హైపో

0
2

[dropcap]”తా[/dropcap]తా…!” ఎక్కడ్నుంచో పిల్లల అరుపులు.

“తాతా…!”

“నాన్నగారూ! మందులు సరిగ్గా వేసుకోరు మీరు. మీకు అక్కడయితేనే సౌకర్యంగా ఉంటుంది. టైంకి టిఫిన్, భోజనం, మందులు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సాయంత్రాలు మీకిష్టమైన చదరంగం మీ వయస్సు వాళ్ళతో కబుర్లు చెబుతూ ఆడుకోవచ్చు.”

చిన్నప్పట్నుంచి ఆపేక్షగా పెంచి, మురిసిపోతూ వినే గొంతు తన విక్రమ్‍దే.

మగతగా ఉంది. మళ్ళీ కళ్ళముందు చుక్కల్లా, వెలిగి ఆరే దీపాల్లా కాంతులు కనిపిస్తున్నాయి. తలనొప్పి, చేతులు కొట్టుకోసాగాయి. నోటిలోనుండి నురగ వస్తోంది.

ఏమీ గుర్తురావడం లేదు. ఏవేవో చిన్నప్పటి దృశ్యాలు. చాలారోజుల క్రితం రిటైరయినఫ్ఫుడు ఎల్‌ఐసి ఆఫీస్‌లో టీ పార్టీలో స్టెనో మాలతి పూల ‘బొకె’ ఇస్తోంది.

ఇంకా పాత దృశ్యాలు. ఉద్యోగం మొదటి రోజు ఆఫీసులో సంతకం పెడుతున్నాడు.

“మీ ఛెయిర్ అదే… ఫైల్స్ పంపిస్తాను” మేనేజర్ నీలకంఠేశ్వరరావు స్పోటకం మచ్చల మొహం దగ్గరగా దగ్గరగా వచ్చి అదృశ్యం అయింది.

అఖరి దృశ్యం, భార్య చనిపోయిన రోజు. ఆమెకు పెద్దబొట్టు పెట్టి తడిగుడ్డలతో స్నానం చేసి పూలు కుంకుమ చల్లుతున్నారు. సన్నగా రోదనలు… ఉండుండి భారీ శబ్దంతో వినిపిస్తున్నాయి.

ముసలాయన చేతులూ కాళ్ళూ కొట్టుకోసాగాడు.

***

జీవన సంథ్య ఓల్డేజ్ హోమ్ మాసిన గోడలతో… నాలుగు అంతస్థులతో ఉన్న ఒక పాత బిల్డింగ్. నాలుగో అంతస్థులో ఐదోనెంబరు గదిలో తలుపు తీసుకుని వచ్చింది ఆయా.

“ఓ… ముసలాయనకి ఫిట్స్ వస్తున్నాయి! రవిబాబు… రవిబాబు…” అంటూ పిలిచింది కాంపౌండర్ కోసం.

ఓల్డేజ్ హోమ్‍లో డ్యూటీ డాక్టర్స్ ఉండరు. ఒక కాంపౌండర్, నర్స్ నైట్ డ్యూటీలో ఉంటారు. ఆయాలు అందరికీ భోజనాల ప్లేటులు, కాఫీ, టీ, పాలు లాంటివి బి.పి మందులు, షుగరు మందులు ఇస్తుంటారు.

రవిబాబు త్వరగానే కదిలాడు. నాలుగో అంతస్థుకి స్థూలకాయంతో పరుగెత్తడం కష్టం అయినా.

‘అయ్యో ఫిట్స్ 108కి ఫోన్ చేద్దాం. ఈ లోపల వేలియం ఇంజక్షను…. అదే ఇస్తాను’ అనుకుంటూ… అది తెచ్చుకుని… కింద కప్‍బోర్డ్ లో వుంది… తనకి తెలిసిన వైద్యం అమలు చేశాడు.

