[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. లక్ష్మి అనే మహిళ తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]
[dropcap]”నా[/dropcap]కు నా పేరంటే అస్సలు ఇష్టం లేదు. సుబ్బలక్ష్మి అనే పాతకాలం పేరు పెట్టారు మా అమ్మా నాన్న” అంది పాఠశాల ఆవరణలో ఒక అమ్మాయి.
”నాకు చెల్లాయి అనే పేరు పెట్టారు. నాకు అది ఇష్టం లేదు. అమ్మకి, నాన్నకి, తాతయ్యకే కాదు రేపు నన్ను పెళ్లి చేసుకునే వాడికి నేను చెల్లాయిని అవుతాను” చిరాకుగా అంది ఇంకో అమ్మాయి.
”నాకు మాత్రం ఉదయలక్ష్మి అనే నా పేరంటే చాలా ఇష్టం. చీకటికి, చింతకి దూరంగా తొలి వెలుగు కిరణంలా ఉదయలక్ష్మి తూర్పున ఉదయించి చీకట్లను తరిమి కొట్టినట్లుగా నేను కూడా నా చుట్టూ వున్న చీకట్లనే కాదు నాలాంటి వారి చుట్టూ వున్న చీకట్లను కూడా తొలగించి సార్ధక నామధేయురాలినవుతాను. అంత స్ఫూర్తినిస్తోంది నా పేరు” అంది ఉదయలక్ష్మి.
అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసారు.
తనంతట తాను నాలుగడుగులు వెయ్యలేదు. పోలియో కాలివల్ల కాళ్ళకి సత్తువ లేదు. అయినా ఆమె గుండెల నిండా ధైర్యం, తనమీద తనకి అంతులేని నమ్మకం.
ఉదయ ధైర్యానికి ప్రతీక. 1954వ సంవత్సరంలో గుడ్లవల్లేరులో డాక్టర్ శివలెంక సదాశివరావు, విజయలక్ష్మిలకి మామూలు పాపగానే పుట్టిన ఉదయకి పాకడం వయసుకు తగ్గట్టు రాలేదు. దానికి కారణం 7వ నెలలో పుట్టడమే అనుకున్నారు అయిన వారందరూ. కానీ పాకడo నడవడం రాలేదు సరికదా కాళ్ళు సన్నగా బలహీనంగా తయారయ్యాయి.
ఇంట్లో కంగారు పడ్డారు. బాధపడ్డారు. ఏదయినా చేసి పాపని అందరు అమ్మాయిల్లా మార్చాలని ఆశ పడ్డారు. రకరకాల వైద్యాలు చేయించారు. అవన్నిమంచివి కాదని పాప తండ్రి డాక్టర్ సదాశివరావు చెప్పినా ఇంట్లోని పెద్దలకి ఆశ వదిలేది కాదు. మొక్కులూ, నోములూ వ్రతాలు సరేసరి. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ వేల్పు ఆశీస్సులంది పాప నడవగలుగుతుందో అన్నది వారి ఆశావాదం.
1960లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా వున్నడాక్టర్ రంగారెడ్డిగారి దగ్గరికి విషయం వెళ్ళింది. ఆయన చివాట్లు పెట్టారు. ‘మొరటు వైద్యాలతో పాపని మరింతగా బాధపెట్టకండి’ అని ఉదయ తల్లికి చెప్పి ఉదయ తండ్రి సదాశివరావుకి ‘నేనున్నానని’ ధైర్యం చెప్పి ఉస్మానియా ఆసుపత్రిలో ఉదయని చేర్చే దాకా వదలలేదు రంగారెడ్డిగారు.
ఉదయకి ఆపరేషన్ చేశారు. నాలుగైదేళ్ల ఆ పాపకి బూట్లు వేసి నడిచే సౌలభ్యం కల్పించారు.
”అమ్మా చూడు చూడు నేను ఎంత బాగా నడుస్తున్నానో. నీలాగే నడుస్తున్నాను చూసావా?”
”నాన్నా చూడు చూడు నేను నీలాగా తొందర తొందరగా నడుస్తున్నాను. నన్ను మీరు ఎక్కడికీ ఎత్తుకుని తీసుకు వెళ్ళక్కరలేదు. నా బూట్లు నన్ను నడిపిస్తాయి” నవ్వుతూ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతూ నడుస్తోంది ఉదయ.
”కొత్తగా బూట్లతో నడుస్తున్నావు కదా, కాళ్ళు నెప్పి చేస్తాయి. బూట్లు కరుస్తాయేమో కూడా. ఇవాళ్టి ఇంక చాలమ్మా” అంది తల్లి.
