శ్రీపర్వతం-8

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 8వ భాగం. [/box]

15

[dropcap]ఆ[/dropcap] రోజు సోమవారమేమో, పనివాళ్ళకు సెలవు. జావా కూడా రానని ముందు చెప్పినా, దొరసానికి ఇబ్బందవుతుందని పన్నెండు వరకూ ఉంది.

ప్రతి సోమవారం హైదరాబాదు నుండి ఒక కొరియర్ ప్యూను వస్తాడు. అతడు వారంలో వచ్చిన ఉత్తరాలు, పళ్ళు, కాయగూరలు, తాజా బ్రెడ్, బటర్, స్టేషనరీ, ఇస్త్రీ చేసిన బట్టలు తెచ్చేవాడు. ఇటుంచి పోస్టు చేయవలసిన ఉత్తరాలు, ఇస్త్రీ కోసం శశికళ బట్టలు, ఖాళీ సంచులు పట్టుకు పోయేవాడు.

సోమవారం నాడు మోహన్‌కి కూడా తీరుబడి ఉండదు. అతడు పుట్లగూడెం వేపు వెళ్ళి, అక్కడ, కృష్ణానదిలో బట్టలుతుక్కొని, స్నానం చేసి వచ్చేవాడు. టెంటుకి అతడు తిరిగి వచ్చే సరికి పది గంటలయింది.

డిసెంబరు నెలేమో, కృష్ణ నీరు మంచులా ఉండేది. ఆ నీటిలో స్నానం చేసి పైకి వస్తే ఎంతో హాయిగా ఉండేది. రోజూ వేడి నీళ్ళు స్నానం చేస్తున్న అతనికి, ఈ మార్పు ఆరోగ్యదాయకంగా కనిపించింది.

మోహన్ టెంటు చేరి బట్టలు వేసుకునే సరికి టిఫిన్ తయారయింది. సుబ్రహ్మణ్యేశ్వరరావు కూడా ఆ సరికి టెంటు చేరుకున్నాడు.

లోయలో వచ్చేసరికి శశికళ బాబ్డ్ హెయిర్‌లో ఉంది. ఇప్పుడామె జుట్టు కొంచెం పెరిగింది. దానినామె చిన్న ముడిగా చుట్టుకుంది. జరీ అంచు నేత చీర కట్టుకుంది. నుదుట తిలకం దిద్దుకొంది. ముందు టెంటులో ముగ్గురూ టేబిలు ముందు కూర్చున్నారు.

ఆమె ప్లేట్లలో సేమ్యా కిచిడీ వడ్డించింది.

ఫిల్లరు నుండి గ్లాసుల్లోకి నీళ్ళు పట్టి టేబిలు మీద ఉంచాడు మోహన్. శశికళ లండన్‌లో కొన్న బ్రేక్‌ఫాస్ట్ సెట్ అది. చాల అందంగా ఉంది.

టిఫిన్ తింటూ వాళ్లు చాల విషయాలు మాట్లాడుకున్నారు. డామ్ నిర్మాణం గురించి రావుగారు చెప్పేవారు. వారం పొడుగున తాను రేడియోలో విన్న వార్తల గురించి మోహన్ చెప్పేవాడు. శశికళ చాల తక్కువగా మాట్లాడేది. చాల శ్రద్ధగా వినేది.

వాళ్ళు టిఫిన్ పూర్తి చేసేసరికి కొరియర్ కుర్రాడు వచ్చాడు. కుర్రాడికి, జావాకి టిఫిన్ పెట్టింది శశికళ, తరువాత తనకు వచ్చిన ఉత్తరాలను పట్టుకొని తన టెంటులోకి వెళ్ళిపోయింది. ఆమె తల్లిగారు, చెల్లెలు, తమ్ముడు ఉత్తరాలు వ్రాశారు. కొన్ని పుస్తకాల పాకెట్లు, ఎపిగ్రఫీ సంచికలు, లండన్ నుంచి ఒక స్నేహితురాలు పంపిన క్రిస్టమస్ గ్రీటింగ్సు వచ్చాయి.

శశికళ కుక్కరు అమర్చి, ఉత్తరాలకు జవాబులు వ్రాయడానికి కూచుంది. మోహన్ కూడా అదే పని చేశాడు. రెండు టెంట్లలకు పక్కన అంతా ఖాళీ స్థలమే. అటు లబడాడీ తండా వరకు ఇటు పుల్లారెడ్డి గూడెం వెళ్ళే దారిలో 53 నంబరు సైటుంది. అక్కడ తవ్వకాలు పూర్తయాయి. రాతి యుగం నాటి పనిముట్లు అక్కడ లభించాయి.

