నీలమత పురాణం-64

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]శ్వే[/dropcap]తాశ్వతరోపనిషత్తుకు వ్యాఖ్యానం రాస్తూ శ్రీ త్యాగీశానంద స్వామి ‘రుద్ర’ అన్న పదం గురించి ఇలా వ్యాఖ్యానించారు.

“రుద్రుడు:

తరువాత వచ్చిన పౌరాణిక సాహిత్యంలో ఈ పదం శివుడికి పర్యాయపదంగా మారింది. కానీ ప్రస్తుత సందర్భంలో (శ్వేతాశ్వతరోపనిషత్తులో) సాంప్రదాయ సంబంధమైన అర్థమేమి ఉద్దేశించబడలేదు. అక్షరాల స్వంత అర్థంలోనే ఈ పద ప్రయోగం జరిగింది. ఈ పదానికి ధాత్వర్థం ‘భక్తుల పాపాలనూ, శోకాలనూ నాశనము చేసేవాడు; జ్ఞానము ఆనందము అనుగ్రహించేవాడు’ అని. ‘తన శారీరక నైతిక ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించే వారిని దండించేవాడు’ అని కూడా రుద్ర పదానికి అర్థం. భగవంతుడు అంతర్యామి. మానవుల సకృత దుష్కృతాలను గమనిస్తూ ఉంటాడని సూచించడానికి ఈ పదం ప్రయోగించబడినట్లు తోస్తుంది” (శ్వేతాశ్వతరోపనిషత్తు, శ్రీ రామకృష్ణ మఠం, పేజీ 50).

అంటే పురాణాలు ప్రధానంగా ‘ఇలా జరిగింది’ అంటూ సమకాలీన సామాజిక, చారిత్రక, ధార్మిక అంశాలను ప్రతిబింబిస్తూ భవిష్యత్తరాలకు మార్గదర్శనం చేస్తూ, మరోవైపు ధర్మం, దైవం ఆధారంగా దేశంలోని అన్ని రాజ్యాలను పూలను దారంతో గుదిగుచ్చి మాలను తయారు చేసినట్టు ఏకం చేస్తాయన్న మాట. భారతదేశం ఏనాడు ఒక దేశంలా లేదని, స్వాతంత్ర్యం తరువాతనే ‘భారతదేశం’ ఏర్పడిందని వ్యాఖ్యానిస్తూ వాదించేవారు గమనించాల్సిన అంశం ఇది. పాశ్చాత్యుల ‘దేశం’ భావనకూ, భారత’ దేశం’ భావనకూ భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. వారి ‘దేశం’ భావన ‘రాజకీయ’ భావనలతో కూడుకొని ఉన్నది. మన ‘దేశం’ ధార్మిక, ఆధ్యాత్మిక భావనలతో మిళితమై ఉన్నది. కాబట్టి అక్కడి ‘దేశ’ భావనను ఇక్కడి ‘దేశ’ భావనకు సమానార్ధకంగా భావించడం కుదరదు. ఇందుకు ప్రధాన నిదర్శనం పురాణాలు. ముఖ్యంగా కశ్మీర్ ప్రాంత ప్రజలకు భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు నడుమ ధార్మికంగా ఎలాంటి తేడా లేదని, ఒక నది ఆవిర్భవించి పలు పాయలుగా చీలి ప్రవహిస్తూ ప్రత్యేక నామంతో గుర్తింపు పొందినా, అన్ని మళ్లీ సముద్రంలో కలవక తప్పని రీతిలో ఏ ప్రాంతంలో ప్రజలు వేర్వేరు పేర్లతో గుర్తింపు పొందిన అందరూ భారతీయ ధర్మమనే మహా సాగరంలో భాగమేనని నిరూపించే ‘నీలమత పురాణం’ తిరుగులేని ఉదాహరణ. ఏ పురాణమయినా దాని అసలు లక్ష్యం జాతీయ సమైక్యత మాత్రమే. ఈ సమైక్య సాధనకు సాధనం ధర్మం.

