[dropcap]ఎ[/dropcap]వరైనా ప్రయాణాలు ఎందుకు చేస్తారు?
కొందరు కొత్త ప్రదేశాలనీ, పర్యాటక అందాల్ని చూడడానికి… మరికొందరు ప్రకృతి అందాలనీ, ఆయా ప్రాంతాలనీ చూడడంతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలను కలుసుకుని వారితో మమేకమై వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకోవడం కోసం ప్రయాణాలు చేస్తారు.
ప్రకృతి సోయగాలను చూడడం నయనానందకరమైతే, సాటి మనుషుల జీవితాలను దర్శించగలగడం హృదయానందం కలిగిస్తుంది.
చాలామందికి విదేశీ విహారాలంటే… ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో లేదా యూరోపియన్ దేశాలో సందర్శించడం. తమ పర్యటన వివరాలను గొప్పగా చెప్పుకుంటారు. అదే మన పొరుగునే ఉన్న ఇతర ఆసియా దేశాలు… ప్రతీ దేశానికి తన కంటూ ఓ ప్రత్యేకత ఉంటుందనీ తెలిసినా… కంటికి ఆనవు. తేలికగా తీసుకుంటారు. మనకి సమీపంలో ఉన్న మనలాంటి దేశాలే కదా, కొత్తగా ఏముంటుంది అనుకుంటారు. లేదంటే ఆయా దేశాలలో ప్రత్యేకత సాధించిన ఓ ప్రాంతాన్ని మాత్రం టూరిస్టుగా సందర్శించి సరిపెట్టుకుంటారు.
అలా ఎక్కువ మంది టూరిస్టులుగా వెళ్ళే దేశం థాయ్‌లాండ్. తెలుగు సినిమాల పుణ్యమా అనీ, మసాజ్ పార్లర్‌ల కారణంగా అనీ థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ తెలుగు వారికి చిరపరిచితమైంది. అలాగే పటాయా సిటీ, ఇంకా మెయిక్‌లాంగ్ స్టేషన్, అక్కడి రైల్వేమార్కెట్… సినిమాల ద్వారా తెలిసినవే.
అయితే థాయ్‌లాండ్ అంటే ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో దర్శనీయ ప్రాంతాలున్నాయి. టూరిస్టు దృక్పథం నుంచి ఇవన్నీ ముఖ్యమైనవే, చూడవలసినవే అయినా, ట్రావెలర్ దృక్కోణం నుంచి చూస్తే ఈ ప్రదేశాలలోని స్థానికుల కథ ఏమిటి? వాళ్ళ జీవన విధానం ఏంటి? అక్కడి కుటుంబ వ్యవస్థ, రాజకీయాలు, ఎకానమీ… ప్రజల జీవనశైలి ఏమిటి తదితర వివరాలను గ్రహించవచ్చు.
ఈ పుస్తకంలో థాయ్‌లాండ్‌లోని పర్యాటక ప్రదేశాల వివరాలున్నాయి. అందమైన ప్రదేశాలను మనకు చూపించే ఫోటోలున్నాయి. రచయిత దాసరి అమరేంద్ర పరిచయం చేసిన చక్కని మనుషులున్నారు. వారిలో కొందరు అద్భుతమైన వ్యక్తులు. కొద్ది క్షణాలలోనే తమదైన ముద్ర వేస్తారు.
తమ వ్యానులో పరిచయాల దశ దాటుకొని పరాచికాల స్థాయిని అందుకొన్న సహయాత్రికుల గురించి చెబుతూ అందరిలోనూ కలుపుగోరుతనం సామాన్య లక్షణంగా కనిపించి సంతోషం కలిగించిందంటారు రచయిత. ‘అసలు ఇలాంటి ఆటవిడుపు ప్రయాణాల్లో ఎంత అంతర్ముఖులైనా ఎంతోకొంత మనసు విప్పుతారనుకొంటాను’ అని ఆయనన్న మాటలు నిజమనిపిస్తాయి.
సుఖమ్‌విట్ హైవే దగ్గర వంతెనల గురించి చెప్పి, అక్కడ కలిసిన సంచార ఫలహారశాల నడిపే కుటుంబ పెద్దని మాటల్లో పెట్టి వాళ్ళింటికి వెళ్తారు రచయిత. లంచ్ సమయానికల్లా ఆ దగ్గర్లోని ఆఫీసు భవనాల దగ్గరకి చేరుకోవాలట, అందుకని కాస్త హడావుడి. వాళ్ళు మరీ నిరుపేదలు కాదు కాని, బీదవాళ్లకిందే లెక్క… బీదతనమేగానీ బేలతనం కనిపించలేదా కుటుంబంలో అని అంటారు.