జావా మొగుడు రెండు టెంట్ల చుట్టూ, అడివి మొక్కలు కొట్టి దడి అల్లి ఆవరణ ఒకటి ఏర్పరిచాడు. దానికో గేటు పెట్టాడు. నక్కలు, తోడేళ్ళు, ఎలుగులు, తిన్నగా టెంట్లలోకి రాకుండా ఆ పని చేశాడు. ముందు టెంటుకి వాకిలిగా, నేల బాగుచేసి విశాలమైన చదరంగా తీర్చాడు. మధ్యను నడవడానికి ఆరడుగుల వెడల్పుదారి విడిచిపెట్టి, పక్కలలో మల్లె మొక్కలు తెచ్చి చేశాడు. అక్కడికి లంబాడీ తండా మూడు ఫర్లాంగులుంటుంది.

మధ్యాహ్నం భోజనాలయేసరికి రెండు గంటలయింది. మూడు వరకూ వాళ్ళు విశ్రాంతి తీసుకొని పుల్లారెడ్డి గూడెం వేపు బయలుదేరారు. కొరియర్ కుర్రాడిని బస్ స్టాప్ దగ్గర విడిచిపెట్టి వాళ్ళు ముగ్గురూ ఆరు బయట రంగస్థలం దగ్గరికి వెళ్ళారు. దానిని ఆంఫీ థియేటరంటారు. ఫిరంగి మోటు కొండల దిగువ భాగంలో ఈ రంగస్థలం ఉంది. దానికి ఎగువ భాగంలో హారీతి దేవాలయం ఉంది.

లోయలోకి వచ్చే వినోదపర్యాటకులు తప్పకుండా ఈ రంగస్థలిని చూడనిదే వెళ్ళరు. సాయంకాలపు సూర్యకాంతిలో ఆ చోటు చాల అద్భుతంగా కనిపిస్తోంది. రమారమి నూరుమంది విద్యార్థులు, విద్యార్థినులు, మగ టీచర్లు, మాడమ్‌లు వారితో పాటు గైడొకడు అక్కడికి చేరుకున్నారు.

పిల్లలందరూ గాలరీ వరుసలుగా ఉన్న పలక రాళ్ళ మీద కూర్చున్నారు. టీచర్లు వాళ్ళను నాలుగు దిక్కులకు సర్దారు. మెట్లకు దిగువ దీర్ఘ చతురస్రంగా ఉన్న నేల మధ్యను గైడ్ నిలబడ్డాడు. అతనినందరూ రెడ్డిగారని పిలుస్తారు. అతని గొంతు పెద్దది. అనునాసికంగా అతని మాటలు వెలువడతాయి.

“విద్యార్థి సోదరులారా! ఆచార్యులారా! ఉపాధ్యాయులారా! మీరు ప్రస్తుతం కూర్చున్న ఈ రంగస్థలం క్రీస్తు శకం మూడో శతాబ్దంలో నిర్మింపబడింది. భారతదేశంలో ఇటువంటిది మరొకటి లేదనడం నిర్వివాదమైన విషయం. ఇందులో ఒక ముఖ్యమైన విశేషం మీరు గమనించే ఉంటారు. నేను మామూలుగా మాట్లాడుతున్నాను. పైమెట్ల మీద కూర్చున్న వారికి, కింది వరుసలలో నున్న వారికి నా మాటలు వినిపిస్తున్నాయా?”

వాళ్ళందరూ చప్పట్లు కొట్టి అరిచారు – “చాల స్పష్టంగా వినిపిస్తున్నాయి!”

“నేను గుసగుసలుగా రెండు మాటలంటాను. ‘ఇక్ష్వాకులు దేని నిర్మాణానికి కారకులు’ నా మాటలు వినిపిస్తున్నాయా?”

అందరూ చప్పట్లు కొట్టారు. ‘అద్భుతంగా ఉంది’ అంటూ కేకలేశారు.

“మీరంతా గట్టిగా అరుస్తే నా చెవులు చిల్లులు పడుతున్నాయి. నా మాటలెంత స్పష్టంగా మీకు వినిపించాయో, మీ అరుపులు కూడా అంత గట్టిగా నాకు వినిపిస్తున్నాయి.”

అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

“శబ్ద శాస్త్రాన్ని ఇంగ్లీషులో అకౌస్టిక్స్ అంటారు. ఈ స్థలానికి మూడు వేపుల కొండలున్నాయి. ధ్వని తరంగాలు, ప్రతిధ్వని తరంగాలు చక్కగా మేళవించి, అందరికీ శబ్దం వినడానికి అనుకూలించే ఈ ప్రదేశాన్ని ఆనాటి ఇంజనీర్లు కనుక్కొని ఇక్కడ ఆరుబయట రంగస్థలాన్ని నిర్మించారు.”

