దైవాధీనం

0
3

[dropcap]జీ[/dropcap]వితంలో మొదటిసారి ఒక గట్టి నిర్ణయం తీసుకుని, దాన్ని అమలు జరిపే నిశ్చయంతో కండువా దులిపి భుజాన వేసుకుని బయల్దేరారు బడిపంతులు పరంధామయ్య గారు. ఆయన జీవితాన్ని దైవాధీనంగా సాగించారు. అందుకోసం ఆయన బాధపడానూ లేదు, పడే అవసరమూ రాలేదు ఇంత వరకూ. తాతగారు కట్టించిన పెద్ద పెంకుటిల్లు, తండ్రి మిగిలించిన నాలుగెకరాల మాగాణి, తనంత తానుగా తనని వలచి వచ్చిన, తన చదువుకీ ప్రవృత్తికీ తగిన ఉద్యోగం, మంచి ఇల్లాలుగా, తల్లిగా బంధువర్గంలోను, ఇరుగు పొరుగులోనూ పేరుతెచ్చుకున్న భార్య, ముత్యాల్లాంటి పిల్లలు. వీటిలో ఏ ఒక్కటీ కావాలని, కష్టపడి ప్రయత్నంచేస్తే వచ్చినవి కావు. అందుకే ఎవరు ఏ మంచిమాటన్నా “అంతా దైవాధీనం” అనటం, క్రెడిట్ అంతా ఆ పరంధామునికే కట్టబెట్టటం పరంధామయ్యగారికి అలవాటు. ఇప్పుడు ఆ అలవాటుని పొరపాటు చేసే పరిస్థితి వచ్చింది. కనకనే పరంధామయ్యగారు స్వతంత్రించి తనంతట తానుగా ఒక నిర్ణయం తీసుకున్నారు.

‘కొంత కాలంగా తను పడుతున్న బాధకి ఇంక భరతవాక్యం పలకబోతున్నాను’ అని సింహద్వారం దాటి వీధిలోకి అడుగు పెడుతూ అనుకున్నారు. వెంటనే ఫక్కున నవ్వారు – వృత్తి, ప్రవృత్తి ఒకటే అయి తన ఆలోచనా సరళిని ఎంతగా లోబరచుకున్నాయో తలుచుకుని. ఈ పరిస్థితిలో కూడా లక్షణశాస్త్రానికి సంబంధించిన పదజాలమే, ఉపమానాలే! కాదు కాదు పోలికలు అనాలి కదూ! భరతవాక్యానికి ముందు పతాక సన్నివేశం ఉండాలి కదా! అది నిన్నటి సమావేశం. అది తలుచుకోగానే పరంధామయ్య గారికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపట లాడాయి. అడుగులు వేగంగా పడసాగాయి.

ఈమధ్య కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనల వెనక ఇంత కుళ్ళు, ఇంత కుతంత్రం, ఇంత రాజకీయం ఉన్నాయని పరంధామయ్యగారు ఊహించలేదు. కొంతకాలం ఒక్కొక్క ఊపు ఉంటుంది, గాలివాటంలే అది అనుకున్నారు. కాని, రాను రాను అది గాలివాటం కాదు, సుడిగాలి అనిపించింది. గమ్మత్తుగా ఒకదాని తరవాత ఒకటిగా వచ్చిన ఏ సుడిగాలి అయినా కొట్టుకు పోయింది మాత్రం ఒకటే. ఒక ఏడాదిగా విషయం అర్థం కావటం మొదలుపెట్టి గుండె కోసినంత బాధ కలుగుతోంది. ఇటువంటి వాతావరణంలో అవమానాలతో బతకటం చాలా కష్టమనిపిస్తోంది.

ఆత్మప్రశ్రయం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్నవి క్రమంగా కనుమరుగై పోతున్నాయి. మానహీనంగా బ్రతికితే మనిషి ఎట్లా అవుతాడు? అభిమానం లేని బ్రతుకు అనవసరం. అనవసరమైన దానిని కొనసాగించటం తెలివి తక్కువ.

“ తెలుగు క్లాసేగా, పోయినా పరవాలేదు.” సైన్సుమాస్టారి ఉవాచ.

“తెలుగు మీడియంలో గతిలేక చేరాను.” ఒక విద్యార్థి బాధ.

“ఇంగ్లీష్ మీడియంలో సీట్లు లేవా? తెలుగు మీడియంలో చేర్చను. ఇంకో స్కూల్లో చేరుస్తాను.” ఒక తండ్రి మాతృభాష పట్ల చూపించిన గౌరవం.

