అనుబంధ బంధాలు-37

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 37వ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]యితే…. ఈ సంస్కృతిలో పెట్టుబడి లేకుండానే ‘లాభం’ ఉంటుంది. న్యాయానికి అలా ఉండరాదు. “శ్రమ లేని వ్యాపారాలు కూడా లాభాలనిస్తయి” అని అనలేదు. కొంత వరకు నయం. గుడ్డిలో మెల్లలా…

ఇక… పెట్టుబడి లేని ‘లాభం’ అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుందాం. అదేలాగంటే… ప్రపంచం వింతైనది, విచిత్రమైనది గదా!….

ఇక్కడ కొన్ని అపురూపమైన వింతైన వస్తువులు మనకు కనిపిస్తయి. చాలా చాలా ధనం ఉన్న వాళ్ళు కోరిక ఉన్న వాళ్ళు అనేకులు ఈ వస్తువులను ‘తమ’వి అనిపించుకోవాలని తమ దగ్గర ఉంచుకోవాలనీ కోరుకుంటారు. మన బోటి లేని వారికి అలాంటి కొండ మీది కోతి లాంటి కోరిక ఉన్నా నిరుపయోగం ఉన్నవాని కోరిక మాత్రమే ఈ అపురూపమైన వస్తునుల వద్ద చుక్కల్నంటే ‘ధర’ను పలికిస్తుంది. దాని విలువను మామూలుగా ముడి సరుకు విలువలా ‘fix’ చేయలేం. ఇవి కాక మన నిత్య జీవితంలో సహజంగా మనకు కనిపించే విషయం కూడా ఒక్కటున్నది. మనకు ఏ వస్తువు పైనైతే మక్కువ ఉంటుందో అది మార్కెట్టులో ప్రియంగా కనిపిస్తుంది. ‘ప్రియంగా’ కనిపించినా కొనుక్కుంటాం కాని అది అందుబాటులో లేకపోతే అరుదుగా కనిపిస్తే గాని మనం స్వంతం చేసుకోవాలనే వెంపర్లాట ప్రారంబమవుతది గదా.

అంటే?… దాని విలువ మరీ మరీ పెరుగుతుంటుంది. పైకం అయినా చెల్లించి స్వంతం చేసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతది. పోటీ ఏర్పడతది.

ఇక్కడ ప్రారంభం అయ్యేదాన్నే మనం “స్మగ్లింగ్” అంటాం. బాగా కావాలనుకునే సరుకు దాని అవసరాన్ని బట్టి ‘స్మగ్లింగ్‌’లో ప్రత్యక్షమవుతది. అయితే ఈ వస్తువులలో కొన్ని చట్టరీత్యా విదేశాల నుండి వెంట తెచ్చుకోవచ్చు.

కొన్ని చట్టాలు వొప్పుకోవు, అనుమతించవు. ఉదాహరణకు మాధకద్రవ్యాలు తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించదు, అంటే అది నిషిద్దమైన వస్తువు.

దీనికి మనం ఎంత ట్యాక్సు కడతామన్నా కుదరదు. కటకటాల వెనక్కి వెళ్ళిపోవడం తప్ప…

ఇక… నగలూ (బంగారంవి, వెండివి, ప్లాటినంవి) నాణ్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పిస్తోళ్ళు, బట్టలు వగైరాలు తెచ్చుకునేందుకు మన చట్టంలో అవకాశముంది. But we have to pay the Tax (అదీ వంద రెట్లలో) అలాంటప్పడు వ్యక్తికి ఈ TAX భారాన్ని దింపుకునేందుకు ప్రయత్నం ప్రారంభమవుతది అదే స్మగ్లింగ్.

ఒక్క బంగారం విషయం మనం కొంత తడిమి చూద్దాం. 1984వ సంవత్సరం నుంచి 1988 వరకు మన కష్టమ్ అధికారులకు దొరికిన బంగారం మొత్తం ఎంతో తెలుసా…. 10498 కిలోలు. 1988 నుంచి 1990 వరకు రెండు సంవత్సరాల కాలంలో దొరికిందెంతనుకున్నారు… 110935 కోట్ల విలువ కల్గినది.

