లోకల్ క్లాసిక్స్ – 13: పనస నుంచీ ఫుట్‌బాలల దాకా!

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా హిస్నమ్ తోంబా దర్శకత్వం వహించిన మణిపురి సినిమా ‘నోబప్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘నోబప్’ (మణిపురి)

[dropcap]1[/dropcap]972లో నిర్మించిన మొదటి మణిపురి చలన చిత్రం‘మాతంగీ మణిపూర్’ నుంచీ నేటి దాకా తరచూ జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న రాష్ట్రంగా మణిపూర్ దేశంలో వార్తల్లో వుంటోంది. కేవలం 30 లక్షల జనాభాగల ఈ అతి చిన్నఈశాన్య సరిహద్దు రాష్ట్రం వాస్తవిక సినిమాలతో బాటు క్రీడలకి ఒక ప్రధాన కేంద్రంగా వుంటోంది. దేశంలో తొలి క్రీడా విశ్వ విద్యాలయాన్ని ఇక్కడే నెలకొల్పారు. హాకీ, ఫుట్‌బాల్, మార్షల్ ఆర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన క్రీడాకారులెందర్నో ఈ రాష్ట్రం అందించింది. బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ గురించి తెలిసిందే. రగ్బీతో సమానమైన కోకోనట్ రగ్బీ ఇక్కడే పుట్టింది. గుర్రాలతో అంతర్జాతీయంగా ఆడే పోలో క్రీడని ఇక్కడ్నించే బ్రిటిషర్లు యూరప్‌కి తీసి కెళ్ళారు. ఇలా వుంటే, ఇంత ఘనమైన క్రీడా నేపథ్యమున్న రాష్ట్రంలో, పేద పిల్లలు ఆట వస్తువులకి కూడా నోచుకునే అదృష్టం లేని పార్శ్వం ఒక దయనీయ దృశ్యంగా వుంది. వైభవమున్న చోటే ప్రచారముంటుంది, వైభవం కోసం వెంపర్లాడే చోట వార్తలుండవు. వార్తలుండని చోట సినిమా వుంటుంది. దర్శకుడు హిస్నమ్ తోంబా సినిమా అనే కళా జ్యోతిని పేద పిల్లల క్రీడార్తి మీద ప్రసరింపజేసి, ప్రభుత్వాలకి కనువిప్పు కలిగేలా చేశాడు.

హిస్నమ్ తోంబా నాటకరంగ కళాకారులైన తల్లిదండ్రుల (కన్హైలాల్, సాబిత్రి) దగ్గరే నటనలో శిక్షణ పొంది – నాటక రచయితా, సంగీత దర్శకుడు, దర్శకుడూ పదవులు నిర్వహిస్తూ నటనలో శిక్షణనిచ్చే గురువుగా కొనసాగాడు. ఆరు నాటకాలు రాసి ఎనిమిది నాటకాలకి దర్శకత్వం వహించాడు. వీటిలో రబీంద్ర నాథ్ రాగూర్, ఇస్బెన్ లు రాసిన రెండు నాటకాలున్నాయి. ఢిల్లీ, ముంబాయి, మైసూరు, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పాట్నా, బంగ్లాదేశ్, సింగపూర్‌లలో నటనా శిక్షణా తరగతులు నిర్వహించాడు. ఈ సేవలన్నిటికి గానూ కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ సంస్కృతీ అవార్డు నందుకున్నాడు.

