[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయం
[dropcap]అ[/dropcap]య్యలరాజు రామభద్రుడు సకలకథాసారసంగ్రహం, రామాభ్యుదయం అనే రెండు గ్రంథాలు వ్రాశాడు. రామాభ్యుదయాన్ని అళియరామరాజు మేనల్లుడు గొబ్బూరి నరసరాజున కంకితం. రామాయణానికి ప్రబంధ రూపమే రామాభ్యుదయం. ప్రధానమైన కథకు భంగం రాకుండా కవి ప్రయత్నించాడు. ప్రబంధాని కవసరమైన వర్ణనలు జొప్పించాడు. శబ్ద ప్రాధాన్యం గల అంత్యప్రాసలు, అనుప్రాసలు, శ్లేషలు, అర్థాలంకార శబ్దాలంకారాలు ప్రయోగించాడు. రామాయణాన్ని ఒకే ప్రబంధంలో ఇమడ్చడం కష్టసాధ్యం. అందుకని మూలకథను చాలా సన్నివేశాలలో సంక్షేపించాడు. దశరధుని రాజ్యపాలనతో మొదలుపెట్టి శ్రీరాముని అరణ్యవాసానంతరం నందిగ్రామం చేరేవరకు కథను ప్రస్తవించాడు.
ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఈ కవిని ఇలా ప్రశంసించారు.
“ఆలంకారికమైన శబ్ద చాతుర్యమును చూపిన కవులలో ఈతడు ప్రథముడు. ఈతడు చూపిన శబ్ద చిత్రములు, అర్ధగుంభనములు తరువాత వసుచరిత్రకారునికి మార్గదర్శకములైనవి. రామభద్రుడా కాలమున మహాకవిగా ఎన్నబడి యుండును. ఈయన ప్రబంధ యుగమున కొన అంతరువు (land mark) సృజించి మేటి అనిపించుకొనినాడు” (ఆంధ్ర సాహిత్య చరిత్ర, పుట 382).
రామాభ్యుదయంలో నాయకుడు రాముడు. ఇందులో విశ్వామిత్రుడు సీతను అంగాంగ సుందరంగా వర్ణించడం అనౌచిత్యం.
రాయల ఆస్థానమైన భువన విజయంలో అష్టదిగ్గజ కవులలో ఈ రామభద్రుడొకరు. క్రీ.శ. 1495-1570 ప్రాంతము వాడై యుండును. రామాభ్యుదయం గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఆచార్య కాకర్ల వెంకటరామ నరసింహం పరిష్కరణతో 1967లో ప్రచురించారు. ఆచార్య ఎస్.వి. జోగారవు పర్యవేక్షణలో డా. కొత్తపల్లి విశ్వేశ్వరశాస్త్రి ‘రామాభ్యుదయ వైభవం’ అనే గ్రంథాన్ని 1985లో ప్రచురించారు. రామభద్రకవి పూర్వులు కడప మండలం లోని ఒంటిమిట్టలో నివసించేవారు. సకలకథాసారసంగ్రహం తొమ్మిది ఆశ్వాసాల గ్రంథం. అందులో చివరి ఆశ్వాసం అసమగ్రం. శ్రీకృష్ణదేవరాయల ఆనతి మేరకు రామభద్రుడు ‘పురాతన మహాకవి విరచిత ప్రబంధముల నన్వేషించి’ ఈ గ్రంథము రచించాడు. ఇందులో ఒక పద్యం రామాభ్యుదయంలో ‘కానకకన్న సత్సూనుండు’ యథాతథంగా కన్పిస్తున్నది.
విశిష్టత:
రామాభ్యుదయం 8 ఆశ్వాసాల చక్కని ప్రబంధం. ఇందులో వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండను కవి స్వీకరించలేదు. భాసుని నాటకాలలో అవాల్మీకములైన కల్పన లున్నట్టే ఇందులోనూ కొత్త కల్పనలున్నాయి. దశరథుని యౌవనాన్ని కవి వర్ణించాడు. పాయస విభాగంలో కూడా రామభద్రుడు స్వతంత్రించి కల్పన చేశాడు. కౌసల్య, కైకలు తమకిచ్చిన పాయసంలో చెరి సగం సుమిత్రకు పంచి ఇచ్చారని చెప్పాడు:
“ఇచ్చినగని ఇరువురు పొర
పొచ్చెము లేకపుడు సవతి పొలతి సుమిత్రన్
మచ్చిక పిలిచి కృపామతి
నిచ్చిరి చెరి సగము తమకు ఇడి నందులోన్.”