అందరూ చాల శ్రద్ధగా వింటున్నారు.

“ఇక్ష్వాకుల కాలంలో ఇది నిర్మింపబడింది. ఆ రోజుల్లో విజయపురి ప్రజలతో కిక్కిరిసి ఉండేది. వారికి వినోదం కలిగించడం కోసం ఇటువంటి ఆరుబయట రంగస్థలం ఎంతేనా అవసరమే. గాయకులు, నాట్యకారులు, నటకులు, ఉపన్యాసకులు, ధర్మకథకులు, ఈ విధంగా చాలమంది ఈ రంగస్థలిని ఉపయోగించుకున్నారు”.

“ఎంతకాలం ఇది వాడుకలో ఉంది?” ఒక టీచరడిగాడు.

“రమారమి నూరు సంవత్సరాలు.”

“అటు తరువాతా?”

“ఇక్ష్వాకుల పాలన అకస్మాత్తుగా అంతమయింది. దానితో పాటు ఈ రంగస్థలి కూడా కాలగర్భంలో కలసిపోయింది. ఇప్పుడు జరుగుతున్న తవ్వకాలలో ఇది బయట పడింది. మనకు పైన కొండమీద హారీతి దేవాలయం చూశారు కదా! అంత ఎత్తు వరకు ఈ మాటలు ప్రయాణం చేస్తాయి”.

“ఇందతా నీట్లో మునిగిపోతుందా?” మరెవరో ప్రశ్నించారు.

“మునిగిపోతుంది కాని, కొన్ని కట్టడాలను నాగార్జున కొండమీదికి, కొన్ని అనుపు దగ్గరికి తరలిస్తారు.”

“ఇంత పెద్ద రంగస్థలాన్నా?……” మరెవరో అన్నారు.

“అవును. వేయిమంది ప్రేక్షకులు హాయిగా కూర్చొని వినోదించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. 1955లో భారత ప్రధాని శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపనకు వస్తే వారికి ఈ రంగస్థలిని చూపించారు. ఆయన దీని విశిష్ట నిర్మాణానికి చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఇది కాల గర్భంలో కలిసిపోదు. పునర్జన్మ లభిస్తుంది దీనికి.”

పిల్లలందరూ చప్పట్లు చరిచారు.

కింది వరుస పలకల మీద మోహన్, శశికళ, సుబ్రహ్మణ్యేశ్వరరావు కూర్చున్నారు. ఆ సమయంలో శశికళ లేచి, గైడ్ దగ్గరికి వెళ్ళి నిలుచుంది.

“నా పేరు శశికళ, నేను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. మీరొక్క పదినిమిషాలు కూర్చుంటే ఇటువంటి రంగస్థలి గురించి చెప్తాను.”

“ఉంటాం మాడమ్!” చాలామంది అంగీకారం తెలిపారు.

“వినండి! గ్రీసు దేశంలో తూర్పున ఒక అఖాతముంది. భూకంపం వలన ఆ అఖాతంలో ఒక ద్వీపం పైకి వచ్చింది. దాని పేరు ఏజినా. అక్కడో మహానగరం వర్ధిల్లింది. ఆ నగరంలోని సమాధులలో చాలా బంగారం దొరికింది. క్రీస్తు పూర్వం 1100 సంవత్సరం ప్రాంతాలలో డోరియన్లు ఆ ద్వీపాన్ని జయించారు. పంటలు పండడానికి భూమి అనుకూలించకపోతే దానిని వాణిజ్యం కోసం ఉపయోగించారు. అయిదారు వందల సంవత్సరాల తరువాత పర్షియన్లు ఏజినా ద్వీపాన్ని ఆక్రమించారు. అపుడు సంపన్నులైన వర్తుకులే అక్కడ ఉండేవారు. వాళ్ళు తమ కార్ఖానాలో తయారయే పాత్రలను, కంచుతో చేసిన వస్తువులను కొనేవారు. వాళ్ళలో కొంతంది బానిసలు కార్ఖానాలలో పనిచేసేవారు. మిగిలిన వారిని దేశంలో విక్రయించేవారు. క్రీస్తు పూర్వం 350 సంవత్సరాలలో ఏజినాలో అయిదు లక్షలమంది ప్రజలు నివసించేవారు. వారిలో నాలుగు లక్షల డెబ్బై వేలమంది బానిసలే. ఇక్కడే మొదటి సారిగా గ్రీకు నాణాలు తయారయాయి. తూనికలు, కొలమానాలు ఇక్కడే తయారయాయి. ఇవన్నీ రోమనులు గ్రీసును జయించే వరకు వాడకంలో ఉన్నాయి.”

