[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
సమవుజ్జీల పోరు (క్లాష్ ఆఫ్ టైటాన్స్)
1936లో విడుదలైన రెండు ముఖ్యమైన తెలుగు సినిమాల వాణిజ్య ప్రకటనలను చూడండి – (నా చిన్నతనంలో ఈ రెండు చిత్రాల గురించి నానమ్మ నాకు చెప్పారు).
(1) ద్రౌపది మాన సంరక్షణం – 1936 (2) ద్రౌపది వస్త్రాపహరణం – 1936.
ద్రౌపది వస్త్రాపహరణం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది, అయితే ద్రౌపది మాన సంరక్షణం విఫలమైంది. ఈ కథ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం ఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇది ద్రౌపదిని కౌరవులు బహిరంగంగా అవమానించిన ఘటనను వర్ణిస్తుంది. యుధిష్ఠరుడు, ఇతర పాండవులు పాచికల ఆటలో ఓడి ఆమెను దుర్యోధనుడికి కోల్పోయిన తరువాత ఇది జరుగుతుంది. కౌరవులు తన దుస్తులు తీసి అవమానించడానికి ప్రయత్నిస్తుండగా, ఆమె శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. అతను ఆమె చీర తర్వాత చీరని అందిస్తూ ఆమె సహాయానికి వస్తాడు.
ఇప్పుడు ప్రతి చిత్రానికి తారాగణం మరియు క్రెడిట్స్ గురించి చదువుదాం….
ద్రౌపది మాన సంరక్షణం (1936) –
తారాగణం: బళ్ళారి రాఘవ (దుర్యోధనుడు), సురభి కమలాబాయి (ద్రౌపది), బందా కనక లింగేశ్వరరావు (శ్రీ కృష్ణ), కె. శివరామ కృష్ణయ్య (కర్ణ), బి. చలపతి రావు (అర్జున), ఎస్. రంగస్వామి అయ్యంగార్ (శకుని), కె.హెచ్. దాస్ చౌదరి (దుశ్శాసన),పారుపల్లి సుబ్బారావు (ధర్మరాజు), వి.వి. సుబ్బారావు (భీమ), ఎం. రాజారావు (నకుల), డివి సుబ్రహ్మణయం (సహదేవ), లీలాబాయి (సత్య), శ్రీహరి (రుక్మిణి), సుభద్ర (జాంబవతి), కె. సీతా దేవి (మిత్రవింద), వెంకట లక్ష్మి (సుభద్ర), పద్మావతి దేవి (భానుమతి), దైతా గోపాలం (విదుర), మాధవపెద్ది వెంకటరామయ్య (శిశుపాల), మంత్రవాది వెంకట శేషయ్య (భీష్మ), నంద మార్కండేయ శర్మ (ద్రోణ), టి. సుబ్రహ్మణ్యం (నారద), మాస్టర్ దుర్గా ప్రసాద్ (వికర్ణ), డాక్టర్ రామ శాస్త్రి (అశ్వత్థామ), మంత్రవాది వెంకట్రామయ్య (ప్రతిగామి), జోన్నవిత్తుల సత్యనారాయణ (ధృతరాష్ట్ర), రాగిణి దేవి (నర్తకి), గోపీనాథ్ (నర్తకుడు)
గీతాలు: పాపట్ల లక్ష్మీకాంతం, దైతా గోపాలం
సంగీతం: ఏ.టి. రామానుజులు (హార్మోనియం), కె. గున్నయ్య (ఫిడేలు) ఇంకా పి. నారాయణ (తబలా).
సినిమాటోగ్రఫీ: సర్‌పోత్‌దార్
ఆడియోగ్రఫీ: అరోరా
కొరియోగ్రఫీ: రాగిణి దేవి (అమెరికా) మరియు గోపీనాథ్ (మలబార్) [వారి పేర్లు ఎంత ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయో బొమ్మ చూడండి].