“తెగులు క్లాసు కదా ఇప్పుడు!” ఒక ఎన్నార్ యే ( నాన్ రెసిడెంట్ అమెరికన్) తెలుగుకి ఇచ్చిన బిరుదు. ‘తెగులు’ అన్నది జంతువులకి చెట్లకి వచ్చే రోగం అన్నది కూడా తెలియదు.

“తెలుగు చదివితే ఏం ఉద్యోగం వస్తుంది? మంచి మార్కులు వచ్చినా ఏం లాభం? పాస్ అయితే చాలు.” ఒక తండ్రి తనయుడికి చేసిన బోధ.

వీళ్ళకా మేం పాఠాలు చెప్పేది! మేం తయారు చేస్తున్నది ఇటువంటి మాతృభాషాద్రోహులనా? గుండె తరుక్కు పోతోంది. ఇది విద్యార్థుల్లో వచ్చిన మార్పు మాత్రమే కాదన్న నిజం జీర్ణించుకోటానికి సమయం పట్టింది.

సమాజం ఎటువైపు నడుస్తోంది? కన్నతల్లిని, ఉన్నఊరిని, గౌరవించినట్టే తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి వింటున్న భాషని కూడా గౌరవించాలని వీళ్ళకి తెలియదా? అంటే “తెలిసినా ఏం లాభం? తల్లినే గౌరవించటం లేదు. దేశమంటే లక్ష్యం లేదు. ఇంక భాషనేం గౌరవిస్తారు?” అని సంస్కృతం చెప్పే రెడ్డిగారు అన్నమాట అక్షరసత్యం.

“పంతులు గారూ! అట్లా గబగబా వెడుతున్నారెక్కడికి? ఏమైంది?” నరసన్న పలకరింపుతో ఆలోచనలు తాత్కాలికంగా ఆగాయి.

“అట్లా చెరువు గట్టు మీద చల్ల గాలికి కూర్చుందామని వెడుతున్నాను. ఏదో ఆలోచనల్లో పడి వేగంగా నడిచానేమో!” అన్నారు.

“మంచిది పంతులుగారూ! ఏమైనా కావాలేమో అని అడిగాను. ఇక ఉంటాను” వెళ్లిపోయాడు.

ఒక్కక్షణం సంతోషం మెరిసి మాయ మయ్యింది – తన గురించి పట్టించుకొని గౌరవంగా మాట్లాడిన ఒక వ్యక్తి కనపడినందుకు. ఆ గౌరవం తన మీద కాక తను బోధించే, వారు మాట్లాడే మాతృభాష మీద ఉంటే ఎంత బాగుండు? పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్క లేకపోయినా, ఇంగ్లీషు అసలేం తెలియక పోయినా తెలుగంటే మాత్రం చులకన. అది రానక్కరలేదు. నేర్చుకోవలసిన అవసరం లేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత గొప్ప. మొన్నటికి మొన్న ఇస్తారి అన్న మాటలు విన్న క్షణాన నవ్వు కలిగించాయి. మరుక్షణం గుండెలు పిండేశాయి.

ఇస్తారి చదువుకోలేదు. వాళ్ళ నాన్న “మా వోడికి నాలుగచ్చరమ్ముక్కలు సెప్పండి పొంతులు గోరూ!” అంటే తను శతథా ప్రయత్నం చేసినా వాడికిష్టం లేదు కనక ఫలించలేదు. “నాను సదూకోను అయ్యగోరూ!” అంటూ పారిపోయేవాడు. వాడి కొడుకు ఐదో తరగతి పాసై ఏదో ఆఫీసులో ప్యూనుగా చేరాడు. వాడికి ఒకకొడుకు. కూతురు కూడా పుట్టిందని చెప్పటానికి వచ్చాడు. “ నీ మనవడెట్లా ఉన్నాడురా!” అని అడిగారు.

“ఆడు దొరబాబయ్యా! అంతా ఇంగిలీసే. అమ్మా, బాబూ అనడు. నామోసీ అంట. మమ్మీ, డాడీ అంటాడు” అన్నాడు.

నవ్వాలా? ఏడవాలా? తెలియలేదు. ఇంతకీ ఆ పిల్లాడికి రెండేళ్లు నిండలేదు. వీడికి ‘నామోషీ’ అనటం కూడా రాదు.