ఇదొక రకం. ఇక మరొకటుంది. అది మాదక ద్రవ్యాల రవాణా.

వీటిలో దొరికే మత్తు కొసం మొత్తం ప్రపంచ యువత గమ్మత్తుగా కాంక్షతో ఉవ్విళ్ళురుతుంది. ఎగబడి కోరుకుంటుంది. అంతుమాలిన, వ్యామోహాన్ని పెంచుకొని ఉచ్చ నీచాలను మరచి తెగించి మరి విరగబడిపోతుంది. ప్రస్తుత యువతకు ఇదో మంచి పట్టున్న ‘ఎంటర్‌టైనర్’. దీన్ని వెన్నంటి మృత్యువు తమ దాపులో కొస్తుందనే ద్యాసను కూడా వీరు లెక్క చేయడం లేదు. ఒకరి కోరికతో ఈ మృత్యు కబంద హస్తాలను ఆహ్వానిస్తున్నారు. విలాసవంతమైన మిరుమిట్లు గొలిపే జిగేలు మనిపించే ప్రపంచంలో ఈ ‘సరుకు’కు అత్యంత డిమాండ్ ఉంది.

ఇంతెందుకు?…. మనది పేద దేశం కదా! ఇక్కడ ఒక్కకిలో ఖరీదెంత అనుకున్నారు? ఊహించి చెప్పండి?

ఇది మీ ఊహకు కూడా అందని విషయం కాదు. Realty is fact. అరవై వేల నుంచి ఎనభై వేల రూపాయలు. ఇదే కిలో (లెదర్ పవుడర్)ను ఒక వేళ్ళ మనంగా ఐరోపా వరకు చేర్చగలిగితే దాని ఖరీదు ఎంతో అంచనా వేయగలరా. ఒక కోటి రూపాయలు. ఇది మన కళ్ళ ముందున్న నిజం.

అంటే… ఒక్క రూపాయి పెట్టుబడికి వెయ్యురూపాయలు వస్తయి. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. 1991 – 1992 లో ఒక్క బొంబై విమానాశ్రయంలోనే (భూమిపైన, సముద్రం పైన కాక) 282 కిలోల మత్తు మందు దొరికింది. ఈ సరుకుని అడ్డాకు చేర్చగలగాలే గానీ సరుకు కొనేందుకు ‘రిసీవర్లు’ ఎక్కడికక్కడే ఎదురుతెన్నులు చూస్తుంటారు. అర నిముషం టైం చాలు చాలా చేతులు మారిపోతుంది. ఇక అతి విషాదకర విషయం ఏమంటే…. ఈ మృత్యువుతో కూడిన మత్తు వెఱ్ఱి వ్యామోహం బడి పిల్లలు దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా ఊడలమఱ్ఱిలా వ్యాపించిపోతుంది. ఒక్క చాక్లెట్లు కొని నోట్లో వేసుకొని కళ్ళు మూసుకుంటే చాలు… మనిషి పుట్టాక ఈ ప్రపంచంలో చేతికి ఎన్నడూ దొరకనంత ఆనందానుభూతి మమైకపు స్థితి కొన్ని గంటల వరకు మన్ని వదలదు.

అందుకే…. అందుకే చిన్న పిల్లలు సైతం దీని కోసం పిచ్చిగా వెంటపడుతున్నారు. పెద్ద వాళ్ళకు ఒకే ఒక్క దమ్ము, లేదా రెండు బుక్కల పొగ చాలు లేదా ఒక ఇంజెక్షన్ చాలు. రంభ, ఊర్వశి, తిలోత్తమ తమ వొళ్ళోకి వచ్చి అపురూపమైన అనుభవాల్ని ప్రసాదించడానికి.

