ఒక్క సారిగా పరిసరాల స్పృహ తెప్పించే “థప్పడ్”

0
3

[box type=’note’ fontsize=’16’] “అందరి నటనా ఆ స్థాయిలో వుండడం వలనే ఈ చిత్రం ఇంత ప్రభావవంతంగా వచ్చింది” అంటూ ‘థప్పడ్’ సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]తె[/dropcap]లుగు సినీ రంగం నుంచి నిష్క్రమించి తాపసి పన్ను తనకి, మనకీ, హిందీ చిత్ర రంగానికీ పెద్ద ఉపకారమే చేసింది. హీరో పేరు చూసి సినిమాకెళ్ళే జనం తాపసీ పన్ను లాంటి హీరోయిన్ పేరు చూసి కూడా సినిమాకెళ్ళడం మంచి మార్పే.

ఈ చిత్రంలోని పాత్రధారులందరూ ఐస్ ఫ్రూట్ తింటూ రకరకాల పరిస్థితుల్లో పరిచయం అవుతారు. వొకరికొకరు ఏదో సందర్భంలో సంబంధం వున్న పాత్రలే అవి, కలిపి వుంచిన సూత్రం ఇక్కడ ఐస్ ఫ్రూట్ అయితే, తర్వాతి కథలో ఆత్మావలోకనం.

తీర్చిన ముగ్గు లాంటి ఇల్లు. డయాబిటీస్ తో బాధ పడుతున్న అత్త సులక్షణనూ (తన్వి ఆజ్మి), వొక కంపెనీలో మంచి స్థాయిలో వున్న, త్వరలో లండన్ శాఖ కు బాస్ గా ఎదగబోతున్న, భర్త విక్రంనూ (పవైల్ గులాటి) ప్రేమపూర్వకంగా చాకిరీ (అంటే శ్రమేనండీ) చేస్తున్న అమృత (తాపసి పన్ను). ఎవరికి ఏ వేళలో ఏది అవసరమో అన్నీ గుర్తుపెట్టుకుని చూసి, చేసిపెట్టే పన్ను ని చూస్తే ముచ్చటేస్తుంది. ఫైర్ బ్రాండ్ పన్ను ఇలా అణిగిమణిగిన లేదా ప్రేమతో నిండిన గృహిణిగా కనిపించడం మామూలు విషయం అయితే కాదు. ఎందుకో తెలీదు గాని మామగారు, మరిది/బావగారు వేరే ఇంట్లో వుంటారు. అత్త విక్రంను విడిచి వుండలేనని భర్తకు దూరంగా వుంటుంది. ఎక్కువ సంభాషణలు లేకుండానే తన్వీ చాలా కథను వ్యథనూ చెబుతుంది. లండన్ కు బదిలీ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో నెమ్మదిగా విక్రం కు తెలుస్తుంది, తను బాస్ గా కాకుండా అక్కడి శ్వేతజాతి స్త్రీ (color and gender)కి కింది అధికారిగా వెళ్తున్నాడు అని. కోపంతో వూగిపోతాడు. అందరూ అనునయించడానికి ప్రయత్నిస్తుంటారు. పక్కకు లాగబోయిన అమృతను కోపంతో అందరి ముందూ చెయ్యి చేసుకుంటాడు. (థప్పడ్ అంటే చెంప దెబ్బ).

