[dropcap]సం[/dropcap]చిక సాహితీ ప్రచురణలు ప్రచురించే ఉగాది కథల సంకలనం తయారీ జోరుగా సాగుతోంది. తెలుగు భాష ప్రాధాన్యం, ప్రాశస్త్యం, ఔన్నత్యం ప్రదర్శిస్తూ, తెలుగు భాషను సజీవంగా నిలిపేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించే కథల సంకలనం కోసం కథలు పంపిన రచయితలకు, కథలను సూచించిన సాహిత్యాభిమానులకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
సంచిక ప్రచురించే కథల సంకలనాల పట్ల పాఠకులలో సాహిత్యాభిమానులలో ప్రదర్శితమవుతున్న ఆదరణ, కనబడుతున్న ఉత్సాహం, లభిస్తున్న ప్రసంశలు ఎంతో ప్రేరణాత్మకంగా వున్నాయి. మరింత ఉత్సాహంతో ఇంకా సరికొత్త ప్రయోగాలు చేస్తూ పాఠకుల ఆదరణ పొందాలని, కొత్త పాఠకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, స్కూలు పిల్లలు కథారచన పట్ల ఉత్సాహం చూపటం సంచికకు ఆనందాన్ని కలిగించటమే కాదు, మరింతగా ప్రేరణనిస్తోంది.
సాహిత్యం ఎంతగా కాల్పనిక ప్రపంచంలో విహరించినా దానికి బీజం నిజంలో వుంటుంది. ప్రేరణ సమాజంలో వుంటుంది. అంటే రచయిత ఊహ ఎంతగా అంతరిక్ష లోలోతుల్లో విశృంఖల విహారం చేసినా కాళ్ళు భూమి మీదే వుంటాయన్నమాట. అంటే ఎవరు ఎంతగా ప్రయత్నించినా తన సామాజిక మనస్తత్వాన్నీ, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, రాజకీయ అంశాలకు బద్ధుడయివుంటాడన్నమాట. అతడి సృజనాత్మకత వీటితో ముడిపడి వుంటుందన్నమాట. అది సాంఘిక కథ అయినా, చారిత్రిక రచన అయినా, డిటెక్టివ్, హారర్, సైన్స్ ఫిక్షన్ రచన అయినా చివరికి పౌరాణిక రచన అయినా రచయిత సృజనపై సమకాలీన సమాజ ప్రభావం ఉంటుంది. అంటే సాహిత్యం సమకాలీన సమాజం రెండూ పడుగులో పేకలా కలసిపోయి వుంటాయన్నమాట.
అందుకే, సంచికను ఎంతగా సాహిత్యానికి పరిమితం చేయాలని అనుంటూన్నా, సమకాలీన సామాజిక పరిస్థితులకు అతీతంగా వుంచటం కష్టంగా వుంది. నడుస్తున్న చరిత్రను ప్రతిబింబించకుండా, జరుగుతున్న వాటిని మౌనంగా చూస్తూ, ఏమీ ఎరగనట్టు ముందుకు సాగుతూండటం ఉచితం అనిపొంచటంలేదు. అలాగని, సాహిత్యం కాక మరో అంశం సంచికలో పొందుపరచాలనీ లేదు. కానీ, ఇంత సమాచార విస్ఫోటన యుగంలో చుట్టూ నెలకొంటున్న అజ్ఞానాంధకారాలు, అసత్య ప్రచారాలవల్ల చెలరేగుతున్న అజ్ఞానాగ్నుల భుగభుగలూ పట్టనట్టు వ్యవహరించటం నేరంలా తోస్తోంది. ఒకోసారి మౌనం కూడా అసత్యప్రచారానికి మద్దతే అవుతుంది. అందుకని సంచిక త్వరలో ఒక రాజకీయ విశ్లేషణాత్మక శీర్షికను ఆరంభించాలని ఆలోచిస్తోంది. నిష్పాక్షికంగా సమాచారాన్ని ఇస్తూ, సమాచారాన్ని విశ్లేషిస్తూ దాని ఆధారంగా పాఠకులే ఒక నిర్ణయానికి వచ్చే రీతిలో శీర్షికను తీర్చిదిద్దాలని సంచిక ప్రయత్నిస్తోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజలలో విద్వేషాలను రెచ్చగొడుతూ, అసత్యమే సత్యంకన్నా మిన్నగా అల్లకల్లోలాలు సమాజంలో సృష్టిస్తూంటే సాహిత్యానికే పరిమితం అని గిరిగీసుకుని కూచోవటం సంచికకు భావ్యం అనిపించటం లేదు. అందుకని త్వరలో సంచికలో సామాజిక రాజకీయ అంశాలను పాఠకులకు చేరువచేసే శీర్షిక ఆరంభమవుతోంది.