నటన ఎలాగో ఇలా చెప్తాడు – నటన నీ శరీరం, శరీరాన్ని నమ్ము. పంచేంద్రియాలని వినియోగించు, అభివృద్ధి పర్చు. మనస్సుని నమ్ము. తనువూ మనసూ నీ ఆస్తి. అంతరాళంలో ఎన్నో వుంటాయి, వెలికి తీయ్. చుట్టూ ప్రకృతి నుంచి నేర్చుకో. చొక్కా తీసి చీకట్లోకి వెళ్ళు. మైమరచి చీకటినంతా పీల్చు. అభినయానికి ఉపకరణాలని తోడు చేసుకోకు. శరీరాన్ని నమ్ము. నటన శరీరం గురించే…

నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగు పెడుతూ దర్శకత్వం వహించిన ‘నోబప్’ని నటనలో పిల్లల నైపుణ్యానికి ప్రయోగశాలగా మల్చాడు. ఎనిమిది మంది పిల్లలచేత మూగ వేదనే నటనకి ప్రేరణగా చేసి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. మణిపూర్ కొండకోనల మారుమూల గ్రామంలో పేదరికాన్ని మౌనంగా భరించే పిల్లల ‘పెద్దరికాన్ని’, పరిపక్వతనీ, చివరికి పతాక సన్నివేశంలో ఆకాశాన్నంటించాడు. గెలుపు దేనికి? ఫలాలు అనుభవించడానికా, పరోపకారం చేయడానికా? ఈ ప్రశ్నకి పేద పిల్లల చేత సమాధానం ఇప్పించాడు. జీవితం చూపించాడు, సినిమా చూపించలేదు.

పనసతో పసితనం

చెట్టు నుంచి ఆపిల్ పండు రాలితే న్యూటన్‌కి గురుత్వాకర్షణ శక్తి తెలిసింది. చెట్టు నుంచి పసర పనస రాలిపడితే? పిల్లలకి ఫుట్‌బాల్ ఆట తెలిసింది. కొండ ప్రాంతంలో చుట్టూ పచ్చటి ప్రకృతి మధ్య అతి నిద్రాణంగా వుండే ఆ మణిపురీ గ్రామంలో ఆడపిల్లల్ని ఆటలు పట్టిస్తూ తిరుగుతూంటారు ఈ పిల్లలు. చదవడానికి స్కూలు లేదు, ఉన్నా టీచర్లు రారు. ఇంట్లో చదువుకుందామన్నా పుస్తలకాలకి డబ్బుల్లేవు. తోచిన ఒడిసెల (గులేర్), గిల్లీ కర్ర (గిల్లీ దండ) ఆటలు ఆడుకుంటూ, పనిలో పనిగా అమ్మాయిల్ని ఆటలు పట్టిస్తూ రోజులు గడిపేస్తూంటారు.

ఓ రోజు చెట్టుకింద గిల్లీకర్ర ఆడుతూంటే చెట్టునుంచి పనస కాయ రాలిపడుతుంది. దాన్ని తంతూ ఫుట్‌బాల్ ఆడేస్తారు. ఈ ఆటని జీపు డ్రైవర్ తంబూ (రాజూ నోంగ్) చూస్తూంటాడు. ఇతను దగ్గరి టౌనుకీ గ్రామానికీ మధ్య జీపు నడుపుతూ ఉపాధి పొందుతూంటాడు. ఈ జీపుకి రోజుకి మూడొందలు అద్దె కట్టాలి. థాజా (అబెనో ఎలంగ్బమ్), తోయిబీ (రంజన) అనే ఇద్దరమ్మాయిలు జీపులో టౌనుకి వెళ్లి బట్టలు కుట్టి వస్తూ వుంటారు. ఒక జత కుడితే ఇరవై ఆరు రూపాయలు వస్తాయి. థాజాతో గాఢమైన ఏకపక్ష ప్రేమలో వుంటాడు తంబూ. పిల్లలు పనస కాయతో ఫుట్‌బాల్ ఆడేస్తూంటే, ఇలాక్కాదు లెదర్ బాల్‌తో ఆడాలంటాడు. ఆ బాల్ ఎంతవుతుందంటే, మూడొందలు అవచ్చంటాడు. అది కొనివ్వాలంటే తనకి వచ్చే ఏడాది చివరి వరకూ పడుతుందంటాడు. పిల్లలు తామే కొనుక్కునేందుకు డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారు.