ప్రపంచం దాని గతిలో అది కదులుతూ వుంది, కాని అమృత చేష్టలుడిగి వుండిపోతుంది. చాలా హడావిడిగా పనులు చేసిన ఆ ఇంట్లోనే ఉలుకు పలుకు లేకుండా మసలుతుంది. నెమ్మదిగా విషయం మెదడులో ఇంకేసరికి కొన్నాళ్ళ పాటు పుట్టింటికి వెళ్తానని బయలుదేరుతుంది. ఆలోచించిన కొద్దీ మనుషుల మధ్య వున్న సంబంధాలలో అధికారం అనేది ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంటుంది. తల్లి, అత్త, తమ్ముడు, ఆఖరుకు లాయర్ నేత్ర(మాయా సరాఒ) కూడా నచ్చచెప్పజూస్తారు. కేవలం వొక్క చెంపదెబ్బకేనా? అని వొకరంటే చీటింగ్ ఒక్కసారి చేసినా చీటింగే అంటుంది. ఆడవాళ్ళం కదా అణిగి వుండాలి, సర్దుకు పోవాలి అంటారు అత్తా అమ్మానూ, మేము కూడా అంతే కదా అని. ఒక్క తండ్రి (కుముద్ మిశ్రా) మాత్రం కూతురు పక్షం. నీ మనస్సాక్షి ఏది చెబితే అదే చెయ్యి, అయితే తీసుకున్న నిర్ణయాలు ఒకోసారి మంచి ఫలితాలివ్వకపోవచ్చు అన్న ఎరుకతో అంటాడు. పక్కనే వున్న తల్లి, మేమందరం సర్దుకుపోలేదా అంటుంది. తండ్రి ఆమెను ఆశ్చర్యంగా చూస్తాడు. నాకు సంగీతం అంటే ఇష్టం వుండేది, కాని పెళ్ళయ్యాక మానెయ్యలేదా అంటుంది తల్లి (రత్నా పాఠక్ షా). నేనేమీ అడ్డు చెప్పలేదే అంటాడు గాని, తను కూడా ఎప్పుడూ ఆమె ఇష్టాఇష్టాలు అడిగి మరీ తెలుసుకోలేదు. అంటే covert/overtగానో తనూ బాధ్యుడే. విక్రంకు భార్య లేని లోటు అర్థమవుతోంది, కాని తను తప్పు చేసినట్లు అనిపించదు; తను చేసినది తప్పనీ ఎవరూ చెప్పరు. అదే అహంకారంతో, మగజాతి లక్షణాలతో స్పందిస్తాడు. విడాకుల పర్వంలో అతను వైవాహిక హక్కుల (conjugal rights) గురించి కేసు వేస్తే, ఆమె ముందు పరస్పర ఇష్టపూర్వకంగా విడాకులు ఎలాంటి భరణం లేకుండానే కోరుతుంది. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించడం, తను ఇల్లు చూసుకోవడం తో చెల్లు కదా అని అమాయకంగా నమ్ముతుంది. తర్వాతి పరిణామాలు నెమ్మదిగా ఆ కేసును గృహహింస (domestic violence) కారణంగా విడాకులకు నివేదనగా మారుస్తుంది. తర్వాత అమృత కథ ఎలా ముగుస్తుంది అన్నది మిగతా కథ.

ఈ జంట గురించి కథ చెబుతూ కొన్ని ఉపకథలు కూడా చెబుతాడు దర్శకుడు. పనిమనిషి సునీత (గీతికా విద్యా) కు ఇంటిదగ్గర భర్తతో రోజూ దెబ్బలు తినడం అలవాటై వుండడం. లాయర్ నేత్ర ఇప్పుడిప్పుడే పైకి వస్తోంది, రాదు మరీ భర్త పేరున్న లాయరు, మామగారు రిటైర్ అయిన పేరున్న జడ్జి (భర్త మాటల్లో). భర్తతో ఆమె అనుబంధం ఎలాంటిదో తెలీదు గాని, మరో స్నేహితుడితో రహస్యంగా కలవడం చేస్తుంటుంది. ఒక కేసు గెలిచిన సందర్భంలో ఇంటికెళ్తే నేను ఈ కేసును ఇప్పించాను నాకు కృతజ్ఞతలు కూడా లేవా అంటాడు భర్త. మెసేజ్ చేశానుగా అంటున్నా వినిపించుకోకుండా నాకు కృతజ్ఞతలు ఎలా కావాలో అలా తీసుకుంటాను అంటూ ఆమెను బలవంతం చేస్తాడు. ప్రేమలో వున్న తమ్ముడు కూడా అమృతను నచ్చజెప్పాలనే చూస్తాడు, తన ప్రియురాలు అక్కకు మద్దతునిస్తే ఆమెను వదిలి వెళ్ళిపొమ్మంటాడు. (తర్వాత తగ్గి, అర్థం చేసుకుని క్షమాపణలు అడుగుతాడు. వున్న పాత్రలలో వయసులో చిన్నవయసు పాత్ర.) ఇదంతా చెప్పేది వొక్కటే ఈ సమాజంలోని మానవ సంబంధాలు అనేవి ఎలా వున్నాయో అలాగే కొనసాగడానికి అందరూ యథాస్థితిని పూర్తిగా అంగీకరైంచడమే. పేరు వున్నా, తెలివితేటలూ చదువూ వున్నా, బీద అయినా, చదువు రాని వారైనా ప్రతి స్త్రీ కథా దాదాపు వొక్కలాగే వుండడానికి కారణం. పురుషులు అయాచితంగా వచ్చే అధికారాన్ని, స్త్రీలు అణిగి వుండి, సర్దుకుపోయే గుణాన్ని. అంతే తప్ప స్త్రీ పురుషుల మధ్య యుధ్ధం లా చూపించి, పురుషులను విలన్లు గా చూపించలేదు. ఫెమినిస్టు కాని వ్యక్తి అయినా ఇది చూసి క్షణం పాటైనా అపరాధ భావన అనుభవిస్తాడు.