నడుస్తున్న ఉదయ ఆగింది. ఆమె కళ్ళనిండా నీళ్ళున్నాయి.
”లేదమ్మా యెంత నెప్పిగా వున్నా నడుస్తాను. బుజ్జి పాపాయిలు పడుతూ లేస్తూ నడిచినట్టు నేనూ నడుస్తాను. మన లేగదూడలాగా చెంగు చెంగున ఎగరలేకపోయినా నా కాళ్లతో నేను నడుస్తాను” అంది ఉదయ,.
తల్లి కళ్ళు నీళ్లతో నిండి పోయాయి. ఉదయని దగ్గరికి తీసుకుంది. కింద కూర్చుని ఉదయ పాదాల దగ్గర చూసింది. ఎర్రంగా కంది వాచిపోయి వున్నాయి పాదాలు. వాటి నెప్పి ఆ చిన్నపిల్లకి తెలియనంత సంతోషం కలుగుతున్నట్టుంది. అందుకే కన్నీళ్లతో వున్నా కళ్ళు మెరుస్తున్నాయి. పెదవులు విరిసివున్నాయి. చాలాసేపటిదాకా నడుస్తూనే వుంది ఉదయ. ఆ రాత్రి ఉదయ నిద్రపోలేదు.
”నాన్నా చాలా థాంక్స్” అంది తండ్రితో.
తండ్రి అడిగాడు – ”ఎందుకమ్మా?”
”నాకు కాళ్ళిచ్చావు కదా నాన్నా, అందుకు” అంది
”నిజంగా నీకు కాళ్ళు ఇవ్వగల శక్తి నాకంటే ఎంత బాగుండేదో” గొణిగినట్టుగా అన్నాడు.
ఉదయకి అది వినిపించలేదు. అసలు ఆమెకి ఏమీ వినిపించడంలేదు తాను బూట్లతో నడుస్తున్నప్పుడు వినిపించిన అడుగుల చప్పుడే ఆమెకింకా వినిపిస్తోంది. ఉదయ కళ్ళకి తాను నడవడమే కనిపిస్తున్నట్టుంది.
అర్ధరాత్రి ఉదయ తల్లికి మెలుకువ వచ్చింది. నిద్ర పోకుండా కూర్చున్న కూతుర్ని చూసి ”ఇంకా నిద్ర పోలేదేంటి, అర్ధరాత్రి అయింది తెలుసా?” అని అడిగింది.
”నువ్వయినా, ఇంకెవరైనా లేస్తే నా బూట్లు ఇమ్మని అడగాలని కూర్చున్నాను.”
” బూట్లా? ఇంత అర్ధరాత్రి ఎందుకే?”
”నాకు నడవాలనుందమ్మా”
”రేపు పొద్దున్న నడుద్దువు గాని పడుకో.”
”అందరు పుట్టిన యేడాదికే నడుస్తారుట కదమ్మా. నేను ఇన్నేళ్ల తర్వాత నడుస్తున్నాను. కనక నడవడం నెప్పిగా వున్నా చాలా బాగుంది. అవి తొడుక్కుంటే గుండె నిండా ధైర్యంగా ఉన్నట్టుంది.”
ఉదయ మాటలు విని అక్కడికి వఛ్చిన తండ్రికి ఆమెని చూస్తే ఎలాగో అనిపించింది. When your legs are tired you run with your heart అన్నది ఎప్పుడో చదివిన వాక్యం గుర్తొచ్చింది.
”హాయిగా నిద్రపో ఉదయా. నువ్వు నీ బూట్లతో ఇంట్లో నడవడం ఏమిటి? ఎక్కడెక్కడికో వెళ్తావు. ఎన్నెన్నో విజయాలు సాధిస్తావు. Journey of a thousand steps begins with a single step. ఇంక నీ బూట్ల ప్రయాణం ఖాయం హాయిగా నిద్రపో” అన్నాడు.
ఏ తెల్లవారు జాముకో నిద్రలోకి జారిన ఉదయకి ఎన్నెన్నో కలలు వచ్చాయి. ఆ కలల్లో తానొక సీతాకోకచిలకై ఆకాశంలో ఎగురుతోంది. గుర్రం పిల్ల లాగయ్యి పరుగుతీస్తోంది. తనకి కాళ్ళొచ్చాయి. అవి రావడం వల్ల రెక్కలూ వచ్చినట్టుంది. అందుకే ఎగురుతోంది కూడా. ఆకాశమంత ఎత్తుకు ఎగురుతూ వెనక్కి తిరిగి చూసింది.
