వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-11

1
3

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. బాధ్యత

“భారతీ, వచ్చేవారం అమెరికా నుండీ నా బాల్యస్నేహితుడు చంద్రం వస్తున్నాడు, తిరిగి వెళ్ళేవరకు ఓ వారం రోజులు మన ఇంట్లోనే ఉంటానన్నాడు” రాత్రి ఫ్యాక్టరీ నుండి రాగానే భార్యతో చెప్పాడు రమేష్.

“సరేనండీ, అయినా ఇక్కడే ఉన్న వాళ్ల అన్నయ్య ఇంటికి వెళ్ళడటనా?” అడిగింది భారతి.

“ఏదో విషయంలో వాళ్ల అన్నయ్యతో అభిప్రాయభేదాలున్నాయిగా, వెళ్ళకపోవచ్చు, అతడు ఇక్కడ ఉన్నన్ని రోజులు టిఫిన్లు, భోజనాలకు ఏ విధమైన లోటు రాకుండా నువ్వే దగ్గరుండి శ్రద్ధగా చూసుకోవాలి, వాడు నాకు చాలా ఇష్టమైన మిత్రుడు” నొక్కి చెప్పాడు రమేష్.

“సరేనండీ, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, కొన్ని ముఖ్యమైనవే చాలు రాసిస్తా, సాయంత్రం వచ్చేటప్పుడు పట్టుకొస్తారా?” అడిగింది భారతి రమేష్ ను.

“జీతం రావడానికి గడువు ఇంకా పదిరోజులపైనే ఉంది, ఫ్యాక్టరీలో అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వే ఎలాగో సర్దాలి” అభ్యర్థనగా అన్నాడు రమేష్.

సరిగ్గా పదిరోజుల తర్వాత…

“చంద్రం నీ ఆతిథ్యానికి చాలా సంతోషపడ్డాడోయ్, వాడు ఉన్నన్ని రోజులూ ఏ లోటూ లేకుండా చూసుకున్నందుకు నీకు స్పెషల్ థ్యాంక్స్, అయినా వెచ్చాలు లేవన్నావ్, ఎలా సర్దగలిగావ్?”భార్యను అడిగాడు రమేష్.

“మీకు ఎంతో ఇష్టమైన బాల్య స్నేహితుడు అన్నారుగా, అంత దూరం నుండి వస్తే అతడి ముందు మీ గౌరవం కాపాడటం భార్యగా  నా ‘బాధ్యత’ కాదా” చెప్పింది భారతి; ఈ అవసరం గట్టెక్కడానికి కావలసిన సొమ్ముకోసం ఎదురింటి మీనాక్షమ్మ వద్ద కుదువ పెట్టగా బోసిగా వున్న తనకు ఎంతో ఇష్టమైన పచ్చరాయి ఉంగరం లేని తన చేతిని తడుముకుంటూ.

2. ఆసరా

“సరళా, నీ నిర్ణయం సరైనది కాదేమో అని నాకనిపిస్తోంది” ఆఫీస్ నుండి రాగానే భార్యకు సలహా ఇస్తున్నట్లుగా అన్నాడు ప్రసాద్.

“ఇక మనకు పిల్లలు పుట్టరని తెలిసిపోయాక ఎవరో ఒకరిని తెచ్చుకొని పెంచుకోవడం పెద్ద తప్పు కాదు కదండీ” తన ఆలోచన సరైనదే అన్నట్లు అంది సరళ.

“పిల్లలను పెంచుకోవడం తప్పని నేననను కానీ, మరీ అనాథాశ్రమం నుండి తెచ్చుకోవడం ఎందుకని నా ఉద్దేశం” భార్య వంక గమనిస్తూ అన్నాడు ప్రసాద్.

“మరి మీ మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో చెప్పరాదా?” అడిగింది సరళ.

“మా అన్నయ్య ఆఖరి కొడుకును తెచ్చుకుంటే సరిపోదా?” చెప్పాడు ప్రసాద్.

“అది నాకు ఇష్టం లేదండీ, అలా చేస్తే ఆస్తి అంతా మీ అన్నయ్య కొడుక్కే దక్కుతుందని మా వైపు వాళ్లు నిన్ను పెద్దగా గౌరవించరు, పైగా ఇప్పటి నుండినే చాలా చులకనగా చూస్తారు” చెప్పింది సరళ ఏదో ఆలోచిస్తున్నట్లుగా.

“అలా అయితే మీ చెల్లి కొడుకుని తెచ్చి పెంచుకుందాంలే” అన్నాడు ప్రసాద్.

“అప్పుడు కూడా మీ తరపు వాళ్ళ నుండి నాకు సమస్యే కదండీ, మనం పోయాక ఆస్తి మొత్తము మా వాళ్లకు వచ్చేలా ప్లాన్ చేశానని నన్ను ఆడి పోసుకోరా?”అడిగింది సరళ

“నువ్వు చెబుతున్నట్లుగా రెండు వైపులా సమస్యే” ఒప్పుకుంటున్నట్లుగా అన్నాడు ప్రసాద్.

“అందుకేనండీ, ఎవరి నుండి ఏమాట పడే అవసరం రాకుండా పిల్లాడిని అనాథాశ్రమం నుండి తెచ్చుకుందామని చెప్పేది, పైగా మన ‘ఆసరా’ కావాల్సింది తల్లిదండ్రులు లేని నిజమైన అనాథలకే కానీ, తల్లిదండ్రులు ఉండి అన్ని రకాలుగా బాగున్న పిల్లల కోసం కాదు కదా” చెప్పింది సరళ తన నిర్ణయం ఎందుకు సరైనదో వివరిస్తూ.

