[dropcap]కం[/dropcap]టికి కనిపించని ఆ దేవుడు, కంటికి కనిపించే మానవులను సృష్టించాడు. ఆ ‘మానవ సేవయే మాధవ సేవ’ అని మనమంతా ప్రగాఢంగా విశ్వసిస్తాము. ఆ క్రమంలో అనేక జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థలు వెలుగులోకి వచ్చాయి.
‘వుయ్ సర్వ్’ అంటుంది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్.
‘సర్వీస్ ఎబౌ సెల్ఫ్’ అంటుంది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్.
స్టార్ హోటళ్ళలో, ఆసుపత్రులలో, బ్యాంకులలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘మే ఐ హెల్ప్ యూ’ అనే బోర్డులు కనబడుతూంటాయి.
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి.యస్.ఆర్) చట్టం 2014 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం రూ.500 కోట్లకు పైగా నికర లాభం ఆర్జిస్తున్న కార్పోరేట్ కంపెనీలు (క్రితం మూడు సంవత్సరాల సగటు లాభంపై) తమ లాభాల్లో రెండు శాతాన్ని సి.యస్.ఆర్. కోసం ఖర్చు చేయాలి. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో కార్పోరేట్ సామాజిక బాధ్యత (సి.యస్.ఆర్)క్రింద, సేవాకార్యక్రమాల కోసం రూ.10,030 కోట్లను ఖర్చు చేశాయి.
ఇవన్నీ కాక, కోకొల్లలుగా దేశమంతా విస్తరించి ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు విద్య, వైద్య, ఉపాధి, న్యాయం మొదలైన రంగాలలో సమాజానికి ఇతోధికంగా సేవలందిస్తున్నాయి.
వీటికి తోడుగా, ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్న సంపన్నులు, సినిమా నటీనటులు, క్రికెటర్లు, మరెంతోమంది మంచి మనస్సుతో, సేవా ధృక్పథంతో, వ్యక్తిగతంగా కొన్ని అభివృద్ధిలో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకొని, ఆ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటునందిస్తుండడం, మనం కళ్ళారా చూస్తూనే వున్నాం.
ఈ నేపథ్యంలో మనం సదానంద్ గురించి కొంత తెలుసుకుందాం. ఆ ఊర్లోనే వున్న ఒక జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కష్టాలలో ఉన్నవారికి అంతో ఇంతో సహాయం చేస్తూ, సమాజ సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ వుంటాడు. తన సేవా నిరతితో అనతికాలంలోనే ఆ ఊర్లో ఒక ఉన్నత ఆశయాలున్న వ్యక్తిగా పేరు సంపాదించాడు.
ఆ క్రమంలో స్థానికంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ దృష్టిలో పడ్డాడు సదానంద్. తమ సంస్థలో చేరి తాము చేసే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవలసిందిగా సదానంద్‌ని ఆహ్వానించారు ఆ సేవా సంస్థ అధ్యక్షులు, కార్యదర్శులు. ఆ సంస్థలో సుమారు అరవై మంది సభ్యులున్నారు. అందులో ఓ నలభై మంది క్రియాశీలకంగా వుంటారు. తనని స్థానిక సేవల సంస్థ వాళ్ళు గుర్తించనందుకు చాలా సంతోషించాడు సదానంద్.
ఒంటరిగానైతే చిన్న చిన్న సేవా కార్యక్రమాలతో అతి కొద్ది మందికి మాత్రమే సేవలందించగలము. అదే ఒక సంస్థ ద్వారా అయితే సభ్యులందరితో కలిసి సంఘటితంగా, చిన్నా, పెద్దా సేవా కార్యక్రమాలలతో వేలాదిమందికి సేవలందించవచ్చనే ముందుచూపుతో ఆ స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యుడిగా చేరాడు. ఆ రోజు నుంచి ఇక వెనక్కి చూడలేదు సదానంద్. ఆ సంస్థ నిర్వహించే ప్రతి సమావేశంలో విధిగా పాల్గొంటూ తన ఆలోచనలను సభ్యులందరి ముందుంచుతూ, అందరితో కలిసి సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న సదానంద్‌ని చూస్తుంటే, ఆ సేవాసంస్థ సభ్యులందరికీ ముచ్చటేసేది. తమ సంస్థకు మరో సమర్థవంతమైన సభ్యుడు సదానంద్ రూపంలో దొరికినందుకు సభ్యులందరూ చాలా సంతోషించారు. రాబోయే సంవత్సరంలో సదానంద్‌ని తమ సేవా సంస్థ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బావుంటుందని అభిప్రాయాన్ని అడపాదడపా బయటపెడుతున్నారు ఆ సంస్థ సభ్యులు.
