[box type=’note’ fontsize=’16’] అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా, ఆకాశవాణి మహిళా విభాగం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కె. కామేశ్వరి గారితో శివరంజని గారు జరిపిన ముఖాముఖిని సంచిక పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం ఒకటిన్నర అవుతూనే గ్రామీణ మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమం రేడియోలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారం చేయబడే ‘వనితా లోకం’. మనస్సుకు హత్తుకునే కథానికలతో వినోదాన్ని, మేధావుల పరిచయ కార్యక్రమాలు, వ్యాసాల ద్వారా విజ్ఞానాన్ని, స్త్రీలకు ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక విషయాల గురించి అవగాహన పెంచుతూ లలిత సంగీతాన్ని కూడా అందిస్తూ, ఉత్తరాల ద్వారా అభిమానాన్ని చాటే శ్రోతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, మారుతున్న కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు నవీకరణ చెందుతూ, వినూత్న కార్యక్రమాలు ప్రసారం చేస్తూ అత్యధిక మహిళల అభిమానాన్ని చూరగొన్న కార్యక్రమమే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారమయ్యే ‘వనితా లోకం’.
బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ వనితా లోకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కె. కామేశ్వరి గారితో ఇంటర్వ్యూ.
తల్లి తండ్రులు, విద్యాబ్యాసం:
శ్రీమతి వర్దిని శ్రీ అరుణాచలం దంపతుల ముద్దుల తనయ కామేశ్వరి గారు ఎమ్ ఏ, ఎమ్ బి ఏ చదివారు.
రేడియో ప్రస్థానం:
ఆల్ ఇండియా రేడియోలో రాత పరీక్ష ద్వారా ఉద్యోగం వచ్చింది, అదే సమయంలో బ్యాంకు ఉద్యోగం కూడా వచ్చింది, అయితే బ్యాంకు ఉద్యోగం వేరే ఊళ్ళో ఉండటం, రేడియో స్టేషన్ అయితే స్థానికంగా హైదరాబాద్ లోనే ఉండడం వల్ల, నేను మా కుటుంబ సభ్యులు ఆకాశవాణి ఉద్యోగం ఎన్నుకోవడం జరిగింది.
ఉద్యోగానుభవం:
రేడియోతో అనుబంధం నాకు భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనేదే మా నినాదం. ప్రజా సంక్షేమం కోసం మేము వివిధ రంగాల మేధావులతో పరిచయ కార్యక్రమాలు ప్రసారం చేస్తాము. మా కార్యక్రమాలు వినడం వల్ల శ్రోతలకు సమస్య దాని పరిష్కారం రెండూ తెలుస్తాయి. కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా అనేక మందితో కలిసి పని చేసాను, ఒకవైపు చదువుకున్న మహిళా రచయిత్రులు, డాక్టర్లు, లాయర్లు, బ్యాంకు ఆఫీసర్లు అయితే మరోవైపు నిరక్షరాస్యులైనప్పటికీ విజయం సాధిస్తున్న డ్వాక్రా మహిళలు, మహిళా రైతులు ఇలా అనేక మంది శక్తివంతమైన మహిళలతో పరిచయాలు తీసుకోవడం నా అదృష్టం.
మీ కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. మీ స్ఫూర్తి?
మా నాన్న గారికి 84 సంవత్సరాలు, అమ్మకు 78 సంవత్సరాలు. ఇద్దరూ పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్నారు. ఇప్పటికీ వాళ్లు తమ పనులు తామే చేసుకోవడమే కాకుండా, ఇతరులకు కుడా సహాయం చేస్తూ ఉంటారు.