అందరూ శ్రద్ధగా వింటున్నారు. శశికళ తిరిగి చెప్పింది.

“క్రీస్తు శకం 1811లో బాటసారి ఒకడు ఈ ప్రాంతాలలో, చెత్తకుప్పలలో, చాల చక్కగా చెక్కిన శిల్పాలను కనుగొన్నాడు. సంపన్నులు ధనార్జన నుండి శిల్పకళ వేపు ఆకర్షితులైనట్లున్నారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఏజినా పక్కనే ఎపీడారస్ అన్న దీపముంది. గ్రీసు దేశానికి వచ్చిన టూరిస్టులు ఏజినా నుండి ఎపీడారస్ పడవల మీద పోతారు. ఒకప్పుడు గ్రీసులో ప్రఖ్యాత పొందిన నగరం అక్కడుండేది. ఇప్పుడక్కడ అయిదు వందలమంది ఉండే చిన్న గ్రామం మాత్రం ఉంది. దీనికి పదిమైళ్ళ దూరంలో కొండకనుమలలో, ఉన్నతమైన పర్వత శ్రేణిలో, ఆస్క్లిపయస్ ఉండేవాడు. అతడు రోగాలు కుదిర్చే దేవత. అపోలోకి కొరోనియస్‌కి పుట్టినవాడు. అతడంటే మానవులు ఎంతో సంతోషించేవారు. అతడు చాలమంది ప్రజల రుగ్మతలను కుదిర్చాడు. చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికించాడు. అపుడు నరకానికి ప్రభువైన ప్లూటో, దేవాదిదేవుడైన జూస్‌తో మొరపెట్టుకున్నాడు. ఈ జూస్‌ని రోమన్లు జూపిటర్ అని అంటారు. మరణించవలసిన మానవులంతా చిరంజీవులుగా నిలిచిపోతే ఏం చేయడమో అతనికి తోచలేదు. జూస్ తన వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆస్క్లిపయస్‌ని నాశనం చేశాడు. పిడుగుపాటుతో అతడు చనిపోయినా, థెసలీ దేశపు ప్రజలు, గ్రీకులు, అతనిని ప్రాణదానం చేసిన దేవుడిగా పూజించారు”.

ప్రసంగం ఆపి ఆమె నాలుగు వేపులు చూసి తిరిగి అడిగింది.

“మీకేం బోరు కొట్టడం లేదుకదా?”

“చెప్పండి మాడమ్!” చాలా మంది కుర్రాళ్ళు అరిచారు.

“మహోన్నతమైన ఆలయం ఒకటి ఆస్క్లిపయస్ కోసం నిర్మించారు. ఆ ఆలయంలో పూజారులు మహావైద్యులు. వాళ్ళను ఆస్క్లిపయడీస్ అంటారు. అక్కడ వాళ్ళొక ఆర్యోగకేంద్రం స్థాపించారు. దాని కీర్తి అన్ని దేశాలకు వ్యాపించింది. మధ్యధరా సముద్ర దేశ ప్రాంతాలనుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. గ్రీకులకు అన్ని వరాలకన్న ఆరోగ్యమే గొప్పది. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రజలు దేవాలయంలో నిద్రపోయేవారు. వైద్యులైన పూజారులు నిర్ణయించిన పథ్యాల నన్నిటిని పాటించేవారు. ఔషధాలను సేవించేవారు. తమకు కలిగిన రోగవిముక్తి దైవికమైన మహాసంఘటనగా భావించి, దాని గురించి రాతిపలకలమీద చెక్కించారు. ఆ పవిత్ర ప్రదేశంలో ఇప్పటికి కూడా ఆ పలకలు లభ్యమవుతాయి. ఆ రోగులు ఇచ్చిన బహుమతులతోను, ధన రూపమైన ప్రతిఫలంతోను, ఆ పర్వతాల ఒడిలో ఒక మహా రంగస్థలాన్ని, ఎపిడోరస్‍లో నిర్మాణం చేశాడు. ఇక్కడ దట్టమైన అరణ్యాలున్నాయి. టూరిస్టులకు ఈ మహారంగస్థలం కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో ‘పాలిక్లిటన్’ దీనిని నిర్మించాడు. ఈనాటికి కూడా ఇది మనకు సంపూర్ణంగా దర్శనమిస్తుంది. నాట్యవేదిక వర్తులంగా ఉంటుంది. పర్యాటకుడు దాని మధ్యను నిలబడితే, అతనికి ఎదురుగా, పంక్తులలో పైకి లేచిన పధ్నాలుగు వేల ఆసనాలు కనిపిస్తాయి. వేదిక మీద నిలబడ్డ పర్యాటకుడికి ఆసనాలమీద కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు అభిముఖంగా కనిపిస్తాడు. ఆ విధంగా రంగస్థలం నిర్మింపబడింది. ఆసనాల వరుసల మధ్యను, మీదకు పోడానికి బాటలున్నాయి. అవి నాట్య వేదికనుండి తిన్నగా కొండచరియల వరకు పోతాయి. పర్యాటకుడు దిగువనుండి రెండ వందల అడుగుల ఎత్తున ఆసనాలలో కూర్చున్న తన స్నేహితులతో నెమ్మదిగా మాట్లాడితే, అతని చిన్న మాట కూడా వాళ్ళకు స్పష్టంగా వినిపిస్తుంది. రెండు వేల సంవత్సరాలకు పూర్వమే పట్టణాలలో నివసించే గ్రీకులు, ఆరుబయట జీవితం గడిపి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవారని మనకు తెలుస్తుంది.”