బాహ్య ప్రపంచపు దశ బొత్తిగా గుర్తుండదు. గుర్తులోకి రావడాన్ని అవసరాలు వారుగా భరించలేరు. అందుకే స్మగ్లింగ్. దీన్ని పెట్టుబడిదారూ… రహస్యంగా రవాణా చేసేవాడూ… దళారి సరుకు అడ్డాలకు చేర్చేవాడూ… అమ్మేవాడూ… ఇలా ఉంటుంది లింకు. వీరంతా కోటీశ్వరలై పోతుంటారు అకస్మాత్తుగా. కొందరు జైళ్ళ పాలవుతారు… కొందరు చస్తున్నారు.

మన దేశంలో ముంబై ఈ పనికి పుట్టినిల్లు.

ప్రస్తుతం ‘స్మోక్’ ఊహించినంత డబ్బునూ బంగారాన్ని ఇస్తున్నది.

బొంబై ఎయిర్ పోర్టు… ఇక్కడ జనం ఎప్పుడూ చిత్తడిగానే ఉంటుంటారు. రాత్రి పూట మరీను.

ఇక… విమానం ఏదైనా ‘ల్యాండ్’ అవుతుంటే చాలు అంతులేని రద్దీ ప్రారంభమవుతది. వీరికి తోడు విమానం దిగి వచ్చే ప్రయాణీకులు. ఈ జనారణ్యాల…. A.I.U. వారు తమ పని తాము చేసుకొనిపోతుంటారు.

కానీ…. ఎంత చేసినా వారి పరిధి చాలదు. ఎందుచేతనంటే అక్కడ కనిపించే వాళ్ళలో 60% మంది అనుమానితులుగానే వీరికి కనిపిస్తారు. విమానం దిగి వచ్చే వారిలో పెద్ద చికాకులుండవు. ఎక్కేవారితోనే…. TIME ప్రకారం చెకింగ్ కావాలి గదా. స్మగ్లింగ్ పంథాలో నైజీరియన్స్ చాలా చురుకైన వారు.

“ఎక్కువ మంది” ఉన్నారు.

“శాంతి సహదేవ్” విమానం దిగింది.

 A.I.U వారు ఆవిడను అనుమానించి లోనికి రమ్మన్నారు.

నిర్భయంగా చిరునవ్వు చిందిస్తూ అందాలొలకబోస్తూ లోనకొచ్చింది. చెక్ చేసారు. ఆవిడ దగ్గర బంగారం కడ్డీలతో అల్లిక చేసిన జాకెట్టు దొరికింది. అరెస్టు చేసారు SPOTలో… తీసుకెళ్ళారు…

ఇంటరాగేషన్ చేసారు. ఆవిడ నుంచి సమాధానం రాకపోగా…. అతి ప్రశాంతంగా నవ్వి “అసలు బంగారం స్మగ్లింగు ఎందుకు చేస్తున్నట్లు?” అని ప్రశ్నించింది.

A.I.U వారు పని స్మగ్లింగును ఆపడం, స్మగ్లింగ్‌లో అమ్మే వాటిన పట్టుకోవడం. కాని ఎందుకు చేస్తున్నారు? అన్నదానికి వారి దగ్గర సమాదానమేముంటుంది అంచేత ఎగా దిగా బట్టారు.

అది చూసి వార్నందరిని ఎలాగో చూసి సుతారంగా జారిన పైటను పైకి జరుపుకొని “నే చేప్పేదా?” అంది పొడుపు కథ విప్పగలను అన్నట్లు.

“అవును కాదు” అనలేక దేభీమొఖాలేసుకొని చూసారు పాపం.

ఆవిడ ప్రారంభించింది. స్కూల్ టీచరు పిల్లలకు పాఠం చెపుతున్నట్టు “ఇతర దేశాలలో పది గ్రాముల బంగారం ధర (2200) ఇరవై రెండందల రూపాయలు మరి మన దగ్గర?…. ముప్పై అయిదు వందలు పైన నాల్గువేలు లోపు….”

ఇంత మార్జిన్ లాటరీ టిక్కెట్టుగా గ్యారంటిగా కళ్ళ ఎదుట కనిపిస్తుంటే… నేను కాదు, అసలు ఏ మీసం ఉన్న మగాడూ అగుతాడు” అని అడిగింది. వింటున్నారు ఎదురుగా ఉన్న వాళ్ళు.

