జీవన రమణీయం-98

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap]కు ‘మధుమాసం’ సినిమా కథకి నంది అవార్డు వచ్చినట్టు చెప్పాను కానీ ఆ వివరాలు తర్వాత చెప్తాను అన్నాను, కానీ చెప్పలేదు! ‘మధుమాసం’ సినిమా మొదలయినప్పటి నుండీ అయిపోయాకా కూడా చాలా ఫంక్షన్స్ చేసారు రామానాయుడుగారు. ఈ సందర్భంగా ‘అభినందన’ సంస్థ భవాని గారు రామానాయుడు గారినీ, హీరో హీరోయిన్నీ, నన్నూ, డైరెక్టర్‌నీ, కెమెరామన్‍నీ పిలిచి సన్మానించారు!

తరువాత నేను తర్వాత సినిమా పని మీద పడి ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒకనాడు నా మిత్రుడు శ్రీమిత్రా ప్రసాద్ నుండి నా సెల్‌ఫోన్‍కి ఒక మెసేజ్ వచ్చింది “కంగ్రాట్స్… నంది అవార్డు వచ్చినందుకు” అని. నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈ సినిమాని నంది అవార్డ్ కోసం పంపినట్లు కూడా నాకు తెలీదు! “నిజమా?” అని అడిగితే, “ప్రెస్ మీట్‌లో వున్నాను” అని జవాబు వచ్చింది. అంటే అతను నంది జ్యూరీలో వున్నట్టు నాకు అర్థం అయింది. నేను పరిగెత్తి టీ.వీ. ఆన్ చేస్తుండగా, కె.ఎస్. రామారావు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే తీసాను. “మొత్తానికి సాధించారుగా… నంది అవార్డ్… అభినందనలు” అన్నారు.

అప్పుడు నమ్మకం కలిగింది. ఆయన ఆ మాటలు ఎందుకున్నారంటే, ఆయన  నా నవల ‘మొగుడే రెండో ప్రియుడు’ సినిమాగా తియ్యాలని చాలా ప్రయత్నించారు. కానీ నేను చేసిన ఓ తొందరపాటు చర్య వల్ల, అది కామినేని ప్రసాద్ అన్న నిర్మాతగారి వద్ద అడ్వాన్స్ తీసుకోవడం వల్లా, ఆ తర్వాత రామారావు గారు దాన్ని సినిమాగా తియ్యడానికి, శ్రీకాంత్,  జగపతిబాబు, సౌందర్యలతో… ముందుకొచ్చినప్పుడు, నేను, ఆ కామినేని ప్రసాద్ గారి అల్లుడి బెదిరింపులకు భయపడి… “వద్దు లెండి” అన్నాను. రామారావు గారు నాకు ధైర్యం చెప్పినా నేను వినలేదు!

“మీరు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కొస్తున్నారు… ఇంకా వుండాలంటే ఆ సినిమా తీసే సాహసం చెయ్యొద్దని చెప్పండి” అన్నాడు అతనెవరో. ఆ పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. అందుకే వద్దు అన్నాను. అప్పటి నుండీ నేను పైకి రాలేదని పాపం రామారావు గారు చాలా బాధపడ్తూనే వున్నారు. వాళ్ళబ్బాయి సినిమా ‘ఎవరే అతగాడు’ కి కథ ఇచ్చాను గానీ అది ఆడలేదు! కానీ ఆ పాటలు ఇప్పటికీ వింటుంటే మైమరచిపోతాం! కీరవాణి గారు అంత మంచి సంగీతం అందించారు! ఇంత పెద్ద కథ వుంది కె.ఎస్. రామారావు గారు “మొత్తానికి సాధించారు” అన్న మాట వాడటానికి వెనుక.

సరే… టీ.వీ. పెట్టాను. స్క్రోలింగ్‌లో నంది అవార్డులు 2006కి గాను అని ప్రకటిస్తూ, ఉత్తమ కథ బలభద్రపాత్రుని రమణి ‘మధుమాసం’ చిత్రం అని బ్రాకెట్‌లో వెళ్తోంది. ఏం చెయ్యాలో తెలీలేదు! అమ్మకి ఫోన్ చెయ్యనా? రామానాయుడి గారికి ఫోన్ చెయ్యనా? అన్నయ్యకి ఫోన్ చెయ్యనా? చంద్రసిద్ధార్థకి ఫోన్ చెయ్యనా?… అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు… అసలు అవార్డుల స్క్రీనింగ్ జరుగుతున్నట్లు కూడా తెలీదు! అందుకే మైండ్ బ్లాంక్ అయి… మా ఆయనకి ఫోన్ చేసాను. జహీరాబాద్‌లో వర్క్ చేస్తున్నారు. ఈ విషయం మెసేజ్ కన్నా, ఫోన్‌లో మాట్లాడడమే న్యాయం అనిపించింది. ఆయన సీట్‌లో లేరు. కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ ఫోన్ చేసాను… “నాకు ‘మధుమాసం’కి నంది అవార్డ్ వచ్చింది” అన్నాను. ఒక్క నిమిషం పాటు విన్నదేమిటో అర్థం కాక, “ఏమొచ్చిందీ?” అన్నారు.

