వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-10

0
6

వేంపల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. నిజాయితీ

“అయ్యా, పిల్లలతో ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్నాయి, కష్టం కూడా ఎక్కువగానే వుంది, ఈనెల నుండి రెండువందలయినా పెంచండయ్యా” సురేంద్రను అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది చాకలి సుబ్బమ్మ.

“ఇప్పుడు నెలనెలా ఇస్తున్న నాలుగువందలే ఎక్కువ, ఒక్క నయాపైసా కూడా పెంచను, ఎక్కువ మాట్లాడితే నీపని చాలించు, వాషింగ్ మిషన్ తెచ్చుకుంటా”సుబ్బమ్మను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు సురేంద్ర.

“అంత పని చేయకండయ్యా, మొగుడు లేనిదాన్ని”దీనంగా అంది సుబ్బమ్మ ఉతకడానికి వేసిన బట్టల్ని మూటకట్టుకుని బయలుదేరుతూ.

“శ్యామలా, నా పర్సులో వుండాల్సిన రెండువేల రూపాయల నోటు కనిపించడం లేదు, నువ్వు గానీ తీశావా?”భార్యను అడిగాడు సురేంద్ర మరుసటిరోజు.

“లేదండీ, నేను కనీసం చూడనుకూడా లేదు” చెప్పింది శ్యామల.

“నువ్వు అలాగే అంటావు, నీకీమధ్య చేతివాటం ఎక్కువైపోయింది, నిజం అస్సలు ఒప్పుకోవు” చెంప ఛెళ్లుమనిపిస్తూ కోపంగా అన్నాడు సురేంద్ర.

రెండు రోజుల తర్వాత…

“అయ్యా, బట్టలు ఉతికేటప్పుడు మీ చొక్కాలోపలి జేబులో ఈ రెండువేల రూపాయల నోటు దొరికిందయ్యా” నోటు సురేంద్రకు అందిస్తూ చెప్పింది సుబ్బమ్మ.

చేస్తున్న కష్టానికి న్యాయమైన ప్రతిఫలం ఆశిస్తే ఇవ్వనని చెప్పిన సురేంద్ర మొహం వెలవెలబోయింది తన నోటు జాగ్రత్తగా తెచ్చి ఇస్తున్న సుబ్బమ్మ నిజాయితీ ముందు.

2. ఉపవాసం

“స్వీట్ బాక్స్ తెచ్చారు, ఏంటండీ, ఇవాళ స్పెషల్?”రాత్రి చాలా ఆలస్యంగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త ప్రసాద్‌ను అడిగింది పంకజం.

“ఎవరో ముసలాడు వృద్ధాప్య పింఛన్ రాలేదని వస్తే వాని నుండి గుంజిన సొమ్ముతో తెచ్చాగాని, నేను ఓ కోలిగ్ ఇచ్చిన డిన్నర్‌కి వెళ్ళొచ్చా, నాకు భోజనం వద్దు” భార్యకు బదులిచ్చాడు ప్రసాద్ నేరుగా బెడ్‌రూమ్ లోకి దారి తీస్తూ.

మరుసటి రోజు ఉదయం…

“అమ్మా చాలా ఆకలిగా ఉంది, రాత్రి మీరు తినగా మిగిలిపోయిన అన్నం ఉంటే కాస్త పెట్టండమ్మా”దీనంగా అడిగాడు డెభ్భైఏళ్ల పెద్దాయన పంకజం ఇంటి ముందు నిలబడి.

“ఏమీ లేదు వెళ్లవయ్యా, అయినా కష్టపడి పని చేసుకోక ఇలా అడుక్కు తినడం ఎందుకు?”అసహ్యంగా చీదరించుకుంటూ అంది పంకజం.

“నేను అడుక్కునే వాడిని కాదమ్మా, పింఛన్ రాకుంటే కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చా, అక్కడ నా పని చేయించడానికి ఓ సారు నా దగ్గర ఉన్న సొమ్ము మొత్తం గుంజుకున్నాడు, హోటల్లో తినేందుకు లేక, రాత్రి మా పల్లెకు తిరిగి వెళ్లేందుకు కూడా చార్జి సొమ్ము లేక ఇక్కడే ఉండి పోయా” చెప్పాడు వృద్ధుడు నిరాశగా వెళ్ళిపోతూ.

ఓ గంట తర్వాత…

“వదినా, రాత్రి మా వారు ఓ కొలిగ్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లి వచ్చి భోంచేయలేదు, నిన్న గురువారం నేను ఉపవాసం ఉండి వండిన అన్నం దండిగా మిగిలిపోయింది, చద్దన్నంతో వడియాలు ఎలా పెట్టాలో కాస్తంత చెబుతారా?” అడిగింది పంకజం పక్కింటి పార్వతమ్మను ఉపవాసం అన్న పదాన్ని గట్టిగా ఒత్తి పలుకుతూ.