ఎదుకింత తేడా ఉంది? అసలు ఈ అంతరానికి కారణం ఏంటి? (ఆవిడే ప్రశ్నించింది నవ్వి.) అని మనని ఏలే ప్రభుత్వాధి నేతలు ఒక సారి ఆలోచించి సరి చేస్తే… బంగారం స్మగ్లింగ్ అసలుండదు గదా అని నవ్వి… “మీ ఉద్యోగాలు పోతాయని బెంగ పడకండి ఇంకా మీరు పట్టుకోవల్సినవి ఉన్నాయి. ”

“అయినా ఇంకో ప్రశ్న…. మన దేశంలో బంగారం (సాలీనా) ఎంత పడుతుంది? అంటే మనకు కావల్సిన బంగారం ఎంత? అని…. దీనికి మీ దగ్గర సమాధానం ఉండదు. కనీసం ఈ ప్రభుత్వానికైనా తెలుసా? ఇక్కడ అవసరానికి ఇంకా ఎంత కావాల్సి ఉంటుంది? ఆ కావాల్సిన దానిని ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు? ప్రభుత్వం తెచ్చి అందుబాటున ఉంచాలి గదా?…”

“ఇదీ తెలీదు?”

“ఇక్కడకు మనం బంగారం దిగుమతి చేసుకోవడం లేదు. మరి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తది? అక్కర ఉంది గనుక స్మగ్లింగ్ జరుగుతుంది. మార్జిన్ ఉంది గనుక స్మగ్లింగ్ ఉంటుంది. ఇదిగో ఆఫీసర్ నేనొక గుడ్డి లెక్క చెప్పుతాను కనీసం లెక్కనైనా మీ పాలకులకు ఒక్కసారి చెప్పండి, ఎక్కడికైనా మెదడుకు పడుతుందేమో చూద్దాం.

మనదేశంలో సాలీనా కనీసం తొంభై లక్షల పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇదీ తెల్సు అని నేను అనుకోను. అని నవ్వి, ఏం తెల్సు గునక ఇది తెలుస్తుంది అని… ఒక్కో పెళ్ళికి హీన పక్షం పాతిక గ్రాముల బంగారం పడుతుంది. అది పుస్తె బిళ్ళ కోసం అంటే పాతిక తొంభై లక్షలన్న మాట….

అంటే 22.5 మెట్రిక్కు టన్నుల బంగారం మనకు తప్పని సరిగా కావాలన్న మాట. ఇదీ గాక ఎనభై మెట్రిక్కు టన్నుల బంగారం పై వాడకానికి అందాజాగా పడుతుంది.

అయితే… మనకు కావల్సిన దానిలో 3% మాత్రమే మన దగ్గర ఉత్పత్తి అవుతుంది. మిగిలిన దాన్ని దిగుమతి చేసుకోడమూ లేదు. మరి ఎలా? అని పెద్దగా నవ్వి…. ఒక్క మన దేశంలో తప్ప ఫార్ ఈస్ట్ దేశాలలో ఎక్కడా బంగారం పైన ఆంక్షలు లేవయ్యా.

అందుకనే ఎవరికి అవకాశం ఉన్న పరిధిలో వారు బంగారాన్ని దేశంలోకి పంపుతున్నారు, మార్కెట్టు ఉంది గదా. అంటే మంచి వాళ్ళను కూడా మన నేతలు ఎంచక్కా స్మగ్లర్లుగా మార్చుతున్నారో చూడండి?” అని నవ్వి.

“అసలు ఇక్కడ… మీ కళ్ళు గప్పి కోటీశ్వరులయిన వారెందరున్నారో తెలుసా?… “

“ఇక విషయం… అసలు మీకు బంగారం స్మగుల్ చేయించే వాడెవడన్నా ఇంత వరకు దొరికాడా? కనీసం మీ రికార్డును చూసేనా చెప్పిండి. సిగ్గు పడాల్సిన పని లేదు. మీకు వాళ్ళు దొరకరుగాక దొరకరు అంతే… ఒక వేళ ఎప్పుడైనా ఒక్కడైనా కథా జిత్తుగా దొరికినా అది మీ చాతాళం గాదు… (వాళ్ళలో వాళ్ళకు పడక చెప్పుకుంటుంటారు గనుక)

ఇంతోటి దానికి…

మెటల్ డిటెక్టర్లు…

నైట్ విజర్స్…..

