[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న ఎస్.బిందు శ్రీ ఈ పుస్తకంలోని ‘ మంచితనానికి కులమేమిటి?’ కథను విశ్లేషిస్తోంది.
***
ఉపోద్ఘాతం:
సంచిక తెలుగు సాహితీ వేదిక వారు ప్రజలలో తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం గురించి వారిలో అవగాహన పెంచడం కోసం చేసే ప్రయత్నంలో విద్యార్థి దశ నుండే సాహిత్యంపై ఇష్టం ఉండేలాగా వారు ప్రచురించిన పుస్తకంలో కులం అని కనిపించని గోడ మనల్ని ఏ విధంగా మారుస్తుందో అనే విషయం పై ఎన్నో కథలను ప్రచురించారు. అందులో నాకు నచ్చిన కథ ”మంచితనానికి కులమేమిటి?’. పుస్తకం పై నా అభిప్రాయం.
- చదువరులకు పుస్తకం చదవాలంటే ఆ పుస్తకం ఆ వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉండాలి.
- నేను చదివిన పుస్తకం పేరు కులం కథ. చదివిన కథ ‘’మంచితనానికి కులమేమిటి?’.
- ఈ కథ యొక్క రచయిత్రి ఎస్.పార్వతీదేవి.
- నాకు నచ్చిన దంపతుల పాత్ర రాజగోపాలం మరియి రాజమ్మ.
- తన వారిని కూడా వదిలించుకునేందుకు చూస్తున్న వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో రాజగోపాలం, రాజమ్మ లాంటి వ్యక్తులు ఉండటం విశేషం.
- ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారు ఎప్పుడు వెళ్ళిపోతారు అని ఆలోచించే వ్యక్తులు కాకుండా వారి ఇల్లు బంధువులతో నిండి ఉండటం ఆనందం.
- కొంత ధనం సంపాదిస్తేనే పేదవారిని చులకనగా చూస్తున్న ఈ రోజుల్లో రాజగోపాలం లాంటి మంచి మనసున్న వ్యక్తి ఉండటం ఆనందదాయకం.
- సహయం కోసం వచ్చిన వారికి లేదనక సహాయం చేసిన ఆ మహాభారతంలో దాన కర్ణుడు. ఈ కాలంలో ఈ దంపతులు.
- కన్న బిడ్డలనే భారంగా చూస్తున్న ఈ కాలంలో ఎవరో తెలియని ఒక అనాథ బిడ్డను చేరదీసి పెంచి ప్రయోజకుణ్ని చేసిన ఈ దంపతులు సాక్షాత్తు ఆదిదంపతులే.
- నాకు నచ్చిన ఇంకో పాత్ర మంగన్న.
- మంగన్న ఒక సాధారణ రైతు బిడ్డ. కానీ వారి ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల చదువుకోవాల్సిన వయస్సులో తండ్రి కోసం పనులకు వెళ్ళేవాడు.
- రాజగోపాలం దయతో పట్నంలో దేనికి కొరత లేకుండా స్థిరపడ్డాడు.
- ఉత్తములు తాము పొందిన ఏ సహాయాన్ని మరువరు అది ఇసుమంత అయిన కావచ్చు లేదా ఆకాశమంత అయినా కావచ్చు.
- అప్పుడు ఎంతో మందికి చేయూతనిచ్చి. సహాయం చేసిన ఆ దంపతులు వారికి కష్టం వచ్చాకా నిస్సంకోచంగా మంగన్న తన ఇంటికి తీసుకువెళ్ళడం సంతోషం.
- మంగన్న మనసులో కుల భావం వారి ద్వారా నేను ఈ స్థితికి వచ్చాను. ఎంత మందిని మంచి స్థితికి చేర్చిన వీరికి నేను అటుంవంటి స్థితి ఇవ్వలేకపోవచ్చు. కానీ వారికి ఏమీ కొరత రాకూడదు అనుకుని వారిని తన ఇంటికి ఆహ్వానించాడు.
- నాకు నచ్చని పాత్ర విజయశేఖర్.
