[dropcap]“పొ[/dropcap]ద్దప్పడు, సెంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, గాలి, నీరు నేల
నిప్పు, కొండలు బండలు, మేఘం, మంచు, పువ్వులు, పండ్లు,
జలజీవాలు, జంతువులు, గువ్వలు, పంటలు వంటలు, ఎండా
వానా ఋతురాగాలు, రసమయ గీతాలు… ఎన్నెన్ని… ఎంతెంత…
ఈ సృష్టి రహస్యం ఏమి? దీని పొడవెంత, వెడల్పు ఎంత?
బరువెంత” కట్టపైన కూకొని కాకన్న కాను చేనూ
యినబడే మాద్రిగా గట్టిగా అనె.
“రేయ్! కాక ఇంత మాత్రానికే అదేల అట్ల అరస్తావు.
ఇదే దీని లెక్క పక్కా లెక్క ఇదే. ఇదో చూసుకో ఈ బుక్కులా
చెప్పిందే వేదం…. ఇక్కడు సూడి ఇది శానా పాత గ్రంతం….
ఇది తీసుకో ఇదే పవిత్ర గ్రంతం”. అని అక్కడినింకా ఇక్కడినింకా
ఎక్కడెక్కడినింకానో వచ్చి బుక్కులు కాకన్న చేతిలో పెట్టిరి.
వాళ్ల మాటలు యింటానే ఆ బుక్కులు చూస్తానే కాకన్నకి
రేగిపొయ. “మీ పుంగ మాటలతో విశ్వాన్ని లెక్కిస్తారా? పాత పద్ధతులు
సన్న బుద్ధులు (సంకుచిత మనస్తత్వం)లతో సృష్టి రహస్యం యిప్పతారా
మనిషిని మనిషిగా చూడని మీరా నాకి నా మూలం గురించి చెప్పేది”
అని కిరస్తా ఆ బుక్కులని చించి పారేశా
చిరిగిన ఆ బుక్కులు యిరిగి పోతే, గాలికి ఎగిరిపోతే
పక్కపక్కకి జరిగి జరాసంధుడై తిరగా వచ్చె.
తిరగా = మళ్లి