[dropcap]అ[/dropcap]దొక చిన్న ఊరు. మొత్తం యాభై కుటుంబాల వాళ్లు ఆ ఊళ్లో వుంటున్నారు. వారిలో పరమయ్య తాత కుటుంబం కూడా ఒకటి. పరమయ్య తాత చిన్నప్పటి నుండీ పొలంలో పని చేస్తూ కష్టపడుతున్నాడు. చదువు అస్సలు రాదు. ఆయన కొడుకు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు 5వ తరగతి వరకూ చదుకున్నాడు. ఆ తర్వాత చదువుకోవటానికి ఊర్లో స్కూలు లేదు. ఆ ఊరికి 10 మైళ్ల దూరంలో వేరే వూర్లో హైస్కూల్ వున్నది. అందుకని అప్పట్లో చాలా మంది పిల్లలు 5వ తరగతిలోనే చదువు ఆపేసే వాళ్లు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. వాళ్లిద్దర్నీ హాస్టల్లో వుంచి మరీ చదివిస్తున్నాడు.
మార్చి నెల. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఉగాది పండుగ వచ్చింది. వెంకటేశ్వర్ల పిల్లలు హాస్టలు నుంచి ఇంటికి వచ్చారు. పండుగ మరుసటి రోజు ఆదివారమొచ్చింది. రెండు రోజులు శెలవులు కలిసొస్తాయని పిల్లలూ, పెద్దలూ సంతోషించారు. వెంకటేశ్వర్లు కొడుకు తరుణ్ అతను తనతో పాటు చదువుకునే యోగి అనే పిల్లవాడిని కూడా ఇక్కడుకు తీసుకొచ్చాడు.
“వచ్చే నెలలో పెద్ద పరీక్షలు వస్తున్నాయి. జాగ్రత్తగా చదువుకోండి నాయినా. నీ స్నేహితుడికి కాలూ, చెయ్యీ ఒక చోట నిలబడటం లేదు. వచ్చిన దగ్గర్నుండి గోడలు పాకటం, చెట్లెక్కటం లాంటివి చేస్తున్నాడు. హాస్టల్లో కూడా ఇంతేనా నాయనా? నీ చెల్లల్ను చూడు. తన పనేమో తానుగా వుంటూ చక్కగా చదువుకుంటున్నది. తనకింకే జోలీ పట్టదు. నాయనా! తరుణ్! నా మాటలు గుర్తు పెట్టుకో” అన్నది అమ్మ.
“అలాగే అమ్మా! జాగ్రత్తగానే చదువుతాను. నువ్వేం భయపడకు. చెల్లితో పాటు నేనూ మంచి మార్కు తెచ్చుకుంటాను చూడు” అన్నాడు తల్లికి ధైర్యం చెబుతూ తరుణ్.
“కంది చేను దగ్గరకు యోగి కూడా వస్తానంటున్నాడు నాన్నా. మేమిద్దరం నీతో పాటు పొలమొస్తాం” అనడిగాడు తరుణ్.
“బయట ఎండ బాగా పెరిగింది. ఈ ఎండలో మిమ్మల్ని పొలం పంపానని తాత నా మీద కోపం చేస్తాడు. వీలయితే సాయంత్రం మిమ్మల్ని పొలం తీసుకెళ్తానులే” అంటూ వెంకటేశ్వర్లు తన పని మీద తాను బయటికి పోయాడు.
అమ్మకు వంట పనుల్లో తరుణ్ చెల్లెలు సాయంచేస్తున్నది. తరుణ్‌కూ, యోగికీ ఇంట్లో ఏం తోచటం లేదు. ఎలాగైనా ఇంట్లో నుంచి బయటపడాలి. కుదిరితే కంది చేను వైపుకే వెళ్లాలని బాగా ఉబలాటంగా వున్నది. అసలే యోగికి ఆటల పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక ఆట ఆడుతూనే వుంటాడు. తరుణ్ గంభీరంగా ప్రవహించే నదిలాగా కుదురుగా వుంటాడు. యోగి మాత్రం ఎత్తు నుంచి కిందికి దూకే సెలయేరులాగా గలగలలాడుతూ వుంటాడు. అమ్మకూ నాన్నకూ చెప్పకుండానే పిల్లుల్లాగా తరుణ్, యోగి ఇంట్లో నుంచి వచ్చారు. కంది చేను వేపుకే నడక సాగించారు.