దర్శకుడు: ఎన్.జగన్నాథ స్వామి
బ్యానర్: లక్ష్మి ఫిల్మ్స్
విడుదల తేదీలు: 24 మార్చి (మద్రాస్, బెజవాడ, తెనాలి) మరియు మార్చి 31 (నెల్లూరు, ఏలూర్, గుంటూరు, సికింద్రాబాద్)
బాక్స్ ఆఫీస్: ఫ్లాప్
ట్రివియా: ఆ సమయంలో సినీ విమర్శకుడైన కమలకర కామేశ్వరరావు ఈ చిత్రాన్ని – బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన మరో చిత్రం ‘ద్రౌపది వస్త్రాపహరణం’కు వ్యతిరేకంగా ప్రశంసించారు. ‘ద్రౌపది మాన సంరక్షణం’లో నటుల సాంకేతిక విలువలు, నటనను ఆయన మెచ్చుకున్నారు.
బళ్ళారి రాఘవ గొప్ప తెలుగు నాటక కళాకారులలో ఒకరు. ఆయన అతి కొద్ది కాలం మాత్రమే సినీ పరిశ్రమలో ఉన్నారు. 1936లో ‘ద్రౌపది మాన సంరక్షణం’లో దుర్యోధనుడి పాత్ర పోషించారు. ‘రైతుబిడ్డ’, ‘చండిక’ చిత్రాల్లో కూడా నటించారు. అయితే, ఆయన సినీ పరిశ్రమను త్వరగా విడిచిపెట్టారు.
ఈ చిత్రాన్ని బొంబాయిలోని ఫిల్మ్ సిటీ స్టూడియోలో నిర్మించారు.
***
ద్రౌపది వస్త్రాపహరణం – 1936
తారాగణం: ద్రౌపది – కన్నాంబ, దుర్యోధనుడు- యడవల్లి సూర్యనారాయణ, కృష్ణుడు – చిలకలపుడి సీతారామాంజనేయులు, శకుని- నెల్లూరి నాగ రాజారావు, ధర్మరాజ – చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, దుశ్శాసన – లంకా కృష్ణమూర్తి, భీముడు – దోమేటి సూర్యనారాయణ, శిశుపాల – వేమూరి గగ్గయ్య, నారద – పి. సూరిబాబు, విదుర – అరాని సత్యనారాయణ, అశ్వత్థామ – దోమేటి సత్యనారాయణ, సత్యభామ – దాసరి రామతిలకం.
ఈ చిత్ర నిర్మాణానికి తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రెండు నిర్మాణ సంస్థలు 1936లో సినిమాలు నిర్మించడానికి మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం అనే ఒకే ఇతివృత్తం కోసం పోటీపడ్డాయి.
సరస్వతి పబ్లిషింగ్ హౌస్ కురుకూరి సుబ్బారావు మరియు పారుపల్లి వెంకట శేషయ్య సరస్వతి టాకీస్ లిమిటెడ్‌ను ప్రారంభించారు, ఇందులో గూడవల్లి రామబ్రహ్మం గారు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉండేవారు. ప్రముఖ రంగస్థల నాటకం ద్రౌపది వస్త్రాపహరణం ఇతివృత్తంతో సినిమా తీయాలని వారు నిర్ణయించారు. శ్రీ లక్ష్మి ఫిల్మ్స్‌కు చెందిన కావలి గుప్తా ఇప్పటికే హక్కులను సొంతం చేసుకుని, కీలక పాత్ర పోషించడానికి బళ్లారి రాఘవతో సంతకం చేశారు. సుబ్బారావు మరియు శేషయ్య తమ ప్రాజెక్టుతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ యడవల్లి సూర్యనారాయణ ప్రసిద్ధ రంగస్థల నటుడు. దుర్యోధనుడి కోసం వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కావలి గుప్తా వారి ప్రకటనను చూసినప్పుడు, అతను తన సినిమా టైటిల్‌ను ‘ద్రౌపది మాన సంరక్షణం’ అని మార్చి, నిర్మాణానికి తొందరపడ్డాడు. అయితే ఇది సరస్వతి టాకీస్ వెంచర్ తర్వాత మూడు వారాల తరువాత విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది.