మూట మోస్తే రూపాయి బిళ్ళ, వొళ్ళు పడితే రూపాయి కాసు, మొక్కలకి నీళ్ళు పెడితే ఏక్ రుపయ్యా, చేపలు పడితే ఏక్ సిక్కా…ఇలా సంపాదించుకుంటూ అవి దాచడానికి వెదురు చెట్టుకి రంధ్రం చేసి అందులో కిడ్డీ బ్యాంకులా వేస్తూంటారు నాణేల్ని. కొన్ని రోజులకి తీసి డ్రైవర్ తంబూ ముందు లెక్కిస్తే నూటా డెబ్భయ్యారు రూపాయలుంటాయి. అవి తీసికెళ్ళి ఫుట్ బాల్ కొనుక్కొస్తాడు తంబూ. అందరూ స్నానం చేశాకే బాల్ ఆడాలంటాడు.

అందరూ స్నానాలు చేసి వచ్చి పవిత్రంగా ఆ బాల్‌తో ఆడుతూంటే అది వెళ్లి జీపు కింద పడి పగిలిపోతుంది. ఇది చూసుకోడు తోంబా. పిల్లలు కూడా చెప్పరు. లోలోనేబాధ పడుతూంటారు. బాల్ లేక, ఆటా లేక దిగాలుపడి వుంటారు. ఇంకో పిల్ల వాడు మాస్టర్ చింకెన్గంబా ఇంట్లో తాగుబోతు తండ్రి, అతడితో గొడవపడే తల్లి, విసుక్కునే అక్క థాజా వుంటారు. వూరికే తిరుగుతున్న డెనిల్ ని హోటల్లో పనికి పంపాలని తండ్రి కుయుక్తులు పన్నుతూంటాడు. దీని మీద గొడవ. ఈ గొడవని తప్పిస్తూ గ్రామంలోకి విద్యామంత్రి వస్తున్నట్టు కబురు. కంగారు. శిథిలావస్థలో వున్న స్కూలు కేసి టీచర్లు పరుగో పరుగు. పిల్లల్ని పోగేసి లాక్కెళ్ళి విద్యామంత్రి ముందు హాజరు. విద్యామంత్రి పరిస్థితి గమనిస్తాడు. స్కూలు మరమ్మత్తులకోసం ఎన్ని నిధులు విడుదల చేసినాదిగ మింగి కూర్చుంటున్నారు. ఈసారి ఇలా కుదరదు. స్కూల్ని బాగు చెయ్యాల్సిందే. తన బాధ్యతగా పుస్తకాలు, పెన్సిళ్ళు, ఆడుకోవడానికి ఫుట్ బాల్సూ తెచ్చాడు…

ఆ ఫుట్‌బాల్స్‌ని చూసి పిల్లలు మర్నాడు ఉత్సాహంగా చదువుకోవడానికి స్కూలుకి పోతే, ఫుట్‌బాల్స్ వుండవు. టీచర్లు వాళ్ళ పిల్లల కోసం ఎత్తుకెళ్ళి పోయారు. ఇక అలవాటుగా టీచర్లు రావడంలేదు, స్కూలు ఎప్పట్లానే మూత.

ఇక గ్రామంలోకి పిల్లల కిడ్నాపర్లు వస్తారు. మాస్టర్ చింకెన్గంబాని వాడి తండ్రి వాళ్ళకి అప్పగించి డబ్బులు తీసుకుంటాడు. ఇంకో మాస్టర్ సంతోష్‌ని వాడి తండ్రి కూడా అమ్మేస్తాడు. ఇద్దర్నీ రాజధాని ఇంఫాల్ తీసికెళ్ళి హోటల్లో ఒకడ్నీ, గ్యారేజీలో ఇంకొకడ్నీ అమ్మేస్తారు కిడ్నాపర్లు.