అమృతత్వాన్ని ప్రతిబింబించే ‘అమ్మ’ని వదిలి మృతతత్వాన్ని సూచించే ‘మమ్మీ’ అనటం గొప్ప అనుకుంటున్నాడు. పాపం! వాడిని అని ఏం లాభం! విద్యావంతులు కూడా అదే ధోరణిలో ఉన్నారు కదా!

ఒక ధోరణి మొదలైతే ఆగదని తెలియదు. తెలుగు భాషని, తెలుగు మాస్టర్లని, వారి వస్త్రధారణని వెక్కిరించి అదే హాస్యం అని ప్రేక్షకులని నమ్మించే సినిమాలు చూస్తుంటే కడుపు దేవేస్తుంది. ఆ ధోరణి ఇప్పుడు విస్తరించి, ఏ సబ్జక్టయినా ఉపాధ్యాయులని టార్గెట్ చేస్తోంది. విచిత్రం ఏమంటే ఎవ్వరూ దీనిని తప్పు అని చెప్పరు. ఇప్పుడు టీవీల పుణ్యమా అని నట్టింట్లోకి వచ్చేశాయి. ఇంటిల్లిపాది కలిసి కూర్చుని అటువంటివి చూశాక పిల్లలతో ఉపాధ్యాయులని గౌరవించమని ఎట్లా చెప్పగలరు? రాబోయే తరాలు ఎట్లా ఉంటాయో ఊహించ గలమా?

ఈ ఆవేదనలు మనసుని దొలిచేస్తూ ఉంటే నిన్నటి ఆఘాతం మరి కోలుకోలేనట్టు చేసింది. తలుచుకుంటే కళ్ళలోంచి చెవుల్లోంచి ఆవిర్లు వస్తున్నాయి. తల చిట్లిపోతుందేమో ననిపిస్తోంది.

స్వయానా తన కొడుకు కూతురు కూడా ఈ లోకం తీరుకి భిన్నంగా లేరు. ఇంట్లో వాళ్ళనే మార్చలేని వాడికి లోకం గురించి ఆలోచించే అర్హత ఎక్కడ? మహంతయ్య గారి కూతురికి సంబంధం వచ్చింది, మాట్లాడటానికి తోడు రమ్మని ఆయన పిలిస్తే వెళ్ళారు. మాటల మధ్యలో ఆయన భార్య “అన్నయ్యగారూ! ఒక్కసారి లోపలికి వస్తారా?” అని పిలిచింది. మహంతయ్య ముఖంలో కోపం కనపడింది. లోపలికి వెళ్ళారు.

“చూడండి అన్నయ్యగారూ! ఈ సంబంధం అమ్మాయికీ, నాకూ కూడా ఇష్టంలేదు. వద్దని ఎంత చెప్పినా ఈయన వినటంలేదు. మీ మాటంటే ఆయనకి గురి కదా! చెప్పి పుణ్యం కట్టుకోండి” అంది ముక్కు చీదుకుంటూ.

తెల్లబోయారు పరంధామయ్యగారు. బంగారంలాంటి సంబంధం. పిల్లాడు బుద్ధిమంతుడు. ఎటువంటి దురలవాట్లు – ఈకాలం పిల్లల్లో ఎక్కువగా కనపడేవి లేవు. ఉన్న ఊళ్లోనే స్థిరమైన ఉద్యోగం. పొలం, ఇల్లు ఉన్నాయి. పెళ్ళికొడుకు తండ్రి ఆదర్శభావాలున్నవాడు. కట్నకానుకల విషయంలో ఎటువంటి పేచీ లేదు. ప్రశ్నార్థకంగా చూశారు. ఆవిడ తల వంచుకొని,

“ఎన్ని ఉండి ఏం లాభం అన్నయ్యగారూ! అబ్బాయి తెలుగు మాస్టరు. దర్జా ఏం ఉంటుంది చెప్పండి?” అంది.

పరంధామయ్య, మహంతయ్య కూడా తెలుగు మాస్టర్లే. ఇంకా వాళ్ళది ఓరియంటల్ డిగ్రీ. పెళ్లికొడుకు ఎం. ఏ; బి. ఈడీ; నోట మాట రాలేదు. కష్టపడి గొంతు పెగుల్చుకుని చెప్పబోయారు. ఆవిడ ఆ అవకాశం ఇవ్వలేదు.

“ఏది ఏమైనా అమ్మాయి ఒప్పుకోవటంలేదు. బలవంతం చేయలేం. ఈ రోజుల్లో పిల్లలమాట మనం వినాలి కదా!” అని గొప్ప సత్యాన్ని ఆవిష్కరించింది.