“ముల్క్” లాంటి చిత్రం చూసిన తర్వాత “థప్పడ్” చూడటం అంతే సంతృప్తికరంగా వుంది. అనుభవ్ సిన్‌హా దర్శకత్వం, అనుభవ్ సిన్‌హా మృణ్మయీ లాగూ (రీమా లాగూ కూతురు) కలిసి వ్రాసిన స్క్రిప్ట్ బాగున్నాయి. అందరి నటనా చాలా బాగుంది. ముఖ్యంగా తాపసి పన్ను. మొదట్లో ఒద్దికగా, తర్వాత అసమంజసంలో వుండి కదిలే శిల్పంలా, తర్వాత నెమ్మదిగా బలపడుతున్న స్వరంతో క్రమంగా వస్తున్న ధృఢత్వంతో చాలా బాగా నటించింది. భర్త కూడా వొక విలన్ లా కాకుండా మగవాడిగా పుట్టుడంతోనే వచ్చిన సౌకర్యాలు, అధికారాలూ అనుభవిస్తున్న స్వార్థపూరిత మగవాడిగా పవైల్ గులాటి నటన బాగుంది. అలాగే ఇతర పాత్రలు. అందరి నటనా ఆ స్థాయిలో వుండడం వలనే ఈ చిత్రం ఇంత ప్రభావవంతంగా వచ్చింది. సౌమిక్ ముఖర్జీ కెమెరా, యశ రామచందాని ఎడిటింగ్ బాగున్నాయి.

లాయర్ నేత్ర అంటుంది కేవలం వొక్క చెంప దెబ్బ కొట్టినందుకే విడాకులు అంటే కోర్టు ఒప్పదు. ఒక్కసారి కూడా చెయ్యి చేసుకునే అధికారం అతనికి లేదు. తన వృత్తి సంబంధమైన వొత్తిడుల కారణంగా కొట్టానన్నా కుదరదు, ఏం ఆ అన్యాయం చేసిన అధికారుల మీద చెయ్యి చేసుకోగలడా? “పింక్” లో నో ఇజ్ నో, ఇక్కడ చెంప దెబ్బ ఒక్కసారి కూడా కూడదు గా పరిణతి చెందింది. ఒక్కసారి వద్దన్నా అర్జున్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. తన ఆవేశంలో ఆమెను కొట్టినా, సెక్స్ కు ఒప్పుకుని రానిచ్చిన స్త్రీ మనసు మార్చుకుని నో అన్నా కత్తి చూపించి బెడిరించి అనుభవించడానికి ప్రయత్నించడం లాంటివన్నీ ఈ మౌలికమైన విషయాన్ని అర్థం చేసుకుంటే తేటతెల్లం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here