ఇది డ్రైవర్ తంబూకి తెలిసి మాస్టర్ చింకెన్గంబా తాగుబోతు తండ్రిని అదే హోటల్లో పడేసి, మాస్టర్ చింకెన్గంబాని విడిపించుకుంటాడు. గ్యారేజీలో మెకానిక్కులతో ఫైట్ చేసి మాస్టర్ సంతోష్‌ని విడిపించుకుంటాడు. ఈ రెండ్రోజులూ తను వూళ్ళో లేకపోవడంతో ఎవరో అమ్మాయిని లేపుకుపోయాడని పుకార్లు వ్యాపిస్తాయి. ఇది నమ్మేసి అతణ్ణి మూగగా ప్రేమిస్తున్న థాజా మానసికంగా దెబ్బ తినిపోతుంది. అటు తంబూ ఇంటికి జీపు యజమాని వెళ్లి జీపు వాపసు ఇచ్చేయాలని గొడవ పెట్టుకుంటాడు తంబూ తల్లితో. అప్పుడే జీపుతో వూళ్ళోకి వచ్చిన తంబూ, యజమాని మొహాన ఆ జీపుని కొట్టి, నిరుద్యోగిగా తిరగడం మొదలెడతాడు. ఇటు ఉపాధీ పోయి, అటు ప్రేమించిన అమ్మాయీ పోయి ఏమిటీ జీవితమని బాధపడతాడు.

నేను ప్రేమిస్తున్నట్టు నీకు చెప్పలేదు
నా హృదయం చెప్తోంది
నేను ప్రేమిస్తున్నట్టు నీకు రాయలేదు
నా హృదయం రాస్తోంది
నాకు కేవలం హృదయం వుంది
నాకున్నదల్లా హృదయం
హృదయముంది కాబట్టే
ప్రేమ గురించి తెలిసింది
హృదయం లేకపోతే ఎలా తెలిసేది?
నేను హృదయాన్ని సముదాయించినప్పుడల్లా
అదేన్నో ప్రశ్నలు వేస్తోంది
ఏం సమాధానం చెప్పాలి?
ఏం చెప్పి సమాధాన పర్చాలి?

ఇలా విరహగీతంతో ఇతనుంటే, అటు స్కూల్లో కూడా బాల్స్ లేకపోయినందుకు పిల్లలకి కోపం పెరిగిపోయి, ఇంకో పనస కాయని రాల్చి ఎడాపెడా తన్నేస్తూ ముక్కలు చేస్తారు. ఆ తన్నడంలో మాస్టర్ డెనిల్ కాలికి తీవ్ర గాయమై పడిపోతాడు.

ఇటు ఫుట్‌బాల్‌తో ఈ పిల్లల తీరని కోరిక, అటు ప్రేమలో తీరని వ్యథా ఇప్పుడు డ్రైవర్ తంబూ చేతిలో వున్నాయి. వీటినెలా పరిష్కరించాడు? పిల్లల్ని టోర్నమెంటుదాకా తీసికెళ్ళే పట్టుదల ఎలా పెరిగింది? భగ్న ప్రేమ వల్లా? భగ్న ప్రేమ ఇంత పనీ చేస్తుందా? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

మామూలుగా ఆర్ట్ సినిమాలు గాథలతో వుంటాయి. అరుదుగా కథలతో వస్తాయి. గాథల్లో కేవలం సమస్యాత్మక జీవితాలనే చూస్తాం. కథల్లో సమస్యాత్మక జీవితాలతో సంఘర్షణా, పరిష్కారమూ కూడా చూస్తాం. ఇందువల్ల కమర్షియల్ సినిమాలు కథలతో వస్తాయి. గాథలతో వచ్చినప్పుడు ఫ్లాపవుతున్నాయి. ఆర్ట్ సినిమాలు ఎలా వచ్చినా ఆర్ట్ సినిమాలే. అయితే కథలతో వస్తే ప్రయోజనాత్మక సినిమాలు. ‘నోబప్’ ఇలాటి ప్రయోజనాత్మక సినిమా.

