విరాళం

0
3

[dropcap]”అ[/dropcap]మ్మా నా పుట్టిన రోజు వస్తున్నది. గుర్తున్నదిగా. నాకీసారి సూట్ కొనిపెడతానన్నావు. మా క్లాసులో పిల్లలందరికీ ఫైవ్ స్టార్ చాక్లెట్లివ్వాలి. నాకిష్టమైన డిజైన్‌లో పెద్ద పేస్ట్రీ కేక్ ఆర్డరివ్వాలి” అంటూ గారాలుపోయాడు సురేంద్ర. “అలాగే కన్నా నీక్కావలసినవన్నీ తెప్పిస్తాను. నీ పుట్టిన రోజు నేనెలా మర్చిపోతాను?” అన్నది అమ్మ.

ఈ మాటలన్నీ సుందరి విన్నది.

“తమ్ముడూ రెండేళ్ల నుండి నేను పుట్టినరోజులు గ్రాండ్‌గా జరుపుకోవడం లేదు. కాని దానికి బదులుగా ఇంట్లో అడిగి డబ్బులు తీసుకుంటున్నాను. ఆ డబ్బు తీసుకెళ్లి మన స్కూల్లో వాచ్‌మెన్ పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాను. ఇది వరకు వాళ్లు ఒక మనవణ్ణి పెంచేవాళ్లు. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లి చనిపోయింది. పాపం రెండోవాడు చాలా చిన్నవాడు. వాడినీ వీళ్లే పెంచుతున్నారు. మన వాచ్‌మెన్ భార్య ఎప్పుడైనా స్కూల్లో ఏదైనా పని వున్నప్పుడు చేయడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు పెద్ద పిల్లవాడిని వేలు పట్టుకుని నడిపించి తీసుకువస్తుంది. చిన్నవాడిని భుజాన వేసుకుని తీసుకొస్తుంది. ఆ చిన్నవాడిని ఒక చోట పడుకోబెట్టి పెద్దవాడిని కాపలాగా వుంచుతుంది. అది చూసి నాకు చాలా జాలి కలుగుతుంది. ఆ రోజు నా దగ్గరున్న చాక్లెట్లు, బిస్కెట్లు నేనా పెద్దవాడికిస్తాను. నా పుట్టిన రోజును జరుపుకోకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి వాచ్‌మెన్ కిస్తున్నాను. నీ మనవళ్లుకు బట్టలలాంటివి కొనుక్కమని చెప్తున్నాను. నా మాట విని నువ్వు అలాంటి పని ఏదైనా చెయ్యి. అనవసరంగా కేకు కోసం, చాక్లెట్లు కోసం డబ్బులు వృథాగా ఖర్చు చెయ్యకు” అన్నది సుందరి. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్లుగా విప్పారిన పువ్వులాగా వున్నది. ఆమె కళ్లులో అంతు లేని జాలి, చెట్టు నుండి కిందకు రాలే పారిజాతంలాగా స్వచ్ఛంగా సువాసన భరితంగా వున్నది.

“ఏంటక్కా అన్నీ ఇలాంటి మాటల్నే చెప్తావు. నాకు అమ్మ కూడా ఎప్పుడూ ఇట్లా చెప్పదు” అంటూ సురేంద్ర బుంగమూతి పెట్టాడు.

సుందరి వెళ్లి అమ్మ దగ్గర కూర్చున్నది. తమ్ముడితో చెప్పిన మాటల్నే అమ్మకు కూడా చెప్పంది.

“ఏడాది కొకసారి వచ్చే పుట్టిన రోజు. అది జరుపుకోకుండా మానుకోవటం ఎందుకు కావాలంటే వాచ్‌మాన్ కివ్వటానికి వందో, యాభయ్యో డబ్బిస్తాను. నీ పుట్టిన రోజులప్పుడు ఎలాగూ డబ్బే ఇస్తున్నావు. ఇప్పుడు సురేంద్ర పుట్టిన రోజు జరుపుకోవద్దంటే చిన్నబుచ్చుకుంటాడు” అంటూ అక్కడి నుంచి మరో పని కోసం వెళ్ళింది అమ్మ.