ఒక గంటకి వచ్చిన ఆరోగ్యశ్రీ ఏంబులెన్స్‌లో ముసలాయనని నాలుగు అంతస్థులు మోసుకొని క్రిందకి తీసుకువచ్చి ఎలాగోలా స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తలుపులు వేశారు.

“సీరియస్‍గా వుంది. గాంధీ ఆస్పత్రి దాకా వెళ్ళే టైం లేదు. ప్రక్కరోడ్డులో ధన్వంతరి హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకుపోయి చేర్పిద్దాం. పదండి!” అన్నాడు డ్రైవర్. ఏంబులెన్స్ వేగంగా నీలిరంగు లైట్ చిమ్ముకుంటూ కదిలింది.

అది ఐదు నక్షత్రాల ఆస్పత్రి. ఖరీదైనది. గవర్నమెంటు ఆస్పత్రికి వెళ్ళితే ఏమీ లేదు ప్రయోజనం. ఇక్కడయితే అందరికీ కాస్తోకూస్తో ‘కమీషన్’ వస్తుంది కేసు తీసుకెళ్ళినప్పుడల్లా. అది అందరికీ తెలుసు.

***

మర్నాడు ఉదయం పదిగంటలకి…

ధన్వంతరీ హాస్పిటల్, ఓ.పి విభాగం. డయాగ్నొస్టిక్ మెడిసిన్, డాక్టర్ ధీరజ్ ఎమ్.డి అన్న బోర్డు కల గదిలో.

“డాక్టర్ సాబ్! నాకు షుగర్ ఇంక తగ్గదా?” ఆ వ్యక్తి ఎదురుగా కూర్చుని డాక్టర్ ధీరజ్‍ని ప్రాధేయపడుతున్నాడు.

”తగ్గదు. కాని కంట్రోల్ చెయ్యవచ్చు. చూడు మిస్టర్ కుమార్! నీ బరువు 110 కిలోలు ఉంది. ముందు బరువు తగ్గు. రోజు ఆ క్వార్టర్ బాటిల్ విస్కీ తాగడం మానేయి. కొవ్వు ఉన్న మటన్, చికెన్ తినడం మాని ఎక్కువగా కాయగూరలు తిను. రోజు ఒక గంట నడువు. వరి అన్నం మానేసి మిల్లెట్స్ తిను! అప్పుడు సగం షుగర్ తగ్గుతుంది. ఇదిగో ఈ మందులు కూడా వాడు. నీ జీవనశైలి! అంటాం…. అదే మారాలి! లేకపోతే మందులు పనిచెయ్యవు”

“ఎట్లా డాక్టర్ సాబ్! రోజు మందు తాగితేనే నిద్రపడతాది! ఇన్ని పైసలు సంపాదించి తాగకపోతే, తినకపోతే ఎట్లా?”

ధీరజ్ డాక్టర్ లేచి నిలబడ్డారు. “అయితే నీకు షుగర్ తగ్గదు. ఐదేండ్ల కంటే బతకవు. నీ ఏవరేజ్ షుగర్ HbA1C 11 పాయింట్లు ఉంది. ఇక బయటికి పో”

“అదేంటి డాక్టర్ సాబ్! అంత కోపం జేస్తవ్? తగ్గిస్తావనే గదా నీ దగ్గరికి పేరు విని వచ్చింది” ఆ పేషంట్‍కి చాలా కోపం వచ్చింది.

“జీవనశైలి, మద్యపానం, ఆహారం మార్చుకోకపోతే తగ్గదు. నా దగ్గరికి వస్తే నా మాట వినాలి. లేకపోతే నాకు కోపమే!”

“సరే సాబ్! అట్లానే మందులు రాసియ్యి!”

ధీరజ్ అతనికి మందులు రాసి ఇచ్చి ఆహార నియమాలు, వ్యాయామం చేయవల్సిన సూచనలన్ని కాగితం ఇచ్చి సీట్లో వెనక్కి వాలేడు. కొన్నిసార్లు సత్యమైన ఆగ్రహం కూడా పనిచేస్తుంది మరి.