“ఆయనని ఒప్పించే బాధ్యత మీదే! మిమ్మల్ని తప్ప నేనెవర్ని అడగ్గలను?” కళ్ళు ఒత్తుకుంది. చేతులు జోడించింది.

“నేనేం సుఖపడ్డాను? నా దురదృష్టమే నా కూతురుగా పుట్టినందుకు దానికీ రావాలా?” ముక్కు చీదుకుంది ఆ ఇల్లాలు.

పరంధామయ్య మారుమాట్లాడకుండా హాలులోకి వచ్చి, “మహంతయ్యా! ఈ విషయంలో నేనేం జోక్యం చేసుకోలేను” అని సమాధానం కోసం ఆగకుండా ఇంటివైపు అడుగులు వేశారు.

లోపలినుంచి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. పరంధామయ్యగారి పుత్రరత్నం ఆవేశంగా మాట్లాడుతున్నాడు.

“నేను విననమ్మా! నా కొడుకుని మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చేరుస్తాను.”

“అక్కడ అసలు తెలుగే ఉండదుటగా!” పరంధామయ్యగారి శ్రీమతి శ్రీలక్ష్మి గొంతు.

“ఉండదు. అసలు తెలుగక్షరాలు రానక్కరలేదు.”

“తెలుగు రాకపోతే ఎట్లారా?”

“కొంపలేం మునిగిపోవు. మేం నేర్చుకుని ఏం ఉద్ధరించాం? మా ఫ్రండ్స్ అంతా చూడండి! ఎంత హాయిగా అమెరికాలో ఉన్నారో! నేనూ ఉన్నాను అంబాజీపేట కూడా వెళ్లలేదు.”

“నీకేం తక్కువైందిరా?”

“ఎక్కువ ఏముందో చెప్పు?”

“ముత్తాతగారు కట్టించిన పాతకాలపు ఇల్లు, నాలుగు తరాల నాటి పాత పట్టిమంచం, ఏదో కడుపు నింపటానికి ఇంత ధాన్యం……”

కోడలి మాటలకి ఛర్రున జవాబిచ్చింది పరంధామయ్య గారి శ్రీమతి.

“ఇంత కన్నా ఎక్కువ ఏం కావాలే ఎవరికైనా?”

“అవును. ఏం కావాలి? మొన్ననే మారేజ్ డేకి అమెరికా వెళ్ళాం. పిల్లవాడి పుట్టిన రోజుకి ఊటీ వెళ్ళాం. వేసవి సెలవులకి కాశ్మీర్ వెళ్ళాం. రోజూ బెంజ్ కార్లో షికారుకి వెడుతున్నాం” సన్నాయి నొక్కులు నొక్కింది కోడలు పిల్ల.

“అంటే నీ ఉద్దేశం ఏమిటి?”

“మాకెట్లాగూ అటువంటి వైభోగాలు లేవుగా. పిల్లలనైనా మంచి చదువులు చదివిస్తే వాళ్ళకివన్నీ అందుబాటులో ఉంటాయి.”

“అంటే మాపిల్లలవి మంచి చదువులు కావని ఆ అమ్మాయి ఉద్దేశమా?” పరంధామయ్యగారి మనసు బాధతో మూలిగింది.

“కావాలనుకుంటే మీకూ అన్నీ అందుబాటులో ఉండేవే! తలుచుకోలేదు మీరు. ఇప్పుడు మాత్రం మించి పోయిందేముంది? కావాలనుకున్న చోటుకి వెళ్ళండి. డబ్బుకేం కొదవ లేదుగా!” విసురుగా గదిలోంచి బయటికి వచ్చి వంటింట్లోకి వెడుతున్న శ్రీలక్ష్మి భర్తని గమనించనుకూడా లేదు.

“తన కళ్లలాగానే నా చెవులు కూడా పనిచేయటం లేదు” అనుకున్నారు పరంధామయ్యగారు.