కింద నిలబడి ఉన్నవారంతా తనవైపు అదోలా చూస్తున్నారు. రెక్కలు లేని తాను ఎగురుతోంది, కాళ్ళు లేని తాను బూట్లు కట్టుకుని గుఱ్ఱం పిల్లలా పరిగెడుతోంది అని అలా చూస్తున్నారు.
నిజమే, వాళ్లందరిలోకి తాను భిన్నం. అందుకే ఒకేలా ఉన్న అందరిని, భిన్నంగా వున్న తానూ చూస్తోంది. అదోలా నవ్వుతోంది. మీరు ఆశ్చర్యంగా చూస్తూనే వుండoడి. నేను యెగిరి యెగిరి పోతాను అంటోంది.
ఏదో చప్పుడవ్వడంతో మెలుకువ వచ్చింది .
తన కలని గురించి అందరికి చెప్పింది.
”కలలో చందమామని చూసావా?” అడిగాడు తండ్రి
తల ఊపింది.
”ఈ సారి కలలో చందమామని చేరేంత ఎగురు. చేరలేకపోయినా ఫర్వాలేదు. ప్రయత్నించు. చందమామ కోసం ప్రయ్తత్నం చేస్తే చుక్కలయినా దొరుకుతాయి.”
తండ్రి మాట సరిగ్గా అర్థం కాకపోయినా అర్థమైనట్టు తల ఊపింది
***
బూట్లతో నడవడం మొదలయ్యాక ఉదయకి జీవితం కొత్తగా అనిపించి ఉత్సాహం పెరిగింది. బడికి రిక్షాలో వెళ్లి వొచ్చేది ఉదయ. హోళీ, గోళి, బిళ్ళంగోడు అలాంటి ఆటలు వేటికి ఆమె దూరం కాలేదు. బూట్లు ఈడ్చుకుంటూనే నెమ్మదిగా ఆడేది. కుటుంబసభ్యులు, మిత్రురాళ్లూ సహకరించేవారు.
అమ్మాయి పెద్దయ్యాక బడికి పంపడం విరమించి ఆంధ్రా మెట్రిక్ కట్టించారు ఉదయని తండ్రి. ట్యూషన్ మాస్టర్ ఇంటికొచ్చి పాఠాలు చెప్పేవారు
1972లో మెట్రిక్ పాసయ్యింది ఉదయలక్ష్మి. అది ఆమె తొలి విజయం. ఏదైనా పని జరగాలి అంటే ముందు ప్రారంభించాలి. ఆ ప్రారంభం మoచి ఫలితాన్ని ఇచ్చింది అంటే ఇంక రిలాక్స్ అవ్వు అని కాదు, ఇంక నువ్వు రెస్ట్ లేకుండా శ్రమించు అని అర్ధం.
వెంటనే టైపులో చేర్పించింది తల్లి. అది అభినందనీయమైన విషయం. మొదటి అడుగు వేసేందుకు తల్లి సాయపడినట్టే జీవితంలో ఎదిగేందుకు కూడా ముందుగా చిటికెన వేలు అందించేవారుండడం అవసరం.
”ప్రతీ ఆడపిల్లా ఈ కాలంలో తన కాళ్ళమీద తాను నిలబడాలి. దివ్యాoగ యువతులయితే ఎట్టి పటిస్థితిలోనూ ఆర్థికంగా ఎవ్వరి మీద ఆధారపడకూడదు. అర్ధమయ్యిందా అమ్మడూ?” అడిగింది తల్లి.
తల ఊపింది ఉదయ.
”నేను నా కాళ్ళ మీద నిలబడడమే కాదమ్మా, నాలాంటి పదిమంది నిలబడేలా కూడా చేస్తాను” అంది.
తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు పిల్ల ఆత్మవిశ్వాసాన్ని చూసిన ఆనంద భాష్పాలో పిల్ల భవితవ్యాన్ని తలుచుకున్నాక వెలుపలికి వఛ్చిన వేదనాశ్రువులో….. ??
ఇంటికి మాస్టర్ వొచ్చి టైపు నేర్పించారు.
ఒక రోజు సరదాగా స్నేహితురాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళింది ఉదయ. అక్కడ ఆమెకి ప్రమాదవశాత్తూ షాక్ కొట్టి యెగిరి పడింది. అంతే. ఉదయ కాళ్ళకి బూట్లతో నడిచే శక్తి పోయింది.