తలుపు తోసుకుని డాక్టర్ వాసంతి లోపలికి వచ్చింది “ప్రాబ్లెం సార్”

“చెప్పండి వాసంతీ” అన్నాడు ధీరజ్. ఆమె ఇంటెన్సివ్‍కేర్ ఇంఛార్జి డాక్టర్. అంత తేలికగా ‘ప్రాబ్లం’ అని అనదు.

“ఎనభై ఏళ్ళు దాటిన పేషంటు సార్.. ‘సీౙర్స్’ (Fits), జ్ఞాపకశక్తి సరిగ్గా లేదు, అల్జీమర్స్ అని మందులు ఇస్తున్నారు. డయబెటిస్ కూడా వుంది. ఫిట్స్ కూడా తగ్గాయి కాని, స్పృహ వచ్చింది కాని, జ్ఞాపకశక్తి రాలేదు, ఏదీ మాట్లాడడు. అలా అని పక్షవాతం… హెమిప్లెజియా, సారాఫ్లెజియ ఏమీలేదు. మీరు చూడాలి సార్.”

కారిడార్ లోంచి గబగబా నడిచారు ఇద్దరూ.

“‘హైపోగ్లెసీమియా’ (రక్తంలో చక్కెర ప్రమాణం బాగా తగ్గిపోవడం అనే పరిస్థితి) వుందేమో చూసి కరెక్ట్ చేశావా?” అడిగాడు ధీరజ్.

“బ్లడ్ గ్లూకోజ్ 110 మి.గ్రా వుంది సార్, తక్కువ లేదు”.

“హైసోనాట్రీమియా, హైపోకెలీమియా?” (తక్కువ సోడియం, తక్కువ పొటాషియం), హైపో కాల్సీమియా, ఎసిడోసిన్, హైపాక్సియా (తక్కువ ఆక్సిజన్…)” గబా గబా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు.

“నార్మల్… నార్మల్… డాక్టర్” అన్నీ చెప్పింది వాసంతి.

‘ఈ రోజుల్లో వైద్యం అంటే లాబ్ పరీక్షలే అయిపోతున్నాయి’ అనుకున్నాడు. ముసలివారిలో ఫిట్స్ దేనివల్ల నైనా రావచ్చు. జ్వరం, బ్రెయిన్ ఫీవర్, అంటే ఎనసెఫలైటిస్, బ్రెయిన్ స్ట్రోక్ (అంటే మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం) హైబీ.పి., లోబి.పీ ఏదయినా… చివరికి బాత్‍రూంలో కిందపడి తలమీద దెబ్బతగిలినా… సరే!

ఏ.ఎం.సి తలుపులు తోసుకొని ఇద్దరూ ముసలాయన పడుకొని ఉన్న బెడ్ దగ్గరికి నడిచారు.

తెల్లటి పంచ, లాల్చీలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆయన. సి.టి స్కాన్, ఎం.ఆర్. స్కాన్, ఈసిజీ అన్నీ నార్మల్. మరి ఎందుకు అలా ఫిట్స్ వచ్చాయి? జ్వరం కూడా లేదు. అల్జీమర్స్ అని ఇస్తున్న మందుల వల్ల? బ్లడ్ షుగర్ 110 వున్నా కానీ, వృద్ధులలో రక్తంలోని చక్కెర ప్రమాణాల కంటే వాళ్ళ మానసిక లక్షణాల బట్టే మనం వ్యాధి నిర్ణయించాలి. పేషంట్‍కు పరీక్ష ముఖ్యం. ల్యాబ్ వాల్యూస్ కంటే కూడా అనుకున్నాడు ధీరజ్.