సర్క్యూట్ టి.వి లు….

SLA సెమి అటోమెటిక్ తూపాకీలు…

అత్యంత అధునాతనమైన తర్ఫీదు… అయినా ఛాలెంజ్ చేసి చెపుతున్నాను, మీకు ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు చిక్కడు. అసలు వాళ్ళ ప్లానింగ్ మీకు అంతు పట్టదు. వాళ్ళ దగ్గరున్న తెగింపు సిన్సియారిటీ మీకు చచ్చినా రాదు.

ఇదిగో మీకు నేను దొరికానా?…

దొరినాను కదా అని నవ్వి “మరి నేను స్మగ్లరునా?”

కాదు కానేకాదు.

వృత్తి పరంగా అయితే నాకు కనీసం స్మగ్లింగ్‌కు స్పెల్లింగ్ కూడా రాదు. నేను చేసే పని ‘క్యారీ’ చేయడం (చేరవేయడం) అంతే…. ఇప్పుడు మీకు నా దగ్గర దొరికింది చూసారూ అంత మోతాదును నేను వాళ్ళకు ఒక్కసారి చేరిస్తే నాకు నలభై వేల క్యాష్ ఇచ్చేస్తారు.

తెచ్చుకుంటాను happy గా….

కానీ…. నేను ఈ పని ఎవరికి చేస్తున్నానా? ఇంత వరకు తెలీదు. ఎవరో ఒక్కడు వస్తాడు. “దీన్ని ఫలానా చోటుకు చేర్చాలి” అంటాడు. మనం అక్కడ అప్పగించడం పూర్తయిన మరు క్షణాన పైకం మన చేతిలో ఉంటుంది. మేం కనీసం వెనక్కయినా తిరిగి చూడకుండా బయటపడతాం. ఇదిగో ఈ మధ్యన… అదే పది రోజుల క్రితం రాజా సింగ్ అనే వాడి శవం జుహూ బీచ్ దగ్గర లాక్ చేసిన మారుతీ కారులో దొరికింది పేపరులో కూడా వచ్చింది గుర్తుందా?…

దాని గుట్టు ఏమిటో పేపరు వాళ్ళకూ తోచిచావ లేదు. నన్ను చెప్పమంటారా?

ఈ రాజాసింగ్ అనే వాడు మీ కష్టమ్స్ వాళ్ళకు ఇన్‌ఫార్మర్. అందుకే అట్టా దిక్కుమాలిన చావు చచ్చాడు.

ఇంకా నయం అంతటితో ఆగారు… నిజంగా వాళ్ళు తలచుకుంటే అతని ఖాన్‌దాన్నంతా ఎత్తుకెళ్ళి గల్ఫ్‌లో అమ్మేసుకుంటారు. మంచి క్రమశిక్షణ planning వాళ్ళను రక్షిస్తూంది. కూలి రాళ్ళ కోసం, కక్కుర్తి పడే నా బోటి వాళ్ళు మాత్రం అడపాదడపా మీకు చిక్కుతుంటాం. కాని మీరు పోలీసు లిస్టులో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ జోలికి మాత్రం ఎంత తెల్సినా పోరు. పైగా వారు తరచూ గౌరవనీయులతో చాలా గౌరవంగా కనపిస్తుంటారు.

అవును కదూ అని నవ్వి…

“హజీ మస్తాన్…

కరీంవాలా….