ఇంకా ఆమె ఏమి చెప్తుందో వినాలని అందరూ ఎదురు చూశారు.

“మన ఇక్ష్వాకులకు, ప్రాచీన గ్రీకులకు స్నేహసంబంధాలు ఉండేవని, వారి సంస్కృతి యొక్క ప్రభావం మనమీద ఉందని చెప్పడానికి ఈ ఆరుబయట రంగస్థలమే సాక్ష్యం. మీరందరూ ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు.”

సాయంకాలం నీరెండ అందరి ముఖాలమీద బంగారు పూత పూసింది.

దివంగత ప్రధాని ఆదేశానుశారం ఈ ఆరుబయట రంగస్థలిని అనుపు దగ్గిర నిర్మించారు. అన్ని విధాల అది లోయలోని రంగస్థలితో సరిపోయింది. కాని దానిలో ఒక అతిముఖ్యమైన గుణం మాత్రం లోపించింది. పైవారికి మాటలు వినిపించే అదృష్టం మాత్రం పోయింది. ఆ శబ్దశాస్త్రం దీనికి వర్తించలేదు.

16

ఆ రోజుతో ఆంగ్ల సంవత్సరం 1960 మొదలయింది. జనవరి ఒకటో తారీకున పన్నెండు గంటలకే సైటులో పని ఆపేశారు. మధ్యాహ్నం పనివాళ్ళకు సెలవిచ్చారు. మ్యూజియమ్ క్యూరేటరు ప్రసాద్‌ని భోజనానికి పిలిచారు. మోహన్ అతనిని తనతో తీసుకొని టెంట్లవేపు నడిచాడు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు, శశికళ టెంటులో వంటలు వండుతున్నారు. ఆ రోజు ఉదయం శశికళ పనికి పోలేదు. ఆ దినం శుక్రవారం. పుష్యమాసం వచ్చింది. టెంట్లకు ముందునున్న ఆవరణలో గోలాలలో, జావా వేసిన చామంతి మొక్కలు ఏపుగా పెరిగి తెల్లటి పూలు, పచ్చటి పూలు పూస్తూన్నవి.

సూర్యుడు దక్షిణానికి వాలి ప్రయాణం చేస్తున్నాడు. ఉత్తర దిశనుండి చల్లటి గాలి వీస్తున్నది. ఎండలో టేబిళ్ళు పెట్టి, కంచాలు అమర్చి, వండినవి పక్కన మరో బల్లమీద ఉంచుకొని, వాళ్ళు నలుగురూ భోజనాలకు కూర్చునే సరికిక మధ్యాహ్నం ఒంటిగంట అయింది.

వండిన పదార్థాల నుండి వాసనలు వచ్చి అతిథులను ఆహ్వానిస్తున్నవి. గోబీపువ్వులు, బంగాళ దుంపలు, పచ్చి బటానీలు కలిపి వండిన కూర, వంకాయ వేపుడు, కొబ్బరికాయ పెరుగు పచ్చడి, సాంబరు, సలాడ్, పాయసం అవే కాకుండా శశికళ అప్పడాలు వేయించింది. గడ్డ పెరుగు, అరటి పళ్ళు కూడా.

నాగార్జున కొండ లోయలో మంచి భోజనం దొరకడం అబ్బురమే. విందు భోజనం లభించడం ఇంకా అదృష్టమే. మగాళ్ళు ముగ్గురూ ఏక కంఠంతో శశికళను ప్రశంసించారు, అంత ఉత్తమమైన లంచ్ పెట్టినందుకు.

భోజనాలయిన తరువాత మిగిలిన పదార్థాలను జావా లోపలికి తీసుకుపోయింది. టేబిళ్ళు ఎత్తివేశారు. కుర్చీలు కూడా పక్కకు పెట్టేసి, జంబుఖానా పరచుకొని, నలుగురు దానిమీద కూర్చొని మాట్లాడుకోడం మొదలు పెట్టారు.