ఆరోజు జిల్లా కేంద్రం నుంచి వచ్చిన నేత్ర వైద్య బృందం డాక్టర్ సుమంత్ గారి నేతృత్వంలో, ఆ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కాలేజీలో ఒక నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. వచ్చిన వారందరికీ కంటి పరీక్షలు చేసి, వారిలో సుమారు 100 మంది పేదవారికి కంటి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి, వారికి సహాయకులుగా వచ్చిన వారికి మూడు రోజులపాటు ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలను సమకూర్చారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ సంస్థ సభ్యులు. ఇక సదానంద్ సంగతి సరేసరి. అన్నీ తానై, ఆ సేవా కార్యక్రమంలో తన ఉనికిని ప్రస్ఫుటంగా చాటుకున్నాడు సదానంద్.
శిబిరం ఆఖరి రోజున కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కటిక చీకటిలో వెలుగుతున్న దివ్వెలు వెదజల్లుతున్న కాంతుల అనుభూతికి లోనయ్యారు వాళ్ళందరూ. ఇక రాదే రాదనుకున్న కంటి చూపు తిరిగి వచ్చినందుకు, తాము ఈ జన్మలో చూడలేము అనుకున్న ప్రపంచాన్ని మరలా చూడగలుగుతున్నందుకు వారి కళ్ళల్లో కనిపించిన సంతోషం, ఆనందం, తృప్తి, కృతజ్ఞతా భావంతో కూడిన చల్లని చూపులను చూసిన సంస్థ సభ్యులు తమ శ్రమ వృథా పోలేదని, తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని మహదానంద భరితులయ్యారు.
ఆ రోజు సాయంత్రం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ నియోజకవర్గ యమ్.ఎల్.ఎ. పరశురామ్, సేవా సంస్థ ఉచితంగా ఇస్తున్న కళ్ళజోళ్లను, మందులను, కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి అందజేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ….
“సోదర సోదరీమణులారా! ఇవాళ మీ సేవా సంస్థ నిర్వహించిన ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా మీరు దాదాపు 100 మందికి కంటి చూపు ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకు మీ సేవా సంస్థ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్లు చేసినటువంటి ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ సుమంత్ మరియు వారి సహచర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ముందు ముందు మీ సంస్థకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా…. అందుకు నా సేవలను మీరు వినియోగించుకోవచ్చు. మీ సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని, మరెంతో మంది మీరు అందించే సేవల ద్వారా లబ్ధి పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను…” అంటూ సేవా సంస్థకు మరింతగా తోడ్పాటు నందించేందుకు తన సంసిద్ధతను వ్యక్తపరిచారు.
యమ్.ఎల్.ఎ. పరుశురామ్ గారి సందేశాత్మక ప్రసంగంతో సదానంద్ లోని ఉత్సాహం, పట్టుదల, సేవాతత్పరత ద్విగుణీకృతమయ్యాయి. ఆ సేవా సంస్థ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. సదానంద్ తన వంతు బాధ్యతలను నిస్వార్ధంగా నిర్వహిస్తూనే ఉన్నాడు.
అంతలోనే ఆ సేవా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే రోజు రానే వచ్చింది. అధ్యక్షుడిని, కార్యదర్శిని, కార్యవర్గ సభ్యులను సభ్యులందరూ కలసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అందరి ఆకాంక్షల మేరకు ఆ సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికైన సదానంద్ తన పదవీ బాధ్యతలను ఆ రోజే స్వీకరించాడు.
సదానంద ఆలోచనలు శరవేగంతో పరిగెత్తసాగాయి. రాబోయే సంవత్సరంలో మన సేవా సంస్థ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి… తద్వారా ఎక్కువమందికి ఎలా లబ్ధి చేకూర్చాలి…, అందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి…, అనే విషయాలపై సభ్యులందరితో చర్చించిన పిదప ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తయారు చేసుకుని, అమలుకు నడుం బిగించాడు సదానంద్.
