నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 2

0
3

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-2

[dropcap](ఒ[/dropcap]కటవ దృశ్యంలోంచే రెండవ దృశ్యం కూడా రూపు దిద్దుకుంటుంది. రంగస్థలంపైకి రెండవ వైపు నుండి దుర్భిణితో (టెలిస్కోపు) సుబంధు భట్టు ప్రవేశం. వెనక-వెనకే ఖనా కూడా ఉత్సాహంగా వస్తోంది. వారిద్దరూ వచ్చే సరికి స్టేజిపైన నాలుగవ-ఐదవ శతాబ్దపు వాతావరణం కానవస్తుంది. స్టేజిపైన నీలిరంగు పరుచుకుని, రాత్రిని సూచిస్తూ….. సుబంధు భట్టు దుర్భిణిని ఒక వంక ఉంచి ఖనాని ఆకాశంలో గ్రహాలు-నక్షత్రాలను చూడమని సంజ్ఞ చేస్తాడు. ఖనా పరీక్షగా చూస్తోంది. హఠాత్తుగా ఒక ప్రదేశంలో దృష్టిని స్థిరంగా ఉంచి చూడటంతో ఆమె ముఖంలో ఉత్సాహం, ఆశ్చర్యం కలగలిసిన భావం కానవస్తుంది. సుబంధు భట్టు ఒక మోడా మీద కూర్చుని ఖనా ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని గమనిస్తూ ఉంటాడు. మేధ, ఆమె తల్లి ఒకవైపు కూర్చుని వీరిద్దరి వంక చూస్తుండగా…)

సుబంధు భట్టు :  (జిజ్ఞాసతో) ఖనా ఏం చూసేవమ్మా?

ఖనా: (తల తిప్పి) పశ్చిమాకాశంలో శుక్రుడు… అందంగా… అతిసుందరంగా! (అంటూ చెప్పి తిరిగి దుర్బిణితో చూడటంలో ములిగిపోయింది.)

సుబంధు భట్టు : (చిరునవ్వుతో) అందంగానా!

ఖనా : ధనుస్సులో శుక్రుడయి ఉంటాడు కదా బాబాయ్!

భట్టు : (గంభీరంగా) ఇంత త్వరగా నిర్ణయానికి వచ్చెయ్యకు! చూడు! బాగా గమనించు!

ఖనా : చూస్తున్నా బాబాయ్!

భట్టు :  నీకు అన్నీ త్వరగా – త్వరగా తెలుసుకోవాలన్న తొందరెక్కువ!…. ఇంకా ఇప్పుడేగా అడుగు పెట్టేవు ఉజ్జయినీలో… ఈ కళామందిరంలో… నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటావులే….

ఖనా : (సంతోషంగా) బంధు బాబాయ్! చూడండి… అరుంధతి… సప్తర్షుల వద్ద ఉన్న అరుంధతి…. (దుర్భిణి పక్కకు పెట్టి భట్టు వంక తిరిగి, ఒక క్షణం ఆలోచనలో పడినట్లు) ఇంతకీ నేను ఏం అన్నాను? ఏం చేసేనని మీకు అలా అనిపిస్తోంది?

భట్టు : ఏమిటి?

ఖనా : అదే! అన్నీ తొందర – తొందరగా నేర్చేసుకోవాలనుకుంటున్నానని…

భట్టు : ఎందుకు కాదు? ఆచార్య వరాహమిహిరుడుని కలవాలన్న నీ మంకు పట్టు…. (కాస్త ఆట పట్టించాలన్నట్లు) దినంలో పదిసార్లయినా కనీసం గుర్తు చేస్తూనే ఉంటావుగా!

ఖనా : (అలిగినట్లు) కాని మీరే అన్నారుగా బాబాయ్ ఆయన తరచుగా మిమ్మల్ని కలవడానికి వస్తూంటారని?