బృహదశ్వుడు చెప్పిన పవిత్ర స్థలాల గురించి వింటూ చివరికి భూతేశ్వరుడికి ఎదురుగా నిత్యం నంది ఉంటాడన్న మాట విన్న గోనందుడికి ఒక సందేహం వచ్చింది.

‘నంది ఎలాగా దైవానుగ్రహం సంపాదించాడు? నిరంతరం ఈశ్వరుడి సమక్షంలో ఉండే వరం ఎలా పొందాడు?’

రాజు ప్రశ్నకు బృహదశ్వుడు సమాధానం ఇచ్చాడు.

శృణు రాజన్ కథాం దివ్యం సర్మకల్మషనాశినీం।
నందినం ప్రతిభూపాల యథావృత్తాం మనోహరామ్॥

“భారతీయ వాఙ్మయ ప్రధాన ఉద్దేశం ఇది. మనోహరమైన కథలు చెబుతూ సరైన మార్గదర్శనం చేయటం. ‘సర్వ కల్మష నాశినీం’ అంటే సాధారణంగా ‘అన్ని పాపాలు నశిస్తాయి’ అన్నట్టు అర్థం చేసుకుంటారు. కానీ ఈ గాథలను జాగ్రత్తగా విని విశ్లేషించి అర్థం చేసుకుంటే వ్యక్తిత్వ వికాసమే కాదు, బుద్ధి వికాసానికి కూడా ఈ గాథలు తోడ్పడుతాయి. తనని తాను అర్థం చేసుకుని సామాజిక మనస్తత్వాన్ని అవగాహన చేసుకునేందుకే కాదు, భవిష్యత్తును ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ గాథల ద్వారా పొందవచ్చని స్పష్టమవుతుంది. అలా కాక పుక్కిటి పురాణాలు అని, పనికి రానివ్వని భావించి వదిలేస్తే మణులను, రత్నాలను రాళ్ళని పారేసుకున్న మూర్ఖుడి పరిస్థితి అవుతుంది.

రాజా, సర్వ కల్మషాలను నాశనం చేసే దివ్యమైన ఈ గాథను విను” అంటూ ఆరంభించాడు బృహదశ్వుడు.

పూర్వం శిలా దేవుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సంతానం లేదు. సంతానాభిలాషియై అతడు నంది పర్వతం చేరాడు. అక్కడ భగవంతుడిని సంతానం కోసం అభ్యర్థిస్తూ తపస్సు చేస్తూ రాళ్లను పిండిగా కొట్టి భుజిస్తూ ఒక వంద సంవత్సరాలు గడిపాడు. అక్కడి దీక్షకు, తపస్సుకు మెచ్చి దేవదేవుడు అతడికి సంతానంగా అత్యంత శక్తిమంతుడైన ‘గణేశ నంది’ని ఇచ్చాడు.

తనని బ్రాహ్మణుడికి సంతానంగా పంపుతున్న శంకరుడితో నంది ఇలా అన్నాడు:

“శంకరా, దేవదేవా, నీ అనుగ్రహం వల్ల బ్రాహ్మణుడికి సంతానంగా నన్ను పంపుతున్నావు. నాకు అభ్యంతరం లేదు. అయితే నేను బ్రాహ్మణుడిని కుమారుడిగా జన్మిస్తాను. కానీ ఏ గర్భాశయంలోనూ నివసించకుండా ఉండే అనుగ్రహం ఇయ్యి. అలాగే నీకు దూరమై నేను ఏ లోకంలోనూ ఎక్కువ కాలం మనలేను. కాబట్టి ఎక్కువ కాలం నీకు దూరంగా నన్ను ఉండనీయకు” అని బ్రతిమాలాడు.

దానికి శివుడు అతడిపై జాలి చూపుతూ చిరునవ్వుతో ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here