[dropcap]ఎం[/dropcap]త కష్టమొచ్చిందో అమ్మకు
రోడ్డు పక్కన చిత్రంగా కనిపిస్తోంది
ఆ కళ్ళల్లో అలసట మచ్చుకైనా లేదు….
నడి రోడ్డులో వదిలిన భర్తను
ఊసు మరచిన బిడ్డలను
తలచుకోవట్లేదనిపిస్తుంది
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసానికి
చిరునామా ఆమె….
చెక్కిన నిలువెత్తు శ్రమజీవి ఆమె
ధీశాలిలా కనిపిస్తున్న
ఆరుపదులవృద్ధవనిత ఆమె….
సూరీడల్లె మెరిసే సింధూరం
చందమామలా చల్లని చిరునవ్వు…
లోకం నీడ కోసం పరుగిడే ఎండలో
ఎండను గొడుగు చేసుకుని కూర్చుని ఉంది
అదేంటో తెగిపోయిన చెప్పుల వంక
కన్నెత్తయినా చూడడం లేదు జనం
వారి నడక ఇప్పుడు అద్దాల షోరూంల వైపే…
అయినా నిబ్బరంగానే ఉంది
తప్పకుండా ఎవరో ఒకరొస్తారని…
చాలా సేపట్నుండి చూస్తునే ఉన్నానేమో
ఆమె ఆశ ఫలించాలని నాకూ అన్పిస్తోందిప్పుడు
ఎంత ధీమాగా ఉంది రేపటిపై కాదు
ఈరోజుటి పైనే ఆశతో జీవిస్తోంది….
చెప్పులు కుట్టే సరంజామాతో
రోడ్డు పక్కన మేరు నగములా కూర్చుని ఉన్న
ఓ అమ్మ…!!