సుబ్బారావు మరియు శేషయ్య తమ చిత్రానికి దర్శకత్వం వహించడానికి హెచ్‌ఎం రెడ్డిని సంప్రదించారు. అతను బిజీగా ఉన్నందున, రెడ్డి తన బావ హెచ్‌వి బాబు దర్శకుడిగా, తాను పర్యవేక్షక దర్శకుడిగా ఉండటానికి అంగీకరించారు. ప్రసిద్ధ తెలుగు చలనచిత్ర పత్రిక ‘చిత్రకళ’ సంపాదకుడు మరియు ప్రచురణకర్త పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి స్క్రీన్ ప్లే మరియు అదనపు సాహిత్యం, ఇంకా గీతాలు రాయడానికి ఎంపికయ్యారు. యడవల్లి సూర్యనారాయణానికి స్వరం స్పష్టంగా ఉండేది, పద్యాల వ్యక్తీకరణ మరియు సహజమైన నటన వారి బలము. 1932లో ‘పాదుకా పట్టాభిషేకం’ చిత్రంతో తెరపైకి వచ్చారు. శ్రీ కృష్ణుడి పాత్ర కోసం వారు సిఎస్ఆర్ అంజనేయులుతో సంతకం చేశారు, ఎందుకంటే ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించారు. ఇతర నటీనటులను సినీ పాత్రల కోసం ఎంపిక చేశారు.
దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీరను లాగడం ఒక ప్లాంక్ మీద కూర్చున్న కెమెరాకు దూరంగా ఉన్న వ్యక్తి ఎత్తు నుండి కట్టబడిన చీరల కట్ట విసురుతూ చిత్రీకరించారు. సినిమాటోగ్రాఫర్ ఎస్సీ షిండే దీనిని విడిగా చిత్రీకరించారు. ఎడిటింగ్ టేబుల్ వద్ద బాబురావ్ భదోర్కర్ వీటిని కూర్చారు.
రిఫరెన్సులు: నెట్‌లో తెలుగు సినిమా ప్రపంచం; ది హిందూలో ఎంఎల్ నరసింహం రాసిన వ్యాసం.
ఈలపాట రఘురామయ్యకు పౌర సన్మానం
1963, ఫిబ్రవరి 23 లో గుంటూరు బాపుజీ ఉన్నత పాఠశాలలో ఈలపాట రఘురామయ్య గారికి పౌర సన్మానం, కనకభిషేకం జరిగాయి. వారికి “సంగీత సామ్రాట్” అనే బిరుదు కూడా ప్రదానం చేశారు. ఆయనను మేళ తాళాలతో, టపాసులు పేలుస్తూ, పూల రథంపై వేదిక వద్దకు తీసుకువచ్చారు.
గుంటూరు సెషన్స్ జడ్జి డివి రెడ్డి గారితో పాటు జమున, ఘంటసాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రఘురామయ్య తన మొదటి భార్య సావిత్రి దేవితో వచ్చారు. రఘురామయ్య తరువాత తన ఈలపాట కచేరి చేశారు. జమున కూడా ప్రసంగించారు, ఘంటసాల పాటలు పాడారు. ఇది సంతోషకరమైన వేడుక. మరపురాని పాత రోజులు….
‘రాధిక’ అనే 1947 నాటి సినిమాలో ఆయన రావు బాల సరస్వతి దేవితో కలిసి నటించారు. ఈ సినిమా నిర్మాత ఆమె తండ్రిగారేనని ఆమె నాకు చెప్పారు. షూటింగ్ సమయంలో ఆయన తరచూ అంతులేని గమకములుతో, కొన్ని రాగాలతో సెట్ లోకి ప్రవేశించేవారు. ఆయన ఆమె గొంతును ఇష్టపడ్డారు, ఆమెను కూడా పాడమని అడిగారు. ఈ కారణంగా షూటింగ్ పురోగతి సాధించకపోవడంతో ఈ చిత్ర నిర్మాతలు మందలించారు. చివరగా వారు బాల సరస్వతితో మాట్లాడుతూ ఇది సినిమా అనీ, నాటకం కాదని – అలా చేయవద్దని కోరారు.