దావూద్ ఇబ్రహీం…

సమాలాలా…

రదీలాల్… లట్టుజోగా…. సుకుమార్ సేట్‌లు- ఇక్కడే ఇక్కడే ఉంటున్నారు గదా…. యాకూబ్ గల్దార్ అషరఫ్ సికిందరులు దుబాయికి మకాం మార్చారు. ప్రపంచపు కోటీశ్వర్లుల జాబితాలోకి చేరబోతున్నారు వీరు. మనదేసపు ఆర్దిక వ్యవస్థను గడగడలాడిస్తున్నారు. చేతి పావులా వాడుకునే ప్రయత్నం చేసుతన్నారు. వారు సఫలీకృతులవుతారు. వార్ని మీరు ఎందుకు పట్టుకోలేదు….. ప్రాసిక్యూట్ ఎందుకు చేయలేదు… మిమ్మల్ని కాదు ఈ గడ్డనేలతున్న భ్రష్టుల్ని వేయాల్సిన ప్రశ్న అది. I know what is what. గత సంవత్సరం ఇదే ఎయిర్ పోర్టులో ఇద్దరు నవయవ్వనంలో ఉన్న ఇరానియన్ సుందరాంగులని అనుమానించారు. చెక్ చేసారు కూడా… వారి అతి సుకుమారమైన అందమైన అవయవాల చుట్టురా ప్లాష్టిక్ దారాలతో చుట్టి దొరికిన మత్తు మందు విలువ ఎంతో తెలుసా… డెబ్బయి రెండు లక్షలు… కాలి జోళ్ళలో… వెంట్రుకలలో… అనాసపళ్ళలో…. హార్లిక్స్ డబ్బాలలో…. చివరకు మందు క్యాప్సిల్స్‌లో… కూడా… చివరకు షేవింగ్ సామాన్ను కూడా వదిలే పని లేదు.

అయితే…

వీటిని తెచ్చేది మాములు వాళ్ళు… వారి వారి అక్కరల కోసం. కుటుంబాల కోసం వాటిని మంచిగా నడిపేందుకు కావాల్సిన పైసల కోసం దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్న ‘BOSS’లు కూడా పైసల కోసమేననుకోండి.

“దోమ అక్కర దోమది ఏనుగు అక్కర ఏనుగుది.”

అదీ తేడా. ఇక నా సంగతి చెప్తాను… నాకో భర్త ఉన్నాడు. పనిపాటు లేని విలాస పురుషుడు. రోజుకో స్కాచ్ బాటిల్ కావాలి. నేను విమానం ఎక్కిన దగ్గర నుంచీ ఎవరో       ఒక కాల్ గోర్ల్ తోడుగా ఉండాలి. కారుండాలి, డ్రైవరు పెట్రోలు నింపి రడీగా ఉండాలి. ఈ అవసరాలకు కొంచం ఆలస్యమైనా ఓర్చుకోలేడు. ఇల్లు యుద్దం సీనులోకి వెళ్ళిపోతుంది” అని నవ్వి, “నా విషయం అరమరిక లేకుండా చెప్పాను. మీకు వీలుంటే వదిలేయండి” అన్నది.

కస్టమ్స్ అధికారి నవ్వాడు.

ఆ నవ్వుకు అర్థం తెల్సు.

“నువ్వు దొరికావు గనుక నువ్వే దొంగవు. మేం చార్జిషీటు నీ పైనే పెడతాం” అంటుండగా…

“ఏం నేను చెప్పింది వినపడలేదా? నా పైన నమ్మకం లేదా? నే చెప్పింది విన్నాక కూడా నేను నేరస్తురాలిగా కనిపిస్తున్నానా? నిజంగా గుండె మీద చేయి వేసుకని చెప్పండి? నేను నేరస్తురాలినా? సరే నేనే అనుకుందాం మరి నాతో ఈ నేరం చేయించి నాకు కూలి ఇచ్చేదెవరు? వాడికి ఆసరాగా ఉన్నదెవడు? వాడిచ్చిన చందాలతో మంత్రులయిన సిగ్గు మాలిన మంత్రులెవరు? అసలిలాంటి నేరాల్ని చేసేందుకు అవకాశం కల్పించిన నేత లెవరు?