- విజయశేఖర్ ఎవరు. ఒక అనాథ. కట్టుకోవడానికి బట్టలు లేని ఒక పిల్లవాడు. అటువంటి వాడికి ఆ దంపతులు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. వాడికి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. వాడి అన్నీ ఆకాంక్షలు తీర్చారు.
- ఫలితం వాడు గౌరవ కలక్టర్ అయ్యాడు. అప్పటికే రాజగోపాలం చనిపోయి. రాజమ్మ ఆమె చిన్న కొడుకు శివ దయనీయ పరిస్థితులలో ఉన్నారు.
- తన కన్నకొడుకును తను పెంచిన కొడుకు పట్ల ఎటువంటి పక్షపాతం చూపించలేదు అన్న విషయం శేఖర్‌కు గుర్తుకురాలేదు.
- తను ఈ స్థితిలో ఉండటానికి కారణం వాళ్ళేనని శేఖర్ మరిచి వారిని మానసికక్షభకు గురిచేశారు.
- రాజమ్మకు శేఖర్‌ని కలిసిన తరువాత అర్థమైంది. తను తన భర్త పెంచింది మామిడి చెట్టు అనుకుని మురిసిపోయారు. కానీ వారు పెంచింది ఉపయోగపడే మామిడి కాయల చెట్టు కాదని. ఎందుకూ పనికిరాని తుమ్మ చెట్టు అని.
- అప్పుడు రాజమ్మకు అవగతమైంది. తుమ్మ చెట్టు లాంటి శేఖర్ తన వాడి అయిన ముళ్ళతో ఆమెను మాటలతో తూట్లు పొడిచాడు. దేన్నైనా ఆదిలోనే అంతం చేయాలి. అవి సమస్యలు కావచ్చు. అడ్డదిడ్డంగా పెరిగే చెట్టు కావచ్చు. చివరికి చేసిన మేలు మరచిన కొడుకు కావచ్చు.
- ఒక వేళ ఆ దంపతులకు అది మామిడి చెట్టు కాదు. తుమ్మ చెట్టు అని తెలిసి ఉంటే దాని మొదలులోనే అంతం చేసే వారేమో.
- తమ కొడుకు తమకు సహాయం చేస్తారని భావించిన రాజమ్మ యొక్క మనఃస్థితి చదవరులకు చాలా బాధ కలిగిస్తుంది.
ఈ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్న నీతి:
- మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కోవచ్చు.
- కాని కులం ఇది ఒక కార్చిచ్చు.
- ఏ విధంగా అయితే కార్చిచ్చు వనాన్ని దహించివేస్తుందో అదే విధంగా ఈ కులం అనే కార్చిచ్చు భారతదేశం అనే ఈ వనాన్ని దహించివేస్తుంది.
- కులం అనే బడబాగ్ని మనలోనే పుడుతుంది. అది ఎప్పటికీ తరగదు. అగ్ని పర్వతంలో పుట్టే లావా తరుగుతుందమో కాని కులం అనే లావా పెరుగుతుంది.
- సముద్రంలో ఉండే అగ్నిపర్వతంలో గల బడబాగ్ని ఎప్పుడూ విధ్వంసం సృష్టింస్తుందో అలాగే మన మనసులో ఉండే కులం అనే బడబాగ్ని అవస్యం మనల్ని మన వినాశనానికి దారితీస్తుంది.
- వర్షం వచ్చే ముందు ఎలాగైతే ఆకాశం అంతా కారమబ్బులు కమ్ముకుంటాయో అదే విధంగా మన భారతదేశాన్ని కులం అనే కారుమబ్బులు చుట్టుముట్టాయి.
- దేశానికి, దేశానికి సమస్య వస్తే నిలువరించవచ్చు. కానీ దేశంలోనే కులం వల్ల సమస్య వస్తే నిలువరించే అవకాశం ఉండదు.
- కులం ఒక వ్యాధి. ఆ వ్యాధికి ఔషధం లేదు. దాన్ని నిలువరించాలంటే కులం అనే గోడను కూల్చేయాలి.