వారే నా స్పూర్తి, ఎందుకంటే ఈ వయస్సులో కూడా వాళ్లు ఎంతో ఉత్సాహంగా, బాధ్యతగా ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరు. ప్రతిరోజు ఉదయమే లేస్తారు. తమ రోజువారీ పనులు అయ్యాక చుట్టుపక్కల వారికి గాని, చుట్టాలకు గాని ఏదయినా అవసరంలో సహాయం చేయటానికి ముందుంటారు. మా అమ్మ గారయితే ఈ వయసులో ప్రతి రోజూ ఏదో ఒక స్పెషల్ వండి ఇంటికి వచ్చే బందువులకు, చుట్టుపక్కల వారికి తినిపిస్తూ తృప్తి పడుతూ ఉంటారు. ఎందుకు శ్రమ పడతారు, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే పని చేస్తేనే మేము క్రియాశీలకంగా ఉంటాము అంటారు.
మహిళల ప్రాధాన్యత గురించి:
నేను గమనించింది స్త్రీలు ఆర్థిక స్వేచ్చ సాధించారు. ఆర్థిక అసమానత నుండి ఆర్థిక సమానత వైపు వచ్చేసాము. ముప్పయి సంవత్సరాల క్రితం స్త్రీలకు ఉద్యోగం తప్పనిసరి కాదు, కోందరు మాత్రమే ఉద్యోగాలు చేసేవారు. చాలామటుకు పెళ్లి అయిన తర్వాత ఉద్యోగాలు చేసేవారు. అప్పట్లో పెళ్లి కుటుంబం ముఖ్యం, అదే వారి జీవితం. నేటి ఆధునిక మహిళలు మొదట చదువు, ఉద్యోగం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం తర్వాత పెళ్లి అంటున్నారు. ఇది అద్భుతమైన ఆహ్వానించదగ్గ మార్పు. నేటి ఆధునిక మహిళలు అనుకున్నది సాధించే శక్తిమంతులు, నిబద్ధత క్రమశిక్షణతో పని చేస్తారు.
గ్రామీణ ప్రాంతాల డ్వాక్రా మహిళలు ఛార్టర్డ్ అకౌంటెంట్‌కి ఏ మాత్రం తీసిపోరు. డ్వాక్రా సంఘాలు నిబద్ధతతో పనిచేస్తున్నాయి. నేడు అయిదు కోట్ల టర్నోవర్‌కు చేరుకున్న డ్వాక్రా సంఘాలు కూడా ఉన్నాయి. తీసుకున్న అప్పును కచ్చితంగా సమయానికి వడ్డీతో సహా తీరుస్తారు. దీని కోసం అప్పు తీసుకుంటారో దానికే వాడుతారు, నిధుల మల్లింపు ఉండదు. ఒక వేల ఉన్న వాటిని నమోదు చేస్తారు. అప్పులు ఎగొట్టటం, బ్యాంకుల ఆర్థిక వ్యవస్థను చితక్కొట్టటం డ్వాక్రా సంఘాలు చేయవు, కారణం వాటిని నిర్వహిస్తున్న మహిళలలో పని పట్ల ఉన్న నిబద్ధత. అందుకే గ్రామీణ ప్రాంతాల డ్వాక్రా సంఘాలు వారికి అప్పులు ఇచ్చే బ్యాంకులు విజయవంతమైనాయి.
సమానత్వం గురించి:
సమానత్వం అనేది మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం. స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని మన సనాతన ధర్మాలు ఎప్పుడో చెప్పాయి. అర్ధనారీశ్వర తత్వాన్నే తీసుకోండి, పరమ శివుడు పార్వతీ దేవి ఇద్దరూ సమానం. మన పురాణాలలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన స్థాయి ఇస్తూ దేవుడిని దేవతని సమానంగా పూజించారు, అదే మనం అనుసరించాల్సిన విధానం కూడా.
బాధ్యతగా పనిచేయడం, దూసుకుపోయే తత్త్వం ఉన్నవారు స్త్రీ పురుషులెవరైనా ఇంటికి వృత్తికి రెంటికీ న్యాయం చేయగలుగుతారు. ఆ తత్త్వం లేనివారు స్త్రీ పురుషులెవరైనా విజయం సాధించలేరు, ఇక్కడ లింగ బేధం లేదు, కస్టపడి పని చేసే తత్త్వం, పని మీద శ్రద్ధ అవసరం.