3. నిజం

“మధ్యాహ్నభోజన పథకం క్రింద నీకు పెడుతున్న అన్నం ఇక్కడే తినక సత్తు క్యారియర్లో సర్దుకుంటున్నావెందుకు? అడిగింది తొమ్మిదో తరగతి విద్యార్థిని జ్యోతిని టీచర్ అనుపమ.

“కడుపునొప్పి వస్తోంది టీచర్, అందుకే నా భోజనాన్ని ఇంటికి తీసుకెళ్లాలని” భయపడుతూ మెల్లగా చెప్పింది జ్యోతి.

“కడుపు నొప్పి అంటున్నావు, అయినా క్లాసులో చలాకీగానే కనిపిస్తున్నావే, ఆసుపత్రికి వెళ్ళరాదా?” సలహా ఇస్తున్నట్లుగా అంది టీచర్.

“అదే తగ్గిపోతుందని వెళ్ళలేదు టీచర్”బదులిచ్చింది జ్యోతి.

“కనీసం ఇంటి వద్దనే వుండి విశ్రాంతి తీసుకోరాదా, స్కూల్‌కు ఎందుకు రావడం?”మళ్ళీ అడిగింది టీచర్.

“పాఠాలు మిస్ అవుతాయని వస్తున్నా టీచర్” చెప్పింది జ్యోతి.

“ఎప్పటి నుంచి నీకు ఈ సమస్య?” విచారిస్తున్నట్లుగా అడిగింది అనుపమ.

“రెండు రోజుల నుంచి, రోజూ మధ్యాహ్న వేళల్లోనే” సమాధానం చెప్పి తన క్యారియర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది జ్యోతి.

“జ్యోతి అబద్ధం చెబుతోంది టీచర్, జ్వరం కారణంగా వాళ్ళ అమ్మ రెండు రోజుల నుంచి కూలికి వెళ్లలేక ఇంటి వద్దనే ఉంది, వీళ్ళ చెల్లెలు ఏడవ తరగతి చదివే దీప కూడా రోజూ ఏదో ఒకటి చెప్పి తన భోజనాన్ని కూడా క్యారియర్లో సర్దుకుని తన అక్కతో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది తమ అమ్మతో కలిపి ఇప్పుడూ, రాత్రిపూట కూడా తినడానికి” తనకు తెలిసిన అసలు ‘నిజాన్ని’ చెప్పింది జ్యోతి క్లాస్ మేట్ ఉష.

4. లోపం

“మమ్మీ, ఆ రాజమండ్రి వాళ్ళ సంబంధం ఖాయం చేసేయమని నాన్నగారితో చెప్పెయ్”తల్లి రాజేశ్వరితో చెప్పింది మాలతి.

“నీకేమైనా తెలివుండే మాట్లాడుతున్నావా? నువ్వు ఆ అబ్బాయిని సరిగా గమనించావో, లేదో? ఓ కన్ను మెల్ల” కూతురుపై కోపగించుకుంటున్నట్లు చెప్పింది రాజేశ్వరి.

“ఆ సంగతి బాగా గమనించానులే గాని, అన్నీ ఆలోచించుకునే చెబుతున్నా, అతడినే చేసుకుంటాను” అని మాలతీ గొంతు స్థిరంగా పలికింది.

“తన మెల్లకన్ను కారణంగా కట్నం వద్దన్నాడని అతడినే చేసుకుంటానంటున్నావేమో, రేపు ఎప్పుడైనా మంచి సంబంధం చేయలేదని జీవితాంతం నన్ను మీ నాన్నను దెప్పిపొడవడానికా?”అడిగింది రాజేశ్వరి.

“అలాంటిదేమీ లేదు కానీ, మెల్లకన్ను లోపమా మమ్మీ?” ప్రశ్నించింది మాలతి.

“మెల్లకన్ను లోపం కాక మరేంటి?” అంది కూతురుతో రాజేశ్వరి.

“అయినా సరే చేసుకునేదాన్ని నేనుగా”అంది మాలతి.

“నిన్ను కన్ను లోపం గల వారికి ఇచ్చి కట్టబెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు”ఈ సంబంధం తల్లిగా తనకు ఇష్టంలేదన్నట్లు చెప్పింది కూతురితో రాజేశ్వరి.

“పెళ్లి చూపుల పేరుతో ఇప్పటి దాకా నన్ను చూసి వెళ్లి, లక్షల కట్నమూ, బంగారం డిమాండ్ చేసిన ఎందరో వెధవల ‘మానసిక లోపం’తో పోల్చితే ఇతడి మెల్లకన్ను లోపం పెద్దదేమీ కాదులే మమ్మీ” తన నిర్ణయంలో మార్పు లేదన్నట్లుగా చెప్పింది తల్లితో మాలతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here