[dropcap]ఎ[/dropcap]ప్పుడయినా
ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా
అమ్మలో కొంత మిగిలే ఉంటుంది
బిడ్డల కోసమే
అమ్మ… కొంత దాచి ఉంచుతుంది
వంటింట్లో ఆఖరి మెతుకు దాకా
పోపుల డబ్బాలో చివరి చిల్లర నాణెం దాకా
ఏదో ఒకటి… ఎక్కడో ఒకచోట
బిడ్డల కోసమే
అమ్మ… కొంత దాచి ఉంచుతుంది
ఒక్కొక్కరికి జన్మ ఇస్తున్నప్పుడు
రక్త మాంసాలే కాదు
రాబోయే రేపు కోసం
అందమైన ఆశల్ని కూడా
అమ్మ దాచి ఉంచుకుంటుంది.
మనవడు… మనవరాళ్ళ కోసం కుడా
చిట్టి పొట్టి పాటలు… చిన్నారుల కథలు
తాను తరలిపోయాక కూడా
తన మాటలు తొలకరించిన శబ్దాలు
అమ్మ దాచి ఉంచుతుంది.
చివరి క్షణాల్లో ఆఖారి శ్వాసలో కూడా
అత్తవారింటి నుంచి ఆయాసపడుతూ
కన్నీళ్ళతో పరుగెత్తు కొచ్చే కూతురి కోసం
నీళ్ళలోకి కరిగిపోతున్న తీయని మమకారాన్ని
తప్పకుండా… కంటి పాప కదలికల్లో
అమ్మ దాచి ఉంచుతూనే ఉంటుంది.