[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న వై. మానస ఈ పుస్తకంలోని ‘మెరవణి’ కథను విశ్లేషిస్తోంది.
***
నేను ‘కులం కథ’ అనెడి గ్రంథంలో కథలు చదివాను. ఈ పుస్తకం యొక్క సంపాదకులు కస్తూరి మురళికృష్ణ, కోడిహళ్ళి మురళీమోహన్. నేను ఈ గ్రంథంలో ‘మెరవణి’ అనెడి కథను చదివాను. దానిని రచించిన వారు వి.ఆర్.రాసాని.
వి.ఆర్.రాసాని గారు ఈ కథను ఎంతో ఆందోళకరమైన సంఘటను రాసారు. ఈ కథలో రాసాని గారు కులం వివాదం గురించి రాసారు. ఈ కథలో ఒక ఇల్లాలు అప్పుడే పని నుండి ఇంటికి వచ్చి తొందర తొందరగా తిని ఇంట్లోని పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె భర్త, కొడుకు ఊరిలో పండుగ అయ్యేసరికి తొందరగా స్నానం చేసి అక్కడికి వెళ్తారు. ఆ ఇల్లాలు దేవుడు వస్తాడేమో అని కంగారుగా ఇల్లు అలికి ముగ్గుపెడుతూ మహాలక్ష్మిలా ఉంది. అప్పుడే పక్కింటి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఆయన్ని పిల్లడ్ని ఊర్లో అందరూ కలిసి కొడుతున్నారే అని చెప్తుంది. అంతే ఆమె ప్రాణం పోయినంత పనయింది. వెంటనే పరిగెతుకుంటూ అక్కడికి వెళ్ళి చూసే సరికి రక్తపు మడుగులో వాళ్ళాయన, పిల్లాడు కనిపిస్తారు.
ఆమె గుండె పగిలిపోయేలా ఏడ్చింది. వాళ్ళాయన దగ్గర కూర్చుని భోరున ఏడ్చింది. అక్కడ ఉండే వారు కొన్ని సపర్యలు చేసినారు. ఆమె కొడుకు బాలకిష్టుడు అప్పటికే మరణించాడు. అప్పుడు ఆమె వాళ్ళను తిడుతుంది.
అసలు జరిగిన విషమేమిటంటే వీరయ్య ఆ ఊరికి ప్రెసిడెంటు. కాని ఈమధ్య రామచంద్రయ్య అనే అతడు ప్రెసిడెంటు అవుతాడు. అది వీరయ్య తట్టుకోలేడు. రామచంద్రయ్య ఆ ఊరిలో వీరయ్యకు పత్రి పనిలో పోటిగా ఉంటాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు వీరయ్య. ఇలా ఉండగా మొదటగా దేవుడు ప్రతిసారి రామచంద్రయ్య ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఊరిలోకి వెళ్తారు. ఇదే అవకాశం అనుకొని తన వాళ్ళతో కలిసి ఇన్నిరోజులు రామచంద్రయ్య ఇంటికి వెళ్తున్నారు కదా ఈసారి మా ఇంటికి ముందు పంపించండి అని చెప్తాడు. అది అలా అలా పెద్దదయ్యి కులం వరకు వెళ్ళింది.
మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని దుడ్డు కర్రలతో కొట్టుకుంటారు. కొందరికి కాళ్ళు చేతులూ విరుగుతున్నాయి, అప్పుడే రంగయ్య తన బిడ్డ కోసం వెళ్తాడు. అది గమనించిన వీరయ్య, రామచంద్రయ్య అతనిని చంపమని చెప్తాడు. వెంటనే వారి మనుషులు దుడ్డుకర్రలతో రంగయ్య అతని కొడుకుపై దాడి చేస్తారు. బాలకిష్టుడు మరణిస్తాడు. రంగయ్య నేలపై పడిపోతాడు.
అప్పుడు ఆ ఇల్లాలు కులం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ రాసానిగారు కులం గురించి ఎంత చక్కగా ఆవేశంగా వివరిస్తారు. ఉదాహరణకు మనందరి రక్తం ఒకటే. అందరి కులాల్లో ఉండే రక్తమూ ఒక్కటే. అది ఎర్రగానే ఉంటుంది. దాని వర్ణం ఎరుపు అని ఎంతో ఆవేశంగా రాసానిగారు చెప్తారు. ఇంకా మడుసుల్లో ఉండేదంతా ఎర్ర నెత్తురే. కాని మడిసి సేసిన ఈ కులాల వర్ణాలు మాత్రం వేరే. అందరూ బతికేది ఈ భూమిపైన్నే. ఏ కులం అయితేనేం. అందరూ జీవనం గడుపుతూ వుండేది జానడు పొట్టకోసమే అని ఎంత చక్కగా వర్ణించారు.
అందువల్ల నాకు ఈ కథ ఎంతో బాగా నచ్చింది. కులం వల్ల రెండు ప్రాణాలు బలైపోయాయి.
ముగింపు – నేను ఈ కథ ద్వారా ఎంతో నేర్చుకున్నాను. కులం అనేది ఒక భయంకరమైన అలావాటు. అందరూ బతికేది భూమి మీదే, అందరూ పని చేసేది పొట్టనింపుకోనడానికే. అలాంటప్పుడు కులం అనేది ఎందుకు. ఈ కథలో కులం ఇద్దరిని బలి తీసుకుంది. మనకు తెలియని కులం వల్ల చావులు ఎన్నో ఉన్నాయి. అలాంటి కులాన్ని అందరూ ఎందుకు నమ్మాలి. కులం అనేది ఒక మూఢనమ్మకం. దానిని నమ్మకుండా అందరూ కలిసి ఉందాం. కలిసి బతుకుదాం.
వై. మానస, సీనియర్ ఎంపిసి,