- లేదంటే ఆ కులం ఎప్పటికైనా మన భారదేశం అనే గట్టిగోడను కూల్చివేస్తుంది.
- ఎన్ని ఆపదలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే భారతీయులు కులం అనే చిచ్చు మన మనసుల్ని దహించివేస్తుందని గ్రహించలేకపోతున్నారు.
- ఒక సమస్యను ఆదిలోనే అంతం చేయాకపోతే అది మనల్ని అంతం చేస్తుంది.
- కులం మనలో పగను రేపుతుంది. మన పురాణాలు, భారతీయ శాస్త్రాలనూ హేళన చేస్తుంది.
- కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి అని అన్నాడు దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి.
- కులం మతం, జాతి వర్గం ఇలా అన్ని మనలోనే పుడుతాయి. వాటిని మనం ఆచరించకూడదు. అది ఒక కనిపించని వస్తువు మాత్రమే.
- మనిషిని మనిషిలా మార్చే రామాయణం, భారతం, గీత వంటి మహా గ్రంథాలను వదిలి మనిషిని రాక్షసునిలా మార్చే కులం అనే ఒక మర్రి ఊడను పట్టుకుని వేలాడుతున్నాం.
- ఆ కులం అవస్య మనల్ని అథః పాతాళంలోకి నెట్టివేస్తుంది.
- దేశంలో అగ్రజాతీ, ఇలా ఎన్ని జాతలు ఉన్నా, కులం అడ్డగిస్తున్నా కానీ మనం ఆ కులం అనే మహాసాగరాన్ని దాటి మనల్ని పెంచిన తల్లిదండ్రుల్ని మరచిపోరాదు.
- ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా అని అన్నాడో మహాకవి. అది ముమ్మాటికి నిజం.
- ఏ దేశానికి వెళ్ళినా, ఎటువంటి స్థితిలో ఉన్నా మనం మన తల్లిదండ్రుల్ని, దేశాన్ని మర్చిపోకూడదు.
- ఇప్పుడు ఈ పవిత్ర భారతభూమి దుఃఖిస్తూ, ఎప్పుడూ నేను ఇటువంటి కులం, మతం అనే వర్గాలు లేని భారతీయులంతా ఒక్కేటే అనే స్థితి ఎప్పటికి వస్తుంది అని దుఃఖిస్తుంది.
- ఎంత మంది కన్నీళ్ళను తుడిచిన భారతమాత కేవలం కులం అనే ఒక చిచ్చు ద్వారా దహించుకుపోతూ మన కంటికి కనిపించకుండా కనుమరుగవుతుంది.
- కురువంశంలో కౌరవుల వంటి గంజాయి మొక్కలు ఉన్నారు. కురువంశం ఒక తులసివనం. ఆ కురువంశంలో గల తమ సోదరుల్ని పాండవులు అంతం చేశారు (గంజాయి మొక్కని.)
- అదే విధంగా భారతదేశం అనే తులసి వనంలో కులం అనే గంజాయి మొక్క పెరుగుతుంది.
- అది ఆదిలోనే అంతం చేయకపోతే తులసివనానికి ఉన్న విశేషత తగ్గుతుంది.
- అందుకే పెద్దలు అంటూరు మొక్కై వంగనిది మానై వంగునా అని.
ముగింపు:
ప్రస్తుత యువత మనసులో కులం అనే మొక్క పెరుగుతుంది. కులం వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. కావున కులాన్ని విస్మరించుదాం. జాతి, మతం అనే మాటలను వదిలి భారతీయులంతా ఒక్కటే WE ARE THE INDIANS అని చెప్పుదాం.
కులాన్ని అంతం చేద్దాం ఆకాంక్షించిన నవభారతాన్ని నిర్మించుదాం మంచిగా జీవిద్దాం
కులం వెనుకబాటుతనం
కులం గోడల్ని కూల్చేద్దాం.
భారతదేశంలో కులం అనే వివక్ష పోతేనే భారతదేశానికున్న పేరు సమస్త ప్రపంచంలో వినిపిస్తుంది.
ఎస్.బిందు శ్రీ