మర్నాడు ఆదివారం. సురేంద్ర, సుందరి ఇద్దరూ ఇంటి దగ్గరే వున్నారు. రోజూలాగా ఉరుకలూ, పరుగులూ లేవు. సుందరి నాన్నతో మాట్లాడాలని కాచుకుని కూర్చున్నది. సురేంద్ర కూడా అదే పనిలో వున్నాడు. నాన్న నడిగి అదనంగా మరి కొన్ని కొనుక్కోవటానికి ఒప్పించుకోవాలి అన్న ఆలోచనలో వున్నాడు.

ఇంకా మూడు నెలల్లో సంక్రాంతి పండగ వస్తుంది. దాని కోసం కోడి పందేలు వేయించాలి. కోడి పందేల్లో పాల్గొనే పుంజుల్ని బాగా మేపాలి. వాటికి బాగా ట్రయినింగ్ ఇవ్వాలి అన్న ఆలోచనలో వీళ్ల నాన్న వున్నాడు.

“ఏం కోటీసూ పుంజుల్ని బాగా తిప్పి పరుగెత్తించావుగా? ఈత వేయించేటప్పుడు జాగ్రత్తగా వుండు. బాదంపప్పులూ, కిస్‌మిస్‌లను పాలల్లోనే నానబెడుతున్నరుగా? అవి తిన్న తర్వాత పాలు తాగిస్తున్నావా? లేదా సిరంజితోనైనా నెమ్మదిగానే పాలు పట్టించు. సిరంజులు ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి. లేకపోతే బ్యాక్టీరియా చేరుతుంది” అంటూ తన దగ్గరున్న తెల్ల నెమలి జాతికి చెందిన పుంజును, కాకి డేగ జాతికి చెందిన పుంజును, మరో డేగ పుంజునూ వరుసగా, పరీక్షిగా చూస్తున్నాడు. ఒక్కోక్కదాన్ని చేతుల్తో పట్టుకుని బరువూ అదీ అంచనా వేసుకోసాగాడు. ఆ పనులన్నింటినీ సుందరి ఆసక్తిగా చూడసాగింది.

“నువ్వెందు కొచ్చావు తల్లీ ఇక్కడకు, వీళ్లు ఈ పుంజుల్ని పందానికి ఎలా తయారు చేస్తున్నారో చూద్దామని వచ్చాను. పోదాం పద” అన్నాడు నాన్న సుందరితో.

“మూడు పుంజులెందుకు నాన్నా? అన్నింటితోనూ పందెం వేయిస్తారా?” అనడిగింది.

“అవునమ్మా. ఇది తెల్లనెమలి. దీన్ని భోగి రోజున పందెంలో దింపుతాం. ఇది కాకి డేగ. దీంతో సంక్రాంతి రోజున పందెం వేయిస్తే ఇది గెలుస్తుంది. ఆ చివరిది డేగ జాతికే చెందిన పుంజు. ఇవయితే కనుమరోజు పందెలకు పనికి వస్తాయి. ఇదంతా కోడి శాస్త్రం ప్రకారం చేస్తాం. అలా చేస్తే మన పుంజులు పందెంలో గెలుస్తాయి” అన్నాడు నమ్మకంగా.

అక్కడున్న బాదం, ఖర్చూరం, కిస్ మిస్‌ల డబ్బాల వంక, సిరంజులకెక్కించే చిక్కటి పాల వంక మార్చి మార్చి చూసింది సుందరి. తమ స్కూల్లో పని చేసే వాచ్‍మెన్ పసి మనుమడికి టీ తాగిస్తుంటే తను అడిగింది – “టీ తాగిస్తే పిల్లవాడికి జబ్బు చెయ్యదా?” అని

“పాలు కొని మేం పట్టలేమమ్మా. అందుకనే టీ కొని చల్లార్చి తాగిస్తాను. చిన్నప్పటి నుండే ఆరటి పండూ మెత్తగా చేసి తినిపిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది వాచ్‌మాన్ భార్య.