ఏ సేవా సంస్థ కైనా తన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే ముఖ్యంగా కావలసింది… మొదటిది సభ్యుల సహకారం, రెండోది… ఆర్థిక వనరులు. సదానంద్‌కి సభ్యుల సహకారం గురించి ఏ ఢోకా లేదు. ఇకపోతే, ఆర్థిక వనరుల విషయంలో ఒక సేవా నిధిని ఏర్పాటు చేశారు. ముందుగా సభ్యులందరూ తమ వంతు విరాళాలను దండిగానే ప్రకటించారు. తర్వాత సభ్యులందరూ కలసి ఒక వారం రోజుల పాటు ఉదయం, సాయంత్రం, ఆ ఊర్లో వున్న ధనవంతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులతో పాటు సాధారణ పౌరులను కూడా కలుసుకుని విరాళాలను ప్రోగు చేశారు. ‘అడగంది అమ్మైనా పెట్టదు’ అనే సామెత ననుసరించి, వారూ వీరూ అనుకోకుండా అందర్నీ కలుసుకుంటూ విరాళాలను కోరారు. అప్పటికే ఆ సంస్థ చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుంది. అందుకే అడిగిన వారందరు లేదనకుండా, తమ స్థాయికి, శక్తికి తగ్గట్టు విరాళాలను అందించారు. అంతిమంగా తాము ఊహించిన దానికి రెట్టింపుగా విరాళాలను సేకరించగలిగారు.
సదానంద్ మాత్రం తాను తలపెట్టిన సేవా కార్యక్రమాల కోసం మరిన్ని విరాళాలు కావాలనుకున్నాడు. వెంటనే తనకొచ్చిన ఆలోచన… ఓ… బెనిఫిట్ షో… ని ప్రదర్శించడం. స్థానికంగా ఉన్న ఓ సినిమా థియేటర్ యజమాని తమ సేవా సంస్థలో సభ్యుడు. ఈ విషయంలో అతని సహాకారం కోరినప్పుడు, తన థియేటర్‌లో ఒక మార్నింగ్ షోగా ఒక మంచి అరుదైన పాత తరం సినిమా వేద్దామని, అందుకు తనకేమీ డబ్బు ఇవ్వనవసరం లేదని చెప్పాడు. ఆ సినిమాను కూడా జిల్లా కేంద్రంలో డిస్ట్రిబ్యూటర్‌గా వున్న తన బంధువు ద్వారా ఏ మాత్రం డబ్బు చెల్లించకుండా ఉచితంగా తేగలననే భరోసా ఇచ్చి, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండని ప్రోత్సహించాడు ఆ థియేటర్ యజమాని. వెంటనే బెనిఫిట్ షో టిక్కెట్లను ప్రత్యేకంగా ముద్రించి, సంస్థ సభ్యులందరు కలిసి వాటిని విక్రయించి, అలా వచ్చిన మొత్తం డబ్బును సేవానిధికి జమచేశారు. బెనిఫిట్ షో ప్రయోగం అలా విజయవంతమైంది.
ఇక సదానంద్ ప్రతి సంవత్సరం చేస్తున్న ఉచిత వైద్య శిబిరం, ఉచిత నేత్ర వైద్య శిబిరం, ఉచిత దంత వైద్య శిబిరం లాంటి సేవా కార్యక్రమాలతో పాటు కొత్తగా, వినూత్నంగా, సృజనాత్మకంగా మరికొన్నింటిని చేయాలనుకుని, సంస్థ సభ్యుల ఆమోదంతో రంగంలోకి దిగడు.
ఆ క్రమంలో సదానంద్ నేతృత్వంలో ఆ సేవా సంస్థ చేపట్టిన కొన్ని విలక్షణమైన కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం:
ఉచిత పశు వైద్య శిబిరం:
ఎండల్లో ఎండుతూ, వానల్లో తడుస్తూ, ఎన్నో కష్టాలను ఓర్చుకుని మానవులకెంతో సహాయపడుతున్న నోరు లేని మూగజీవాల ఆరోగ్య పరిరక్షణార్థం… ఊరికి దగ్గర్లో ఉన్న ఓ పల్లెటూర్లో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. తమ ఊర్లోనే వున్న పశువైద్యశాఅలో పని చేస్తున్న పశువైద్యులు డా. గురుమూర్తి, డా. గౌరీశంకర్ మరియు వారి సహాయకుల సహకారంతో ఆ పల్లెటూర్లోని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వాటికవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసింది ఆ సేవా సంస్థ.
