కావ్య పరిమళం-34

0
3

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

అబ్బయామాత్య అనిరుద్ధ చరిత్రం

ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అనిరుద్ధ చరిత్ర గూర్చి ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఇలా అభిప్రాయపడ్డారు: “కనుపర్తి అబ్బయామాత్యుడు అనిరుద్ధ చరిత్రమును వ్రాసెను. ఇది పిల్ల వసుచరిత్రలలో ఒకటి. విజయ విలాసమును కూడ అనుకరింప ప్రయత్నమిందు కానబడును. కాని దీనికి దాని ఏ లక్షణమును అబ్బలేదు” (పుట 437). ఎమెస్కో సంప్రదాయ సాహితిలో భాగంగా యామిజాల పద్మనాభస్వామి సరసోపాయనముతో అనిరుద్ధ చరిత్ర 2006లో ముద్రితమైంది.

అబ్బయ వంశ చరిత్రను మార్చి 1929లో వావిళ్ళవారు ప్రకటించిన కవిరాజు మనోరంజనం (పురూరవ చరిత్ర) పీఠికలో శేషాద్రి రమణ కవులు కొంత వ్రాసారు. అబ్బయ వంశీయులు గుంటూరు మండలానికి చెందిన కొండవీటి మండలాధిపతులకు మంత్రులు. వారి అనుగ్రహం వల్ల ‘కనుపర్తి’ గ్రామాన్ని సర్వాధికారాలతో పొంది నివసించేవారు. కనుక వారు సంపన్న గృహస్థులు.

మంగళగిరి పానకాల నరసింహస్వామిని ఉపాసించి శాస్త్ర వైదుష్యం సంపాదించి తన రెండు గ్రంథాలను స్వామికే అంకితమిచ్చాడు అబ్బయామాత్యుడు.

కృతులను నరాంకితం చేయని పోతన, ధూర్జటి కోవలోకి చేరాడు. ఈ కవి వినయశీల.

“కాళిదాసాదులకు నైన కలవు తప్పు
లనిరి పెద్దలు, మా దృశులనగ నెంత?
తప్పు కల్గిన దిద్దుడు మెప్పుగాను
బాలునకు బుద్ధి నేర్పిన భంగి కవులు”

అని వినయంగా చెప్పాడు. “చతుర కవిత్వ తత్వ పటుసంపద ఒకరి సొత్తు కాదు” అని మర్యాదగా పలికాడు.

పానకాల నృసింహస్వామి ఒకనాడు కవికి కలలో కన్పించి – “వత్సా! ‘అనిరుద్ధ చరిత్ర’ అనే ముచ్చట ప్రబంధంగా వ్రాసి మా పేర అంకితం చేస్తే శ్రేయోదాయకం” అని సెలవిచ్చాడు. నృసింహస్వామిని కవి అల్లుడుగా చేసుకొన్నాడు. అతనికి విపరీతమైన దాహం ఎలా వచ్చిందో కవి చమత్కారంగా పలికాడు: “తిరుపతి కొండపై విసుగు లేకుండా వడలు తినడం, శ్రీరంగంలో కోర్కె తీరా పొంగలి ఆరగింపు, కంచిలో కావలసినన్ని ఇడ్డెనలు భక్షించడం, అళగిరిలో తనివితీరా దోసెల ఆరగింపు వల్ల నృసింహస్వామికి దాహం వేసింది. మంగళగిరిలో బెల్లపు పానకం స్వామికి అర్చకులు నివేదిస్తారని ఇక్కడ కొలువయ్యాడు. అందుకే పానకాలరాయుడయ్యాడు” (అవతారిక – 41 పద్యం).

మూలకథ:

ఈ కావ్యానికి కథ మహాభాగవతంలోను, హరివంశములోను వుంది. అబ్బయ్య భాగవత కథను అనుసరిస్తూ రచించాడు. భాగవత కథకూ, హరివంశ కథకూ కొన్ని ఘట్టాలలో తేడాలున్నాయి. తనకు నృసింహ స్వామి కలలో కన్పించాడు. కలలో కూడా నాయిక ఉషకు కల రావడం ప్రధానం. ఉష అదృష్టవంతురాలు. కల యథార్థంగా అనుభవించింది, ఆనందించింది. కలలు సర్వసామాన్యంగా వస్తాయి. కలలు కరిగిపోతాయి. అవి కావ్యాలుగా రూపుదిద్దుకుని కలకాలం నిలవడం ఒక విశిష్టత. తెలుగు వాఙ్మయంలో ఉషాస్వప్నం ఆ అదృష్టానికి నోచుకుంది. పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నం స్వప్న కథను ప్రశస్తంగా ప్రబంధంగా తీర్చిదిద్దాడు తొలిసారిగా.