సుందరికిప్పుడు ఆ మాటలు గుర్తుకొచ్చి బాధనిపించింది. తమ ఇంట్లో ఇలా, వాచ్‌మన్ ఇంట్లో అలా అనుకుని నిట్టూర్చింది.

“నాన్నా మరేమో” అంటూ సురేంద్ర నాన్న చెయ్యి పట్టుకుని తన మాట వినమంటున్నట్లుగా గుంజసాగాడు.

“పదండి. ఇంట్లోకి వెళ్దాం” అంటూ పిల్లలిద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని నాన్న లోపలికి తీసుకొచ్చాడు. “సురేంద్రా” అని స్నేహితుడు వచ్చి పిలవగానే నాన్నతో మాట్లాడాలనుకున్న దాన్ని వాయిదా వేసి సురేంద్ర నాన్న చేయి విడిపించుకుని బయటకు పరుగు తీశాడు.

“అయిందా కోడి పుంజుల సేవ? వాటిని మేపటానికి వేలు ఖర్చువుతున్నాయి. మేత ఖర్చుకు తోడు మేపే వాళ్ల జీతాలు అన్నీ కలిసి తడిపి మోపెడవుతున్నాయి. తీరా రేపు ఆ పుంజులు పందెంలో గెలిస్తే సరి, ఓడిపోతే కూర వండుకోవటానికి కూడా పుంజు మిగలదు. నా మాట విని పండగ నెల వుందనగా పుంజుల్ని ఒక్కో దాన్ని లక్షకో, లక్షన్నరకో అమ్మేయిండి. వాటిని కొన్న ఖర్చూ, మేపిన ఖర్చూ అన్నీ వస్తాయి” అంటూ సలహా ఇచ్చింది అమ్మ.

ఈ మాటలన్నీ సుందరి విన్నది. ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న పిల్ల. అన్నీ ఆలోచించటం నేర్చుకునే వయసు. ఇలా పుంజుల్ని మేపటం, పందాలు వేయటం ఇదంతా చాలా వృథా అనిపించింది.

“నిరుడు పందెం లక్షల్లోనే వేశారు. మన పుంజు గెలిచింది కదా. ఇయ్యేడు కూడా మన పుంజులే గెలుస్తాయి. పందెంలో కొట్టే అన్ని కమీషన్లు పోను బోలెడు లాభం మిగిలింది. పై పెచ్చు నాకు పంజుల్ని మేపి వాటిని పందెంలో దింపటం మహా సరదాగా వుంటుంది. కోడి పందాల్ని నువ్వేప్పుడూ చూడలేదుగాని మా సరదాగా వుంటాయి. ఎంత మంది జనాలు చేరతారో చుట్టూ ఎన్ని స్క్రీనులు పెట్టినా చాలవు. నేను ఈయేడు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను. ఏ రోజు ఏ పుంజును బరిలోకి దించాలో ఆలోచించి మరీ దించుతాను. నా పుంజు గెలవని సంవత్సరం వున్నదా. నా పుంజులు గెలుస్తాయని బయట కొంత మంది పై పందాలు కూడా కాసి డబ్బులు గెలుస్తూ వుంటారు. నా పుంజులంటే జనానికి అంత నమ్మకం. నువ్వూరికే అధైర్యపడబాకు” అంటూ భార్యకు ధైర్యం చెప్పాడు.

సురేంద్ర మధ్యలో ఓసారి వచ్చి తొంగి చూశాడు. కాని ఇలాంటి మాటల పట్ల అవగాహన లేని వయసు, కావటంతో నిశ్శబ్దంగా వున్నాడు. ప్రస్తుతం వరకు నాకది కావాలి, ఇది కావాలి అని అడిగి కొనిపించుకోవటం వరకే తెలుసు. వాతావరణం గంభీరంగా వుండటంతో ప్రస్తుతం మౌనం దాల్చాడు. సుందరి మాత్రం తమ్ముడి పుట్టిన రోజు గురించీ నాన్న వేయబోయే కోడి పందాల గురించి సీరియస్‌గా ఆలోచించసాగింది. ఆ తర్వాత కూడా సురేంద్రతో మాట్లాడి తమ్ముడ్ని ఒప్పించటానికే ప్రయిత్నం చేయసాగింది.

