[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, తెలుగు సాహిత్యాభిమానులందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాదికి సంచిక వెబ్ పత్రిక ఆరంభమయి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ రెండు సంవత్సరాలలో సంచిక పత్రిక తనదంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించటంలో సఫలమయింది. సంచిక పత్రిక తెలుగు సాహిత్య వేదిక అని పేరు తెచ్చుకుంది.
వాద వివాదాలకు దూరంగా వుంటూ, సెన్సేషనలిజాన్ని పరిహరిస్తూ, ఆవేశ కావేశాలకు తావివ్వకుండా, చీప్ ట్రిక్స్‌తో ఒకే వర్గానికో, భావజాలానికో మాత్రమే పరిమితమయిన పాఠకుల కోసమే కాకుండా, తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, అభిమానం వున్న ప్రతి పాఠకుడు సంచిక పాఠకుడయ్యే రీతిలో సంచికను తీర్చిదిద్దాలని సంచిక సంపాదక బృందం తపనపడుతోంది.
‘ఆనోభద్రాః క్రతవో యంతు విశ్వతః’ అన్న వేదోక్తి ఆధారంగా అన్నివైపులనుంచీ అందే ఉన్నతమైన భావాలకు స్వాగతం పలుకుతోంది సంచిక. తద్వారా ఈనాడు తొమ్మిదో తరగతి చదివే పిల్లవాడి నుంచి 84 ఏళ్ళ వృద్ధుల వరకూ అందరూ సంచిక పాఠకులే, సంచిక రచయితలే!!!
ఈ ఉగాదికి ప్రపంచంలో వాతావరణం కరోనా మయమయిపోయింది. ఎవ్వరూ దాని ప్రభావం నుంచి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ ఉగాదికి సంచిక సాహితీ ప్రచురణలు సంయుక్తంగా ప్రచురించే సంకలనం అనుకున్న తేదీకి తయారయినా ప్రచురణ వాయిదా వేసుకోవాల్సివచ్చింది. అలాగే సంచికలో ప్రచురితమయిన ‘నల్లటి మంచు’ నాటకం, ‘ఒక్క పుస్తకం’ నవల, ‘దివినుంచి భువికి దిగిన దేవతలు’ వ్యాస పరంపరలనూ పుస్తక రూపంలో ప్రచురించటం వాయిదా వేయాల్సి వచ్చింది.
త్వరలోనే ప్రపంచం నుంచీ విషపు వైరస్ మేఘాలు తొలగి ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి వెలుగుతో ప్రపంచం నిండుతుందని ఆశిద్దాం.
పాఠకులను అలరించాలని, ఆకర్షించాలని సంచిక చేసే ప్రయత్నాల్లో భాగంగానే త్వరలో సరికొత్త సీరియళ్ళు, ఫీచర్లూ ఆరంభమవుతాయి.
ఈ ఉగాది సందర్భంగా సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న రచనలు:
- తెలిసొచ్చింది… తెలివొచ్చింది – కథ – డా. కాండూరి సీతారామచంద్రమూర్తి
- ఉగాది పండుగ వచ్చిందీ… – కథ – చివుకుల శ్రీలక్ష్మి
- మరో తెలుగు సూరీడు – కథ – గాడేపల్లి పద్మజ
- ఈ ఏడాది ఉగాది… – కవిత – సింగిడి రామారావు
- ఉగాది… యుగాది…. – బాల గేయం – రజిత కొండసాని
మీ సలహాలు, సూచనలు, రచనలతో సంచికను మరింతగా ఆకర్షణీయంగా, నాణ్యంగా తీర్చిదిద్దటంలో తోడ్పడాలని ప్రార్ధన….
మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.
అందరూ జాగ్రత్తగా వుండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సంచికను చదవండి.. చదివిస్తూండండి.
సంపాదక బృందం