మహంతయ్య ఇంటిదగ్గిరే వారి మనస్సు గాయపడింది. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టయింది. మాతృభాషా వైముఖ్యమనే పురుగు తమ ఇంట్లో కూడా దూరింది. దానికి పరిపోషకం ఉపాధ్యాయ వృత్తిని తక్కువ చెయ్యటం. దేశానికి వెన్నెముకలుగా ఉండి, సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులని గౌరవించని జాతి ఎలా పురోభివృద్ధి చెందుతుంది? ఎంతోమందిలాగా ఎవరెట్లా పోతే నాకెందుకు? “చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష” అన్నట్టుగా ఉండలేకపోతున్నారు. దేశానికి సమాజానికి సేవ చేయాలని ఇష్టంతో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు గాని బలవంతానో, గతి లేకో కాదు. అందుకే తరగతిలోనే కాదు బయట కూడా తనేవి నమ్మారో అవే సిద్ధాంతాలని చెపుతూ ఉంటారు. నిజాయితీగా అమలు పరుస్తారు. అందుకే కాబోలు కొద్దికాలం క్రితం వరకు ఆయన మాటని చాలామంది వినేవారు. ఇప్పుడు ……… ?

లోపలి మాటలు ఆలోచనలకి అడ్డుకట్ట వేసి చెవికి పని కల్పించాయి.

“ఇదుగో మళ్ళీ చెపుతున్నాను. నా కొడుకుని పట్నంలో టెక్నో స్కూల్‌లో వెయ్యాల్సిందే. లేకపోతే……..”

“నీమాట కాదన్నానా ఎప్పుడైనా? వాడు నాకూ కొడుకేగా! వాడి భవిష్యత్తు బాగుండాలని నాకు మాత్రం ఉండదూ?” బతిమాలుతున్న ధోరణిలో ఉన్నాయి మాటలు.

“ఇప్పుడిట్లాగే అంటారు. తరవాత మీ నాన్నగారిని చూడగానే……”

“చూడు! ఎలా మాట్లాడతానో. నన్ను నాకిష్టం లేకపోయినా ఈ పల్లెటూళ్ళో చదివించారు. గతిలేక ఊరుకున్నాను. ఇప్పుడు నేనూ సంపాదనాపరుడినే. ఆయన మాట వినాల్సిన పనిలేదు.”

తరవాత మాటలు వినాలనిపించలేదు. ఎక్కడో ఉందనుకున్న జాడ్యం తమ ఇంట్లోనే తిష్ఠ వేసింది. మనసు కకావికలమైపోయింది. అట్లాగే అరుగు మీద చాలాసేపు ఉండిపోయారు. ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. శ్రీలక్ష్మి భోజనానికి పిలిస్తే బలవంతాన తినటానికి కూర్చున్నారు కాని, చేదుగా అనిపించి ముద్ద మింగుడు పడలేదు. ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ‘తలనెప్పిగా ఉంది, రేపు మాట్లాడుకుందాం’ అని ఆపారు. అన్నం కూడా సరిగా తినకపోవటంతో నిజమే అని ఊరుకుంది.

“మందేమైనా వేసుకోండి. పని అయినాక వచ్చి అమృతాంజనం రాస్తాను. అయినా ఇందాకే చెప్పచ్చుగా. అప్పుడే రాసేదాన్ని” అంది.

“అదే తగ్గుతుందిలే” అని గదిలోకి వెళ్ళారు. పాపం! తనకి కూడా కోడలికి ఉన్న లాంటి ఆలోచనాలున్నాయేమో! నేనెప్పుడూ కనుక్కోలేదు అని జాలివేసింది. పడుకున్నా నిద్రపడుతుందా మనస్సు కాలిపోతుంటే? తొంగిచూసి, నిద్ర పోతున్నారనుకుని తిరిగి వెళ్లింది శ్రీలక్ష్మి.

పరంధామయ్య గారికి మాష్టర్ ఉద్యోగం అని, అందులోనూ తెలుగు అని ఎవరెవరు ఎంత చులకన చేశారో ఒక్కొక్కటీ గుర్తు వస్తున్నాయి. ప్రతిదానికి సలహాకీ, సంప్రదింపుకి కావాలి కాని గౌరవానికి మాత్రం, గద్దె నెక్కించటానికి మాత్రం టిక్కుటాక్కుగా బట్టలు వేసుకునే వాళ్ళు కావాలి. నాలుగు బట్లరింగ్లీషు ముక్కలు పలికే వాళ్ళు కావాలి. హెడ్ మాస్టర్ పోస్ట్‌కి తెలుగు మాష్టారు పనికి రారుట! ఎందుకంటే ఇంగ్లీషు రాదుట! నిజమే బట్లరింగ్లీషు రాదు. వాళ్ళకన్న మంచి ఇంగ్లీషే వచ్చునని వాళ్ళకీ తెలుసు. క్లాసులో ఇంగ్లీషు మాట్లాడడుట! తెలుగు క్లాసులో ఎవరన్నా ఇంగ్లీషులో మాట్లాడతారా? ఇంగ్లీషు క్లాసులో తెలుగులో మాట్లాడుతారా? విషయం అది కాదు. చిన్నచూపు. అంతే! బెస్ట్ టీచర్ అవార్డ్‌కి కాని, మరేదైనా సన్మానానికి గాని అంతే! అక్కడే కాదు ఇంటా బయటా అదే పరిస్థితి అని అందరు వాపోతుంటే – ఈ తీరెన్నాళ్ళుంటుందిలే అని సద్దిచెప్పేవారు. ఎన్నో సంఘటనలు మనోయవనిక మీదకి చకచక వచ్చి మెరుపుల్లాగా మాయమవుతున్నాయి. కాని, ఒక్కొక్కటి గాయాన్ని కెలికి వెడుతోంది. ఎప్పటికో నిద్ర పట్టింది.