అనిరుద్ధుడు:

శ్రీకృష్ణుడు ద్వారకను నిత్యకళ్యాణం పచ్చతోరణంగా పాలిస్తున్నాడు. అప్పటికాయన తాతగారు. పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు. ప్రభావతీ ప్రద్యుమ్నంలో కథానాయకుడు. అతడు మన్మథుని మరుజన్మ. అతడు తన మేనమామ రుక్మి కూతురుని వివాహమాడాడు. వారిద్దరికీ జన్మించిన పుత్రుడు అనిరుద్ధుడు. అతడు కొమరు ప్రాయం వాడయ్యాడు. అతని శరీర సౌందర్యం చూచి తరుణలందరూ ఇతడు నా జీవితేశ్వరుడైతే బాగుండునని సంతాపం చెందేవారు.

మ:
తరుణుల్ వాని విలాస సంపదకు ఆంతర్యంబునం జొక్కితత్
పరిరంభానుభవంబు కోరుచూ – “విధాతా! వీని మజ్జీవితే
శ్వరుగా నేటికి చేయవైతి” వనుచున్ సంతాపనున్ చెందు, ను
స్సురు గాడ్పుల్ విధికంగదాహ మొదనించున్ మండు వేసంగియై (ప్రథమా – 83).

అతడు రుక్మి మనుమరాలైన రుక్మలోచనను వివాహమాడి సుఖభోగాలనుభవిస్తున్నాడు. వారి వివాహ వైభవాన్ని అబ్బయ తెలుగింటి పెళ్ళి సందడితో నింపాడు.

వైదర్భులు ద్వారకావాసులకు ఎదుర్కోలు పలికారు. వధూవరులకు బాసికాలు కట్టారు. కంకణాలను ధరింపజేశారు. తెరపచ్చడం అడ్దుపెట్టి ఇద్దరినీ ఎదురెదురుగా కుర్చోబెట్టారు. తెర తొలగించగానే పరస్పరం వీక్షించారు (మాంగల్యధారణ ప్రస్తావన లేదు). ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. ఆవిడ పాదాలు తన హస్తపద్మాలతో పట్టి వరుడు సప్తపది నడిపించాడు. ప్రధాన హోమాది వైదిక కార్యక్రమాలు పూర్తి చేశారు. నవదంపతులు శృంగార కేళిలో తేలియాడారు. ఇది ప్రథమాశ్వాసంలోని గాథ.

ద్వితీయాశ్వాసంలో శోణపుర వైభవము, బాణాసురునకు పరమశివానుగ్రహం, శివునితో బాణుని కదన కుతూహలము వర్ణించబడ్డాయి.

కథాకథనం:

బాణాసురుడు శోణపురాధిపతి. అతని కుమార్తె ఉషాకన్య. ఆమె అందాల సుందరి. లలితకళలలో ప్రావీణ్యురాలు. ఆ రాక్షస రాజకుమార్తె శృంగారపు విద్యలన్నీ నేర్చుకొంది. ఆమె చెలికత్తెలతో వనవిహారానికి వసంతశోభలో అడుగుపెట్టింది. వనవిహారానంతరం ఆ నాటి రాత్రి నిజమందిరంలో శయ్యాతలంపై నిద్రించింది. ఆమెకు కలలో ఒక మోహనాంగుడు ప్రణయ కలాపాలు కొనసాగించాడు. కెమ్మోవి మొనపంటి ఊనాడు. కుచ కుంభాలు గోళ్ళతో గిల్లాడు. చుంబించాడు. మర్మావయవాలు ముట్టుకున్నాడు. సురతసుఖంలో తేలియాడజేశాడు. అదొక స్వప్నంగా గాక ఎదుట వ్యక్తి ఉన్నట్లుగా ఆమె భావించి విరహతాపం అనుభవించింది.

ఉషకు స్నేహితురాలు చిత్రలేఖ. ఆమె మంత్రి కుమార్తె. ఆమె ఉషను ఊరడించింది. ఉష ఆమెతో తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆ సుందరాంగుని తెచ్చిపెట్టి నా దైన్యం తొలగించమని వేడుకొంది. చిత్రలేఖ చిత్రకళలో నిపుణురాలు. త్రిభువనాలలోని సుందరాంగుల చిత్రాలు స్వయంగా లిఖించి ఉషకు చూపించింది. చిట్టచివరగా అనిరుద్ధుని చిత్రపటాన్ని చూచి ఉష మేలుపడింది. వానిని ఎలాగైనా తెచ్చిపెట్టమని ప్రాధేయపడింది. ఉషకు చెలులు శైత్యోపచారాలు నిర్వహించారు.

చిత్రరేఖ యోగమహిమతో ద్వారకానగర ప్రవేశం చేసింది. సమ్మోహన విద్యా ప్రభావంతో అనిరుద్ధుని అపహరించి శోణపురంలో ఉష శయ్యపై చేర్చింది. అనిరుద్ధుని చూడగానే ఉష పరవశురాలైంది.