“హైసోగ్లైసిమియా”నే కారణం కనిపిస్తోంది 25% గ్లూకోజ్ ఇవ్వు!” అని చెప్పి “ఆ ఓల్డేజ్ హోమ్‍లోని అటెండర్స్ ఎవరైనా ఉన్నారా మాట్లాడదాం పద!” అన్నాడు.

బయట ఒక నడివయస్సు మహిళ చామనఛాయతో, తెల్లటి చీర కట్టుకుని నిలబడి ఉంది.

“మీరు……?”

“ఆయన మా మామగారు చక్రధర రావుగారండి”

“మీకు ఆయనకిచ్చే మందులు తెలుసా? చెప్పగలరా?”

“అన్నీ ఓల్డేజ్ హోం వాళ్ళే చూసుకుంటారు డాక్టర్ సాబ్! నాకేం తెలీదు. సీరియస్ అంటే వచ్చాను. ఎలావుంది ఆయన పరిస్థితి?”

ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి డాక్టరుకి. నిజానికి అన్ని పరీక్షలు నార్మల్‍గానే ఉన్నాయి. ఏం చెప్పాలి!

“అంతా ఓ.కే అమ్మా! అబ్జర్వేషన్ చేసి రేపు చెప్పగలను. నథింగ్ సీరియస్!” ధీరజ్, ఆమెకి చెప్పి, “వాసంతీ! శర్మిష్ఠని కూడా పిలు!” అన్నాడు.

ఇద్దరూ నా డ్యూటీ రూంకి రండి!”

***

“సార్! మీరు చెప్పేది చేయాలంటే కొద్దిగా భయం వేస్తోంది” అంది శర్మిష్ఠ.

“నాకయితే భయం లేదు కానీ తోడు కావాలి” అంది వాసంతి.

“మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళాలి” అన్నాడు ధీరజ్.

“తెల్లకోటు వేసుకొని గవర్నమెంట్ ఇన్‍స్పెక్షన్ అని చెబితే ఎవరయినా భయపడతారు. లెటజ్ గో” అన్నాడు.

“ఒక ఛాలెంజ్‍గా తీసుకుందాం. నేనే వస్తాను”

***

“జీవనసంధ్య” ఓల్టేజ్ హోం రాత్రి పదిగంటలకి మసకచీకటిలో సగం నిద్రలో వుంది. పెద్దవయసు వాళ్ళందరికి ఏడుగంటలకే భోజనాలు పెట్టేసి, తొమ్మిదిగంటలకల్లా పడుకోబెట్టేస్తారు.

గేటు దగ్గర కాలింగ్ బెల్ మోగగానే రవిబాబుకి మెలకువ వచ్చింది. “ఎవరో చూడు ఇప్పుడొచ్చిన్రు!” విసుగ్గా చెప్పేడు ఆయాకి.

లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకో, కోపంగా, విసుగ్గానే వున్నారు.

తెల్లకోటులో చేతిలో ఏవో పుస్తకాలు ఫైల్స్ పట్టుకుని ఒక మధ్యవయస్కుడు మాసిన గడ్దం, ఎర్రటి కళ్ళతో తీక్షణంగా అడిగాడు.

“చక్రధరరావు మీ దగ్గర ఉండే పేషంటేనా?”

రవిబాబుకు కొద్దిగా చెమటలు పట్టాయి. “ఏమైంది సార్. ఆ పెద్దాయన ఇక్కడ్నే వుండే. ధన్వంతరీలో చేర్పించినం. ఫిట్స్ వస్తే”

వాసంతి, ధీరజ్ సాధ్యమైనంత గంభీరంగా ముఖాలు పెట్టుకుని ఒకేసారి అన్నారు. “ఆయనకి బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. డాక్టరులకి కూడా చూపకుండా మీరు ఆయనకి ఏం మందులు ఇస్తున్నారో తెలుసుకోవాలి. మేం డ్రగ్ ఇన్‍స్పెక్టర్స్‌మి. హాస్పిటల్ నుండి వచ్చాం. మీ ఫార్మసీ చూపించండి. మందుల నాణ్యత సరిగ్గా లేకపోతే ఏక్షన్ తీసుకోవల్సిందే”