భట్టు : అవును తల్లీ…. వస్తూంటారు… ఆయన నన్ను కుమారుడిలా చూసుకుంటారు…. కాని, ఈ మధ్య మాళవ గణనాయకుడైన విక్రమాదిత్యుడు, తన ఆస్థానంలో ఉండే నవరత్నాలను వేర్వేరు పెద్ద-పెద్ద ప్రణాళికలలో పెట్టడం వలన వారంతా ఆ పనులలో తలమునకలుగా ఉన్నారని విన్నాను.

ఖనా : (దీనంగా) ఇంటికి రాకపోయినా, కనీసం పాఠశాలలో ఐనా కలవలేమా?

భట్టు : (నవ్వుతూ) పాఠశాలలో ఆయనకేం పని? ఎంత అమాయకురాలివి?….. ఆయన మాళవ గణనాయకుల వారి నవరత్నాలలో ఒకరు…. భౌతిక శాస్త్రంతో బాటు ప్రజా సంక్షేమ విభాగాలు ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి…. నా పూర్వ పుణ్యం వలన ఆయన నాపట్ల వాత్సల్యంతో, ఇక్కడకు వచ్చి నాకెంతో మహోపకారాన్ని చేస్తున్నారనుకో! (ఆలోచనామగ్నుడయి) ఎందుకో ఈ మధ్య చాలాకాలం అయింది, ఆయన రాక!

(అదే సమయంలో ఆచార్య వరాహమిహిరుడి ప్రవేశం)

వరాహమిహిరుడు : (పిలుస్తూ) సుబంధూ….. సుబంధూ….. లోపలున్నావా?

సుబంధు భట్టు : (ఆశ్చర్యంగా లేచి నిల్చుని) ఆచార్యా! రండి! స్వాగతం గురుదేవా!

(సుబంధు భట్టు చేతులు జోడించి అభివాదం చేస్తూ, స్వాగతిస్తాడు)

ఖనా : (ఒక్కసారిగా ఆయన వంక తిరిగి) ఆచార్య వరాహమిహిరులవారు! (ముందుకు వెళ్లి ఎంతో భక్తిగా ఆయన పాదాలను స్పర్శించి, ఆయన పాఠాలను పట్టుకునే ఉండిపోతుంది; వదలదు.)

వరాహమిహిరుడు : (ఆశ్చర్యంగా) ఎవరమ్మా?

భట్టు : స్వర్గస్థులయిన మా అన్నగారి కుమార్తె ‘ఖనా’ గురువర్యా!… ఉజ్జయినీ వచ్చి కొద్ది దినములయింది.

వరాహమిహిరుడు : లే అమ్మా! లే!

ఖనా : ఆశీర్వాదం లభించదా గురువర్యా?

వరాహమిహిరుడు : సుఖీభవ!

ఖనా :- (పాదాలను వదలకుండా) అంతేనా?

వరాహమిహిరుడు : (తల కిందకు దించి ఖనా వంక చూసి) శూన్యంగా ఉన్న నీ లలాటం, త్వరలోనే అనురాగపు సౌభాగ్యం చిహ్నంతో శోభించుగాక!

ఖనా : (తల పైకి ఎత్తి) అంతేనా ఆచార్యా ?

వరాహమిహిరుడు : (చిరునవ్వుతో) దీనితోని నీకు సంతోషం కలగలేదంటే సరే ఈ రోజు నిన్ను ఎవరైనా గొప్ప వంశస్థుల ఇంటి మహాలక్ష్మివి కావాలి అని ఆశీర్వదిస్తున్నాను తల్లీ! లే!

ఖనా : (పాదాలను వదలిలేచి, చేతులు జోడించి) నాకు ఆశ్రయం కావాలి… జ్ఞానాశ్రయం… మీ ఆశ్రయం…. జ్ఞానమార్గంలో పయనించగలిగే వరాన్ని ప్రసాదించండి ఆచార్యా… ఆ వరాన్ని ప్రసాదించండి…

వరాహమిహిరుడు : (ఆశ్చర్యంగా) జ్ఞానమార్గమా? దానికి మామూలు జీవితాన్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది… ఉహు! జ్ఞానం, సామాన్య జీవితం – రెండూ కలిసి వెళ్లలేవు.