“తవ్వకాలలో మేము సాధించినది లేకపోయినా దీనికి లోటు ఏకుండా రోజులు గడుపుతున్నాం. జావాకి శశికళ వంట నేర్పారు. వీలయినప్పుడల్లా ఆమె సవ్యంగా వండుతున్నారు. డాక్టర్ శశికళను అందరి తరపున మరోసారి అభినందిస్తున్నాను” అన్నాడు మోహన్.

“నేను డాక్టర్ మోహన్‌ని, డాక్టర్ శశికళను అభినందిస్తున్నాను. నా ఉద్యోగంలో ఎటువంటి కొత్తదనం లేదని వాపోయేవాడిని. ఒంటరితనంతో బాధపడేవాడిని. వీళ్ళిద్దరితో పరిచయం ఏర్పడిన తరువాత చాలా విషయాలు తెలుసుకొని, తవ్వకాల పట్ల మోజు పడుతున్నాను” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“పరిశోధనలో తలమునకలై మరో విషయం గురించి ఆలోచనే లేని నాకు మీ ముగ్గురి పరిచయం కలిగి, జీవితంలోని మాధుర్యం అప్పుడప్పుడు అస్వాదించడానికి చక్కని అవకాశం కలుగుతున్నది. కాబట్టి, మీ ముగ్గిరిని నేను అభినందిస్తున్నాను” అన్నారు క్యూరేటరు.

ఏవో పిచ్చాపాటి మాటలు దొర్లుతున్నాయి.

ప్రసంగం మధ్యలో ప్రసాద్ అన్నారు.

“శశికళా! మీకు గ్రీకుల చరిత్ర గురించి బాగా తెలుసు, వారి సంస్కృతి గురించి, గ్రీకు వనిత గురించి తెలుసుకోవాలని ఉంది.”

సుబ్రహ్మణ్యేశ్వరరావు, మోహన్ కూడా ఆసక్తి కనబరిచారు.

“నాకు చాలా విషయాలు తెలుసు. గ్రీకు గణిక గురించి బాగా చదివాను. వారి సౌందర్యం గురించి కూడా తెలుసు. ఇంకా తెలిసిన విషయాలు మీకు చెప్పడం నా అదృష్టమని భావిస్తాను” అంది శశికళ.

గ్రీకుల జీవితాదర్శాల గురించి ఆమె చెప్పడం మొదలు పెట్టింది.

“గ్రీకుల అన్నిటికన్న ముందుగా శారీరక సౌఖ్యాన్ని కోరుకుంటారు. ఆ సౌఖ్యం మానవులకు లభించాలంటే ఆరోగ్యం ముఖ్యమైనది. ఈ సౌఖ్యం తరువాత వాళ్ళు కోరుకునేది యశస్సు. కాని, కీర్తి మాత్రం గౌరవంగా లభించాలి. వాళ్ళు ఆరోగ్యాన్ని ఎంత హెచ్చుగా వాంఛిస్తారో, అదే స్థాయిలో తాము ప్రేమించిన దానిని పొందడానికి ప్రయత్నిస్తారు.”

“గ్రీకులు కోరే జీవితానందం, సౌందర్యం ప్రేమ అన్న వాటి మీద ఆధారపడింది. ఉల్లాసకరమైన ఆనందాన్ని ప్రేమ మాత్రమే ఇవ్వగలదని వాళ్ళు భావిస్తారు.”

“ఇవన్నీ పైకి సబబుగా, మర్యాదగా కనుపించే విషయాలు. ఇది వారి బాహ్య స్వభావం కాని, దీని వెనుకకు ఓ కలవరపరిచే నిజముంది. గ్రీకుల అంతర్గతమైన స్వభావం నగ్నంగా ఉండే కాముకత్వం. ఇది ఒకప్పుడు పశుత్వంగా పరిణమిస్తుందని చెప్పడంలో అసత్యం లేదు.”

“హెరాక్లెడ్ ఫాంటికస్ అనే పర్షియన్ రాజుండేవాడు. అతనికి మూడు వందల మంది అంతఃపుర స్త్రీలుండేవారు. వాళ్ళు పగటిపూట నిద్రించి, రాత్రి మేలుకొని ఉండేవాళ్ళు. పాడుతూ దీప కాంతిలో వాళ్ళు రాజుతో శృంగార చేష్టలలో పాల్గొనేవారు. రాజు వేటకు వెళ్ళినా, వీళ్ళు కూడా అతనితో వెళ్ళేవారు.”