మరో విశేషం – కుంభకర్ణ వధానంతం నారదుడు యుద్ధభూమికి వచ్చి రాముని ప్రశంసించడం. ఋష్యశృంగుని దశరథుడే అయోధ్యకు పిలిపించాడు. రామాభ్యుదయములో అరణ్యవాస సమయంలో రాముడు భరధ్వాజుని, శరభంగుని, అగస్త్యని మాత్రమే కలిసాడు. మిగతా ఋషుల ప్రస్తావన లేదు. సీతారాముల గృహస్థ జీవనం ఇందులో విస్తృతం. ప్రకృతి వర్ణనలు విస్తారం. అవి సహజ సుందరంగా, అతిశయోక్తులకు దూరంగా ఉన్నాయి.
కైక పాత్రకు కవి ప్రాధాన్యత ఇవ్వలేదు. కైకేయీ దశరథుల సంవాదం ఇందులో లేదు. మంధర పాత్ర అసలే లేదు. శబరి పాత్ర కనిపించదు. అహల్యాతారా మండోదరుల పాత్రలు సంక్షిప్తంగా ప్రస్తావించబడ్డాయి. రావణుడు సీతాపహరణం కొసం వచ్చి బ్రాహ్మణ రూపంలో ఆబ్దికానికి కూచొని బంగారు లేడిని తెమ్మని రాముని పంపడం కొత్తదనం.
హనుమంతుని ఔన్నత్యాన్ని రామసుగ్రీవులు ప్రశంసించే పద్యం అద్భుతం:
“పావని! రమ్ము నీ వఖిల పావనమూర్తివి మత్కులంబు నీ
చే వెలయున్ సమర్థుడవు సీత కనుంగొని రావటన్న సు
గ్రీవ! బళారే! ఎంత పనికిన్ హనుమంతుడు దక్షుడంచు ను
ర్వీవరశేఖరుడు రఘువరుడు డగ్గర బిల్చె మారుతిన్!” (షష్ఠా – 55).
కథాకథనం:
వాల్మీకి రామాయణానికి భిన్నంగా రామాభ్యుదయ కవి కథా భాగాన్ని ఎనిమిది ఆశ్వాసాలలో మలచాడు. 24వేల శ్లోకాలను 1850 పద్యాలలో సక్షిప్తం చేశాడు. ఆరు కాండలు ఎనిమిది ఆశ్వాసాలైనాయి. ప్రథమాశ్వాసంలో అయోధ్యా పట్టణాన్ని, దశరథుని వర్ణించి, వెంటనే వసంత ఋతువును వివరించాడు. వసంత ఋతువు రాగానే దశరథుడు భార్యలతో వన విహారం చేశాడు. అక్కడ పుష్పపచయం, జల విహారము, జలక్రీడలు సలిపారు. మూలంలో సంతానం లేక కుమిలిపోయే దశరథుడు మనకు బాలకాండలో కనిపిస్తాడు. ప్రబంధం కాబట్టి రామాభ్యుదయ కవి 94 పద్యాలలో ప్రథమాశ్వాసం వర్ణనలతో నింపాడు.
రెండో ఆశ్వాసం దశరథుడు కొలువు దీరడంతో ఆరంభమైంది. ఆ సభలోకి చెంచులు వచ్చి అడవి మృగాలు బాధించడాన్ని ఏకరువు పెట్టారు. రాజుగా వారిని రక్షించడం తన బాధ్యత కాబట్టి దశరథుడు వేటకు బయలుదేరాడు. వేట కేగిన రాజు ఏనుగు అనే భ్రమతో ముని కుమారుని మరణానికి కారణమయ్యాడు. అతని తల్లిదండ్రులు దశరథునకు పుత్ర వియోగంతో మరణాన్ని శాపంగా ఇచ్చారు. సంతానం లేరని దశరథుడు చింతించడం, వశిష్ఠుని ఆనతిచే పుత్రకామేష్ఠి చేశాడు. ఋష్యశృంగుని రప్పించాడు. ఆయనకు శాంతతో వివాహం జరిపించాడు.
తృతీయాశ్వాసంలో ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠి దశరథుడు జరిపాడు. మూలంలో దేవతలు యజ్ఞాశాలకు వచ్చి రావణుని దుండగాలు వర్ణించినట్లు వుండగా, ఈ కవి వైకుంఠంలో విష్ణువుకు రావణుని ఆగడాలు వర్ణించినట్లు మలచాడు. యజ్ఞపురుషుడు దశరథునకు పాయస మివ్వడం, దానిని రాణులకివ్వడం, శ్రీరామాదుల జననం, బాల్యం, వారి శస్త్రాభ్యాసం ఇందులో ఉన్నాయి. ఈ ఘట్టాలలో రామభద్రుడు పోతన కవిత్వాన్ని తలపించేలా రచించాడు.
