[dropcap]‘‘వే[/dropcap]పపువ్వు అని రాయాల్రా చిట్టీ!’’ అన్నాడు వెంకటేశ్వర్లు.
‘‘ఊరుకో మావయ్యా! మాట్లాడేటప్పుడు వేప్పువ్వు అంటూ, రాసేటప్పుడు వేపపువ్వు అని రాయమంటావేంటి? అయినా దేవుడు అని అంటూ దేముడు అని రాయమంటావా ఏంటి? అలా అయితే నువ్వు మావయ్యవి కాదు. మామయ్యవి’’ అంటూ చిట్టి వాదనకి దిగాడు.
‘ఎలాగోలా ఏడు’ అనేసాడు వెంకటేశ్వర్లు. రాతకీ మాటకీ వస్తున్న తేడాని తేల్చలేక సర్ది చెప్పుకున్నాడు.
ఇంతలో శ్రీవత్స గారొచ్చారు. “రండి. రండి. పండగ రోజుల్లో రాక రాక మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషం!” అంటూ ఆయనని ఆహ్వానించాడు వెంకటేశ్వర్లు.
“ఏం లేదు, ఈ దారినే పోతూ మీరివాళ ఇంట్లోనే ఉంటారు కదా, పలకరిద్దామనిపించి వచ్చాను” అన్నారు శ్రీవత్సగారు.
కాస్సేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పుకున్నాక ‘ఇక వెళ్ళొస్తాను’ అని లేచిన శ్రీవత్సతో ‘‘ఒంటరిగాళ్ళు పండగపూటా మీ ఇంట్లో ఏం చేయి కాల్చుకుంటారు గాని, ఇవాళ్టికి మా ఇంట్లో చేయి కడగండి’’ అని చేయి పట్టుకుని ఆపేసాడు వెంకటేశ్వర్లు.
ఆయన ‘సరే ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దాం. అంతకంటేనా’ అని కూర్చుండిపోయారు.
చిట్టికి అర్థం కాలేదు. వాళ్ళింట్లో చేయి కాల్చుకోవడమేంటో, మన ఇంట్లో చేయి కడుక్కోవడమేంటో. ఆయన వెళ్ళాకా అడుగుదామనుకుని ఊరుకున్నాడు.
‘ఆవకాయకి మావిడికాయలు అప్పుడే తెచ్చేసినట్టున్నారే’ అన్నారు శ్రీవత్స.
‘‘అబ్బే! ఉగాది రోజు కదా ఏదో పులుపుకని తెచ్చారు, ఇంకా ఆవకాయ కాయ దిగలేదు కదా!’’ అన్నాడు వెంకటేశ్వర్లు.
‘‘ఏవైనా మావిడికాయతో ఆవకాయ కాక మరో ఆరు రకాల పచ్చళ్ళు పెడుతుంది మా అమ్మ.”
‘పచ్చళ్ళంటే పికిల్సా?’ అనడిగాడు చిట్టి.
‘‘ఆవకాయ, మాగాయ, కోరుపచ్చడి, పులిహోరావకాయ, తొక్కుపచ్చడి, బెల్లవావకాయ ఇలా రకరకాలు పెడుతుంది మా అమ్మ. అవి పీకలదాకా తింటే పికిల్సవుతాయిలే’’ అని వెక్కిరించాడు వెంకటేశ్వర్లు ఇందాకటి వేప్పువ్వు కసి తీరక.
‘భోజనానికి లేవండం’ది చిట్టి వాళ్ళమ్మ.
‘మేం ఎప్పుడో ఉదయమే నిద్ర లేచాం’ అన్నాడు చిట్టి.
‘నన్నే వెక్కిరిస్తావురా!’ అని ఓ మొట్టికాయ వేసిందావిడ చిట్టి నెత్తిమీద. తప్పించుకోవడానికి పరిగెడుతున్న చిట్టిని జబ్బట్టుకుని అక్కయ్యకి అప్పచెపుతూ ‘ఆకలి దంచేస్తోంది. ఆరుగంటలు ఆస్యంగా వచ్చి తగలడింది రైలుబండి’ అంటూ తనూ భోజనానికి తయారయాడు మోడ్రన్ తెలుగు బావ. అతను తెలుగు పంతులుగా పనిచేస్తున్నాడు. వేప్పువ్వు అని రాయచ్చని అతనే చిట్టికి లోగడ చెప్పాడు. అదిగో అలాటివి చెపుతాడనే మోడ్రన్ తెలుగు పంతులంటాడతన్ని వెంకటేశ్వర్లు. చిట్టి మోడ్రన్ తెలుగు బావంటాడు.
‘అయినా ఓ చెంబుడు నీళ్ళోసుకుని రా, నువ్వూ వీళ్ళతో ఎంగిలి పడుదువు గాని. ప్రయాణం చేసొచ్చి మైలగుడ్డతో భోంచేస్తావేంటి? ’ అంది వాళ్ళక్కయ్య.
‘ఎంగిళ్ళు తింటాడా మోడ్రన్ తెలుగు బావ! అబ్బే!’ అనుకున్నాడు చిట్టి.