“సరే అక్కా, నీ మాట కొంచం వింటాను. సూట్ కావాలనను. మాములు బట్టలే కొనుక్కుంటాను. అలాగే ఫైవ్ స్టార్ చాకలెట్స్‌కు బదులు మామూలువి తీసుకుంటాను. కేకు చిన్నదైనా సరే తెప్పించుకుంటాను. అమ్మ నడిగి కొంత డబ్బు తీసుకొని మన స్కూల్ వాచ్‌మెన్‌కు ఇస్తాను సరేనా” అన్నాడు అక్క గడ్డం పట్టి పైకెత్తుతూ. వాడికి అక్క అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో అక్క చెప్పే మాటలు కూడూ వింటావుంటాడు.

ఈ పుట్టిన రోజుకు తమ్ముడు కొద్దిగా మారాడు. రాబోయే పుట్టిన రోజుకు పూర్తిగా, తన మాట వింటాడని సుందరికి నమ్మకం కలిగింది. అమ్మకు మళ్లీ గుర్తు చేసింది సుందరి.

“అమ్మా చిన్న పిల్లాడమ్మా పాపం వాళ్లమ్మ చచ్చిపోయింది. వాడికి పాలు కొని పట్టటానికి కూడా వాళ్ల దగ్గర డబ్బులు లేవంట. నువ్వు కొంత డబ్బిస్తే వాళ్లకిద్దాం. ఇవ్వమ్మా” అంటూ జాలిగా అడిగింది సుందరి.

వాళ్లమ్మక్కూడా బాధనిపించింది. సురేంద్రకు బట్టలు కొనటానికి వెళ్లి నప్పుడు వాచ్‌మెన్ పిల్లలకూ బట్టలు కొన్నది. ఆ బట్టల్ని ఐదందల రూపాయల్నీ సరేంద్ర పుట్టిన రోజునాడు వాచ్‌మెన్ కిప్పించనమని సుందరికి చెప్పి పంపింది అమ్మ. సుందరీ, సురేంద్ర లిద్దరూ సంతోషించారు. స్నేహితులకు చాక్లెట్లు పంచినదాని కన్నా ఇలా పేద వాచ్‌మెన్ పిల్లలకివ్వటం చాలా బాగుందనిపించింది సురేంద్రకు. స్నేహితులైతే హాపీ బర్తడే అనీ చాక్లేట్ ఇస్తే ధాంక్‌యూ అని అంటారు. వాచ్‌మెన్ మాత్రం ఆనందంగా రెండు చేతుల్తో ఆ బట్టల్నీ డబ్బుల్నీ తీసుకున్నాడు. “సుఖంగా వుండండి బాబూ” అంటూ మనసారా అన్నాడు. అతని కళ్లలో ఎంతో సంతోషం కనపడింది. ఎండ వేళప్పుడు చెఱువులోని చేప పిల్ల పైకెగిరినప్పుడు తళుక్కమని మెరుస్తుంది. అలాంటి తళతళ వాచ్‌మెన్ కళ్లలో మెరిసింది.

తర్వాత ఈ విషయం తెలుసుకున్న నాన్న కూడా “మంచి పని చేశారు” అని మెచ్చుకున్నాడు.

మళ్లీ ఆదివారమొచ్చింది. సుందరీ, సురేంద్రలు నాన్నకు చెరో పక్క చేరారు. నాన్న కూడా తను పందెం వేయిబోయే డేగ పుంజును నిమురుతూ తీరుబాటుగా కూర్చున్నాడు.

మోకాళ్ల మీద కూర్చున్న సుందరి నాన్న చేయిపట్టి లాగుతూ “మరే నాన్నా” అన్నది.

“ఏంటమ్మా ఏమన్నా కావాలా?” అనడిగాడు నాన్న.