ఖనా : తెలుసు గురుదేవా! నా సాహసాన్ని మన్నించండి… మనం సాధారణాన్ని సామాన్యం అనమూ? నిజమే అసాధారణమైన దాన్ని సాధించాలంటే, సామాన్య జీవితాన్ని త్యాగం చెయ్యాలి!

వరాహమిహిరుడు : (ఇప్పుడు ఖనా వంక పరిశీలనగా చూస్తూ క్షణకాలంపాటు ఆలోచిస్తారు. తిరిగి కనురెప్ప వాల్చకుండా చూస్తూ) ఓహో… అయితే జీవితంలో నువ్వు కోరుకునేది ఏంటమ్మా? ఏం కావాలనుకుంటున్నావు?

ఖనా : (ప్రసన్నంగా, ఏదో స్వప్న లోకంలో విహరిస్తూ) జీవితంలో కోరుకునేదా? నాకు కావలసినదా? (గొంతుకలో ఆనందం ప్రస్ఫుటిస్తూండగా) నేనా? నేను…. జీవితాన్ని అవనినుండి అంబరం వరకూ నాలో ఇముడ్చుకోవాలనుకుంటున్నాను. నా ఈ స్థూల చక్షువులను సూక్ష్మ చక్షువులుగా మార్చుకోవాలనుకుంటున్నాను. వాటితో స్థూల ఆకృతుల ఆవల కూడా చూడాలనుకుంటున్నాను. దేశ-కాలాలు అనే కారావాసం నుండి ముక్తి పొందిన దృష్టిని పొందాలనుకుంటున్నాను.

భట్టు : (కంగారుగా) ఖనా… కాస్త…..

ఖనా : (సుబందుభట్టు మాటలేవీ వినిపించుకోకుండా, ఏదో తనలోకంలో విహరిస్తూ) తూర్పు నుండి పడమర దాకా, ఉత్తరం నుండి దక్షిణం దాకా విస్తరించి, ఒకొక్కసారి ప్రకాశిస్తూ, ఒకొక్కసారి స్తబ్దుగా ఉండిపోతూ, ఒకొక్కసారి ఉదాసీనంగా మాయమయ్యే గ్రహాలు, నక్షత్రాలు, తారల అస్తిత్వాన్ని గ్రహించాలనుకుంటున్నాను. వాటితో సంభాషించాలనుకుంటున్నాను. ఓహ్! జీవితంలో ఏం కావాలనుకుంటున్నానా? (స్టేజి అంతా తిరుగుతూ) సూర్యుడి నుండి స్వయంప్రకాశాన్ని కావాలనుకుంటున్నాను! చంద్రుని నుండి మనః ప్రపంచాన్ని కావాలనుకుంటున్నాను. మనసు చేసే మాయలను అర్థం చేసుకోవాలని ఆశ! కుజుని నుండి ఉత్సాహం, శక్తి కావాలనుకుంటున్నాను. బుధుని నుండి ఆలోచనలను వ్యక్తం చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. బృహస్పతి నుండి వివేకాన్ని, శుక్రుని నుండి కళాత్మకంగా రచించగలిగే ఆనందాన్ని కోరుకుంటున్నాను. మరి శని నుండో?…. ఉచితానుచితాలను గుర్తించగలిగే సూక్ష్మదృష్టిని కావాలనుకుంటున్నాను. ఛాయాగ్రహాలంటూ తిరస్కరింపబడిన రాహు, కేతువుల అనుగ్రహం కావాలని కోరుకుంటాను.

