[dropcap]ఇ[/dropcap]న్ని రాత్రుల్ని
ఎలా గట్టుమీద కూర్చోబెట్టావో
ఎవరు చూస్తారు
ఇన్ని కన్నీళ్ళను ఎట్లా గుప్తపరిచావో
ఎవరు పట్టించుకుంటారు
లోకం సయ్యాటల్లో మునిగిపోతూ ఉంటే
నువ్వు సత్యశోధనలో
దహించుకుపోతున్న సంగతి ఎవరికెరుక
సాయంత్రాలు మత్తులో
చీర్లు కొడుతూ ఉంటే
నువ్వు కంట్లో వత్తులువేసుకున్న వైనం
ఎక్కడి బయటికి వస్తుంది
సకలం సుఖాల మజాల్లో
మునిగి తేలినప్పుడు
బాధ్యతల బరువు బండల్లో
అణిగిపోయిన వాడా
పగళ్ళ దీర్ఘతను బాతాఖానీ
బంతులాడిన వాళ్ళ గేలిని చూసి
శ్రమ కన్నెను కౌగిలించిన
చేతనోత్తముడా
నువ్వు పలికితే
మంత్రమెందుకయిందని
వాళ్ళకో పజిల్
నువ్వు పిలిస్తే
సూదంటరాయెందుకని
వాళ్ళ కన్‌ఫ్యూజన్
దాచేదేదీ దాచని వాడా
ప్రవహించే నదిలా
పలికేవాడా
నీదైన నీతిని రీతిగా
నిలిపిన వాడా
మాటకు ఎవరికి వాళ్ళే
తీపి అద్దుకోవలసిన వాళ్ళు
చేతకు ఎవరికి వాళ్ళే
సత్యం దిద్దుకోవలసిన వాళ్ళు
నడకలో వంకరలుంటాయికని
నడతలో రుజువర్తన
ఆర్తనాదాన్ని పంటిబిగువున
మోస్తున్న వాళ్ళు
వాళ్ళు నియంత్రిత
జీవరేఖలైతే కావొచ్చు
కదనరంగం లాంటి
కాలరేఖ మీదే నడవొచ్చు
వాళ్ళు ఊపిరి బిగబడతారు
లోసత్తువ కేంద్రీకరిస్తారు
లక్ష్యం అంచుల పర్యంతాలను స్పృశించి
కేంద్రం మీద మనసు పెడతారు
ఆశయం మీద విరుచుకుపడతారు
మెడలో విరిదండలు దాల్చాలంటే
మెడదాకా మునిగిన
తపస్సు చేయాల్సిందే