“……. ఆయన దదొక పిచ్చి. ఎవరు చెప్పినా వినరు. సద్దుకుపోవటం తప్ప ఏం చేస్తాం? ఆయన మారరు. ఆయనతో చెప్పకుండా తీసుకెళ్లి చేర్చు. చెపితే కాదంటారు. కాదన్నాక చేర్చితే బాధ పడతారు.”

లోగొంతుతో చెపుతున్న శ్రీలక్ష్మి మాటలు మెలకువ రాగానే పరంధామయ్యగారిని వాస్తవంలోకి తీసుకు వచ్చాయి. ఇక ఎవరి మొహమూ చూడాలనిపించ లేదు. అందుకే మొదటిసారి స్వంతనిర్ణయం తీసుకున్నారు.

నడుస్తున్న పరంధామయ్యగారి ఆలోచనలు గతాన్ని తవ్వుకుంటూ పరిపరి విధాల పోతున్నాయి. కాళ్ళు వాటి పని అవి చేస్తున్నాయి. దేని దారి దానిది.

ఉలికిపాటుతో హఠాత్తుగా నడక ఆగింది. కొద్ది దూరంలో పెద్దకారు. సడన్ బ్రేకుతో ఆగింది.

“చావటానికి మాకారే దొరికిందా?” డ్రైవర్ విసుగ్గా అన్నాడు.

“నీకంత కష్టం ఎందుకు నాయనా! నన్ను మాఊరి చెరువు పిలుస్తోంది” గొణిగారు.

కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి అద్దాలు కిందకి దింపి “ఊళ్ళోకి వచ్చేశామా?” అంటూ తొంగిచూశాడు. వెంటనే కారు దిగి తెల్లబోయి నిలబడి ఉన్న పరంధామయ్యగారి కాళ్ళకి దణ్ణంపెట్టాడు.

“మాష్టారూ! నన్ను గుర్తుపట్టలేదా? శంకర్‌ని. ముప్పయ్యేళ్ళ క్రితం మీ దగ్గిర చదువుకున్నాను. మీ దయ వల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఇండియా వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుస్తాను. నాలుగేళ్ల క్రితం నా భార్యని మీ ఇంటికి తీసుకు వచ్చాను” గబగబా చెప్పేస్తున్నాడు. ఒక్కొక్కటీ గుర్తువచ్చాయి.

“అవునవును. బాగున్నావా?” అడిగారు.

“ఈసారి మాఅబ్బాయికి మిమ్మల్ని చూపించాలని తెచ్చాను” అని కారులోకి చూస్తూ, “అశోక్! చూశావా? మా గురువుగారు నాకెదురొచ్చారు” అన్నాడు.

అశోక్ వెంటనే కారు దిగి పరంధామయ్యగారి కాళ్ళకి దణ్ణం పెట్టాడు.

“ఏదైనా పనిమీద వెడుతున్నారా? కారెక్కండి. నేను తీసుకెడతాను. లేకపోతే మీ ఇంటికి వెడదాం. అమ్మగారిని కూడా చూపించాలి వీడికి.” అన్నాడు.

“ఏం తోచక చల్లగాలికి ఇటు వచ్చాను. ఇంటికి వచ్చిన మనవడిని కొంచెం ముద్దు చెయ్యాలిగా!” అన్నారు.

 ‘చావటం కూడ నా చేతుల్లో లేదు. అంతా దైవాధీనం’ అనుకుంటూ కారెక్కారు పరంధామయ్యగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here