మొక్కలు నాటే కార్యక్రమం:
ఆ సేవా సంస్థ పర్యావరణ పరిరక్షణార్థం ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే మొక్కలను లక్షల్లో తరలించి చుట్టుపక్క ఐదారు గ్రామాల్లో… గ్రామస్థులు, స్కూలు పిల్లలు, అందరూ కలిసి మూకుమ్మదిగా ఆ మొక్కలను నాటారు. ఆ మొక్కలు సక్రమంగ పెరిగి పెద్దవడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేశారు ఆ సేవా సంస్థ సభ్యులు.
గుండె పరీక్షల శిబిరం:
జిల్లా కేంద్రంలో ఒక పేరు మోసిన కార్పోరేట్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న డా. కమలాకర్ మన సదానంద్‌కి సమీప బంధువు. సదానంద్ కోరిన మీదట డా. కమలాకర్ తన్ సిబ్బందితో, అవసరమైన పరికరాలతో సహా ఈ ఊరొచ్చి దాదాపు వందమందికి గుండె పరీక్షలు నిర్వహించారు. ఆ డాక్టర్లు తగిన సలహాలను, ఆ సేవా సంస్థ అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.
బస్ షెల్టర్ నిర్మాణం:
బస్ డిపో లోని గ్రామాల్లో బస్సుల కోసం ఎండల్లో, వానల్లో నిరీక్షిస్తూ నానా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, గర్భిణులు, బాలింతల సౌకర్యార్థం, కనీసం ఒక్క బస్ షెల్టర్ నైనా ఒక గ్రామంలో నిర్మించతలపెట్టాడు సదానంద్. అందులకవసరమయే డబ్బులో కొంత మొత్తాన్ని సేవాసంస్థ భరిస్తూ, మిగతా డబ్బు కోసం ఎం.ఎల్.ఎ. పరుశురామ్‌ని కోరాడు. ఆయన సహృదయంతో ప్రభుత్వం తనకు కేటాయించిన యమ్.ఎల్.ఎ ఫండ్ లోంచి ఆ మిగతా డబ్బును గ్రాంటుగా విడుదల చేసి బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయడంలో సహాయపడ్డారు.
ఆ బస్ షెల్టర్‌ని చూసినప్పుడల్లా ఆ సేవాసంస్థ సేవలను కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుకు తెచ్చుకుంటారు ఆ గ్రామవాసులు.
ఉచిత మధుమేహ వ్యాధి శిబిరం:
వయసుతో నిమిత్తం లేకుండా ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. సదానంద్ తనకున్న పరిచయాలను ఉపయేగించుకుని, జిల్లా కేంద్రంలో పని చేస్తున్న డా.కేశవరావు, డా. రామాచారిల సహకారంతో ఉచిత మధుమేహ వ్యాధి శిభిరాన్ని నిర్వహించారు. వచ్చిన వారందరికీ మధుమేహ వ్యాధి స్థాయిని పరీక్షిచి చికిత్స కవసరమయ్యే మందులను సేవా సంస్థ ద్వారా ఉచితంగా ఆందజేశారు.
చివరిగా మధుమేహ వ్యాధి రాకుండా వుండటానికి పాటించవలసిన ఆహార నియమాలు, చేయవలసిన శారీరక వ్యాయామాలు, ఆలోచనలను నియంత్రించుకునేందుకు యోగా, ధ్యానం గురించి ప్రజలలో అవగాహన కలిగించారు ఆ వైద్య నిపుణులు.
రక్తదాన మరియు బ్లడ్ గ్రూపింగ్ శిబిరం:
జిల్లా కేంద్రంలో పని చేస్తున్న బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా సంస్థ సభ్యులతో పాటు, ఇతరులు కూడా రక్తదానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సుమారు వంద మందిలో ఆ ఊర్లో నివసిస్తున్న శ్రీ యస్.వి.రావుగారు ఒకరు. ఆయన గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వచ్చందంటే… ఇప్పటి వరకు ఆయన పద్దెనిమిది సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు మన శిబిరంలో చేసిన రక్తదానంతో కలిపితే ఇప్పటికి పందొమ్మిది సార్లు చేసినట్లు. నిజంగా అభినందించ వలసిన విషయం. అందుకే ఆ రోజు శిభిరం ముగింపు సభలో శ్రీ.యస్.వి.రావు గారిని పుష్పగుచ్ఛంతో, జ్ఞాపికతో, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు సేవాసంస్థ సభ్యులు.
