[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–10” వ్యాసంలో అలంపూర్ లోని “నవ బ్రహ్మల” ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
నవ బ్రహ్మల ఆలయాలు, అలంపురం
[dropcap]మ[/dropcap]హా శక్తి శ్రీ జోగుళాంబ ఆలయం చూశారు కదా. ఇప్పుడు పక్కనే వున్న నవ బ్రహ్మల ఆలయాలు కూడా దర్శిద్దాము. నవ బ్రహ్మల ఆలయాలు అంటే అసలు బ్రహ్మ దేవుడికి గుడే వుండదు కదా, బ్రహ్మాలయం అంటున్నారు, పైగా తొమ్మిదా అని ఆశ్చర్య పోకండి. ఇవన్నీ శివాలయాలు. వీటిని నిర్మించినవారు బాదామీ చాళుక్యులు. అయితే ఇవ్వన్నీ ఒకేసారి నిర్మించబడ్డవి కావు. ఇక్కడ లభ్యమయ్యే శాసనాలు వగైరా ఆధారాలవలన అలంపురం ప్రాంతం క్రీ.శ. 566 – 757 వరకు బాదామీ చాళుక్యుల పరిపాలనలో వుంది. ఈ సమయంలో నిర్మింపబడ్డ ఆలయాలివి. వీరి తర్వాత రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, కుతుబ్ శాహీ నవాబులు, అసఫ్సహీలు వగైరాల పాలనలో వున్న అలంపురం ఒకప్పుడు గొప్ప విద్యాపీఠం.
ఈ నవ బ్రహ్మల ఆలయాలలో ప్రధానమైనది బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయం. పూర్వం బ్రహ్మ దేవుడు ఇక్కడ తపస్సు చేసి శివ లింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చింది. చిన్న లింగం కనుక బాల బ్రహ్మేశ్వరుడన్నారని పూజారిగారు చెప్పారు. ఈ ఆలయం రస సిధ్ధులైన శిల్పాచార్యులచేత నిర్మించబడింది. ఇక్కడి లింగం మహా ఓషధీ సంస్కారం పొందిన మహిమాన్విత రస లింగం.
వేరే క్షేత్రాలలో సాధారణంగా బ్రహ్మదేవుని విగ్రహాలు కనబడవు. కానీ ఇక్కడ కనబడతాయి.
క్షేత్ర పురాణం ప్రకారం అలంపూరులోని దేవాలయాలను ఒక రససిధ్ధుడు కట్టించాడు. ఆ సిధ్ధుడు కాశీ విశ్వేశ్వరుని ప్రేరణతో ఈ క్షేత్రానికి వచ్చి క్షేత్రపాలకుల గురించి తపస్సు చేశాడు. బ్రహ్మేశ్వరుడు తలపైనుండి, జోగుళాంబ నోటినుండి, గణపతి బొడ్డునుండి రసాన్ని ఇచ్చారట. వాటితో పరుసవేదిని చేసుకొని సిధ్ధుడు ఇక్కడి ఆలయాలను కట్టిస్తూ వున్నాడు. విసలద్రాజు అనే రాజు పరుసవేదిని సిధ్ధుడినుండి లాక్కోవడంకోసం దండెత్తి వచ్చాడు. సిధ్ధుడు ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే గర్భాలయంలోకి ప్రవేశించి బ్రహ్మేశ్వరునిలో లీనమైపోయాడు. సిధ్ధుని శాపంవలన విలసద్రాజు రాజ్యం పోగొట్టుకుని ఎన్నో కష్టాలు అనుభవించి, ఒక జింక చేత ఉపదేశంపొంది, చివరికి శివసాన్నిధ్యం పొందాడట. ఈ కధ ఇంతకన్నా వివరంగా తెలియలేదు. ఈ కథ ప్రవేశ ద్వారం ముందు వున్న తోరణ స్తంభంపైన చెక్కబడివుంది. పాల్కురికి సోమనాధుడు తన పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్ర మహిమ, ఇక్కడి తీర్ధాలను వర్ణించాడు.
