పరికిణి

0
3

[dropcap]కి[/dropcap]టికీ పక్కన వేపచెట్టు
ఆ పక్కనే పొందికగా కూచుని ఉందో చిలక
ఏదో రాజ్యపు పట్టపురాణిలా ఉంది
కాఫీ కప్పు వేడిగా ఉన్నంత సేపూ
ఆ చిలక వైపే నా దృష్టి
నేనేం తక్కువ తిన్నానా అంటూ దాని ప్రతి-దృష్టి
మనుషుల్ని చూసి చటుక్కున పారిపోవాల్సిన పక్షి
నను చూసి భయపడలేదు కనీసం దూరంగా ఎగరలేదు
మొదట తెలీని ఆశ్చర్యం తరువాత నవ్వడం అలవాటైంది
పొద్దున్నే కాఫీ మిళిత హంసరాగం అద్భుతం
సాయంత్రం ఎదురుచూపుల కూనిరాగం అర్థవంతం
ఈ చిన్ని నేస్తం నా జీవితంలో ఒక భాగమైంది
ఇప్పుడు దానికో చిన్న చెక్క ఇల్లు
బస్తాడు ధాన్యం చాలినన్ని నీళ్లు
బెరుకు పోయి ఇంట్లో హాయిగా విహరిస్తుంది
గాల్లో తన రెక్కలను ఫ్యాను కన్నా వేగంగా ఊపితే
నా భుజాలపై మార్చి మార్చి కూర్చుని
నా తలచుట్టూ పలు సార్లు గిరగిరా తిరిగితే
అది యేన లేని సంతోషం అన్నమాట
చెలిమి ఎప్పుడు కుదిరిందో తెలియదు
తన భాష మౌనంగా ఎప్పుడు నేర్పిందో తెలియదు
అమాయకత్వాన్ని కసిగా పిసికేసే మనిషితో స్నేహం
కల్మషంలేని చిన్ని పొట్టలో నాపై ఎంత నమ్మకం!!
కిలకిలరావాల చిన్ని చిలక
నెలవంక తలపై తురుముకుని
ఇంద్రధనస్సు రంగులతో
చిటికెన వేలంత పరిమాణంతో
కళ్లకింపుగా కలుగుగోలుగా తిరుగుతోన్న
నే ముచ్చటగా పిలుచుకునే నా బంగారు చిలక, పేరు “పరికిణి”!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here