పనిలో పనిగా అందరి రక్తనమూనాలను పరీక్షించి, ఎవరిది ఏ గ్రూపో నిర్ధారించి సర్టిఫికట్‌లను కూడా ఇచ్చారు.
ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం:
జిల్లా కేంద్రంలో ఉన్న ఒక పేరు మోసిన క్యాన్సర్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డా. కుటుంబరావు, డా. కేశవరావుల సహాకారంతో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. వచ్చిన వారందికీ క్యాన్సర్ పరీక్షలు చేసి, చికిత్సల గురించి తెలియజేశారు. గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మహిళల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్యర్, మొదలగు వ్యాధుల గురించి, వాటి నివారణ చర్యల గురించి విపులంగా వివరించారు డాక్టర్లు.
రక్షిత మంచి నీటి సరఫరా ట్యాంకు:
దగ్గలో వున్న ఒక గ్రామంలో ఒక రక్షిత మంచి నీటి సరఫరా ట్యాంకు నిర్మాణం తలపెట్టింది ఆ సేవా సంస్థ. అందుకు కావలిసిన డబ్బులో కొంత భాగాన్ని సేవా సంస్థ భరిస్తూ, మిగతా డబ్బు కోసం యమ్.ఎల్.ఎ పరశురామ్ గారిని కలిసి, యం.పి. మదన్ మోహన్ గారికి చెప్పించారు. యమ్.ఎల్.ఎ.గారి సిఫారసుతో, యంపిగారు తనకు ప్రభుత్వం కేటాయించిన యం.పి ల్యాడ్స్ ఫండ్ లోంచి కావలసిన మిగతా డబ్బును గ్రాంటుగా విడుదల చేసి ట్యాంకు నిర్మాణానికి సహాయపడ్డారు. యం.పి.మదన్ మోహన్ గారు ఆ గ్రామంలోని వారందరికీ నిరంతారయంగా రక్షిత మంచి నీటిని అందిస్తూతూ, ఆ సేవా సంస్థ అందించే సమాజ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా ఆ గ్రామంలో దర్శనమిస్తుంది ఆ రక్షిత మంచి నీటి ట్యాంకు.
మహిళల మరియు గర్భిణీ స్త్రీల వైద్యశిబిరం:
గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు సరిపడా లేకపోవడం వల్ల, గ్రామీణ ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని దృష్టిలో వుంచుకుని ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించదలిచాడు సదానంద్. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న స్త్రీ మరియు శిశువైద్య నిపుణురాలు డా.విశాలాక్షిగారి సహకారంతో శిబిరాన్ని నిర్వహించారు. మహిళలందరికీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమయే మందులను సేవ సంస్థ ద్వారా ఉచితంగా అందజేశారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల సుఖ ప్రసవానికి, తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కొరకు పాటించవలసిన జాగ్రత్తలను సవివరంగా వివరించారు డా. విశాలాక్షి.
ప్రతిభావతులైన పేదవిద్యార్థులకు ఉపకారవేతనాలు:
ఆ ఊర్లో వున్న అన్ని పాఠశాలల్లో చదువుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్యాల వైపు ఆకర్షితులయేలా చేయాలనుకున్నాడు సదానంద్. ప్రతి తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సంస్థ తరపున అందించారు. ఆ విద్యార్థుల భవిష్యత్తు అవసరాల కోసం కూడా భరోసా ఇచ్చింది ఆ సేవా సంస్థ.
గ్రామీణ క్రీడా పోటీలు:
గ్రామీణ యువతీ యువకుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, వారి దేహధారుఢ్య పెంపుదలకు కబడ్డీ, కోకో, వాలీబాల్ మొదలైన గ్రామీణ క్రీడల్లో పోటీలను నిర్వహించింది ఆ సేవా సంస్థ. క్రీడాకారులకు కావలసిన ఏకరూప దుస్తులను, క్రీడా సామాగ్రిని సేవా సంస్థ ద్వారా ఉచితంగా అందజేశారు. విజేతలందరికీ బహుమతులను కూడా ప్రదానం చేశారు.