ఇక్కడి నవ బ్రహ్మాలయాల్లో ప్రతిష్టించబడినవి శివలింగాలే అని చెప్పాను కదా. వాటి పేర్లు.. బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ. అన్ని పేర్లకీ బ్రహ్మ ఎందుకు చేర్చారో తెలియలేదు. అన్ని పేర్లూ బ్రహ్మతో వచ్చినాయి గనుకే వీటిని నవబ్రహ్మాలయాలని వుండవచ్చు.
రేణుకా జమదగ్నుల కథ
పూర్వం ఇక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమం వుండేది. ఆయన భార్య రేణుకా దేవి. ఆవిడ ప్రతి రోజూ నదికి వెళ్ళి ఇసుకతో కుండను చేసుకుని దాంతో నీళ్ళు తీసుకువచ్చేది. ఒక రోజు ఒక మహారాజు తన భార్యలతో అక్కడ జలక్రీడలు ఆడుతుండగా చూసిన రేణుక మనస్సు వారి అదృష్టాన్ని పొగిడింది. అంతే.. ఆ రోజు ఇసుక కుండ ఎన్నిసార్లు చేసినా నిలువలేదు. ఆలస్యమయిపోతోందని నీళ్ళు తీసుకురాకుండానే వచ్చిన రేణుకా దేవిని చూసి జమదగ్ని మహర్షి జరిగినది తెలుసుకుని, రేణుకా దేవి శిరస్సు ఖండించమని తనయులకు ఆనతి ఇచ్చాడు. జమదగ్ని కుమారులెవరూ తల్లిని ఖండించే సాహసం చెయ్యలేకపోయారు. కనిష్టుడయిన పరశురాముడు మాత్రం తండ్రి ఆనతిమేరకు తల్లి తలను ఖండించాడు. జమదగ్ని సంతోషించి వరం కోరుకోమంటే తల్లిని బతికించమని వరం కోరుకుంటాడు. అప్పటికే రేణుక తల ఎగిరి దగ్గరలోవున్న ఛండాలవాటికలో పడినందువల్ల మొండెంతో తల అతికించటానికి వీలుకాదని, ఇకమీద ఆ తల ఎల్లమ్మ అనే పేరుతో అక్కడ గ్రామదేవతగా పూజలందుకుంటుందని, ఈ మొండెం బ్రహ్మేశ్వరాలయంలో వుండి సంతాన ప్రదాయినిగా స్త్రీలచే పూజలందుకుంటుందని వరమిచ్చాడు. ఈ ఆలయంలో వున్న మొండాన్ని పూజించినట్లయితే సంతానం కలుగుతుందనే నమ్మకంతో సంతానంలేని స్త్రీలు పూజిస్తారు.
పురావస్తు సంగ్రహాలయం
బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రవేశద్వారం బయట వున్న ఈ పురావస్తు సంగ్రహాలయంలో అలంపూరు పరిసరాలలో దొరికిన విగ్రహాలను, శిలా శాసనాలను భద్రపరచారు. ఇందులో ఎన్నో అపురూపమైన శిల్పాలున్నాయి.
వసతులు
బాలబ్రహ్మేశ్వరాలయంలోవున్న సత్రాలలో ముందు చెప్తే బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఈమధ్య ఆలయానికి వెళ్ళే త్రోవలో పున్నమి రెస్టారెంటు పెట్టారు. ఇక్కడ భోజన, వసతి సౌకర్యాలు వున్నాయి.
మార్గం
హైదరాబాదునుంచి కర్నూలు వెళ్ళే దోవలో ఎడమవైపు శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు దోవ చూపే బోర్డు కనబడుతుంది. అక్కడనుంచి సుమారు 13 కి.మీ. లు లోపలకి వెళ్ళాలి.