“మరేమో నాన్నా మా స్కూలు బాత్ రూమ్స్ పాడయిపోయాయి. దాంతో నీళ్లు అస్సలు వుండటం లేదు. అవి రిపేరు చేయిస్తే కాని నీళ్లు రావట. అయినా పాత వాటిని పడేసి కొత్త బాత్ రూమ్స్ కట్టిస్తే కాని ఉపయోగ ముండదనీ అంటున్నారు. దాని ఖర్చు కోసమని స్కూల్లోని పిల్లలందరి దగ్గరా కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. ఇంకా స్కూల్ చుట్టూ ప్రహారీ కట్టించాలట నాన్నా. చాల ఖర్చు అవుతంది. మీ తల్లిదండ్రులతో చెప్పండి. చేయిగలిగిన సాయం చేయమని అడుగుతున్నారు నాన్నా. అమ్మ మిమ్మల్ని కోడి పుంజులు అమ్మేయమంటున్నదిగా. వాటినమ్మేసి ఆ డబ్బు మా స్కూల్ కోసం ఖర్చు చేయింగుడదా నాన్నా?” అన్నది నెమ్మదిగా సుందరి. కూతురి మాటలకు ముందుగా కోపం వచ్చింది. చిన్న పిల్ల నాకు చెప్పొస్తుంది అనుకున్నాడు. నిదానంగా ఆలోచిస్తే చిన్నదైనా తన కూతురు చెప్పంది బాగున్నట్లుగా అనిపించింది. ఆ పని చేస్తే తన పిల్లలతో బాటు ఎంతో మంది చిన్నారులకు ఉపయోగం జరుగుతుందనిపించింది. మరో వైపు కోడి పందాల పట్ల తనకున్న మోజు అంతా ఇంతా కాదనిపించింది. వాటిని మేపే వాళ్లు, వాటికి పెట్టే తిండి, ఇవ్వాన్నీ మనసులో మెదిలాయి. అంత తెలిగ్గా దాన్ని వదులుకోలేడు తను. భోజనం చేసి పడుకుని తీరుబాటుగా ఆలోచించాడు. చివరకు కోడి పంజుల్ని అమ్మేయాలనే నిర్ణయానికే వచ్చాడు. పుంజులను మేపి వాటి సంరక్షణ చూసే వాళ్లు గోలపెట్టారు.

“ఇప్పటిదాకా వీటిని జాగ్రత్తగా సాకాం. కంటికి రెప్పలా కాపాడుతున్నాం. ఇంకా కొద్ది రోజులాగితే పుంజులు బాగా తయారవుతాయి. ఎప్పటిలాగే కోడి పందాలలో మీ పుంజులే గెలుస్తాయి. పిల్లలేదో చెప్పారని పుంజుల్ని అమ్మొద్దండీ. చాలా నష్టమొస్తుంది. ఒక్కసారి పందెం పాట పెరిగి రెండు మూడు లక్షల దాకా పోతుంది” అంటూ నచ్చచెప్పారు.

కాని ఈసారి సుందరీ వాళ్ల నాన్న తన మనసును గట్టి చేసుకున్నాడు. తన కూతురు చెప్పిన మాటల వీటికన్నా సరైనవని అనుకున్నాడు. మూడు కోడి పుంజల్నీ బేరం పెట్టాడు. వచ్చిన రేటు తీసుకున్నాడు.

సుందరి వాళ్ల స్కూల్ కెళ్లాడు. బాత్‌రూమ్ క్కాని, ప్రహారీ గోడక్కానీ ఖర్చు పెట్టండి అంటూ 2 లక్షల యాభై వేలు రూపాయల విరాళాన్ని అందించాడు. స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మిగతా సిబ్బందీ అంతా ధన్యవాదాలు చెప్పారు. సుందరీ, సురేంద్రనూ, వాళ్ల నాన్ననూ ఎంతగానో అభినందించారు. రసీదు ఇచ్చారు. దాన్ని జేబులో పెట్టుకున్నాడు. పందెంలో గెలిచిన కోడినీ, కోడి తెచ్చి పెట్టిన లాభాన్ని బేబులో పెట్టుకున్నప్పటి కన్నా, ఈ విరాళపు రసీదును జేబులో పెట్టుకుంటుంటే ఎంత ఆనందం కలిగింది. మంచి పని చేశానన్న సంతృప్తి మనసంతా పరుచుకున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here