గీతా యోగ పాఠశాల స్థాపన:
నేటి తరం ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ విషయంలో మంచి అవగాహన ఏర్పడింది. ఉదయం పూట నడక, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, పరుగు పెట్టడం లాంటివి సర్వసాధరాణమైపోయాయి. ఆర్ధిక సౌలభ్యం ఉన్న కొందరైతే జిమ్‌లకు వెళ్లి అక్కడ అందుబాటులో వున్న ఆధునిక పరికరాలతో వ్యాయామం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగాసనాలకు, ధ్యానానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది
ఆ క్రమంలో సదానంద్ ఆలోచనల నుండి పుట్టినదే గీతా యోగ పాఠశాల స్థాపన. హైదరాబాద్‌లో ఉంటున్న తన ప్రియ మిత్రుడు రవీంద్ర తండ్రిగారైన దీక్షితులుగారి వయస్సు ఎనభై సంవత్సరాల పై మాటే. ఆయన యోగా, ధ్యానం శిక్షణ ఇవ్వడంలో పేరొందిన గురువుగారు.
సదానంద్ తన మిత్రుడు రవీంద్ర సహాయంతో, దీక్షితులు గురువుగారిని తమ ఊరికి పిలిపించుకుని, ఒక నెల రోజుల పాటు ఆయన సేవలను వినియోగించుకున్నారు. సేవా సంస్థల సభ్యులతో పాటు సుమారు అరవై మంది యోగా. ధ్యానంలో గురువుగారి దగ్గర శిక్షణ పొందారు. ఆ తరువాత గురువుగారు తిరిగి హైదరాబాద్‌కు వెళ్ళారు, అయినా, అక్కడకు రోజూ వచ్చేవారు, గురువుగారు నేర్పిన అంశాలన్నింటినీ తు.చ. తప్పకుండా అభ్యాసం చేస్తున్నారు. గీతా యోగ పాఠశాల అప్పటి నుండి నిర్వఘ్నంగా నడుస్తూనే వుంది. నేర్చుకున్నవారు కొత్త వారికి నేర్పుతూనే వున్నారు.
సేవా సంస్థకు సొంత భవనం:
సంస్థ సభ్యుల్లో ఒకరైన గోపీనాద్‌గారు, స్థానిక జూనియర్ కాలేజీకి కరస్పాండెంటు. ఆ కాలేజీలోనే మన సదానంద్ లెక్టరర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ కాలేజీలోనే ఒక హాల్లో మన సేవా సంస్థ సమావేశాలు, ఇతర పరిపాలనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడే గీతా యోగ పాఠశాలను కూడా నిడిపిస్తున్నారు. ఒక నాటి సమావేశంలో, మన సేవాసంస్థకు ఒక సొంత భవనం ఉంటే బాగుంటుందనే తన ఆలోచనను తెరపైకి తెచ్చాడు సదానంద్. అందరూ ఆ ఆలోచనను గట్టిగానే సమర్థించారు. అక్కడే వున్న బాగా ధనవంతుడైన ఆ సంస్థలో సభ్యుడు శ్రీగంగారామ్, ఊరికి నడి బొడ్డున ఉన్న ఎంతో ఖరీదైన తనకు చెందిన ఖాళీ స్థలాన్ని సంస్థ సొంత భవన నిర్మాణం కోసం తన వంతు విరాళంగా ఆ సేవా సంస్థకు వ్రాసిచ్చేందుకు ముందుకొచ్చాడు. అందరూ ఎంతో సంతోషించి గంగారామ్‌గారికి కృతజ్ఞతలు చెప్పడంలో పోటీ పడ్డారు.