దీని నిడివి రెండు గంటలా 36 నిమిషాలు. ఆర్ట్ సినిమాకి ఎక్కువే. అయితే ఇంత నిడివిని నిలబెట్ట గలగడం కథ అయినందువల్లే సాధ్యమైంది. మొదట్లో డ్రైవర్ తంబూ ఫుట్‌బాల్ కొని తేవడం దగ్గర ప్రారంభమయ్యే కథ (దీనికి ముందు వచ్చే దృశ్యాలన్నీ ప్రారంభం కాబోయే కథకి కేవలం ఉపోద్ఘాతమే లెక్క ప్రకారం), ద్వితీయార్ధంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్ గురించి పోస్టర్ అంటించడం దగ్గర- నలుగుతున్న సమస్యకి ఈ టోర్నమెంట్ ఒక పరిష్కార మార్గంగా కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత టోర్నమెంటు కెళ్ళాలంటే తగిన పౌష్టికాహారం, నిధులూ, తయారీ, శిక్షణా వగైరా తతంగం, ఆఖరికి టోర్నమెంటులో విజయమూ ఉద్దేశించిన కథకి ఉపసంహారమే. ఈ మూడంకాల నిర్మాణంతో అయినా ఇంత సుదీర్ఘ కథని నిలబెట్టడం కష్టం. కమర్షియల్ సినిమాల్లోనే ఈ పని చేతగాక చేతులెత్తేస్తున్నారు. అలాంటింది ఇక్కడ తొలిసారిగా సినిమా చేపట్టిన దర్శకుడు హిస్నమ్ తోంబా, ఫుట్‌బాల్ కొని తేవడం దగ్గర్నుంచీ, టోర్నమెంట్ పోస్టరు అంటించే దాకా సుమారు 90 నిమిషాల పాటూ సాగే కథని విసుగు పుట్టించకుండా నడపడం చాలా గొప్ప. ఎక్కడా కమర్షియల్ విలువల జోలికి పోలేదు. గ్యారేజీలో ఫైటింగ్ దృశ్యంలో తోంబా పడిపోతే, మాస్టర్ సంతోష్ అక్కడున్న ఇనప కడ్డీ తీసుకుని అడుగు లేస్తాడు. కమర్షియల్ సినిమాల్లో లాగా ఆ కడ్డీతో శత్రువుల మీద తను విరుచుకు పడడు. దాన్ని తోంబాకి అందిస్తాడు. తోంబా దాంతో శత్రువుల్ని ఎదుర్కొంటాడు.

ఈ 90 నిమిషాల కథతో రెండో అంకం సూత్రాలనుసారం చర్యకి ప్రతిచర్య పంథాలో కథనం నడిపినందువల్ల ఎక్కడేసిన గొంగళిలా ఈ ఆర్ట్ సినిమా కథ వుండదు. బాల్ కొని తెస్తే అది జీపు కిందపడి పగలడం,విద్యామంత్రి బాల్స్ తెస్తే టీచర్లు కొట్టేయడం, పిల్లలు పనసకాయ మీద కోపం తీర్చుకోబోతే కాలికి గాయమై నడవలేని స్థితికి చేరడం, తంబూ మళ్ళీ బాల్ కొని తెస్తే…ఇలా చర్యకి ప్రతిచర్య పంథా కథనంతో సమస్యాత్మక సంఘర్షణగా రెండో అంకం సాగుతుంది.

ప్రేమ కథకూడా ఈ పంథా లోనే సాగుతుంది. తంబూ ఇంఫాల్ లో పిల్లల్ని విడిపించడానికి రెండు రోజులు గ్రామంలో లేకపోయే సరికి, ఎవర్నో అమ్మాయిని లేపుకుపోయాడన్న పుకార్లు అతడి జీవనోపాధినీ, ప్రేమనీ చట్టు బండలు చేస్తాయి. ఇలా పనిలేక తను, బాల్ లేక పిల్లలూ ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, చెట్టు కింద కూర్చోబెట్టుకుని పిల్లలకి చదువైనా చెపుదామని పూనుకుంటాడు – ‘మన అమ్మానాన్నలు చెప్పేది, పంతుళ్ళు బోధించేది మనం శ్రద్ధగా వింటాం, వాటిని శిరసావహిస్తాం. సూర్యోదయానికి ముందే పళ్ళు తోముకుంటాం, మొహం కడుక్కుంటాం’… ఇలా తను చెప్పేది పిల్లలు రిపీట్ చేస్తూంటారు.

