[dropcap]స[/dropcap]రిహద్దులే లేక
సాగించిన స్వేచ్ఛా జీవితానికి
కాలంతో పరుగులు తీసిన
బతుకుతెరువు పయనానికి
దారుల్లో ముళ్ళకంచెలు మొలిస్తే
అడుగడుగున ఆంక్షలు అడ్డుగోడలై నిలిస్తే
అంతగా, ఏమంతగా రుచించదు
నిన్నా మొన్నా నడిచిన వీథులు
నాలుగు దారుల కూడళ్ళు
దారులు, రయ్యిన పరుగెత్తించిన రహదారులు
రమ్మని రారమ్మని పిలుస్తుంటే
ఇంటిలోన, ఇరుకు గోడల మధ్య
బందీలాంటి బతుక బానే బావుండదు
యుద్ధభేరి ఎప్పుడో, ఎక్కడో
నిశ్శబ్దంగా మోగింది
అనంతమై అక్షౌహిణుల కరోనా సేన
కన్నుగప్పి చుట్టుముట్టింది
కనుచూపుమేరంతా మెల్లమెల్లగా పరుచుకుంది
కనిపించని శత్రువుతో పోరాటం మొదలైతే
కంటి ముందరిదంతా
యుద్ధరంగమేనని నిశ్చయమైతే
సన్నద్ధతకో సంసిద్ధతకో
సమయం మరి సరిపోనప్పుడు
అనువైన ఆయుధం అందుబాటులో లేకపోతే
వెనక్కి తగ్గిన ఆత్మరక్షణే అత్యుత్తమ నిర్ణయం
లక్ష్మణరేఖలు నీకైనీవే గీసుకో
రక్షణ తంత్రాలను నీచుట్టూ నీవే రచించుకో
కాలం మెల్లగా అతి మెల్లగానే కదులుతుంది
పంజరంలోని బతుకు భారంగానే గడుస్తుంది
శుభ్రతను, సామాజిక దూరపుతనాన్ని
శస్త్రాస్త్రాలుగా మార్చుకుని
కనిపించని శత్రువుతో తాకరాని పోరాటం చేయి
తలపడమని తొడగొడుతోన్న దాన్ని
తలుపవతలే ఉంచేసేయ్
చేయి కలపమని ఉసిగొలుపుతోన్న దాన్ని
దూరంనుంచే విసిరికొట్టి ఉపేక్షించేయి
నిన్ను చేరకుండా అది ఇలపై నిలువలేదు
నీరసించి కాలంతోపాటు అది కాలగర్భమవుతుంది
కలబడిన యుద్ధరంగంలో అది ఇప్పుడు గెలిచినా
తలపడకుండా దూరంగా నిలబడిన యుద్ధంలో
విజయం నీకే సొంతమవుతుంది
అవును, అది కరోనా..
అదే నోవెల్ కరోనా…
ఓ ! మానవా !! దాన్ని జయించేందుకు..
ఐసా కుచ్ కరోనా !!!