కొన్ని సార్లు గుర్తింపు లేకపోవడం, విమర్శలు ఉంటాయి, అలాంటివి పట్టించుకోనవసరం లేదు, మనం చేసే పని మనం శ్రద్ధగా, బాధ్యతగా చేయడమే విజయానికి నాంది పలుకుతుంది.
మహిళల రక్షణ:
సాధించిన అభివృద్ధి గురించి సంతోషించినా, కొన్ని సంఘటనల వల్ల కలత కలుగుతుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆందోళన చెందడం వల్ల కొన్ని సమయాలలో తక్షణం చురుగ్గా స్పందించకపోవడం జరుగుతోంది.
ఫైర్ ఆక్సిడెంట్ మాక్ డ్రిల్ చేసినట్లుగానే 100, 102, 1098 సర్వీసుల మాక్ డ్రిల్స్ పాఠశాలల్లో, కళాశాలల్లో, కార్యాలయాల్లో నిర్వహించడం, ఈ సర్వీసుల సేవల success స్టోరీస్‌కు ప్రచారం కల్పించడం చాలా అవసరం. దీని ద్వారా మహిళల్లో ఆయా సర్వీస్ ఫోన్ నంబర్ల పట్ల అవగాహన పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా ఆయా సర్వీసులు ఉపయోగించుకుంటారు.
హైవేలు కొన్ని చాలా చీకటిగా ఉంటాయి. మహిళలు తిరిగే ఇలాంటి హైవే లలో లైటింగ్, కెమెరాలు ఫిక్స్ చేస్తే బావుంటుంది. అలాగే ఇలాంటి ప్రదేశాలలో మాక్ డ్రిల్ చేస్తే కూడా బావుంటుంది.
అలాగే అక్షరాస్యత పెరగాలి. కనీస ప్రాథమిక విద్య అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ అందుబాటులో ఉండాలి. చదువుకోవడం వల్ల వ్యక్తుల ఆలోచనా పరిధి పెరుగుతుంది. మంచి చెడుల విచక్షణా జ్ఞానం పెరుగుతుంది.
ఉద్యోగం కుటుంబ బాధ్యతల సమన్వయం:
ఉద్యోగినులు అటు కుటుంబ బాధ్యత ఇటు ఉద్యోగ బాధ్యత సమర్థవంతంగా నిర్వహించాలంటే టైమ్ మేజిమెంట్ పాటించాలి. కుటుంబ సహకారం ఉన్నవారు ఉద్యోగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. నా విషయంలో పిల్లల చిన్నతనంలో అమ్మానాన్నల సహకారంతో, ఇప్పుడు భర్త, పిల్లల సహకారంతో ఉద్యోగం, కుటుంబం రెండూ బాలన్స్ చేసుకోగలుగుతున్నాను.
సాధించాల్సింది:
సాధించిన దాని కంటే సమాజం నుంచి నేర్చుకుంటున్నదే ఎక్కువ. నేను ముక్కుసూటి, అది నా వృత్తిలో విజయం సాధించడానికి ఉపయోగపడింది. స్తబ్దంగా ఉండకుండా ఒత్తిడిలో పని చేయడాన్ని ఆస్వాదిస్తాను. కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్ధం.
కుటుంబం:
జీవిత భాగస్వామి పాండురంగమూర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇద్దరు కొడుకులు. పెద్ద బాబు అమెరికాలో ఎమ్ ఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లయింది. చిన్న బాబు ఇంటర్ చదువుతున్నాడు.
కీలకమైన బాధ్యతలో ఉండి, నాతో ఇంటర్వ్యుకి సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు మేడమ్.
ధన్యవాదాలు.