‘ఆ వంకాయ మెంతికూరతో ఈ కందిపచ్చడి తగిలించండి. మహ భేషుగ్గా ఉంటుంది’ అని శ్రీవత్సగారికి సలహా ఇచ్చాడు వెంకటేశ్వర్లు. ఆ చేయి కాల్చుకోవడమేవిటో, చేయి కడగడమేవిటో, ఈ తగిలించడమేవిటో అర్థం అవక చిట్టికి సరిగా ముద్ద మింగుడు పడలేదు.
‘ఆకలి దంచేస్తోందన్నావ్, అలా కంచంలో కెలుకుతున్నావేంట్రా’ అంది చిట్టి వాళ్ళమ్మ మోడ్రన్ తెలుగు బావని.
‘అదే ఆలోచిస్తున్నా. ఆకలి దంచేస్తోందనడానికి ఇంగ్లీషులో ఏవనాలా అని’ అన్నాడతను.
అవకాశం దొరికింది కదాని వెంకటేశ్వర్లు ‘మనకి తెలిసిన నాలుగు ఇంగ్లీషు ముక్కలూ మన బాధనీ ఆనందాన్నీ బాగా చెప్పలేవు. ఏదో తెలుగులో ఏడవమంటే వంకు పెడతారు. అయినా ఇంగ్లీషులో నైనా తెలుగులో నైనా ఇడియం ఉండాలి భాషకి’ అంటూ తన అక్కసు కక్కేసాడు, అతనికి ఇంగ్లీషు బాగానే వచ్చు.
శ్రీవత్సగారు కలగచేసుకుని ‘దంచేస్తోందనడానికి ఫామిషింగ్ అనచ్చేమో! కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనడానికి రేట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ది స్టమక్ అనలేం కదా! ఇంగ్లీషులో ఇంకో విధంగా ఉండచ్చు’ అన్నారు.
‘మరి చేయి కాల్చుకోడానికి, చేయి కడగడానికీ’ అన్నాడు చిట్టి.
‘మీ నాన్నగారు మా ఇంట్లో నన్ను చేయి కాల్చుకోవద్దు అన్నారంటే వండుకోవద్దు అని. ఇక్కడ చేయి కడగండి అన్నారంటే మీ ఇంట్లో భోజనం చెయ్యమని. అయినా తెలుగులో ఉన్నన్ని నుడికారాలు, సామెతలూ ప్రపంచ భాషలో ఎక్కడా లేవనిపిస్తుంది. ఏ భాషా నుడికారమైనా నేర్చుకోడానికి ముందు మన మాతృభాషని బాగా నేర్చుకోవాలి’ అని వివరించారు.
అన్నం తినగానే నిద్దరోయిన చిట్టికి తన మంచం పక్కన కూచుని పకపకా, గలగలా, కిలకిలా నవ్వుకుంటున్న అక్కయ్యా, పక్కింటి సీతా, వదినా కనిపించారు. ఈ వదిన అన్నయ్య పెళ్ళాం వదినా, మేనత్త కూతురు వదినా అని చిట్టిగాడికి సందేహం. ‘నువ్వు సిస్టర్ అంటే అక్కా?, చెల్లా? అలాగే తెలుగులోనూ మనిషిని బట్టి పిలుపు మారచ్చు’ అని సమర్థించాడు మోడ్రన్ తెలుగు బావ ఒకసారి. అయినా ఒకమాటకి ఒకే అర్థం ఉండకపోవచ్చు. అలాగే ఒకే అర్థానికి వేరు వేరు మాటుండచ్చు వెలుగు, వెలుతురు లాగ అనీ చెప్పాడు. చుక్క అన్న మాటకి ఆరు అర్థాలు చెప్పాడు. ఇంగ్లీషులోనూ ఉంటాయిట.
‘మొగిలీ పువ్వంటీ మొగుడీనివ్వవే అని పాడుకున్నందుకు నిజంగా మొగిలి పువ్వులాంటి మొరటోడు దొరికాడు నాకు’ అంటోంది మావయ్య కూతురు వదిన.
‘మొగిలిపువ్వులా మొరటుగా ఉన్నా మనసు మెత్తనేనే అన్నయ్యదీ లోపలి పుప్పొడిలాగా ’ అంది అక్కయ్య.
‘అవునవును. అందుకే అందరికీ మొగిలిపూల జడేస్తారు పెళ్ళికూతుళ్లకి. మొగిలిపువ్వుని మొరటుగా పట్టుకోకూడదని మొగుళ్ళకి చెప్పాని కూడా ఏమో!’ పక్కింటి సీత.
‘నా నిద్ర పాడు చేసేసార’న్నాడు చిట్టి.
‘పగటినిద్ర పనికి చేటం’ది పక్కింటి సీత.
‘ఆదివారం కూడానా?’ అంటూ పారిపోయాడు చిట్టి.
కబుర్లాడుకుంటూ పడకగదినుంచి బయటకి వచ్చిన ముగ్గుర్నీ చూసి మురిసిపోతూ ‘అలా పొందికగా చీరలు కట్టుకుంటే కుందనబ్బొమ్మల్లా ఉన్నారం’ది చిట్టి వాళ్ళమ్మ.
