[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
రామ్‌నగర్ కోట:
[dropcap]నే[/dropcap]ను ఈ రామ్‌నగర్ కోటకు వెడుతూ దారిలో మొదట అఘోరీ కీనారాం బాబా ఆశ్రమము దగ్గర ఆగాను. అక్కడినుంచి అదే ఆటోలో రామ్ నగర్ కోటకు వెళ్ళాను. ఈ రామ్‌నగర్ గంగకు ఆవల ప్రక్కన తీరము. దీన్నే వ్యాసకాశి అని కూడా అంటారు. ఇది కాశీ పట్టణానికి దాదాపు 14 కి.మీ. దూరము. చాలా ట్రాఫికు మూలంగా రెండు గంటలు పడుతుంది చేరటానికి వెళ్ళేదానికి. అదే గంగ దాటి పడవలో వస్తే గంటలో చేరవచ్చు.
రామ్‌నగరు కోట గంగా నది వడ్డున తూర్పు వైపున వుంటుంది. గంగకు ఒక వడ్డు వారణాసి, మరో వడ్డు రామ్‌నగర్ కోట వుంటాయి. ఈ కోట 18వ శతాబ్ధములో నిర్మించారు. ఇందులో నేటికీ రాచపరివారము నివాసమున్నారు. ఆ రాజులనే మనము బనారస్ రాజు/ కాశీ రాజు అంటాము. ఆ కోట గంగ వడ్డునే, గంగకు ఆనుకొని ఎత్తుగా కట్టబడి వుంది. ఎఱ్ఱ సున్నపు రాయి కట్టడము. మొఘల్ నిర్మాణ స్టైల్ మనకు చూచిన వెంటనే స్పష్టముగా కనపడుతుంది. ప్రకృతి సహజమైన అందాలతో దూరం నుంచి కూడా చూడటానికి మనోహరంగా వుంటుంది కోట. అందమైన ఆ కోట ద్వారము విశాలంగా వుంది. కోట గుమ్మానికి అటూ- ఇటూ రెండు ఫిరంగులు పెట్టి వున్నాయి. లోపల టికెటు కౌంటరు. టికెటు వంద. అక్కడే మన సెల్‌ఫోనులు వదిలి వెయ్యాలి. కోటలోపల వున్న ప్రదర్శనశాలకు కెమెరాను అనుమతించరు.
కోట చాలావిశాలముగా పెద్దగా వుండి, చాలా అందమైన ఎతైన బాల్కనీలు కోట చుట్టూ వున్నాయి. లోపల దర్బారు హలు రాజసంగా వుంది. విశాలమైన గదులలో ఎతైన పైకప్పుతో మరింత పెద్దదిగా కనిపిస్తోంది. గదులలో పెద్ద గాజు బీరువాలు వాటిలో విలువైన వస్తువులు, నాటి పాత ఆకృతులతో వుండి ఆ ప్రదర్శనశాల చాలా ఆకర్షణీయంగా వుంది. అందులో అప్పటి రాజులు వాడిన కొన్ని వస్తువులు అమర్చారు. వారి వివిధ కత్తులు, డాలులూ చాలా ఆకర్షణీయంగా వున్నాయి. కొన్ని విలువైన నగలు నాటి డిజైన్లతో చాలా కన్నులకు ఇంపుగా వున్నాయి. ఆనాటి రాచరికపు కూడా వస్త్రాలను చూడవచ్చు. వాటిని చూసే మన సినిమాలలో చందమామ కథలలో చిత్రించి వుంటారనుకుంటా.
ముఖ్యమైన ఆకర్షణ వారు వాడిన పాత కార్లు, గుర్రపు బగ్గీలు, రథాలు. అవి అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆ విశాలమైన వరండాలు, గదులు, మేడ వీటి మధ్య మనము రాచరికపు భారతంలోకి కొంత తడవు పయనించవచ్చు.
అక్కడ దంతపు నగీషీలతో కూడిన ఎన్నో వస్తువులు ప్రదర్శనకు చూడవచ్చు. ఎన్నో రకాలైన గడియారాలు, గ్రంధాలు కూడా వున్నాయి. ఆ ప్రదర్శనాశాల భవనము సరస్వతీ మహల్ అంటారుట. అది కోటలో ఒక భాగము మాత్రమే. మిగిలిన ముప్పాతిక భాగమూ రాజుగారి అధీనములో వుంది.
ప్రస్తుతము ఆయన తన కుటుంబముతో కలిసి నివాసముంటున్నారు . ఆ ప్రాంతంలో అందమైన పరిసరాలతో వున్న కోట అదొక్కటే కాబట్టి దానిని సినిమాలు తీయ్యటానికి అద్దెకు తీసుకుంటూ వుంటారట. గంగానది మీద కూడా ఆ కోటను చేరవచ్చు. వంతెనలు రెండు వున్నాయి. ఒకటి ప్రజలు రోజూవారిగా వాడటానికి. రెండోది హైవేగా మలచారు.
ఈ కోటకు వానాకాలములో దారులన్నీ మూసుకుపోయినా గంగ మీద చేరేవారుట. రాజు అను నిత్యం పడవ మీద కాశీ విశ్వేశ్వరుణ్ణీ సేవించి తిరిగివచ్చేవారుట. మనం తులసీ ఘాటు వద్ద నిలుచొని చూస్తే నేటికీ ఈ కోట ఆవల దిక్కున కనిపిస్తూ వుంటుంది. ఈ కోటలో వేదవ్యాసుని దేవాలయము వుంది. ఈ స్థలమునే వ్యాసకాశి అంటారు. ఛిన్నమస్తాగా అమ్మవారు కొలవపడుతున్నది కూడా ఈ కోటలోనే. దశముఖ హనుమాను గుడి కూడా ఇక్కడే వుంది. ఇన్ని దేవాలయాలు కాశిరాజు గారి రక్ష. కాశీ రాజు గారి గురించి ఎన్నో చందమామ కథలలో చదవటము వలన, ఆయనను చూడగలమా? అని నే అక్కడి వారి నడిగాను. కుదరదన్నారు. కొంచం నిరుత్సాహంగా అనిపించింది.
కనీసము ఆయన నివాసము చూశానని కొంత సమాధానపడ్డాను.
రామ్‌నగర్ కోటలో జరిగే ఉత్సవాలలో దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవి. వాటికి ప్రతి రోజూ రాజుగారు వస్తారని, అప్పుడు ఆయనను దర్శించవచ్చని చెప్పారు అక్కడి స్టాఫ్.
పది రోజులు అమ్మవారి ఉత్సవాలతో పాటూ, రామయణ పారాయణము, రామ కథ నాటకాలు జరుగుతాయి కోటలో. ఆ పది రోజులు రాజు తప్పక హాజరు అవుతారట. అప్పుడు మనము వారిని కలవవచ్చు.
రామ్‌నగర్ కోట కాకుండా రాజావారికి వారణాశి పట్టణములో మరో కోట వుంది. అది ప్రస్తుతం తాజ్ వారి లీజ్‌లో తాజ్ హోటెలుగా వుంది.
కాశీకి వచ్చిన యాత్రికులు తప్పక ఈ కోటను దర్శిస్తారు. చందమామ కథలలో, పురాణాలలో, చరిత్రలో చదివిన కాశీ రాజు గురించిన విషయాలు గుర్తుకు తెచ్చే ఆ కోట దర్శనము మనసులో ముద్రపడి పోయ్యింది. రామ్‌నగర్ నుంచి భారతీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నాయకులు కూడా వున్నారు. వారి గురించి నా తదుపరి వ్యాసములో చెబుతాను.
(సశేషం)