(ఆచార్య వరాహమిహిరుడి వద్దకు వచ్చి)

నాకు జ్యోతిష్యమనే జ్యోతి లభించాలని ఆశీర్వదించండి గురువర్యా!…. సృష్టిని అర్థం చేసుకుని, గ్రహ-నక్షత్రాలను సాక్షాత్తూ చూడగలిగి… వాటి చలనాలను అర్థం చేసుకోవడమే నా పరమార్థం అయేటట్లు ఆశీర్వదించండి. భయం నుండి విముక్తిని పొందగలిగే జ్ఞానం నాకు కావాలి! (మేధ ఆనందంగా, ఆశ్చర్యంతో ఖనా వంక వెళ్తూండగా ఆమె తల్లి, చేతిని పట్టుకుని లాగి ఆపి, నిశ్శబ్దంగా చూస్తూ ఉండమని సూచిస్తుంది)

వరాహమిహిరుడు : అమ్మాయీ! నీ లలాట రేఖలను నేను చదివినంతలో…. నీ వచనాలు సామెతలలాగ, ప్రజలనోటి వెంట కవితలలాగ ప్రచారం పొందుతాయని అవగతమవుతోంది. ప్రజల నోళ్లలో నాని అమరమవుతాయి. ఈ భూమి పైన సూర్యుడున్నంత కాలం నీ మీద గురువు కృప అక్షయంగా ప్రసరిస్తుందమ్మా!

ఖనా : (చేతులు జోడించి) మీరు ఆకాశంలోని గురువు… బృహస్పతిని గురించి చెప్తున్నారు…. నేను మాత్రం ఈ భూమి పైనుండే గురువుగారి అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను. ఆచార్యా! మీ అనుగ్రహాన్ని…

వరాహమిహిరుడు : (కాస్త ప్రసన్నంగా, కాస్త మ్రాన్పడిన ధోరణిలో తనతో తానే అనుకుంటున్నట్లు) ఈనాడు వేరొకరి ముందు పరాజితుడిని కావడానికి ముహూర్తమా? (సుబంధు భట్టుతో) సుబంధుభట్టూ! ఈనాటి తారాబలం, ఈ అమ్మాయికి ఇచ్ఛాపూర్తిని తెచ్చుకొచ్చింది! (ప్రేక్షకుల వంక చూస్తూ ప్రకటనే చేస్తున్నట్లున్న కంఠస్వరంతో) మాళవ గణనాయకుడైన చంద్రగుప్త విక్రమాదిత్యుని నవరత్నమైన ఈ వరాహమిహిరుడు, ఖనా అనే ఈ బాలికకు జ్యోతిష్య శాస్త్రంలో దీక్షనిస్తాడని మాట ఇస్తున్నాను.

సుబంధు భట్టు : (తలవంచి, ఆర్ద్రంగా) ఆచార్యా! స్వప్నంలాగ చూసుకుంటున్న ఈ అమాయక బాలిక స్వప్నం నేడు ఇలా నిజమవుతుందని ఊహించలేదు ఎన్నడూ! మా కుటుంబంలో అందరి మీద మీ అనుగ్రహం పూర్తిగా ఉంది. జీవితాంతం ఋణపడి ఉంటాను గురువర్యా!

వరాహమిహిరుడు : (సుబంధు భట్టుతో కాస్తంత లో గొంతుకలో) భట్టూ! నక్షత్రాలు ముందే ఏర్పరచిన విధి ఇది! ఈనాడు ఇక్కడికి రావడానికి ఇదే ప్రయోజనమేమో! సరే, ఇక నేను వెళ్తాను. (వరాహమిహిరుడు త్వరత్వరగా అడుగులు వేస్తూ నిష్క్రమిస్తాడు. సుబంధు భట్టు ఖనా వంక అడుగులు వేసి, ఆప్యాయంగా ఆమె భుజంపైన చేతిని వేస్తాడు)

ఖనా : (ఆర్ద్రమైన గొంతుకతో) బాబాయ్… ఇదంతా నిజమేనా?

సుబంధు భట్టు :- (దూర్భిణి వంక చూపిస్తూ) ఊఁ! ఆకాశాన్ని అడుగు!

(ఇద్దరూ నవ్వుకుంటూ నిష్క్రమిస్తారు).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here