”ఓ.కే సార్. మా దగ్గర అసుమంటి తప్పులు జరగవు సార్. ప్రతిసారీ డాక్టర్‍కి చూపించడం కష్టం కాబట్టి మేమే డాక్టరు మందుల చీటీ ప్రకారం పేషంటుకి ఇస్తాం! అంతే సార్”

“తప్పు లేదు మీరు మంచి సేవ చేస్తున్నారు. కాని ఆయనకి షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయినయ్. మెదడు ఎఫెక్ట్ అయి ఫిట్స్ వచ్చినయ్!”

“ఫార్మసీ లో మందులు అన్ని ‘డయానిల్’, ‘మెటోఫార్మిన్’ గోలీలే ఉన్నాయి”

“గ్లైబిన్క్లినమైడ్. ఇది చాలా శక్తివంతమైనది. ఈ మధ్య వీటిని వృద్ధుల కియ్యరాదని కూడా చాలా సంస్థలు రికమెండ్ చేస్తున్నాయి” అన్నాడు మారువేషంలో వున్న ధీరజ్.

“కానీ బ్లడ్ గ్లూకోజ్ 110 పైనే వుంది సార్. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్లూకోజ్ 70 మిల్లిగ్రాముల కంటే తగ్గితేనే కదా హైపోగ్లైసీమియా” అంది వాసంతి.

రవిబాబుకి కూడా కొంచెం వైద్యం తెలుసు. “సార్ మా దగ్గర కూడా ఎప్పుడు ఆయనకి బ్లడ్ గ్లూకోజ్ 110 కంటే తగ్గలే”

డాక్టర్ ధీరజ్ అన్నాడు “నేను ఏమీ రిపోర్ట్ రాయను కానీ, ఆ ముసలాయనకేమన్నా అలవాట్లున్నాయా. అంటే కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవడం లాంటివి… నిజం చెప్పండి!”

“చెప్పేదేముంది సార్! నిజమే చెబుతాను. ఆయన పూర్వం చాలా సంవత్సరాల నుంచి అలవాటంట. తాగందే వుండలేడని. వాళ్ళ బంధువులు పిల్లలు వాళ్ళూ కూడా ఒప్పుకుంటే, ఎవరూ చూడకుండా రోజు ఒక్క 90 ఎం.ఎల్ కొలిచి, విస్కీ, సోడా ఇచ్చేవాడిని సార్. పాపం పెద్దవయసులో ఆయనని కష్టపెట్టడం ఎందుకని! సార్! మీరు కేసు రాయకండి. మేం వృద్ధులను మంచిగా చూస్తాం” రవిబాబు జేబులోంచి నోట్లకట్ట తీయబోయాడు.

“నో… నో…. మాకు లంచాలు అవసరం లేదు! మాకు కావాల్సిన సమాచారం వచ్చేసింది. డోంట్ వర్రీ. నీ తప్పేం లేదు” అన్నాడు ధీరజ్.

***

నాలుగు రోజుల తర్వాత ధన్వంతరి హాస్పిటల్ మెడికల్ వార్డులో డాక్టర్ ధీరజ్, వాసంతీ, శర్మిష్ఠ, చక్రధరరావు పేషంటు దగ్గర నిలబడి ఉన్నారు.

ఆయన ప్రశాంతంగా తెల్లని ధోవతి, లాల్చీలో చిరునవ్వు నవ్వుతూ పడుకొని వున్నారు. ఆయన దగ్గర కొడుకు, కోడలు కూడా నిల్చుని వున్నారు.

