[dropcap]”ఆ[/dropcap]హా! ఏమి వారి సంస్కారం, భాషాభిమానం మామయ్యగారూ! ఎంత చక్కగా స్వాగతించారు. ఎంత గొప్పగా సన్మానించారు? మీ పాండిత్యాన్ని, ప్రసంగాన్ని ఎంతలా కొనియాడారు. ఆ సంస్థ చైర్మెన్ రాజు గారు, ‘ఆయనకు గల భాషాభిమానానికి పాండిత్యానికి ఆయన వ్రాసిన కావ్యమే ఉదాహరణ తల్లీ! మేము చేసిన సన్మానం, ఇచ్చిన బహుమతి అత్యల్పం. కమ్మని కంఠంతో ఆయన పద్యాలు ఆలపిస్తుంటే అద్భుత లోకాలు కంపించాయి. గంధర్వగానాలు వినిపించాయి. ఇలాంటి గొప్ప కవులను భాషాభిమానులను పట్టించుకోకపోవడం మన తెలుగుజాతి దురదృష్టం’ అన్నారు. సభలో ఉన్న వారంతా ‘ఆయన మీ మామగారా? అదృష్టవంతురాలివి. మా చెవుల్లో తుప్పు వదిల్చి ప్రసంగంతో మా మనసుల్లో పెను మార్పు కల్గించారం’టుంటే చాలా గర్వంగా ఉంది. విన్నారుగా, మీ మనుమలు, ‘ఆయన మనుమలవ్వడం మా అదృష్టం’ అంటే నిజంగా అదృష్టవంతురాలిని అనిపించింది. ఇక మీరెళ్ళే వరకూ వారానికో చోట విందులు, సభలే” నవ్వింది కోడలు.
“మీ మామగారిని మరీ అంతా పొగిడేయకు. ముచ్చటగా మూడు భాషల్లోనైనా మాట్లాడలేరు” అంది తన భార్య.
“భాషలకేముందిలే అత్తయ్యా! రైల్వే పోర్టర్‌కి కూడా చాలా భాషలొస్తాయి. కానీ ఇలాంటి పాండిత్యం వస్తుందా? కనీసం మాతృభాషలోనైనా మంచిగా నాలుగు మాటలాడకపోతే ఎన్ని భాషల్లో ఏవో నాలుగు ముక్కలు మాటాడడం పొట్ట పోసుకోడానికి, పోచికోలు కబుర్లు చెప్పుకోడానికి తప్ప దేనికి?” అంది కోడలు.
భార్య ముఖం మాడిపోయింది.
“దానికేమీ లేమ్మా ఎవరి ప్రతిభవారిది. అయినా స్వదేశంలో ఉన్న మన వారికి సంస్కారాలు అంతరించుకు పోతుంటే, విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు భాషా సంస్కృతులకు బ్రహ్మరథం పడుతున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా!” అంటే “అవును నాన్నగారూ. నాకూ అదే అనిపిస్తోంది. మీకు వాళ్ళు పలికిన ఘనస్వాగతం, చేసిన ఘనసన్మానం – అమ్మతోపాటు కూర్చోపెట్టి మీకు హారతులు పట్టడం భాషామతల్లికి బ్రహ్మ రథం పట్టినట్లనిపించింది” అన్నాడు కొడుకు.
“అవును నాన్నా!” ఆనందంతో అన్నారు పార్వతీశంగారు, అలా కొడుకు డ్రైవ్ చేస్తుంటే ఆనందంతో ఆలోచన లోనికి జారుకున్నారు.
***
ఒక ప్రైవేటు పాఠశాలలో తెలుగు పండితునిగా పని చేసి విశ్రాంత ఉపాధ్యాయుడై అమెరికాలో నున్న కొడుకు దగ్గరకి వచ్చాడు తను. ఆంధ్రభాషా బోధకునిగా, ఆదరణకు నోచుకోని తెలుగు ఉపాధ్యాయునిగా అవమానాలు భరిస్తూ, అపహాస్యాలు ఎదుర్కొంటూ భాషను బ్రతికించమని, అమ్మభాషను ఆదరించమని అరవై ఏళ్ళు వచ్చే వరకూ వినయంగా విన్నవించుకున్నాడు. భాషను బ్రతికించమని బ్రతిమాలాడు. పద్యాలు పాఠాలు చెప్పాడు, నీతులు సూక్తులు చెప్పాడు. పిల్లల తల్లిదండ్రులను ప్రాధేయపడ్డాడు. పిల్లల్ని బుజ్జగించి బ్రతిమాలి చెప్పాడు. ఇంటా బయట తన కృషి ఫలించకపోగా చాదస్తుడు, జిడ్డుగాడు అని బిరుదులు పొందాడు.