‘కంది చెట్లు ఆకులన్నీ పండెత్తాయి. కాయిల్లోని గింజలు బాగా ముదురి ఎండ బెట్టు కోవటానికి తయారయ్యాయి. అలాగే పొలంలోకి వేరు శెనగ మొక్కలు కూడా ఆకులు పండి వడబడ సాగాయి. వాటినీ పీకించాలి. కంది చెట్టును కొట్టించాలి. పొగలు పెట్టించాలి. ఒక వారం, పది రోజులు పంటను పక్షులూ, అడవి పందులలాంటివి వచ్చి తినకుండా కాపలా కాసుకుంటే పంటను మార్పించి ఇంటికి చేర్చేసుకోవచ్చు. అసలే ఈ ఏడు పంట ఆలస్యంగా తయారయింది. ఏటా ఈ పాటికి పంట ఇంటికి వచ్చేది’ అని అలోచించుకుంటూ పరమయ్య తాత మంచె మీద సద్దుక్కూచున్నాడు. అసలే తమ ఊరి నానుకుని చిన్న చిన్న కొండలున్నాయి. ఆ కొండల నిండా చెట్లు. చిన్న చితకా జంతువులు కూడా అక్కడ వుంటూ వుంటాయి. జనాలు కొంచం ఏమరు పాటుగా వుంటే చాలు ఆ జంతువులు పొలాల్లోకి వచ్చేస్తాయి. పిందెలు పడిన దగ్గర నుండీ కాపలా కాయాల్సి వస్తున్నది. లేకపోతే ముఖ్యంగా అడవి పందులు లాంటివి వచ్చేసి వేరుశనగ మొక్కల్ని పీక్కుని కాయల్ని తినేసి పోతున్నాయి. ఇక్కడ పిట్టలూ ఎక్కువే. కందికాయల్ని కొట్టేసి పప్పుల్ని తినేసిపోతున్నాయి. దాంతో తను ఎక్కువ భాగం పొలాన్నే వుండి కాపలా కాసుకోవాల్సి వస్తున్నది. మధ్య మధ్యలో కాస్త నడుం వాల్చి పడుకోవచ్చని పొలంలో ఇలా ఎత్తుగా మంచె కట్టకుని దాంట్లో వుంటున్నాడు. పిట్టల అలికిడి వినపడినప్పుడల్లా డప్పు కొట్టి పెద్దగా శబ్దం చేస్తున్నాడు. వడిసల తిప్పుతూ చిన్న చిన్న రాళ్లను విసురుతూనూ వున్నాడు.
మద్యాహ్నం కొడుకు తెచ్చిన అన్నాన్ని తిన్నాడు పరమయ్య తాత. కాస్త నడుం వాలుద్దామని మంచె మీద అలా వాలి పడుకుని కళ్లు మూసుకున్నాడు. కొద్దిగా కునుకు పట్టింది. ఏదో చిన్న అలికిడి వినపడింది. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. నిద్రను పక్కకు నెట్టి లేచి కూర్చున్నాడు. పొలం నాలుగు మూలలా పరికించి చాశాడు. చిన్న చిరుత పులి కూన. పొలం గట్టు మీద నడుస్తూ వస్తున్నాది.
“అయ్యయ్యో ఇది కూడా తయారయిందా? ఇదొస్తే పంట పాడు చేయటమే కాదు మనుషులుక్కూడా అపకారం చేసి వెళుతుంది. చిన్న కూనే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. మనిషి వాసన పట్టిందంటే మంచె మీదకి కూడా దుమికి తనను గాయపరుస్తుంది. ఇప్పుడెలా?” అని ఆలోచించుకుంటూ అక్కడున్న నల్ల గొంగళి తీసుకుని నిండా కప్పుకున్నాడు. ఐదు నిముషాల తర్వాత ఏ శబ్దమూ వినపడ లేదు. నెమ్మదిగా గొంగళి తొలగించి చూశాడు. అదెక్కడా కనపడలేదు. వచ్చిన దారినే వెళ్లిపోయిందా? లేక కంది చెట్ల చూటున ఎక్కడన్నా నక్కిందా? అనుకుంటూ తేరిపార చూశాడు. ఏమీ కనపడలేదు. ఎందుకయినా మంచిదని మంచె మాత్రం దిగలేదు. కొంచం సేపు అలాగే తానూ ఏ చప్పుడూ చేయకుండా కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్లీ చేనంతా కలియ జూశాడు. అదుగో మళ్లీ చేను గట్టునే చిన్నగా నడుస్తూ వస్తున్నది. చేలోకి దిగటం కాని, మంచె వంకకు చూడటానికి కాని ప్రయత్నం చేయటం లేదు. వచ్చిన దారినే మరలా తిరిగి వెడుతున్నది. ఒక అరగంట అలాగే కూర్చుని ఈ సారి ధైర్యం చేసి కర్ర పట్టుకుని కిందికి దిగి వచ్చాడు.
పక్క చేలో శెనపంట వున్నది. అదీ కోతకు వచ్చింది. ఈ సారి ఆ చేను గట్టు మీద చిరుత కూన కనపడింది. వాళ్ల గట్టుచారుకీ నింపాదిగా నడుస్తున్నది. దాన్ని చూచి పక్క చేను వాళ్లు గట్టిగా అరిచారు. అరవటమే కాకుండా చేను కడ్డం పడి దారి చేసుకుంటూ బయటకు పరుగందుకున్నారు. చిరుతపులి నోట్లో నుంచి ఏదో శబ్దం వచ్చింది. కాని ఆ అరుపు దృఢంగా లేదు.