చతుర్థాశ్వాసంలో విశ్వామిత్రుడు దశరథుని కొలువుకు వస్తాడు. తాటక సంహారం, యాగ సంరక్షణ, అహల్యాశాపవిమోచనము, మిథిలా నగర ప్రయాణము వర్ణించబడ్డాయి. శివ ధనుర్భంగ వృత్తాంతంలో
కం:
“ఆ రమణీయ ధనుష్ఠం
కారము సీతాకుమారికా కల్యాణ
ప్రారంభవాద్యనిరవ
ద్వారమై యొసగె సకలహర్షప్రదమై” (చతుర్థా – 92)
అని రసవత్తరంగా వర్ణించాడు కవి. రామాదుల వివాహాలు, వివాహానంతరం అయోధ్యకు వెళ్ళే దారిలో పరుశురాము నోడించుట, సీతారాముల గృహస్థ జీవనము వివరించబడ్డాయి.
పంచమాశ్వసంలో శ్రీరామ పట్టాభిషేకానికి కైక అడ్డుపడుతుంది. సీతారాములు అరణ్యానికి బయలుదేరుతారు. దశరథుడు విలపిస్తూ మరణిస్తాడు. భరతునికి పాదుకలివ్వడం, పాదుకా పట్టాభిషేకం, పంచవటీ నివాసం, శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, ఖరాసుర వధ, మారీచ వధ, సీతాపహరణం, రాముని దుఃఖం, సుగ్రీవునితో సఖ్యం, వాలి వధ, సుగ్రీవ పట్టాభిషేకం ఇందులో ప్రస్తావించబడ్డాయి. రాముడే శూర్పణఖ ముక్కు చెవులు కోసినట్లు కవి కల్పించాడు. ఇందులో హేమంత వర్ణన వుంది.
ఆరో ఆశ్వాసంలో వర్ష, శరదృతువు వర్ణలౌ, వానరులు సీతాన్వేషణకు బయలుదేరడం, హనుమ సముద్ర లంఘనం, లంకా ప్రవేశం, అశోక వనంలో సీతను చూడడం, అశోకవన భంజనం, రాక్షసులను చంపడం, అక్షకుమార వధ, హనుద్రావణ సంవాదము, లంకా దహనం ప్రస్తవించబడ్డాయి. రావణుడు హనుమతో –
మ:
కొడుకున్ మెచ్చి దశాననుం డనిలజున్ కోపంబుతో చూచి ఏ
అడవిన్ ద్రిమ్మరుచుండు క్రోతివిర రారా! ఎవ్వరంపంగ ని
క్కడికిన్ వచ్చితి వేల చొచ్చితివి లంకా రాజధానిన్ నిజం
బడుగన్ చూచెద అంతయున్ తెలియ నొయ్యం బెప్పురా! నావుడున్ (షష్ఠా-231)
ఏడో ఆశ్వాసంలో సీత వార్తను హనుమంతుడు రాముడికి నివేదించడం, లంకపై దండెత్తడం, సముద్రతీరం చేరటం, లంకలో రావణుని మంతనాలు, విభీషణ శరణాగతి, సేతు బంధనం, అంగద రాయబారం, ఇరు పక్షాల వారి యుద్ధ సన్నాహాలు ప్రస్తావించబడ్డాయి.
అష్టమాశ్వాసంలో వానర రాక్షస యుద్ధం, రావణ వధ, మండోదరీ విలాపం, విభీషణ పట్టాభిషేకం, రాము డయోధ్యకు వచ్చుట, శ్రీరామ పట్టాభిషేకంము ప్రధానం. రామాభ్యుదయంలో పాత్రచిత్రణ కవి అద్భుతంగా చేశాడు. సీతాదేవిని వర్ణిస్తూ రామాకృతి దాల్చిన సీతలో రాముని చెలువమంతా వర్ణించబడింది.
“ఆ కరియాన వేనలి అనంత విలాపము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిలవాణి మధ్యమున, కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆయమమందు జొప్పుడున్” (చతుర్థా -68)
ఈ విధంగా రామాభ్యుదయం ఒక రసవత్ ప్రబంధం.