ఉదయకి ఏడుపు తన్నుకు వొస్తోంది. చెప్పలేని బాధ. తను అందరిలా స్వంత కాళ్లతో కాదు కదా కొందరిలా పోలియో బూట్ల కాళ్లతో కూడా నడవలేదు. పసిపాపల్లా పాకాలి. కాళ్ళు శక్తిని కోల్పోయాయి కనక చేతుల సాయం తీసుకోవాలి. అలవోకగా ముందుకు పోలేదు కనక కష్టపడి ఈడుస్తూ సాగాలి. తన కాళ్లతో తము నడిచేవారిని చూసే కాదు తమా కాళ్ళమీద తాము నిలబడిన వాళ్ళని చూసి కూడా వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపించసాగింది.
టైపు పరీక్షకి డేట్ ఇచ్చ్చారు. వానాకాలం. వానలు దంచేస్తున్నాయి. అందువల్ల ఉదయని పరీక్షకి వెళ్ళద్దన్నారు.
గుడివాడ వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు వెళ్ళాలి. అందులోనూ వానలో వెళ్లడమంటే చీమ కాశీయాత్ర చేసినట్టే. ఉదయని ఆటో ఎక్కించి దింపాలి. పరీక్ష దగ్గర మళ్లీ కుర్చీ ఎక్కించాలి దింపాలి. అసలీ వానలో ఆటో దొరుకుతుందో లేదో. ఆటో దొరికినా సాయపడేందుకు ఆటో అతను సిధ్ధాంగా ఉంటాడో లేదో. ఇంటిల్లిపాదీ పరీక్ష రాసే విషయం కొట్టి పారేశారు. మళ్ళీ రాయవచ్ఛులే ఆరునెలల తర్వాతి పరీక్ష అన్నారు.
అసలే తాను తన ఈడు వాళ్ళకంటే శారీరక సమస్యవల్ల వెనకపడివుంది. ఎలాగైనా ఎదగాలనుకున్నా ఇలాంటి సమస్యలు ఎదురు వస్తున్నాయి. ఎలా వీటిని అధిగమించడం ?
తుఫాను మీద కోపం వొచ్చింది. తాను చిన్న వూర్లో వుంది, పరీక్ష పక్క వూర్లో ఉందని కోపం వొచ్చింది. అన్నింటికంటే ఎక్కువ కోపం తాను నడవలేకపోవడం మీద వొచ్చింది. కోపం ఎక్కువై కన్నీరై స్రవించలేదు. కసిగా మారింది.
చీకటిని తిడుతూ ఊర్చోడం కంటే చిరు దివ్వె వెలిగించి గదికి కాంతి నింపడం ముఖ్యం ఆని చదివినది గుర్తొచ్చింది.
ఎవ్వరితోనూ యెమీ మాట్లాడలేదు. గబగబా స్నానం చేసి చీర కట్టుకుని తయారయ్యింది.
”ఎక్కడికెళ్తున్నావే?” అడిగింది తల్లి.
“పరీక్షకి” జవాబిచ్చింది స్థిరంగా.
“నీకేమైనా పిచ్చెక్కిందా?”
“పరీక్షకి వెళ్లకపోతేనే పిచ్చెక్కేలా వుంది.”
“నీకు సాయం ఎవరున్నారు?”
“మనకి మనమే సాయం చేసుకుంటుంటే చూసి ముచ్చటపడి దేముడు సాయం చేస్తాడని చెప్పావుగా”
” అదేదో చిన్నప్పుడు నిన్ను ప్రోత్సహించడానికి చెప్పిన మాటమ్మా ఉదయా.”
” ఇప్పుడు కూడా ఆ మాటే నన్ను ప్రోత్సహిస్తోందమ్మా” అంది ఉదయ.
“మరి నీకు తోడో”
“నువ్వే చెప్పావుగా దేముడు సాయం చేస్తాడని. దేముడు మా టీచర్ని నాకు తోడుగా పంపిస్తున్నాడు. ఆవిడని అడిగాను వొస్తున్నారు” అంది స్థిరంగా ఉదయ.
టీచర్‌తో కలిసి ఆటోలో బయలు దేరింది ఉదయ. ఎనిమిది కిలోమీటర్ల దూరమే అయినా తుఫాను తాలూకు ఈదురు గాలి వానకి చాలా కష్టపడి నడపవలసి వచ్చింది ఆటోని డ్రైవర్.
అతని కష్టం గమనిస్తూ కూర్చున్న ఉదయకి ‘ఏ పనికైనా కష్టం తప్పదు’ అనిపించింది. ప్రయాణం కష్టమని తెలిసినా ఆటో అతను ముందుకు ఎలా వచ్చాడో తానూ అలాగే వొచ్చింది అనుకుంది, తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఉదయ.