3. చికిత్స

“చెప్పండి, ఏమిటి మీ సమస్య?” ప్రశ్నించాడు ప్రముఖ సైకియాట్రిస్ట్ ధీరజ్ తన ఎదురుగా కూర్చున్న సుధాకర్ ను.

“గత ఆరు నెలల కాలంగా  నా శ్రీమతి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదానిలా దిగులుగా ఉంటోంది” బదులిచ్చాడు సుధాకర్.

“ఇదివరకు ఎక్కడైనా చూపించారా?”అడిగాడు ధీరజ్.

“చాలామందికే చూపించా, శారీరకంగా ఏ జబ్బూ లేదంటే మీ దగ్గరకు వచ్చా” చెప్పాడు సుధాకర్.

“మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు?” ప్రశ్నించాడు ధీరజ్.

“మేము మొత్తం ముగ్గురం సార్, అయితే మా  బాబు ప్రస్తుతం మా వద్ద లేడు, విజయవాడలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో చేర్పించా, ప్రస్తుతం ఇంట్లో ఉండేది నేను నా భార్య మాత్రమే”చెప్పాడు సుధాకర్.

“మీ అబ్బాయి వయస్సు, ఏం చదువుతున్నాడు?” మళ్ళీ ప్రశ్నించాడు ధీరజ్.

“వాడి వయస్సు తొమ్మిదేళ్లు సార్, రెండో తరగతి చదువుతున్నాడు, కాస్తంత ఖర్చుఎక్కువయినా వాడి భవిష్యత్తు బాగుంటుందనీ దూరంగా చేర్పించా” జవాబిచ్చాడు సుధాకర్ ఖర్చు, భవిష్యత్తు అనే పదాలను కాస్తంత నొక్కి చెబుతూ.

“ఎంత కాలమయ్యింది వాడిని అక్కడ చేర్పించి?”మళ్ళీ అడిగాడు ధీరజ్.

“క్రితం జూన్‌లో, ఎనిమిది నెలలు దాటింది” చెప్పాడు సుధాకర్ ఏదో ఆలోచిస్తూ.

“మీ శ్రీమతి మానసిక జబ్బుకు కారణం మరేదో కాదు, కేవలం మీరే, భవిష్యత్తు పేరిట పిల్లాడిని తన నుండి దూరం చేయడం వల్లే  ఆవిడ మెంటల్‌గా డిప్రెస్ అయ్యింది, మీవాడిని వెంటనే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం మినహా ఈ రోగానికి వేరే ‘చికిత్స’ లేదు” చెబుతున్న సైకియాట్రిస్ట్ మాటలు చెంప మీద ఛేళ్ళున బాదుతున్నట్లు అనిపించాయి సుధాకర్‌కు.

4. పరిష్కారం

“అల్లుడుగారితో కనీసం మాట మాత్రమైనా చెప్పాపెట్టకుండా వచ్చేశావట, ఏమిటమ్మా సమస్య?” రాత్రి భోజనాల వేళ రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన కూతురు ధరణిని ప్రశ్నించాడు రమణరావు.

“సుమారు ఏడాదిన్నరగా ఎంతో కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే, అది చెయ్యడం ఏమాత్రం ఇష్టం లేదట నాన్నా, మానేయమని రోజూ గొడవే, అంత పొద్దు పోకపోతే ఇంటివద్దనే ఏదో ఒక వ్యాపకం  పెట్టుకోమంటున్నారు” సమస్య వివరించింది ధరణి భర్త కిరణ్ మీద ఫిర్యాదు చేస్తున్నట్లుగా.

“నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదమ్మా” కూతురుతో అన్నాడు రమణరావు.

“ఏళ్ల తరబడి ఎంతో చదువు చదివి ఇప్పుడు మూలన  కూర్చోమని మీరు కూడా తనలాగా చెబుతారు ఏంటి నాన్నా?” దెబ్బతిన్నట్లుగా చూస్తూ రోషంగా అడిగింది ధరణి.

“ఎందుకలా అపార్థం చేసుకుంటావు ధరణీ, నువ్వు చదివిన చదువుకు సంబంధించే ఏదైనా స్టార్టప్ కంపెనీ ప్రారంభించు. నీకూ పొద్దూ పోతుంది, పైగా బాగా చదువుకున్న పదిమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిన  దానివవుతావు, ముఖ్యంగా నువ్వు కష్టపడటం చూడలేని అల్లుడుగారి కోరిక కూడా నెరవేరుతుందిగా” చెప్పాడు రమణరావు అర్థం చేసుకోమన్నట్లుగా.

“నాన్న చెప్పేదే కరెక్ట్ ధరణి, నిత్యం ఒత్తిళ్లతో సతమతమవుతూ ఎవరో బాస్ దగ్గర పని చేయడం కంటే నీకు నువ్వే బాస్‌గా ఎలా ఉంటుందో కాస్తంత మనసు పెట్టి ఆలోచించు” సమస్యకు భర్త ఇచ్చిన సలహా కూతురు కాపురం నిలబెట్టే సరైన ‘పరిష్కారం’గా చెప్పింది అక్కడే ఉన్న ధరణి తల్లి పార్వతమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here