నేను… తెలుగుభాషను

0
3

[dropcap]ఎ[/dropcap]వరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను

పొరపాటునో ఏమరుపాటునో
సురలోకంలో అమరేంద్రుడి చేయితగిలి
అమృతభాండం కదిలి అల ఇలకొలికిన
అమృతపు చుక్కను నేను.

ఎవరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను.

విత్తుగామారి కవిపోషకుల సత్తువతో
ఎత్తుగా పెరిగిన మొక్కను నేను.
కావ్యాలు కొమ్మలుగా కథలు రెమ్మలుగా
కవితల పూలగుత్తులతో ప్రభందాల పరిమళాలతో
ప్రభవించిన పచ్చని చెట్టును నేను.
వినీలాకాశానికి విస్తరించి విశ్వమంతా
తియ్యందనాలు పరుచుకున్న మహా వృక్షాన్ని నేను.

ఎవరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను.

తాళపత్రాలపై..
కవిత్రయపు రాతలో రసరమ్య భారతాన్నై
పోతన్న ఘంఠంలో దశావతారాలెత్తి దుష్టులను దులమాడాను.
శ్రీనాథు వర్ణనతో శృంగారనైషధమై
తిమ్మక్క మొల్ల రంగాజీ వెంగమాంబల
కర కమలాల కలాల కవనమై మెరిశాను.
మోదమున కలివెంకన్నను పదకవితలతో
ప్రస్తుతించిన తాళ్ళపాక అన్నమయ్య గళాన సంకీర్తనై
కంచర్ల గోపన్న కమనీయ కంఠాన
భక్తి రస భావాన త్యాగయ్య తాళాన కీర్తనై పలికాను.
కదిరి వేమన్న పలుకునై కాలజ్ఞాని వాక్కునై
కన్నడిగ కృష్ణరాయ కమనీయ కల్పనతో
రమణీయ రస ప్రభందమై వెలిశాను.
బ్రౌను దొర సేవలచే ప్రపంచానికి పరిచయమై
తమిళ కవి సుబ్రమణి పొగడ్తలతో పొంగి పులకించాను.

ఎవరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను.

గిడుగు వారి గొడుగునై గురజాడ అడుగునై
ముళ్ళపూడి బుడుగునై విశ్వనాథ సహస్రపడగనై
తామరల మడుగులా శ్రీశ్రీ కవితగా
మహాప్రస్థానమై పెనునిద్దుర వదిలించాను.
కృష్ణశాస్త్రి లాలనతో భావకవితనయ్యాను.
తిలక్ రచనల్లో వెన్నెల్లో ఆడే
అందమైన ఆడపిల్లనయ్యాను.

ఎవరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను.

సిరివెన్నెల గేయంలో గోదారీ గలగలలే వినిపించాను.
సినారె మాటల్లో ఆత్మలనే పలికించాను.
పుట్టపర్తి కావ్యంలో శివతాండవమై నర్తించాను.
వేటూరి పాటగా జాషువాకవితగా
మంది మనసును గెలుచుకున్నాను.
రావూరి సినారె విశ్వనాథలతో
జ్ఞానపీఠనై విశ్వమంతా విస్తరించాను.

ఎవరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను.

అవధానంతో జతకట్టి అబ్బురమనిపించాను.
నుడికారాల నడకతో సామెతల ఛమక్కులతో
అలంకారాల అందంతో ఛందస్సుల సొబగులతో
భావాత్మకమై మనసును దోచేస్తాను.
పద్యమై పదపదాన పదనిసలే పలికిస్తాను.

ఎవరని తలతురో నన్ను
ఏమని పిలుతురో నన్ను.
నేను…
పద్యమై గద్యమై వైవిధ్యమైన ఊహను.
ఊపిరిని. ఉవ్వెత్తున ఎగసే కెరటమైన
శ్వాస మంజూషను.
తెలుగు భాషను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here