“ఈ పర్షియన్ రాజు, ఒక పుస్తకం రచించాడు. దాని పేరు ‘ఆనందం’. అందులో కొన్ని విషయాలు అతడు స్పష్టంగా వ్రాశాడు. పాలకవర్గం వాళ్ళు విలాసంగా జీవితాలు గడుపుతారు. కాముకత్వం వారి జన్మహక్కు, పని, శ్రమ అనేవి బానిసలు, బీదవాళ్ళు ఆచరించవలసినవి.”

“ధనికులు కాముకులుగా విలాసవంతమైన జీవితం గడపడం చేతనే వాళ్ళు విశాలహృదయులుగా, ఉత్తమశీలం కలవారుగా రూపొందుతారని ఈ రాజు తన పుస్తకంలో వ్రాశాడు.”

“టెర్రహీనియన్లన్న మరో తెగ వాళ్ళు, స్త్రీలు అందరికీ చెందిన ఆస్తి అని అంటారు. ఇళ్ళల్లో పనిచేసే స్త్రీలు, పురుషులు ఎదుట నగ్నంగా సంచరించాలి. స్త్రీలు మగవాళ్ళతో కలిసి సాము గరిడీలు చేసేవాళ్ళు, తమ శరీరాలను జాగ్రత్తగా పోషించుకునే వాళ్ళు. నగ్నంగా తిరగడం అవమానకరమైన పని అని వాళ్ళు భావించలేదు. తమ భర్తలతో వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కారు. కాని, ఆ సమయానికి అక్కడ ఏ పురుషుడుంటే అతనితో భుజించేవారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో పానగోష్ఠిలో పాల్గొనే వాళ్ళు. ఆ స్త్రీలు చాలా అందగత్తెలు. తాగడం మీద మోజు పడేవాళ్ళు. తండ్రెవరో తెలియని పిల్లలను తమ బిడ్డలతో సమానంగా పెంచేవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళయితే తమను పోషించిన వాళ్ళవలె తయారయే వాళ్ళు. మగపిల్లలు ఆడపిల్లలతో బహిరంగంగా వ్యభిచరించినా వాళ్ళు తప్పు పట్టేవాళ్ళు కారు. అది సిగ్గు పడవలసిన పనిగా వాళ్ళకి అనిపించేది కాదు. స్నేహితులతోను, బంధువులతోను ఉండేటప్పుడు ఈ విధంగా వ్యవహరించేవాళ్ళు.”

“టెర్రహీనియనులు బాగా తాగి పడకగదులకు పోయినప్పుడు సేవకులు అందమైన అబ్బాయిలను కాని స్త్రీలను కాని తెచ్చేవాళ్ళు. దీపాలు బాగా వెలుగుతుంటే, వాళ్ళతో సంతృప్తికరంగా ఆనందించేవాళ్ళు. అంతటితో సరి పెట్టక, మంచి వయసులో నున్న యువకులను తెప్పించేవాళ్ళు. తమతో బాటు ఆ గణికలను, అబ్బాయిలను స్త్రీలను వాళ్ళు కూడా అనుభవించనిచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రేమకు, సంభోగానికి నివాళులిచ్చేవాళ్ళు, ఒకరినొకరు సాకాంక్షగా చూసుకునేవారు. లేకపోతే తెరలు వేసుకునే వాళ్ళు. టెర్రహీనియన్లకి ఆడవాళ్ళంటే చాల ఇష్టం. అబ్బాయిలన్నా యువకులన్నా వాళ్ళు ఇంకా ఇష్టపడేవారు. వాళ్ళు చాల అందంగా ఉండేవాళ్ళు. శరీరం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు.”

“దిగువ ఇటలీలో టారెంటా అన్న నగరముంది. అక్కడి ప్రజలు చాల విలాసవంతులు – శరీరమంతా కనుపించే పచ్చటి అంచుల కల పలుచటి దుస్తులు ధరించి తిరిగేవాళ్ళు. వాళ్ళు అపూరియాలో ఉన్న కర్బినా పట్టణం ధ్వంసం చేసి, అక్కడి అబ్బాయిలను, అమ్మాయిలను, యువతులను దేవాలయాలలోకి ఈడ్చుకొని వచ్చారు. వాళ్ళను దిగంబరులుగా చేసి ప్రేక్షకులకు చూపించారు. కొంతమంది, ఈ దురదృష్టవంతుల మందమీదికి విరుచుకు పడి, కళ్ళ ఎదుటపడ్డ నగ్న సౌందర్యానికి ఉద్రిక్తులయి, అందరు ప్రజలూ దేవుళ్ళూ చూస్తూ ఉంటే, తమ కామం తీర్చుకునే వాళ్ళు. ఈ దారి తప్పిన వాళ్లకి దేవుళ్ళ మీద అనుమానం కలుగలేదు. దేవుళ్ళేం చెయ్యగలరని వాళ్ళనుకున్నారు. కాని, దేవుళ్ళు ఈ నేరానికి శిక్ష విధించారు. కొద్దికాలంలోని వ్యభిచారులందరూ పిడుగు పడి నశించారు.”