ఉ:
నాథు సుదర్సనంబు వలనన్ మదన గ్రహమోక్షమయ్యె బిం
బాధరకున్, సుదర్శన మహా మహిమంబిటువంటిదే గదా!
ఈ ధర తత్ ప్రయొగమున ఎట్లు గ్రహంబులు నిల్వనేర్చు తత్
సాధకులైన మాంత్రికులు సార మెరుంగుదు అప్పుడిప్పుడున్ (తృతీయా-60).

ఉషానిరుద్ధులిద్దరూ సరస శృంగారంలో తేలియాడారు. మన్మథుడు విజృంభించాడు. ఆ దంపతులు చేసుకొన్న తొలి పుణ్యఫలము లెట్టివోయని కవి చమత్కరించాడు. కొంతకాలానికి ఉష గర్భధారణ చేసింది. చెలులు భయపడి బాణాసురుడికి ఈ వార్త చేరవేశారు. అంతఃపుర ద్రోహిని బంధించమని బాణుడు ఆదేశించాడు. అనిరుద్ధుడు రెచ్చిపోయి రాక్షసులను మట్టుపెట్టాడు. బాణాసురుడు, అనిరుద్ధుడు పరస్పరం తలపడ్డారు. అనిరుద్ధుడు పెట్రేగిపోయాడు. అశరీరవాణి అతనిని హెచ్చరించగా అనిరుద్ధుడు లోబడ్డాడు. ఉషాకాంత సంతాపం చెందింది. అక్కడ ద్వారకలో అనిరుద్ధుడి కోసం వెదికారు.

నారదుని ఆగమనం:

శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు నటించాడు. అంతలో ద్వారకకు నారదుడు వచ్చాడు. అతని ద్వారా అనిరుద్ధుడు బాణాసురుని బందీగా వున్న వార్త తెలిసింది. శోణనగరంపై శ్రీకృష్ణుడు దండెత్తి వెళ్ళాడు. శివుడు బాణాసురుడి ముంగిట కావలివాదు. అతడు బాణాసురునికి సహాయంగా నిలిచాడు. హరిహరుల మధ్య భీకర సంగ్రామం జరిగింది.

శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం వదిలాడు. శివుడు నందీశ్వరునిపై వాలిపోయాడు. బాణాసురుడు యుద్ధ విజృంభణం చేశాడు. ఆ సమయంలో శివకేశవ సమర్థనంగా శాంభవ వైష్ణవ జ్వరాలు ప్రబలాయి. శ్రీకృష్ణునితో బాణాసురుడు తీవ్రంగా తలపడ్డాడు. శ్రీకృష్ణుడు సుదర్శనాయుధం ప్రయోగించాడు. ఆ సమయంలో శివుడు కేశవుడిని స్తుతించాడు. బాణుడు శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతించాడు:

శా.
మాయామానుషమూర్తివై తనరు బ్రహ్మంబున్, శివాబ్జాసన
ధ్యేయున్, నిన్ను ఎరుంగలేక, అవినీతిన్ మారుకొన్నందకున్
ప్రాయశ్చిత్తముగాగ చేసితివి, నా పాపంబు లోపంబుగా
నా అజ్ఞానము వాసె నీ కరుణ కృష్ణా! గోపికా వల్లభా! (5-27).

బుద్ధి తెచ్చుకొని బాణాసురుడు ఉషానిరుద్ధులను శ్రీకృష్ణునకు అప్పగించాడు. వియ్యాల వరికి ఎన్నో రకాల ప్రయోపచారాలు చేశారు. బాణుడు వారికి అనేక రత్నాభరన వస్తు వాహన ధేను దాసదాసీ జనాలను కానుకగా సమర్పించాడు. ఉషానిరుద్ధులకు వీడ్కోలు పలికారు. ద్వారకలో వారికి పురజనులు సంబరంగా స్వాగతం పలికారు. పురకాంతలు పూలజల్లులు కురిపించారు.

అనిరుద్ధుడు రుక్మలోచనతోను, ఉష తోను సుఖభోగాలను దక్షిణ నాయకుడిగా అనుభవించాడు. కొంత కాలానికి ఉష గర్భవతి అయింది. గ్రహాలు ఉచ్చరాశులలో ఉండగా శుభలగ్నంలో రాజాంశలో పుత్రుడు జన్మించాడు. అతనికి వజ్రకుమారుడని నామకరణం చేశారు. నారదు డొకనాడు ద్వారకకు విచ్చేసి వజ్రుని సాముద్రికా శుభలక్షణాలను కొనియాడాడు. సాముద్రికా శాస్త్రంలో ఉన్న మంచి గుణాలు ఇతనికున్నాయని దీవించాడు. ఆ విధంగా అనిరుద్ధుడు పుత్రోత్సాహంతో రాజ్యపాలన చేసి సాయుజ్యసిద్ధి కోసం ఆత్మానుసంధానం చేసి, జనక మహారాజు వలె ఆత్మజ్ఞానియై మెలగాడు. ఈ విధంగా ఐదాశ్వాసాలలో అబ్బయామాత్యుడు రమణీయంగా కథాకథనం కొనసాగించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here