కావ్య పరిమళం-32

0
3

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

సముఖం – అహల్యా సంక్రందనం

ఆంధ్ర సాహిత్యంలో దక్షిణాంధ్ర యుగం (1600-1775)లో ప్రధాన వ్యక్తి రఘునాథనాయకుడు. అతడు 1614లో సింహాసన మధిష్ఠించాడు. స్వయంగా కవి. కవిపోషకుడు. రాయల భువనవిజయ సభాభవనం వలె రఘునాథుని ఇందిరామందిరంలో కవులు విలసిల్లారు. ఈ యుగంలో శృంగార కావ్యాలు అతివేలంగా వెలసాయి. శశాంక విజయము, రాధికా సాంత్వనము, శృంగార సావిత్రి, అహల్యా సంక్రందనం వంటి అనేక శృంగార కావ్యాలు పరిఢవిల్లాయి. తమ కావ్యాలకీ, రాజ్యాలకీ కూడా – ధర్మమా? దైవమా? దేహమా? – ఏది ప్రాతిపదిక అనే మీమాంసలో పూర్ణభక్తి ఒకవైపు, పూర్ణ శృంగారం మరొక వైపు తలుపులు తెరిచి నిలబడ్డాయి. యుగ ధర్మానికి అద్దం పడుతూనే శృంగారాన్నీ, నిర్వేదాన్నీ సమన్వయించుకోవడంలో పెద్దన వంటి కవులు సమర్థులయ్యారు పూర్వ యుగంలో.

అహల్య:

బ్రహ్మ అదే పనిగా ఆమె రూపంలో ఏ వక్రతా లేకుండా అహల్యను అందాల సుందరిగా సృష్టించాడు. అమరాధిపతి ఆమె అందం పట్ల ముగ్ధుడై కామించాడు. బ్రహ్మ ఆమెను గౌతముని దగ్గరగా ఇల్లడంగా వుంచాడు. వయోభేదం కలిగి వైరాగ్య భావంతో వున్న అతనితో ఆ తర్వాత అహల్య వివాహం జరిపించాడు. అహల్య దురదృష్టవంతురాలు.

సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు (1700) చొక్కనాథుడనే రాజు ఆశ్రయంలో పెరిగాడు. కవికి శ్రీరంగనాథుదు కలలో ఒకనాటి ప్రభాతవేళ కన్పించి అహల్యా సంక్రందనమనే రసోల్లాస ప్రబంధం వ్రాసి తన కంకితమిమ్మని ఆదేశించాడు. సక్రందనుడనగా ఇంద్రుడు. అహల్య – ఇంద్రుల జారత్వాన్ని ఈ కావ్యంలో మూడు ఆశ్వాసాలలో కవి విస్తరించాడు. 350 గద్య పద్యములలో కథ ప్రస్తావించాడు.

“అహల్య మునిపత్ని కదా ఇంద్రుని మోహించడం ఎలా జరిగింది? ఆమెకు కలిగిన శాపం ఎలా తొలగిపోయింది?” అని జనమేజయుడు వైశంపాయనుని ప్రశ్నించాడు. దానికి సమాధానమే ఈ కావ్యము. ఈ కథ యథార్థమా? అహల్య అంటే రాత్రి లేదా చీకటి. మరి ఇంద్రుడు – సూర్యుడు. గౌతముడు – చంద్రుడు అని కుమరిలభట్టు సాంకేతిక వివరణ మిచ్చాడు. దానిని సంస్కృత సాహిత్య చరిత్రలో మాక్స్‌ముల్లర్ పండితుడు గౌరవించాడు. అహల్య అనగా దున్నబడని ఊషర క్షేత్రం. వర్షాధిపతియైన ఇంద్రుని సంగమంతో అది ఫలవంతమైనది.

నాయకరాజులు:

దక్షిణ భారతదేశంలో తంజావూరు, మధురలు క్రమంగా ప్రాచీన చోళ, పాండ్య రాజధానులు. లలితకళలకు ప్రోత్సాహకాలు. సంగీత సాహిత్యాలకు పట్టుగొమ్మలు. తెలుగు సరస్వతి ఆ ప్రాంతాలలో తీర్థయాత్రలు సాగించిన రోజులవి. నాయకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతమిచ్చారు. శృంగారరసాధిదేవతగా ఉపాసించారు. కావ్యల పేర్లు విజయములు, పరిణయములు, సాంత్వనములు, విలాసములుగా రూపొందించారు. దక్షిణాంధ్ర కవులలో ఒక చిత్రమున్నదని డి. చిన్నికృష్ణయ్య తమ అనుశీలనంలో (ఎమెస్కో ప్రచురణ 2005) ఇలా పేర్కొన్నారు:

“దాసరి తప్పులు చేయును. దండములు పెట్టును (దాసరి తప్పులు దండంతో సరి అని సామెత). దక్షిణాంధ్ర కవులలో ఈ చిత్రమున్నది. వారు శృంగారములు చెప్పుదురు. మాహాత్మ్యములు వినిపింతురు. ఏమైనను పరగృహము (తమిళదేశం) తెలుగుతల్లి జంకినది. ‘ఇందుండగలేదు పోవలయు’ ననుకొన్నది.”