ఆటో ఆపాడు డ్రైవర్. డబ్బు ఇచ్చాక టీచర్‌తో పాటు ఉదయ కిందకి దిగడానికి సాయం చేసి వెళ్ళిపోయాడు. టీచర్ ఎవరి సాయం అడగాలా అని చుట్టూ చూసింది.
“పదండి టీచర్, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది” అంది ఉదయ.
”అదే ఎలాగా అని చూస్తున్నా” అంది టీచర్. చాలా పెద్ద వాన పడుతూంది. తుఫాను వల్ల ఈదురుగాలి వీస్తోంది. పగలే చీకటిగా అనిపిస్తోంది నల్లమబ్బులు ఊగుతూ వున్న చెట్లని చూస్తే భయమేస్తోంది చెట్లు మీద పడతాయేమో… అని.
”ఇలాగ వెళదాం” అంది పాకుతూ ముందుకు సాగుతూ ఉదయ.
”అయ్యో అది కష్టమమ్మా. రాయి, రప్ప వుంటాయి. చీర తడిసిపోతుంది. ఓ పక్కన వాననీరు, కురుస్తున్న జల్లు ముందుకు పోనివ్వవు.”
”అవి పోనిచ్చేదేమిటి టీచర్. వాటి అడ్డు తొలగించుకుంటూ నేనే పోతాను చూడండి” అంది ఉదయ.
చీర తడిసిముద్దయ్యింది వానజల్లు వల్ల కళ్లకేమీ కనిపించడం లేదు. మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ నుండి లోపలికి వెళ్లేసరికి ఆయాసం వొచ్చింది. ఒంటికి ఏవేవో గుచ్చుకుని మంటపెడుతున్నాయి. పాకడం పసివారికి మామూలు అంశం. కానీ పెద్దయ్యాక అది కష్టతరం. అందులో వానలో మట్టి నేలమీద.
రొప్పుతూ చేరిన ఉదయని చూసి టీచర్ షాక్‌కి గురయ్యింది. ఆశ్చర్యపోయి చూస్తూనే లోపలివారికి విషయం అందించింది. టైపు నేర్పిన సర్ అక్కడ ఉండడంతో ఆయన అరుగు మొదట్లోనే బల్లా కుర్చీ వేయించారు. ముద్దగా తడిసి నీరు కారుతూ అడ్డుపడుతున్న చీరకుచ్చిళ్ళు, సత్తువలేని కాళ్ళు, అలసిన వొడలుతో చాలా కష్ట పడి కుర్చీ ఎక్కి కూర్చుంది ఉదయ.
”మరి నీ బట్టలు తడిసిపోయాయి కదమ్మా, ఎలా రాస్తావు అని ఆడిగాడు ఇన్విజిలేటర్
” ఏమి పర్వాలేదు సర్. గుండె ధైర్యం చేతికి బలం ఇస్తుంది” అంది ఉదయ. అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగానే పరీక్ష రాసేసింది.
ఇంటికి తిరిగి వొచ్చింది.గజాగజావొణుకుతూ కాళ్ళు గీరుకుపోయి విపరీతమైన జలుబుతో సల సలా కాలిపోతున్న జ్వరంతో వొచ్చిన ఉదయని చూసి ఇంటిల్లిపాదీ భయపడిపోయారు.
”చాలా థాంక్స్ అండీ, మా అమ్మాయికి తోడొచ్చారు” అంది తల్లి
”నేనే మీకు థాంక్స్ చెప్పాలి. మీ అమ్మాయిని చూసి నాకు స్ఫూర్తి కలిగిందివాళ. అన్నీ సవ్యంగా వున్నా ఏదో బెరుకు ఎందుకో జంకు వుండే వారందరూ ఉదయని చూసి ఎన్నో నేర్చుకోవాలి” అంది టీచర్.
ఉదయకి రాత్రికి జ్వరం బాగా పెరిగింది. అయినా అంత వొణుకులో కూడా అనుకున్నది చేయగలిగానన్న తృప్తి కలిగింది. నిశ్చింతగా వేడివేడి పాలుతాగి మందు వేసుకుని నిద్రలోకి జారుకుంది.
ఉదయ టైపు పరీక్షలో ఇన్‌స్టిట్యూట్ మొత్తం విద్యార్థినీ విద్యార్థులలో ఫస్ట్ వొచ్చింది. ఆ విజయం ఉదయకి మంచి పాఠం నేర్పింది.
‘గమ్యం చేరేదాకా ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగకూడదు. అలా ఆగక సాగే వారినే విజయం వరిస్తుంది’……. అన్నది నిజమే కదా.