“ఇదేమిటి? చిరుత కూన వింతగా ప్రవర్తిస్తున్నది?” అన్న అనుమానం పరమయ్య తాతకు కలిగింది. ధైర్యంగా ముందుకు వచ్చి పరిశీలనగా చుట్టూ చూశాడు. పొలం మొదట్లో చెట్టుంది. ఆ చెట్టు చాటున ఎవరో నిలబడివున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లాడు. ఇద్దరు పిల్లల మాటలు మెల్లగా వినపడుతున్నాయి. ఒక ఆకారం తన మనుమడిది లాగా వుంది అనుకున్నాడు. ఏమీ ఎరగట్లుగా వెనక్కు వచ్చేశాడు. అదుగో మళ్లా చిరుత కూన ఇటే వస్తున్నది. తాత ఒక్క ఉదుటున వెళ్లి దాన్ని పట్టేశాడు. దాని నోట్లో నుండి కదలికలు వస్తున్నాయి. తాత చేతుల్లో నుండి కూడా వెనక్కు ముందుకు ఊగుసాగింది. దాన్ని తాత గట్టిగా పట్టకుని ఒక తాడు తీసుకుని దాని నడుము కట్టి ఆ తాడును మంచెకు వేలాడతీశాడు. వేలాడుతూ కూడా వెనక్కూ మందుకూ ఊగసాగింది.
చెట్టు చాటు నుండి యోగి, తరుణ్ పిల్లుల్లాగా నడుస్తూ తాత దగ్గరకొచ్చారు.
“ఏరా భడవల్లారా? నన్నే ఏమారుద్దామనుకున్నారా? నేను మీ తాతనురా! నాకు దగ్గులు నేర్పుతారా మీరు? ఏయ్ అబ్బాయ్ మా తరుణ్ తో పాటు వచ్చింది నువ్వేనా? నీ సంగతి నా కొడుకు చెప్పాడులే? ఈ చిరుత కూన బొమ్మ నీదేనా? ఇంత పెద్దదాన్ని పైగా క్రూర జంతువు బొమ్మని మోసుకొచ్చావా?
“అవును తాతయ్యా. ఇది యోగిదే. దాని పొట్టనిండా బ్యాటరీలు వేశాడు. ఈ చిరుత బొమ్మను రిమోట్ నుపయోగించి నడపవచ్చు. అరిపించవచ్చు. చెట్టు చాటున నిలబడ్డాం. గట్టు తిన్నగా బొమ్మను వుంచి రిమోట్ నొక్కి నడిపించాడు. అలాగే అరిపించాడు. పక్క చేలో వాళ్లు దీనిని చూచి నిజంగా చిరుత పిల్లే అనుకుని భయపడ్డారు. పొలం విడిచి పారిపెయారు. రెండో సారి నడిపించినప్పుడు నువ్వు కనిపెట్టేశావు. నిన్ను దడిపిద్దామనుకుంటే కుదరలేదు” అన్నాడు తరణ్ బిక్క మొఖం వేసి.
“ఒరేయ్ అబ్బాయిలూ బొమ్మను చేసిన వాడిదిరా పనితనమంటే. నిజంగా క్రూర జంతువైన చిరుత కూన లాగానే తయారు చేశారు. అయినా క్రూర జంతువుల బొమ్మలతో ఆట లేంటిరా. మీక్కూడా అవే బుద్దులు వస్తాయి. ఇవాళ బొమ్మతో ఆడారు. మళ్లీ ఎప్పుడైనా నిజంగా చిరుత కూన వచ్చినా పరమయ్య మనవడు ఎక్కడో దాక్కుని బొమ్మను నడిపిస్తున్నాడులే అనుకుని నాతో సహా మిగతా వాళ్లు కూడా అశ్రద్ధగా వుండొచ్చు. దాంతో మా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. వెనకటికి మీలాంటి వాడే ఒక పిల్ల వాడుండేవాడు. వాడు గొఱ్ఱెల్ని మేపేవాడు. పులి పులి అని రెండు సార్లు అబద్ధమాడాడు. పెద్ద వాళ్లు వచ్చి చూస్తే పులి లేదు. మూడో సారి నిజంగా పులి వచ్చింది. మళ్లీ పులి పులి అని అరిచాడు. వీడెప్పుడూ అబద్ధాలే చెప్తాడని గొఱ్ఱెల్ని కాపాడటనికి ఎవరూ వెళ్లలేదు. వీడా చిన్న వాడు. పులి రానూ వచ్చింది. గొఱ్ఱె పిల్లల్ని నోట కరుచుకునిపోయింది. పిల్లవాడు లబోదిబో మన్నాడు. మీ పని కూడా అలాగే అవుతుంది. ఇంకెప్పుడూ ఇలాంటి ఆటలు ఆడకండి. ఇప్పటికైనా ఇంటికెళ్లండి” అని వాళ్లనక్కడ నుంచి పంపేశాడు. వేలాడే చిరుత కూన బొమ్మను తీసి ఇచ్చేశాడు.
“యోగీ! ఇంక ఈ ఆట వద్దు. మరేదైనా ఆడుకుందాం పద” అన్నాడు తరుణ్.