“‘మధుమాసం’కి  నంది అవార్డు వచ్చింది బుద్దూ” అన్నాను కోపంగా! అంతే… “హే!” అని అరిచారు. “నేను లీవ్ పెట్టి వచ్చెయ్యనా?” అన్నారు. “వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడే ఏం ఇచ్చేయ్యరు… నేను రామానాయుడి గారికి, అమ్మకీ చెప్పాలి…” అని ఫోన్ పెట్టేసాను. నాయుడి గారికి చెప్పగానే ఆయన “ప్రొడక్షన్‌కి ఏం రాలేదా?” అని అడిగారు… తర్వాత “కంగ్రాట్స్” అన్నారు. చంద్రసిద్ధార్థ మాత్రం చాలా రోజులు ఈ అవార్డు నాకు నాయుడు గారే సిఫార్సు చేసి ఇప్పించారు అనుకున్నాడట!

నేను తర్వాత చెప్పాను, ఆయన మొదట తన సినిమాకి ప్రొడ్యూసర్‌కి రాలేదా అని అడిగి, ఆ తర్వాత అభినందించారని, అప్పుడు నమ్మాడు. ఇండస్ట్రీలో చాలామంది ఓ స్త్రీ రచయిత్రికి జెన్యూన్‌గా నంది అవార్డు వచ్చిందంటే నమ్మలేదు! కాని ఇది నిజం… ఎటువంటి సిఫార్సులూ లేకుండా పదిమంది జ్యూరీ మెంబర్స్ ఏకగ్రీవంగా తీర్మానిస్తే తప్ప ఇండివిడ్యువల్ ఎవార్డులు రావు! నేను చాలాసార్లు జ్యూరీలలో వుండడం అనుభవం వల్ల గట్టిగా చెప్పగలను! ఇది రాస్తున్న ఈ సమయంలో కూడా నేను బెంగుళూరు ఇంటర్నేషనల్ అవార్డ్స్ జ్యూరీ లోనే వుండి, బెంగుళూరు లోని ఫెయిర్‌ఫీల్డ్, మేరియట్ హోటల్ లోని రూమ్‌లో కూర్చుని రాస్తున్నాను. కాబట్టి నాటక పరిషత్తుల నుండి నేషనల్ ఎవార్డ్స్ జ్యూరీ వరకు చేసిన అనుభవంతో చెప్తున్నాను! మరీ పెద్ద పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్‌లూ, స్టేట్ ఏజిటేషన్ లాంటి టైమ్‌లలో తప్ప ఎక్కడా అవినీతి సాధారణంగా జరగదు! జడ్జీలకి వేరే టేస్ట్‌లు వుండడం వల్ల ఒకప్పుడు భిన్నాభిప్రాయాలు రావచ్చు! కానీ ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో వివరించి చెప్పి సాటి జడ్జిలను ఒప్పించగలగాలి! నాకిలాంటి పరిస్థితులు అనేకసార్లు వచ్చాయి. గోపాలరెడ్ది గారు (దుర్గా ఆర్ట్స్) ఛైర్మన్‌గా వున్న సమయంలో నేను 2011 నంది సినిమా అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబరుగా వున్నాను. అప్పుడు ‘నయనతార’కి ఉత్తమనటి అవార్డును నేను ప్రతిపాదిస్తే, “ఏం చేసిందని ఇవ్వాలి?” అన్నాడో పాత్రికేయ మిత్రుడు. “కూర్చున్న చోటు నుండి లేచి నృత్యం చెయ్యలేదు… కనీసం ఎటువంటి మూమెంట్స్ ఇవ్వలేని పాత్రలో, మొహంలో అభినయం చూపింది… కళ్ళతో, పెదవులతో… అదీ నటన అంటే…” అన్నాను. నా వాదన ఛైర్మన్‌గారికి నచ్చి, అప్పటి ఎఫ్.డి.సి. డైరక్టర్ చంద్రవదన్‌కి కూడా చెప్పారు. అలా మనం ఏ బేసిస్ మీద డిసైడ్ చేసామో చెప్పగలగాలి! నా జ్యూరీల ప్రహసనం సినిమాటోగ్రాపర్ల అవార్డ్స్ మలేషియాలో జరిగితే, SICA అంటే సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అవార్డ్స్… అందులో కూడా నన్ను జ్యూరీ మెంబర్‌గా వేసారు!