తాను ‘అమ్మో వాన’ అని భయపడి ఉంటే పరీక్ష రాసేది కాదు. ఆ విధంగా చెయ్యకపోతే తనమీద తనకి నమ్మకం కలిగేది కాదు. క్లాసులో పాఠం చెప్తూ మాస్టర్ ఒక విషయం చెప్పేవారు. ‘విజయం వరించాలి అంటే మూడు ముఖ్యమైనవి ఉంటాయి. ఒకటి మన సంకల్పం. రెండు మన అంకితభావం. మూడు మన పరిశ్రమ. ఏ వ్యక్తి అయినా సత్సంకల్పంతో శ్రమిస్తే అంకితభావాన్ని తోడుచేసుకుంటే ఆతను విజయుడు.’
నేను విజయలక్ష్మిని.. కావాలంటే…. నా కాళ్ళ సమస్యని పూరించడానికి అందరికంటే కసిగా, మరింత జోరుగా చచ్చేంత శ్రమతో దూసుకుపోవాలి. అలా చేస్తేనే నేను విజయం సాధించగలను అనుకుంది ఉదయ.
***
ఇంటర్ చదివాక పరీక్షలప్పుడు కూడా ఉదయకి మళ్లీ సమస్య ఎదురయ్యింది. గుడివాడలోని ఏఎన్నార్ కాలేజీ మేడ మీద సెంటర్ వచ్చింది. పాక్కుంటూ నేలమీద సాగడం ఫర్వాలేదు, కానీ మేడ ఎక్కడం కష్టం.
”దయచేసి నాకు సాయం చేసి పరీక్ష రాయనివ్వండి” అని వేడుకుంది ఉదయ.
”వీల్లేదు ఎప్పుడో అన్ని సెట్ అయిపోయాయి. చిట్టచివరి నిముషంలో ఇదేమి గొడవ? ” అన్నారు విసుగ్గా. వాళ్ళ టెన్షన్ వాళ్ళది. విద్యాశాఖాధికారులకు వాళ్ళు జవాబుదారులు కదా.
”మాలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కింద ఏర్పాటు కూడా చెయ్యాలి కదండీ?” అని అడిగింది ఉదయ.
“ఆ సంగతేదో బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళని కనుక్కోండి మాకేమీ తెలీదు” అని చేతులెత్తేశారు.
ఉదయ అక్కడే చతికిలబడింది.
‘ఇదేంటి ఇక్కడే కూర్చున్నారు ఇంటికి వెళ్ళండి,లేదా పైకెక్కండి.”
”నేను పైకెక్కడం చాలా కష్టమండి. పోనీ నన్ను ఎక్కించగలవాళ్ళుంటే చెప్పండి” అంది.
” అలాంటి వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు” అన్నారు విసుగ్గా
” కొంచెం మానవత్వం చూపించండి.”
ఎవ్వరూ జవాబివ్వలేదు
”నేను పరీక్ష రాసి కానీ వెళ్ళను” అంది. ఎవ్వరూ జవాబివ్వలేదు.
”కాళ్ళు లేని నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను కనికరించండి” అని అడిగింది.
పరీక్ష మొదలయ్యింది. అయిదు, పది నిముషాలు గడుస్తూ పోతున్నాయి. ఉదయ వేడుకుంటూనే వుంది. చిట్టచివరికి పరీక్ష మొదలయిన 10 నిముషాలకి ఎవరెవరి అనుమతో తీసుకుని ఉదయని ఒక్కదాన్ని కింద అంతస్తులో పరీక్ష రాయనిచ్చారు.
”ఎక్సట్రా టైం ఇవ్వము. నీ ఇష్టం చూసుకో” అన్నారు
”ఫర్వాలేదు నేను రాయగలను” అంది.
వైకల్యంతో మనుగడ చాలా కష్టం. మరోలా చెప్పాలంటే అనితర సాధ్యం. ఇక ఆడవారి విషయంలో అది అసాధ్యాలలోనే అసాధ్యం. అనునిత్యం అందరితో పోరాడవలసిందే. ఎటొచ్చి పోరాడే ధైర్యం లేక కొందరు, పోరాటంలో ఓడిపోయి ఇంకొందరూ ఆడవారు సర్దుకుపోతూ ఎన్నో చెయ్యాలనుకున్నా ఏమీ చెయ్యలేక దివ్యాoగ ధీరులుగా కావలసినవారు, దీనంగా మరొకరి మీద ఆధారపడుతూ మిగిలిపోతున్నారు. పోరులేకుంటే ఎక్కడా ముందుకు పోయే అవకాశం లేదు కనక పోరు తప్పడం లేదు. అయితే ఆ పోరు ఏదేదో సాధిo చెయ్యాలని కాదు సరిగ్గా లేని కాళ్ళమీద నిలబడడానికి, కుటుంబ సభ్యులమీద ఆధారపడకుండా బ్రతకడానికి.