వేంకటనాయకుడు సముఖం కవికి పితామహుడు. సముఖ మీనాక్షి విభుడు, అలమేలుమంగలకు వేంకటకృష్ణప్ప జన్మించాడు. ఇతరకు కవితలను మెచ్చుకొని ఏనుగు దానం చేసిన ఘనుడు వేంకట కృష్ణప్ప. కృతిభర్తయైన విజయరంగ చొక్కనాథుడు – ‘ఉల్లసిత సంపత్ పల్లవత’ కలిగేలా కావ్యం వ్రాయమన్నాడు. పల్లవులు అంటే జారులు. అది శ్లేష. అందుకే నవరస నిగూఢ గంభీరంగా అహల్యా సంక్రందన ప్రబంధం వెలువడింది.

అమరావతీ కథాకథనం:

ఇంద్రుని రాజధానియైన అమరావతీ నగర వర్ణనతో కావ్యం ప్రారంభమైంది.

చం:

సురమణి ముద్దుమోవి, సుధ చొక్కపు నవ్వు, బలారి వాహముల్
కురులు, సురద్రుగుచ్ఛములు గుబ్బలు, వేలుపువాక యచ్చపున్
మెఱగు మణుంగునై చికిలి మించగ, తత్పురలక్ష్మి, కాంతిని
స్ఫురణ భవిష్ణు విష్ణు పదభూషణమై చెలువొందు నిచ్చటన్. (ప్రథమా-4).

ఆ నగరంలో దేవతా సార్వభౌముడైన ఇంద్రుదు తన ప్రాభవంతో ‘సుధర్మ’ అనే రాజ సభాభవనంలో వైభవంగా దేవతా సుందరీమణులతో సేవలందుకొంటూ వెలిగిపోతున్నాడు. రంభాది అప్సరసలు శృంగార విలాసాలు ప్రదర్శిస్తున్నారు. ఆ సభలో ఆసీనుడైన ఇంద్రుడు “అచ్చర కాంతలలో ఎవరు మిన్న?” అని ప్రశ్నించాడు.

వరుణుడు ‘ఊర్వశి’ అన్నాడు. పురూరవుడు సమర్థించాడు. నలకూబరుడు రంభను, విభాండకుడు హరిణను, విశ్వామిత్రుడు మేనకను, పరాశరుడు మత్స్యగంధిని ప్రశంసించారు. పురూరవ నలకూబరులు, మునీంద్రుల కోపతాపాలు పెరిగాయి. బ్రహ్మ నడిగి తెలుసుకొందాని మహేంద్రాదులు పయనమయ్యారు. ఇంద్రుని సముచితాసనంపై కూర్చుండజేసి కుశలప్రశ్నలు వేశాడు బ్రహ్మ.

బ్రహ్మ చతురత:

మహేంద్రుడు తన మనసులో సంశయాన్ని వెలిబుచ్చి – “నీ సృష్టిలో అత్యంత సుందరి ఎవరు?” అని ప్రశ్నించాడు. మూడు లోకాలలో అసమానురాలైన ఒక వనితను ఇప్పుడే సృష్టిస్తానన్నాడు బ్రహ్మ.

మ:

“కుదురై యొప్పుల కుప్పయై, తనువునన్ గోరంత యొచ్చెంబు లే
నిదియై, నొవ్వని జవ్వనంబు గలది, నిద్దంపు టొయ్యారియై
మదనోజ్జీవితయై, గరాగరికయై, మాణిక్యపుం బొమ్మయౌ
మదిరాక్షిన్ సృజియింతు నే నొకతె మన్మాహాత్యమున్ చూడుమా!” (ద్వితీయా-9)

అతిలోక లావణ్యవతిని, చూడ వేయి కనులు చాలని దానిని ‘అహల్య’ను సృజించాడు. అచ్చర భామను తలలు వంచుకొన్నారు.

జితేంద్రియులును, దేవకాంతలను ముగ్ధులను చేసిందామె. అష్టదిక్పాలకులు అంగలార్చారు. సమస్త దేవతలు చిత్తరువుల గతి అయ్యారు. మహేంద్రుడు మరులు పడ్డాడు. అహల్యాభామ కూడా అనురాగం ప్రకటించింది. ఆమెను తన కిమ్మని బ్రహ్మను ఇంద్రుడు విన్నవించుకొన్నాడు. నలువ నవ్వి ఆమెను గౌతముని పరిచర్యకు నియమించి అతని వెంట పంపాడు.