ధీరజ్ అన్నాడు. “మందులన్నీ మార్చి రాశాం. తక్కువ శక్తిగల షుగర్ మందులే వాడాలి. ఆల్కహాల్ మానివేయాలి. దానివల్ల గ్లైబన్‌క్లైమైడ్ లాంటి శక్తివంతమైన మందులు, చౌకయినవి అయినా సరే ఆల్కాహాల్‍తో కలిపి షుగర్ లెవెల్స్‌ని బాగా తగ్గించి క్రమంగా ఫిట్స్, జ్ఞాపకశక్తి సమస్యలని కలగజేస్తాయి. ఆయనకి అల్జీమర్స్ లేదు. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది. ఎప్పటప్పటి విషయాలు చెప్పగలుగుతున్నారు. పొద్దున్న జరిగిన సంఘటన అంటే రీసెంట్ మెమరీ కూడా బాగానే వుంది.”

వాసంతి అడిగింది “బ్లడ్ షుగర్ ఎప్పుడు చూసినా నార్మల్ వచ్చేది కదా?”

“వాసంతీ, నువ్వన్నది కరెక్టే. కాని ఫంక్షనల్ హైసోగ్లైసీమియా.‌‌.. అంటే రోగి లక్షణాలు, జ్ఞాపకశక్తి లాంటివి, పెద్ద వయస్సు వాళ్ళకి, సుగర్ లెవెల్ 100 -110 మిల్లీగ్రాములు వున్నా కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ రోగి పరిశీలన ముఖ్యం… ల్యాబ్‍ వాల్యూస్ కంటే. అందుకనే అమెరికన్ డయబెటీస్ ఎసోసియేషన్ కూడా, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, 110-120 మిల్లీ గ్రాముల మధ్య ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(తినక ముందు చక్కెర ప్రమాణం) ఉంటే అది మేలే అని చెబుతున్నది. ఈ సంవత్సరం గైడ్‌లైన్స్ అంటే, మార్గదర్శక సూత్రాలు చదువు. అందుకే కొద్ది కొద్దిగా హైపోగ్లైసీమియా, చాలారోజుల్నుంచి ఆయనకిప్పుడీ లక్షణాలని ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు లాగా పొరబడేలా చేసింది. ఫిట్స్ కూడా రావడంతో ఇదంతా బయట పడింది”

“థ్యాంక్స్ డాక్టర్. మా ఫాదర్‍కి ఫిట్స్ తగ్గడమే కాకుండా, జ్ఞాపకశక్తి వచ్చి మా అందరినీ గుర్తు కూడా పట్టాడు. మాకెంతో హ్యాపీ గా వుంది.”

అంతవరకు మాట్లాడని పేషంట్ చక్రధరరావు ఒక్కసారి కొంచెం గట్టిగా అన్నాడు. “డాక్టర్! నా సన్‍డౌనర్ (సాయంత్రం పూట తీసుకునే మద్యపానం) రోజూ కావాలి. చాలాకాలం నుండి అలవాటు. తీసుకోవచ్చా? కొంచెం చెప్పండి!”

“అది మాత్రం కుదరదు సార్!” అన్నాడు ధీరజ్.

ఆ గదిలో అందరి నవ్వులు ఒక్కసారిగా వెల్లివిరిశాయి. అవసరం అయితే రోగి ఇంటికి కూడా వెళ్ళి పరిశోధన చేసే డాక్టర్ ధీరజ్‍కి తృప్తిగా అనిపించింది. “ఆల్కహాల్ యీజ్ ఇంజ్యూరియస్ టూ యువర్ హెల్త్” అన్నాడు నవ్వుతూ.

“మీకు షుగర్ వ్యాధి లేకపోతే, ఏ మందులు వాడకపోతే… ఏమో కాని…. ఇన్ని సమస్యలు వచ్చాక… ‘నో’ అనే చెప్పాలి. సరేనా!”

“ఓకే డాక్టర్ మీరు చెప్పినట్లే వింటాను!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here