ఎల్.ఎల్.బి. చదవకపోయినా, ఈ విధంగా జడ్జిగా మంచి అనుభవం వచ్చేసింది.

ఇంక నంది అవార్డు ఇంత త్వరగా నాకు రావడం కొంతమంది జీర్ణించుకున్నారూ… కొంతమంది జీర్ణించుకోలేకపోయారూ… అది వేరే సంగతి! కానీ మా కుటుంబంలో చాలా అలజడి రేగింది. అమ్మ వైపు బంధువులు “అరె మాలాగే పెద్దగా చదువుకోకుండా డిగ్రీతో సరిపెట్టి, ఇంటర్‌మీడియట్‌లోనే పెళ్ళి చేసుకున్న ఇది… సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిదంటే, ఏదో ప్రయత్నాలు చేసుకుంటోంది, మన వాళ్ళ వల్ల అవుతుందా అనుకున్నాం, ఇదేంటి నంది అవార్డు రావడం” అని ఆశ్చర్యపోతే, నాన్న సైడ్ వాళ్ళు మాత్రం అందరూ కలిసి ఒక గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి ఓ కిరీటం పెట్టి, “ఎప్పుడూ ఎవరికో నంది అవార్డులు రావడం గురించి పేపర్లో చూసామే కానీ, ఇవాళ మన అమ్మాయికే వచ్చింది, ఎంతో సంతోషం” అని పండగ చేసారు! ఆ చిన్న జర్మన్ సిల్వర్ కిరీటం, వాళ్ళిచ్చిన మట్టి నంది బొమ్మా నేనెంతో పదిలంగా దాచుకున్నాను! ఇంట గెలిచి రచ్చ గెలవడం ఎంతమందికి సాధ్యమవుతుంది చెప్పండీ? ఇంక మా అమ్మ ఆనందానికి అయితే అవధులే లేవు. “నా కడుపున ఇంత అదృష్టం పుట్టిందా?”, ఇది తరచూ ఆవిడ వాడే మాట! అమ్మ ఇప్పటికీ నా కోపాన్ని కంట్రోల్ చేస్తుంది! కోపం చూపిస్తుంది. అలుగుతుంది. గట్టిగా మాట్లాడి నా నోరు మూయిస్తుంది! నేను కొద్దిగా భయపడ్తాను ఆవిడకి కోపం వస్తే! కానీ అమ్మకి నా మీదా, మా అన్నయ్య మీదా తప్ప కోపం ఎవరిమీదా రాదు! దూరపు బంధువులు కూడా “పాపాయి పిన్నికి అసలు కోపమే రాదు” అంటారు. అసలు నా స్నేహితులు అయితే మొదటిసారి మాత్రమే నా కోసం మా ఇంటికొస్తారు, తర్వాత నుండీ వాళ్ళు అమ్మ ఫ్రెండ్సే! శ్యామలా దశిక అని న్యూజెర్సీ నుండీ వచ్చినావిడా, భర్తా, మా భువనచంద్ర గారు, మా లిల్లీ, మా అబ్బాయి ఫ్రెండ్ మనీషా అందరూ తర్వాత నుండీ మా ఇంటికి మా అమ్మ కోసమే వస్తారు! ఆవిడ చూపించే ఆప్యాయత అలాంటింది!

నంది అవార్డుల రోజున నేను నాతో మా అమ్మనీ, మా ఆయననీ తీసుకెళ్ళాను. మా ఆయనకి కూడా మొదటి స్థానం నేను మా అమ్మకి ఇవ్వడం పట్ల ఎటువంటి అభ్యంతరం వుండదు! సాధారణంగా ఏ ఫంక్షన్‌కైనా నేను  మా అమ్మనే కూడా తీసుకెళ్తాను. అమ్మనీ, ఆయన్నీ తీసుకుని మొదట పార్క్ హోటల్‌కి వెళ్ళాం. ఆ రోజు కోసం మా ఆయన వయొలెట్ కలర్ పట్టుచీర కొని పెట్టారు… ఎందుకు చెప్పానంటే, ఆ రంగు ఎప్పుడూ ఇష్టపడేవారు కారు! ఆ హోటల్‌లో రిఫ్రెష్‌మెంట్స్ అయ్యాకా, మేం లలితకళాతోరణంకి అవార్డుల ప్రదానానికి బస్‌లో వెళ్ళాం!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here