     

ఈ సినిమా మొత్తం నిడివిలో పిల్లలతో ప్రధాన కథ, ప్రేమ కథగా వున్న ఉపకథా చెరిసగం వుంటాయి. ఏమైనా గ్లామర్, కమర్షియల్ ఆసక్తులూ వుంటే ప్రేమ కథతోనే -అదికూడా వాస్తవికతా పంథా విడువకుండానే. ఇక చిట్ట చివర పిల్లలు ఇంఫాల్ లో అండర్ -15 టోర్నమెంటులో విజేతలుగా రాణించడం ఆశించే ముగింపే. ఈ ప్లాట్ క్లయిమాక్స్ తో సరి పెట్టేయలేదు. స్టోరీ క్లయిమాక్స్ కెళ్ళాడు దర్శకుడు. టోర్నమెంటులో గెలుపొందిన ఎనిమిది వేల రూపాయల నోట్ల కట్ట పిల్లలకి చూపిస్తూ, ‘దీంతో ఏం చేస్తారు?’ అంటాడు తోంబా.

జీవితంలో అంత డబ్బు కళ్ళ చూడని, అష్ట కష్టాలూ పడి తమ స్వప్నం సాకారం చేసుకున్న నిరుపేద పిల్లలు ఏడుగురూ, ఆ డబ్బు గాయపడి ఆడలేకపోయిన డెనిల్ కాలికి మెరుగైన చికిత్సకి వినియోగించాలని అంటారు.

నువ్వు తలపెట్టు -ప్రకృతి దానికదే ఎన్ని వైపుల నించో నీకు సహకారాలందిస్తుంది – అంటూ పేదరికానికి సమాధానంగా ఈ కథ చేశాడు దర్శకుడు. డ్రైవర్ తంబూ, పక్కూళ్ళో అతడి స్నేహితుడూ, ఇంకో పోటీ జీపు డ్రైవర్ వీళ్ళంతా ప్రకృతి పంపిన ప్రతినిధులే. క్లోజింగ్ ఇమేజిగా అందరూ కలిసి జీపులో పోతున్నప్పుడు, వెనుక చెట్టు నుంచి ఇంకో పనస కాయ రాలి పడుతుంది. జీపాపించి పరుగెత్తుకొచ్చి దాన్నెత్తుకు పోతాడు పిల్లవాడు. అన్నట్టు నోబప్ అంటే పనస కాయే.

అవార్డులు ఎనిమిది

2009 లో నిర్మించిన ‘నోబప్’ ఏడవ మణిపూర్ ఫిలిం ఫెస్టివల్లో 8 అవార్డులూ గెలుచుకుంది. ఉత్తమ కథ, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ శబ్ద గ్రహణం, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ గాయకుడు, ఉత్తమ కథాచిత్రం, ఇంకో స్పెషల్ జ్యూరీ అవార్డు. నిర్మాత సురేష్ హిదంగ్ కథ అందించాడు. కుమార్జిత్ స్క్రీన్ ప్లే రాశాడు. ఓ.గీత్ సంగీతమిచ్చాడు. కొన్జెంగ్బమ్ బూంగ్ ఛాయాగ్రహణం సమకూర్చాడు.

సంస్కృతీ సాంప్రదాయాలంటూ పాత చాదస్తాలకి పోకుండా, కేవలం మణిపురీ నైసర్గిక అందాల్నిఈ క్రీడా జగత్తుకి నేపథ్యంగా తీసుకున్నాడు దర్శకుడు హిస్నమ్ తోంబా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here