అలా పోరాడి రాసి పాసయ్యింది. ఉదయ అనుకున్నది సాధించింది అన్నారు ఇంట్లోని వారు. ‘పోరాడి ముందుకుపోయే ప్రయత్నం చేస్తూ ప్రతీ సంఘటన ద్వారా కాస్తంత మానసిక శక్తిని పెంచుకోగలిగాను’ అనుకుంది ఉదయ.
బియ్యే ఫైనల్ పరీక్ష సోషియాలజీతో మచిలీపట్టణం హిందూ కాలేజీలో రాసి పాస్ అయ్యింది ఉదయ.
1981 వసంవత్సరంలో బియ్యే డిగ్రీ చేతికి వొచ్చింది. తన ఈడు పిల్లలందరికంటే తాను ఆలస్యంగా డిగ్రీ తీసుకున్నందుకు బాధ పడలేదు ఉదయ. ఆలస్యంగా అయినా తాను ఎక్కడా ఆగకుండా ముందుకు సాగింది అది చాలు అనుకుంది.
తర్వాతేం చెయ్యాలి అన్నది అర్థం కాలేదు ఉదయకి. డిగ్రీ అవుతూనే పెళ్లి పీటలెక్కే మూడ్‌లోకి వెళ్లారు ఆమెతో డిగ్రీ చదివిన అమ్మాయిలు.
ఉదయ ఆశలూ ఆశయాలూ వేరు. తనలాగ అందరమ్మాయిలూ పోరాడి ముందుకు పోరు. అలాంటి దివ్యాoగులకు అండగా ఉండడానికి తాను మంచి దార్లోకి చేరాలి. ఆర్థిక స్థోమత ఉండేలా చూసుకోవాలి అనుకుంది.
మేనమామ వుత్తరం రాసారు “నీ సిర్టిఫికెట్లు పంపు వుద్యోగం వచ్చేలా చూస్తాను” అని. వెంటనే స్పీడ్ పోస్టులో సర్టిఫికెట్లు పంపింది ఉదయ.
‘నా మిత్రులు దేముడు లాంటి మనిషి రాఘవేంద్రరావుగారు హైదరాబాద్ బ్లడ్ బ్యాంకు లోని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్. ఆయన వల్ల నీకు ఈజీగా ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వస్తుంది. వెంటనే వెళ్లి ఆయనని కలు’. అని చెప్పడంతో బయలుదేరింది ఉదయ.
రాఘవేంద్రరావుగారు ఉదయని కూర్చోపెట్టి మాట్లాడారు.
”నీ భవిష్యత్తు గురించి నువ్వే విధంగా ఆలోచిస్తున్నావమ్మా?” అని అడిగారు.
”నాతోటి దివ్యాoగుల కోసం శ్రమించడం నా జీవిత ధ్యేయం సర్” అంది ఉదయ.
”ఎలా శ్రమిద్దామనుకుంటున్నావు?” అడిగారు రాఘవేంద్రరావుగారు.
”దివ్యాoగుల విద్య, ఉపాధి ప్రథమ లక్ష్యాలు. తర్వాత వారికి వివాహం జరిపించడం ఉద్దేశం. అది అంత తేలిక కాదు. అందుకే చాలా మంది అవివాహితలుగా మిగిలిపోతున్నారు. కనక వినలేని వారిని, కనలేనివారిని నడవలేనివారిని ఒక త్రాటి కిందకి తెఛ్చి మిగతావి చేస్తానండి” అంది.
” ……. ……. ???”
”నా మాట మీరే కాదు ఎవ్వరూ నమ్మరని, నమ్మలేరని నాకు తెలుసు సర్” అంది.
కాస్సేపు ఆగిన రాఘవేంద్రరావుగారు ప్యూన్‌ని పిలిచి ”అర్జెంట్‌గా చివుకుల గోపాల కృష్ణమూర్తి గారిని పిలువు” అన్నారు.
గోపాలకృష్ణ గారొచ్చారు. ఉదయని ఆయనకి పరిచయం చేశారు రాఘవేంద్రరావుగారు.
”ఈ అమ్మాయి ఆశలూ ఆశయాల గురించి మీరు వినాలి. మందుల కంపెనీలో ఆమెకి వుద్యోగం రావాలి” అన్నారు. ఉదయ వైపు తిరిగి ‘నువ్వు ఎదగాలని అనుకుంటున్నావు కదా’ అని అడిగారు రాఘవేంద్రరావుగారు.