“మార్సెల్సు నగరం స్వలింగ సంపర్కం కలవారికి, అంటే హెమో సెక్కువల్సుకి పుట్టినిల్లు. సామెత ఉండనే ఉంది కదా, ‘షిప్ టు మార్సెల్సు’ అని.

“అస్సీరయా రాజు సర్దనా పాలస్. అతడు సమాధి మీద ఈ విధంగా వ్రాయమని నిర్దేశించాడు.”

‘సూర్యుడి వెలుతురు చూసినంతకాలం నేను రాజుగానే బ్రతికాను. నేను మనసారా తిన్నాను. కోరిక దీరా తాగాను. ప్రేమ నాకిచ్చిన ఆనందాన్ని ఆరాధించాను. జనుల జీవిత కాలం తక్కువనేని, అది కూడా మార్పులకు దురదృష్టానికి బలి అవుతుందని నాకు బాగా తెలుసు. అందుచేత జీవితంలో ఒక రోజు కూడా వ్యర్థం కాకుండా, ఈ విధంగా నేను విలాసవంతంగా జీవిస్తున్నాను.’

“స్పార్టాలో అగీస్ రాజు భార్య టిమాయితో అల్సిబయడెస్ అన్న మహానుభావుడు వ్యభిచరించాడు. దానికతడు ‘కామం కారణం కాదని, రాజకీయమైన ప్రేరణతో అలా చేశానని’ అన్నాడు. అతడు ఎక్కడికి పోయినా, ఆ రోజుల్లో పేరెన్నిక గన్న గణికలు ఎప్పుడూ ఉండేవారు.”

“అల్సిబయడెస్ యువకుడుగా ఉండేటప్పుడు, పురుషులు తమ భార్యలను విడిచిపెట్టి అతని వెంటబడేవారు. అటుపిమ్మట అతడు వయసులో ముదిరిన తరువాత, పురుషులను విడిచి వాళ్ళ భార్యలు అతని వెంటబడ్డారు. హాస్యగాడొకడు ఈ సందర్భంలో అన్నాడు.”

‘తొలుత అల్సిబయడెస్ పురుషుడే కాదు.

ఇప్పుడు అందరి స్త్రీలకు అతనే పురుషుడు’

“చిన్న డయోనీషియస్ సిసిలీకి చిచ్చరపిడుగు. చరిత్రలో అతని గురించి ఉంది.”

“డయోనీషియస్ మాతృనగరమైన లోక్రీసు చేరుకొని, పెద్ద భవనంలో విడిది చేశాడు. దానిని అడవి పూలతోను, గులాబులతోను నింపాడు.

పిమ్మట నగరంలోని యువతులను ఒకరితరువాత ఒకరిని పిలిపించాడు. తాను దిగంబరుడై, వాళ్ళను నగ్నంగా చేసి, పాన్పుమీద వాళ్ళతో దొర్లాడు. ఊహ కందిన విధాలుగా వాళ్ళను రమించాడు.”

“కొద్దికాలం ఇలా సాగింది. అవమానం పొందిన తండ్రులు, భర్తలు మరి సహించలేకపోయారు. డయోనీషియస్ భార్యను, సంతానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అందరి ఎదుట, ఎన్నివిధాలుగా ఊహకు వీలవుతుందో అన్ని విధాలుగా వాళ్ళను చెరిచారు. వాళ్ళమీద తమ కోరికలన్నీ ప్రజలు తీర్చుకున్న తరువాత, వాళ్ళ వేలి గోళ్ళ కింద సూదులు పొడిచి, వాళ్ళను చంపించారు.”

“శరీర సౌఖ్యమే గ్రీకులకు ఆరాధ్యమైనది. కామమే వాళ్ళ పరమావధి. కాని, పరిశీలించి చూస్తే, కాముకత్వం వాళ్ళ జీవితాలకు మూల సూత్రమైనా, వాళ్ళు మరికొన్ని జీవితాదర్శాలతో దీనిని మేళవించి, ఒక మహా సంస్కృతిని సృష్టించారు. అన్ని యుగాలు అంతమయేవారకు మానవజాతి గ్రీకుల సంస్కృతిని కొనియాడుతునే ఉంటుంది.”

జనవరి ఒకటో తారీకు ఆ విధంగా శశికళ ఉపన్యాసాలతో గడిచిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here