మాతృభూమిలో సొంతవాళ్ళని వదిలి, పరాయిదేశంలో శక్తికి మించి శ్రమపడుతూ తమ కుటుంబానికి ఎంతో కొంత డబ్బు పంపాలని తాపత్రయపడిన ఓ ఫిలిప్పీన్స్ మహిళ గాథ మన కళ్ళని చెమరుస్తుంది. మనదేశం నుంచి కువైట్, దుబాయ్ వెళ్ళే శ్రామికుల కడగళ్ళు అప్రయత్నంగా గుర్తుకొస్తాయి, మనసు బరువెక్కుతుంది.
రచయితకి గైడ్‌గా వ్యవహరించిన ‘రికీ’ మరో మంచి మనిషి. వృత్తి ధర్మానీ, స్నేహధర్మానీ కలపకుండా వేర్వేరుగా చూస్తూ, అపారమైన అభిమానాన్ని కురిపిస్తాడు.
‘అయుత్తయ’ అనే చారిత్రక నగరాన్ని ఎలా చూడాలో ఓ మహిళా గైడ్ వివరిస్తే, మనం ఆమె అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేం.
విషాదం నిండిన మార్గం థాయ్‌లాండ్ – బర్మా డెత్ రైల్వే గురించి తెలుసుకుంటుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది.
ఈ మార్గంలో క్వాయ్ నదిపై వంతెన నిర్మాణం సుప్రసిద్ధ నవలకీ, సినిమాకీ ఎలా ప్రేరణ అయ్యిందో, ఆ సినిమా – దర్శకుడయ్యేందుకు ‘బాలూ మహేంద్ర’కి ఎలా మార్గం చూపిందో రచయిత చెబుతారు.
పదాలు, కీర్తనలు, కృతులు, జావళీల మధ్య ఉండే తేడాల గురించీ, కర్నాటక సంగీతంలో వయొలిన్ లాంటి యూరోపియన్ వాళ్ళ పరికరాలు ఎలా వచ్చి చేరాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
‘అతిథి దేవోభవ’, ‘కస్టమర్లే మా దైవాలు’ లాంటి మహాసూక్తులన్నీ కాగితాలలోంచీ ప్రకటనలలోంచీ నడచి వచ్చి కార్యరూపం దాల్చిన గొప్ప సందర్భం గురించి తెలుసుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ పుస్తకం ఎన్నో ప్రశ్నలకు రేకెత్తిస్తుంది. దేశం సంపన్నమైనదైనా, ప్రజలు ఎందుకు బీదగా ఉన్నారు? హిందూ మూలాలున్నా, బౌద్ధం ఎలా వర్ధిల్లింది? రాచరికం, సైన్యం, ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతున్నాయి? విభిన్నమైన ప్రజల మధ్య ఏ విధమైన విద్వేషాలు రగలకపోవడానికి కారణాలు ఏమిటి? కొన్ని ప్రశ్నలకు పాక్షికంగానైనా సమాధానాలు లభిస్తాయి. ఇంకొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.
అయితే మనలో ఒక అన్వేషణ మొదలవుతుంది. థాయ్‌లాండ్ గురించి ఇంకొన్ని వివరాలు, అక్కడి మనుషుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటాం. ఈ రకంగా థాయ్‌లాండ్ వెళ్ళాలనుకునేవారికి ఈ పుస్తకం ఒక ప్రేరణ కావచ్చు. రచయిత ఇంకొన్ని రోజులు అక్కడ ఉండి మనకి మరికొన్ని వివరాలు అందిస్తే బాగుండేది అనిపిస్తుంది.
***
అనగనగా ఒక రాజ్యం
(థాయ్‌లాండ్ యాత్రా గాథ)
రచన: దాసరి అమరేంద్ర
ప్రచురణ: ఆలంబన ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 142
వెల: ₹ 140
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా క్రాస్ రోడ్స్, హైదరాబాద్. +91-9000413413, 040-24652387
https://www.telugubooks.in/products/anaganaga-oka-rajyam