‘పొందూరు, ఉప్పాడ చీరలు మరీ!’ అంది అక్కయ్య.
‘‘కుందనవో చందనవో కానీ ఆ జీను పాంట్లూ, టీ షర్టు కంటే హాయిగా” అంది మామయ్య కూతురు వదిన.
‘‘కానీ స్కూటర్ నడపడానికీ, పరిగెత్తి బస్సులెక్కడానికీ అప్పుడవీ ఇప్పుడివీ” అంది పక్కింటి సీత.
‘‘ఏవైనా ఒళ్ళంతా బయటెట్టే బిగుతు బట్టలేసుకుంటే మీకూ ఇబ్బందే మాకూ ఇబ్బందే. అందుకే తెరచాటు, అరచాటు అందంగా ఉంటుందంటారు’’ అన్నాడు మోడ్రన్ తెలుగు బావ.
ఇంతలో ‘హాపీ ఉగాడీ ఇన్ అడ్మాన్స్!’ అంటూ ఇంట్లోకి హడావుడిగా వచ్చాడు నడమంత్రం నాగేశ్వర్రావు.
‘‘ఒరే గాడిపొయ్యా! ఆ రెంటికి చెడిన రేవడి భాషేవిట్రా? ఉగాది అనలేవూ?’’ అంటూ మోడ్రన్ తెలుగు బావ, వెంకటేశ్వర్లు అతనిమీద కలబడిపోయారు.
అతను ఖంగుతిని ‘అందుకే మీ చాదస్తపోళ్ళని పలకరించాంటే భయం!’ అని మొహం ముడుచుకున్నాడు.
శ్రీవత్సగారు కలగచేసుకుని ‘‘ఉగాది అంటే తెలుగు ఏడాదికి మొదటి రోజని కదా! ఏ యే వేళ పూచే పూవు, ఏ యే వేళ కాచే కాయలు ఆ యా వేళ ఉపయోగించే క్షణాలతో ఉగాది పచ్చడి జీవితంలోని పులుపు, కారం, తీపి, చేదు, ఉప్పు, వగరు అనుభవించాలని చెపుతుందని కదా! ఏ జాతి పండగని ఆ జాతి వాడుకునే భాషలో పిలవడమే సబబు’’ అని సర్ది చెప్పారు.
‘అయితే మీరందరూ పంచెలు కట్టేస్తారన్నమాట!’ అన్నాడు నాగేశ్వర్రావు.
‘వేషం, భాషా, రోషం, ఆచారం గుర్తు చేసుకోడానికే కదా మన పండగలు మన పద్ధతిలో చేసుకుంటాం. అలా చేస్తేనే ఇతరులు కూడా మనని గౌరవిస్తారు. అన్నిటికీ ఇతరులని అనుకరిస్తే చులకన అయిపోతాం’ అన్నాడు వేంకటేశ్వర్లు.
‘‘ఓయ్ మీ వాదనలా ఉండనివ్వండి కానీ కొత్త బెల్లంతో పాటు వేపపువ్వో, వేప్పువ్వో, చెరుకుగడో, చెరుగ్గడో, మావిుడికాయలో, మావిడికాయలో ఇంట్లో తెచ్చిపడేస్తే బూరో, గారో, బొబ్బట్లూ, పులిహోరా, ఉగాది పచ్చడీ కలిపి కొట్టేద్దురు గాని బజారుకెళ్లి రండి. మీర్రండే తిరిగి తిరిగొచ్చి తిండి మీద వీళ్ళు పడేటప్పటికి సిద్ధం చేద్దాం’’ అంది చిట్టి వాళ్ళమ్మ.
‘‘ఏమో పానీ పూరీ నీ పని సరి అనీ, పావుబాజీ రేవుబాజా అనీ, లాక్కో పీక్కో నూడిల్స్ తీగల్స్ అనీ బజారు సరుకు తెచ్చి పడేస్తారేమో’’ అంది పక్కింటి సీత.
‘‘పంచాగం తెచ్చుకోడం మర్చిపోకండి. అందులో చెప్పినట్టే జరగాలని లేకపోయినా మంచి చెడు హెచ్చరికలు తెలుసుకోడం జరుగుతుంది కదా!’’ అన్నారు శ్రీవత్స.
‘‘అయితే పంచ కట్టుకుని రండి మరి!” అని చిట్టి, నడమంత్రం నాగేశ్వర్రావు ముందుగా వీథిలోకి పారిపోయారు.
‘‘వీళ్ళిద్దరికీ మనందరికంటే ముందే ఉగాది తెలివొచ్చింది’’ అన్నాడు వెంకటేశ్వర్లు.
‘‘ఉగాదంటే తెలిసొచ్చింది’’ అన్నాడు మోడ్రన్ తెలుగు బావ.
‘‘కాదు కాదు తెలుగొచ్చింది’’ అంటూ తుర్రున మళ్ళీ ఇంట్లోకెళ్ళి అదే జోరుతో వీథిలోకి పరిగెట్టాడు చిట్టి.