అసత్యాన్ని అసత్యమని స్పష్టంగా ప్రకతించటమూ సాహిత్యంలో భాగమే… ఎందుకంటే సమాజహితం కోరేదే సాహిత్యం.
1 మార్చి 2020 సంచికలో పాఠకులను ఆకర్షించే రచనల వివరాలు:
ప్రధాన వ్యాసం:
వంద వారాల ‘వారం వారం తెలుగు హారం’ – పన్యాల జగన్నాథ్ దాస్
వ్యాసాలు:
తెలుగులో ఆధునిక మహాకావ్యాలు – కోవెల సుప్రసన్నాచార్య
ద్రౌపది – అంబడిపూడి శ్యామసుందర రావు
సీరియల్స్:
శ్రీపర్వతం – 7 – ఘండికోట బ్రహ్మాజీరావు
ముద్రారాక్షసమ్ -సప్తమాఙ్కః-2- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
నీలమత పురాణం – 64 – కస్తూరి మురళీకృష్ణ
జీవన రమణీయం-97- బలభద్రపాత్రుని రమణి
అనుబంధ బంధాలు – 36 – చావా శివకోటి
సాధించెనే ఓ మనసా!-4 – కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
రంగులహేల-24 – పాత స్నేహాల కొత్త రూపాలు – అల్లూరి గౌరిలక్ష్మి
కావ్య పరిమళం -30 – డా. రేవూరు అనంతపద్మనాభరావు
అలనాటి అపురూపాలు -1 – లక్ష్మీ ప్రియ పాకనాటి
కాజాల్లాంటి బాజాలు-45: పెళ్ళిళ్ళలో సందళ్ళు.. – జి.ఎస్. లక్ష్మి
మానస సంచరరే-36: – జె. శ్యామల
కథలు:
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-7 – వేంపల్లి రెడ్డి నాగరాజు
అమ్మా, నాన్న కావాలి – కాశీవిశ్వనాధం పట్రాయుడు
‘నయా’ వంచన – వేణు నక్షత్రం
డాబా ఇల్లు – దాసరి శివకుమారి
గాతము – అగరం వసంత్
కవితలు:
వారెవ్వా-18 – ఐతా చంద్రయ్య
కాలచక్రం – శ్రీధర్ చౌడారపు
పరికిణి – Savvy
ఓ అమ్మ – శాంతి కృష్ణ
విరిదండ – ఏనుగు నరసింహారెడ్డి
గళ్ళ నుడికట్టు:
పదసంచిక-43: కోడీహళ్ళి మురళీమోహన్
పద ప్రహేళిక 3: దినవహి సత్యవతి
నాటకం/నాటిక:
ధర్మాగ్రహం – బెహరా వెంకట లక్ష్మీనారాయణ
పుస్తకాలు:
అమ్మ మాట- పుస్తక పరిచయం – సంచిక టీమ్
‘అనగనగా ఒక రాజ్యం’ చూసొద్దామా – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
బాలసంచిక:
ఆదర్శం – యాడవరం చంద్రకాంత్
భక్తి పర్యటన:
భక్తి పర్యటన కాశీ యాత్ర – 16- సంధ్య యల్లాప్రగడ
భక్తి పర్యటన – ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా-9 జోగుళాంబ – పి.యస్.యమ్. లక్ష్మి
సినిమాలు:
‘ద ఇన్విజిబుల్ మాన్’ – సమీక్ష – వేదాంతం శ్రీపతిశర్మ
‘అధీన్’ – సమీక్ష – పరేష్. ఎన్. దోషి
అవీ ఇవీ:
‘కులం కథ’ పుస్తకం – ‘మంచితనానికి కులమేమిటి’ – కథా విశ్లేషణ — ఎస్. బిందుశ్రీ
సంచికకు రోజు రోజుకూ పెరుగుతున్న పాఠకాదరణ అత్యంత ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ కలిగిస్తోంది. ఇంకా పాఠకులను ఆకర్షించాలని సరికొత్త శీర్షికలను, రచనలను అందించాలని సంచిక ప్రయత్నిస్తోంది. సంచికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంలో రచనలతోనూ, సలహాలు సూచనల ద్వారా అందరూ పాలుపంచుకోవాలని అభ్యర్ధన.
సంపాదక బృందం