అప్పిటిక్పపుడే కొంత మంది సభ్యులు తమ వంతు విరాళాలను భవన నిర్మాణ నిధి కోసం ప్రకటించారు. పెద్ద మొత్తం అవసరం అవుతుంది కాబట్టి, సదానంద్ తన ఆలోచనలకు పదును పెడ్తూ ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. అప్పుడే సదానందికి జర్మనీలో వున్న ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి తెలిసింది. మన దేశంలో బాగా పని చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు సొంత భావనాలు నిర్మించుకోడానికి, ఆ అంతర్జాతీయ సేవా సంస్థ పెద్ద మొత్తాల్లో గ్రాంటుగా సహాయం అందిస్తుంది. వెంటనే సదానంద్ ఆ అంతర్జాతీయ సేవా సంస్థతో ఉత్తర ప్రత్యుత్తరాలను సాగించాడు. ఒక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించి, దానితో పాటు వారికి కావలసిన గత మూడు సంవత్సరాల తాలూకూ వార్షిక నివేదికలు, ఆడిట్ చేయించబడిన ఆస్తి, అప్పుల పట్టికలు, ఇతర పత్రాలను పంపించాడు. వాటన్నింటిని పరిశీలించిన పిమ్మట ఆ అంతర్జాతీయ సంస్థ లేవనెత్తిన సందేహాలన్నింటికి సంతృప్తికరంగా సమాధానాలు పంపించాడు సదానంద్. అన్నింటినీ పునఃపరిశీలించిన పిమ్మట ఆ సంస్థ, అతిత్వరలో తమ నిర్ణయాన్ని తెలుపుతామని వర్తమానం పంపారు. మన సేవా సంస్థ సభ్యులందరూ ఆ తీపి కబరు వినాడానికి ఎదురు చూపులు చూస్తున్నారు.
***
కాలచక్రం ఎవరి కోసం ఆగదు కదా, రోజులు దొర్లిపోతున్నాయ్….
***
ఆ తరుణంలో రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలన్నింటి పని తీరును ఆధ్యయనం చేసి, వాటిలో అత్యుత్తమ సేవల నందిస్తున్న సంస్థలను గుర్తించి, అవార్డులు బహుకరించడానికి మేధావులతో కూడిన ఒక కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిటీ తనకప్పగించిన బాధ్యతను సకాలంలో పూర్తి చేసి, తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మన సేవా సంస్థకు రాష్ట్రం మొత్తం మీద ఉత్తమ సేవాసంస్థగా మరియు మన సంస్థ అధ్యాక్షుడు సదానంద్‌కి ఉత్తమ అధ్యక్షుడిగా అవార్డులు దక్కాయి. ఆ శుభవార్త తెలియగానే సంస్థ సభ్యులందరూ కలుసుకొని ఆనందోత్యాహాలతో కేరింతలు కొడుతూ, స్వీట్లు పంచుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వేడుక చేసుకున్నారు. ఇక సదానంద్ కళ్లల్లో నీళ్లు రెప్పలు దాటి బయటకు పొంగి పొర్లుతున్నాయ్.
ఆ సంస్థకు అంత గర్తింపు రావడానికి, అవార్డులు గెలుపొందడానికి సదానంద్ చేసిన విశేష కృషిని సభ్యులందరూ వేనోళ్ల కొనియాడారు.
ఆ పండుగ వాతావరణంలో అప్పుడే కొరియర్ ద్వారా వచ్చిన మరో తీపి కబురు ఆ సేవా సంస్థ సభ్యుల వీనుల విందు చేసింది. జర్మనీలో వున్న అంతర్జాతీయ సేవాసంస్థ, మన సేవా సంస్థ సొంత భవన నిర్మాణం కోసం పంపిన ప్రతిపాదనను ఆమోదించి ఒక కోటి రూపాయలను గ్రాంటుగా మంజూరు చేసినట్లు వర్తమానం పంపింది.
అంతే… ఒక్కసారిగా సభ్యులందరూ సదానంద్‌ని తమ చేతులపై ఆకాశానికెత్తేశారు.
నిజానికి సదానంద్ గురించి ఇక్కడ మనం మరోసారి చెప్పుకోక తప్పుదు. తన తెలివితేటలను, పరిపాలనా దక్షతను, సేవా నిరతిని, పది మందికీ సహాయ పడాలనే దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని, అధ్యక్షుడిగా తన పదవీ బాధ్యతలను ఎంతో సమర్దవంతంగా నిర్వర్తించాడు సదానంద్.
అంతే కాకుండా, తనకున్న మానవ సంబంధాలను, బంధు మిత్రుల అనుబంధాలను, సంస్థ కోసం పరిపూర్ణంగా వినియోగించుకుని, అనేక సమాజ సేవా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి, ఆ సేవాసంస్థకు, రాష్ట్రస్థాయిలో గుర్తింపుని తెచ్చి పెట్టడంతో పాటు, ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు గెలుపొందేందుకు కూడా దోహదపడ్డాడు సదానంద్.
మరి, అలాంటి సదానంద్, నిజంగా అభినందనీయుడు.