వారు ఈ దేశ చరిత్రలో.. ఎక్కడ? ఎప్పుడూ? శిక్షింప బడ్డట్టుగా కనిపించదు?. అసలు వాళ్ళ పై నేరం మోపే దమ్ము మీకెక్కడిది? ఛ.” అంది ఆవేశంగా.

ఆవిడ కూర్చున్న సెల్ కు తాళం వేసి వెళ్ళిపోయారు ఆఫీసరూ మిగిలిన వాళ్ళు.

నేను ఇక్కడ ఎందుకున్నాను అనిపించి అంతులేని దుఖమొచ్చింది.

ఒళ్ళంతా సెగలు గక్కింది. ఆవేశంగా పెద్దగా అరవాలనిపించింది.

ఆ స్థితిలో సమాధానం మెదిలింది.

‘నేను హజీమస్తానునూ, దావుద్‌ను, రతీలాల్‌ను కాను. నేను’ అని అప్పటి దాకా బాధగా నిప్పు కణికలలా ఉన్న కళ్ళ నుండి జారుతున్న కన్నీరు ఆగింది.

***

చదవడం ఆపాడు దశరథం.

ఏవేవో విచిత్రమైన ఆలోచనలు తలలో కొచ్చినయి.

రెండు క్షణాలు ఆగి “నన్నేందుకు రా చదువమన్నావు?” అనడిగాడు.

“డబ్బు ఏమిటి? ఎందుకు? ఎలా? అసలు డబ్బు మంచిదేనా అనేది కొంతయినా అర్థమవుతదనీ” అని నవ్వాడు దీక్షితులు.

“దీక్షితులు డబ్బుకు మంచి చెడు ఏముందిరా? మాదకద్రవ్యం ఉంటది.. రంగు రుచి వాసన ఉండదు. ఒక్క ప్రతిపాదించిన విలువ తప్ప అది చేతికిచ్చాక ఆ మనిషి స్వభావాన్ని పట్టి అది నడుస్తుంది. డబ్బు చెడ్డది కాదు. దాని ఒనరు దానికుంది. దీన్నే లక్ష్మిగా, ధనాధిదేవతగా వెనకట ఆరాదించారు. చలనం దీని స్వభావం. అంతే…

అందుచేత ఈ డబ్బు పైన మనం ఎలాంటి అనవసరపు ఊహలు చేసినా తప్పే అవుతది. దాని అస్థిత్వం దానికుంది.

ఇక పోతే, శ్రమ లేని డబ్బు…. ఆధారం లేని డబ్బు…. కష్టం తెలీని డబ్బు…. మోసాలతో వగాలతో వచ్చే డబ్బు…. KIT BAGS పేరున వచ్చే డబ్బు…. బ్యూరోక్రాట్ల డబ్బు… మంత్రుల డబ్బు… ఆగితే that will control the whole thing” అని లేచాడు.

అంతా అర్థమైనట్టుగా అనిపించినా చాలా అర్థం కానిది అనుకున్నాడు ధశరథం.

“గారెలు తెస్తున్నాను” సీతమ్మ మాట వినిపించింది.

“గారెలా? మొదట మంచి నీళ్ళు పంపు” అన్నాడు దీక్షితులు.

ఒక్కో బలహీనత ఒక్కో మనిషిని ఆపుతుంది అనుకున్నాడు దశరథం.

‘వాడేదో నా గురించే అనుకుంటున్నాడు – బయటకు పొంగిచావడు – కడుపులోనే కుములుతూంటాడు వెధవ’ అనుకున్నాడు.

సీతమ్మ గారెలు నేతి గిన్నే, కొబ్బరి పచ్చడి తెచ్చి పెట్టింది.

“గడ్డ పెరుగు ఉంటే ఇంకా బావుంటుంది” అనుకున్నాడు దీక్షితులు.

‘మంచి నెయ్యి గదా గారెలలోకి బావుంటది’ అనిపించింది దశరథానికి.

“తినకాండా కూర్చున్నారేం?….” అంటూ మంచి నీళ్ళతో వచ్చింది సీతమ్మ.

“ఎందుకు తినం?” అంటూ ప్రారంభించాడు దీక్షితులు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here