ఇంద్రుడు విరహతప్తుడయ్యాడు. అహల్యారతి భావనలో ఇంద్రుడు మధురస్మృతులలో తేలియాడాడు. అహల్య పావన గౌతమముని ఆశ్రమంలో అతనికి పరిచర్యలు చేస్తూ మునిబాలికలతో వనవిహారకేళి చేస్తూ గడిపింది. యువకుల హృదయాలను మన్మథుడు కలవరపెట్టాడు. గౌతముడు గాఢమైన తపస్సు చేశాడు. అహల్య అతనికి పరిచర్యలు చేసింది. అతని తపోనిష్ఠకు మెచ్చిన బ్రహ్మదేవుడు అహల్యా గౌతములకు వివాహం చేశాడు. ఆమె అనుకూలవతియై పురంధ్రులు మెచ్చుకొనేలా కాపురం చేసింది. మదన తాపం భరించలేక ఇంద్రుడు గౌతమాశ్రమానికి రాకపోకలు అధికం చేశాడు.

ఇంద్రుని దూతగా యోగిని:

ఇంద్రుడు పంపగా ఒక యోగిని అహల్య వద్దకు దూతినిగా ఆశ్రమానికి వచ్చింది. ఇంద్రుని విరహవేదనను అహల్యకు వివరించింది. ఇంద్రుడిలా అన్నాడు;

“ఏల సృజించె దాని? నను నేల సృజించెను బ్రహ్మ? దానికీ
లలితరూప యౌవన కళాలలితాంగ విలాస విభ్రమం
బేలనొసంగె? బేలతన మేటికి నిచ్చె మదీయ బుద్ధికిన్
బాలిక తోడ నామనవి పల్కెడు వారి జగాన కానగా?” (తృతీయా-11).

అహ్యల నర్మగర్భంగా కోపం ప్రకటించింది.

“యోగినీ! నేను ఇంతవరకు ఎవరి ముఖము కన్నెత్తి చూచితినా? ఎవరి వద్దనైనా నిలిచానా? ఆ ఇంద్రుడెవడు? ఈ ఆశ్రమములో ఓ మూల నున్న నన్ను ముంగిటికి ఈడుస్తావెందుకు?” ఆ మాటలను ఖండిస్తూ యోగిని కామ పురుషార్థ ప్రశంస చేసింది. అహల్య గడుసు పలుకులు పలికింది. యొగిని మాటల ప్రభావం అహల్యపై గాఢంగా పనిచెసింది. తన గాఢానురాగాన్ని ఆమె ద్వారా ఇంద్రునికి చేరవేసింది.

ఇంతలో అంధకార ప్రభావం అధికమైంది. ఆ రాత్రి కామోద్దీపితయైన అహల్య గౌతముని పక్కన పవళించింది. పాదాలు వొత్తే నెపంతో గోటితో భర్త పాదం గిల్లి మోహాన్ని ప్రకటించింది. “నీవు రుతుస్నాతవై 16 రోజులైనాయి. కాలదోషం వచ్చింది. ఆ ఆలోచన మానుకో” అన్నాడు.

ఇంద్రుడు ఆ ఆశ్రమానికి వచ్చి కోడియై కూశాడు. గౌతముడు మేల్కొని గంగా స్నానానికి బయలుదేరాడు. మరుక్షణంలో ఇంద్రుడు గౌతముని రూపంలో అహల్య దరి చేరాడు. కపటముని చతురంగా మాట్లాడి నిజరూపంతో ఇంద్రుడు సాక్షాత్కరించాడు. అతదు అహల్యా జారుడయ్యాడు. నెమ్మదిగా పూసెజ్జ కడకు చేరారు. మదన కేళీ విలాసాలలో తేలియాడారు.

ముని శాపం:

ఇంద్రుడు భయం భయంగా బయటకి నడిచాడు. గౌతముడు వచ్చి ఇంద్రునికి ‘అంగవిహీనుడవు’ గమ్నని శపించాడు. బలారాతిని కోరిని నీవు రాతి శరీరంతో పడివుండమని శాపం పెట్టాడు. శ్రీరామ పాదరేణు స్పర్శచే శిల శీలవతి కాగలదని శాపవిమోచనం సూచించాడు. శ్రీరామచంద్రుడు గౌతమాశ్రమానికి రాగానే అహల్య రూపవతి అయి నిలిచింది. గౌతముడు శ్రీరాముని స్తుతించాడు. అహల్యా గౌతములు సుఖ జీవనం కొనసాగిమ్చారు.

ఈ కథాగమనంలో అతివేల శృంగారం కనిపిస్తుంది. అది దక్షిణాంధ్ర యుగలక్షణం. ఇలాంటి కావ్యాలు అధికంగా వచ్చిన రోజులవి. చదివి ఆస్వాదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here