[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
శబ్దయోని స్తథాకాశం జగద్ధారయతే ప్రభో।
వీర్యేణ తే మహాభాగత్వం చ ప్రోక్తస్తధా పరః॥
[dropcap]ప్ర[/dropcap]భూ నీ శక్తి వల్ల ఆకాశం నుండి శబ్దం ఉత్పన్నమౌతోంది. ప్రభూ సర్వం నీవే. ప్రభూ! నీవే చైతన్యం. నీవే మేధ. నీవే విజ్ఞానం, నీవే ఈ సృష్టి ఆత్మవు. అనిర్వచనీయమైన పురుషుడవూ నీవే. సర్వభూతాలు, తన్మాత్రలూ నీవే. జ్ఞాతవు నువే, జ్ఞేయం నీవే. క్షేత్రం నీవే, క్షేత్రజ్ఞం నీవే. పరమదైవం నీవే. తపస్సూ నీవే, తపస్సు ఫలితం నీవే. ధ్యానం నీవే, ధ్యాన ఫలం నీవే. యజ్ఞం నీవే, యజ్ఞ ఫలం నీవే. దేవా! నువ్వు తప్ప ఈ విశ్వంలో ఏముంది? అలాంటి నువ్వు మరొకరికి నమస్కారం చేయటం నా మనస్సులో శంకను కలిగిస్తోంది.
శక్రుడి ప్రార్థనను అనుమానాన్ని విన్న బ్రహ్మ ఇచ్చిన సమాధానాన్ని బృహదశ్వుడు రాజుకు వివరించాడు.
“ఇది నా ద్వితీయ రూపం. సర్వేశ్వరుడు అతి పవిత్రము అయి అత్యంత తపస్సు చేసిన రూపము. ఆ రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఆ రూపాన్ని దేవతలంతా స్తుతిస్తారు. సర్వేశ్వరుడిని సంతుష్టిడిని చేయాలి.”
బ్రహ్మ అలా అనగానే ఇంద్రుడితో సహా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్తుతించారు. శక్రుడు కూడా సర్వేశ్వరుడిని ప్రార్థించాడు.
“నీ దివ్యశక్తులతో ముల్లోకాలను ఆవరించి ఉన్న నీకు నమస్కారములు. యజ్ఞం చేసే వారూ, హవిస్సులు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, వాయువు, సర్వం ముల్లోకాలను ఆవరించిన ఉన్న నీ శరీరంలో భాగాలే. రాజసికమైన బ్రహ్మ రూపం ధరించి సృష్టిని సృజిస్తావు. నువ్వు సృష్టిస్తావు తప్ప నిన్నెవరూ సృష్టించలేరు. మహేశ్వరా, సాక్షిలా నిలిచి ముల్లోకాలను పాలిస్తావు, రక్షిస్తావు. తామసిక రూపం ధరించి విశ్వాన్ని విధ్వంసం చేస్తావు. నంది రూపంలో ధర్మం నీకు సేవ చేస్తుంది. నువ్వు అర్ధనారీశ్వరుడివయినా బ్రహ్మచారివే. నీ జటాజూటాలలో చంద్రుడు ఒదిగి ఉన్నాడు. గాలికి అల్లల్లాడే జటలు గంగానదీ తరంగాలు. నీకు వందనం మహేశ్వరా.
వందనాలు, త్రిపురాసుర సంహారా. వందనాలు అంధక సంహారా. అంశ అనే రాక్షసుడిని త్రిశూలంతో సంహరించావు. ఓ పార్వతీప్రియా, నీకు కంకాళాల హారం పూల హారం లాంటిది. శక్తివంతమైన మారణాయుధాలు ధరించిన నీవు సర్వదుష్టశక్తుల సంహారుడవు.
ఓ ఊర్థ్వ లింగ, శీఘ్ర, క్రధ, క్రధన, శుభప్రదం, అద్భుతం. విభూతి ధరించినవాడా, పరమహంసా! సర్పాన్ని జంధ్యంలా ధరించినవాడా, నన్ను క్షమించు. నా పాపాలను విస్మరించు. దేవదేవా, విశ్వవిధాతా, నీ దివ్యశక్తిని గ్రహించలేకపోయిన అల్పుడను. అందుకే ప్రథమునిగా నిన్ను పూజించలేదు. నా పాపాన్ని క్షమించు. ఇదిగో మహేశ్వరా, నీకు సాష్టాంగ నమస్కారం అర్పిస్తున్నాను!”
ఇంద్రుడు, బ్రహ్మ, మునులు, దేవతలు, అందరి ప్రశంసలు అందుకుంటున్న శివుడు ప్రీతిపాత్రుడై హంసరూపం వదిలి తన నిజరూపం ధరించాడు. పార్వతి, నంది అతని వెంట వచ్చి నిలిచారు.
బ్రహ్మ యజ్ఞం పూర్తయిన తర్వాత శివుడు కాలోదక సరస్సుకు ఇతర దేవతలు వెంటరాగా వెళ్ళాడు.
అక్కడ ఆయన ఆకలితో బలహీనమై, చలికి వణుకుతూ, మృత్యు సమీపంలో ఉన్నా తన ధ్యానం వదలని నందిని చూశాడు.
నందిని చూసి ఆప్యాయంగా అన్నాడు శివుడు: “లే నీకు నచ్చిన వరం కోరుకో.”
పార్వతితో సహా తన ఎదురుగా నిలిచిన శివుడిని, ఇతర దేవీదేవతలను చూసిన నందికి మృత్యుభయం పోయింది.
రాయిని వదిలి నీటి నడుమ నిలబడి దేవతలందరినీ ప్రార్థించాడు.
నంది పూజలు అందుకున్న శివుడు ఆనందంగ మందహాసం చేస్తూ అడిగాడు:
“నీ భక్తికి మెచ్చాను. నీ తపస్సుకు ఆనందపరవశుడనయ్యాను. నీ కోరిక అర్థమైంది. నువ్వు ఇకపై నీ శరీరంతో నాకు అత్యంత సమీపంగా ఉంటావు. నువ్వు మరణ భయం నుంచి విముక్తి పొందారు. నీ గత జన్మలో నువ్వు నా ద్వారపాలకుడవు. శిలాదుడు తపస్సు ద్వారా నిన్ను తన తనయుడిగా వరం పొందాడు. నిన్ను పర్వతంగా పొందడం వల్ల శిలాదుడు నా గణాధికారి అయ్యాడు. నీ తపస్సు వల్ల నువ్వు తూర్పు వైపున నాకు ఒక యోజన దూరంలో ఉంటావు. నేను పంచభూతేశ్వరుడిగా నిరంతరం నీ సమక్షంలో ఉంటాను. ఈ పవిత్ర స్థలంలో వశిష్ఠుడు మనిద్దరి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాడు. మనిద్దరం నిరంతరం ఇక్కడే ఉంటాం. అతి పవిత్రమైన జ్యేతేష లింగం ఇక్కడే ఉద్భవించింది. వేలు, కోట్ల సంఖ్యలో ఋషులు ఆ లింగానికి అభిషేకం చేశారు, ఉత్తర మానసం నుంచి తెచ్చిన నీటితో. వారి తపో ఫలితంగా, నీ పుణ్యం వల్ల నువ్వు సోదర నాగుడి నివాసమైన ఉత్తర మానసం చేరతావు. అక్కడ నిరంతరం హిరణ్యని నది ప్రవహిస్తుంది. ఆ పవిత్ర జలాన్ని కనకవాహిని అంటాడు. అక్కడ సంతోషంగా నివసించు.”
(ఇంకా ఉంది)