‘తెలుగు పండితునిగా మీరు పొందుతున్నసుఖభోగాలు చాల్లెండి.. నా పిల్లలను నేను తప్పక పరాయి భాషల్లో ప్రావీణ్యులను జేసి, పైదేశాలు పంపించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాను’ మంగమ్మశపథం చేసింది భార్య మంగలక్ష్మి. అన్నంతా చేసింది. అమ్మాయిని డాక్టర్ చేసి ఆస్ట్రేలియా పంపింది, అబ్బాయిని ఇంజనీరుని చేసి అమెరికా పంపింది. అహర్నిశలూ శ్రమించి ఆoగ్లం అందంగా మాట్లాడడం నేర్చుకుంది. కానీ తెలుగు మాష్టారు భార్యనని చెప్పు కోడానికి తెగ సిగ్గుపడిపోయేది. అవమానిస్తారని ఆక్రోశించేది. తను కవిత్వం వ్రాస్తే ‘ఇంతోటి సౌభాగ్యానికీ ఇదొకటే తక్కువా? కూడు పెట్టేనా? గుడ్డ పెట్టేనా?’ అని దీర్ఘాలు తీసేది. కవి సమ్మేళనాల్లోనో, కార్యక్రమాల్లోనో ఏ షీల్డులో, మెడల్సో ఇస్తే ‘ఎందుకు సత్తు కానీకి పనికి రావ’ని సాధించేది.
సరదాగా నాలుగు పద్యాలు చెప్తే “చాల్లెండి బాబూ! చెవిలో జోరీగ లాగా! ఏ చెరువు గట్టుకో వెళ్ళి పాడుకోండి” అని సినిమాలు సీరియల్సు చూసేది. తన భార్య ఒక్కతే కాదు “మొగుడు ముండా అంటే మాదాకవళం వాడు వెధవా” అన్నాడని సామెత చెప్పినట్లు అందరికీ చులకనే. పాఠశాలలో మాత్రం ప్రిన్సిపాల్ మొదలు ప్యూను వరకూ మిగతా టీచర్లకు ఇచ్చే విలువ ప్రాధాన్యత తెలుగు పండితులకు ఇవ్వరు. ఇంట బయటా ఇన్ని అవమానాలు ఎదుర్కొని బ్రతకలేక బడిపంతులుగా పని చేసినా, పిల్లలు తన పాఠాలంటే ప్రాణం పెట్టడం; తన పట్ల ఎంతో ఆదరణ చూపెట్టడం వలన మిగతా అవమానాలన్నీ ఆవగింజల్లా కనిపిస్తాయి తనకు.
అబ్బాయి దగ్గరకు రిటైర్ అయ్యాక తను మొదటిసారి అమెరికా వచ్చాడు. తోచట్లేదంటే కోడలు చాలా భాషాభిమానం గల పిల్ల కావడం వలన ఒక లాప్‌టాప్ ఇచ్చి “మీకు నచ్చినవి వ్రాసుకోండి. మీకు కావలిసిన సమాచారం చూసుకోండి. పోటీలకు మీ రచనలు పంపండి. దూరమైన కొలదీ పెరుగును అనురాగం అని ఆత్రేయ గారన్నట్లు అక్కడున్న మనవాళ్ళకి భాషాభిమానాలు అంతరిచి పోతుంటే ఇక్కడకొచ్చి భాషాభివృద్ధికి చాలామంది పెద్దలు బహుముఖ కృషి చేస్తున్నారు మామయ్యగారూ. మీరు మీ రచనలు తప్పక పంపండి మామయ్యగారు. స్వదేశంలో లేని గుర్తింపు విదేశంలో విశ్వాశాన్ని పెంచుతుందేమే చూద్దాం” అని ఆ మెయిల్సు అవీ పెట్టి పంపింది కోడలు. కొడుకూ, భార్యా వెటకారాలాడారు. ‘ఇన్నాళ్ళు ఒకరే పిచ్చి వాళ్లనుకున్నాం. ఇంకొకళ్ళు తోడయ్యార’ని.
“మాతృభాషని, మాతృదేశాన్ని, మాతృభూమిని మన్నించడం మాకు పిచ్చయితే మమకారాలు, అనురాగాలు మరచి మరమనుషులైపోవడం మీ నైజం” విసురుగా అంది కోడలు.
భార్య అలుసుగా మాటడితే వినడం అలవాటయిన తను నోరెత్తలేదు.
అమెరికాలో అత్యంత ఉన్నతమైన సంస్థగా పేరొందిన తెలుగుసాహితీ సమాఖ్యవారు నిర్వహించిన పద్యరచన పోటీలలో ‘వేదన-నివేదన’ ఖండకావ్యానికి ప్రథమ బహుమతి ప్రకటించారు. దేశవిదేశాలలో ఉన్న బంధుమిత్రులు అందరూ ప్రశంసలతో ముంచెత్తడoతో పిల్లలను చూసి వెళ్దామని అమెరికా వచ్చిన పార్వతీశంగారు అవార్డు తీసుకుని వస్తూ ఉప్పొంగి పోతున్నారు. తనకు తన కవిత్వానికి ఇంత ఆదరణ లభిస్తుందని ఆయన కలలోనైనా ఊహించలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తన కోడలు విదేశాలలో ఉన్నా భాషని ఆదరించడం, మనుమలకి నేర్పించడం ఆనందం.
***
“నాన్నగారూ! ఇంటికి వచ్చేశాం. దిగండి” కొడుకు మాటకు కనులు తెరచి వాస్తవంలోకి వచ్చారు పార్వతీశంగారు.