”నేను నిలదొక్కుకోవాలనుకుంటున్నానండి. పదిమందిని నిలబెట్టేందుకు” అంది ఉదయ.
చేతులు జోడించింది ఉదయ.. ‘దేముడి ముందు మోకాళ్ళమీద కూర్చుని ప్రార్థిస్తే దేముడు కరుణించి సహకరిస్తాడట. నేను మోకాల్లమీద కూర్చోలేను కనక ఇలాగే వేడుకుంటున్నానండి. నాకు సాయపడండి’ అంది ఉదయ.
‘నీకు మాటిస్తున్నానమ్మా నీకు సాయం చేస్తాము’ అన్నారు రాఘవేంద్రరావు గారు. ‘రమ్మన్నప్పుడు వొద్దువుగాని వెళ్ళిరా అమ్మా’ అన్నారు నవ్వుతూ.
వెనుతిరిగింది ఉదయ. గాల్లో తేలిపోతున్న భావన..
‘..తనకి ఉద్యోగం రాబోతోంది. కాళ్ళు సరిగ్గా లేకున్నా వాటిమీద నిలబడపోతోంది’. మొగ్గమీద సూర్యకిరణం పడగానే విచ్చుకున్నట్టు, రాఘవేంద్రరావుగారి చిరునవ్వే తనకి మొదటి ప్రోత్సాహం ఇచ్చింది.
గుండెనిండా ఆత్మవిశ్వాసంతో గుడ్లవల్లేరుకు తిరిగి వచ్చింది ఉదయ. అందరికి ఆనందంగా తాను ఉద్యోగిని కాబోతోందని చెప్పింది.
”ఉదయా ఫోన్ వొచ్చిందమ్మా, అర్జెంట్‌గా హైదరాబాద్‌కి బయలుదేరమంటున్నారు ”
”అదేంటి ఆశ్చర్యంగా వుందే” గబగబా ఫోన్ వున్న గదివైపుకు దేకుతూ వెళ్లి ఫోన్ అందుకుంది.
”నీకు ఇబ్బంది అని తెలుసు అయినా అత్యవసరం కాబట్టి పిలుస్తున్నాను వున్నదానివి వున్నట్టే వెంటనే బయలుదేరమ్మా. నేను గోపాలకృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను” అన్నారు అవతలి వ్యక్తి.
ఉదయకి అయోమయంగా అనిపించింది. అయినా ఆలస్యం చెయ్యక తోడు తీసుకుని బయలుదేరింది. హైదరాబాద్ చేరాక విన్న వార్త ఆమెకి షాక్ కలిగించింది.
గోపాలకృష్ణమూర్తిగారితో “ఉదయ పోస్టింగ్ ఏమిటి ఎక్కడ?” అనే విషయం మాట్లాడుతూనే గుండె నెప్పి వఛ్చి రాఘవేంద్రరావుగారు కూలిపోయారట. వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారట కానీ అప్పటికే ప్రాణం పోయిందట.
ఉదయకి కాళ్ళకింద భూమి కదిలి పోతున్నట్టు అనిపించింది.
‘ఎందుకు ఎప్పుడూ తనకే ఇలా జరుగుతుంది?’
‘ఇది పూర్వజన్మ పాపమా? లేక ఏడు జన్మల పాపాల మూట తాలూకు విషయమా?’
‘ ఒక్కటి కూడా తన జీవితంలో సవ్యంగా జరగలేదు. ప్రతీ విషయమూ సందేహాస్పదమే.’
మౌనంగా కూర్చుండిపోయింది. ఆడవారికి నెత్తిమీద నీళ్ల కుండా వుంటుందంటారు. అదేంటో కానీ తనకి గుండెల్లో మంటగా ఉంటుంది. గొంతు పట్టేసినట్టుంటుంది. కానీ కన్నీళ్లు రావు.
”రాఘవేంద్రరావుగారు నీ విషయం మాట్లాడుతూ నీకు న్యాయం చెయ్యాలని చెప్తూ వుండగానే ఆయన ప్రాణం పోయింది. కనక ఆయనకి దహన సంస్కారం చేయకముందే ఆయన ఆఖరి కోరిక ప్రకారం నీకు అపాయింట్‍మెంట్ ఆర్డర్ ఇవ్వాలని రమ్మన్నాను” అన్నారు గోపాలకృష్ణమూర్తిగారు.
ఎవ్వరైనా ఎప్పుడైనా నవ్వించగలరు. కొందరేమో పనికట్టుకుని ఏడ్పించగలరు. కానీ ఎవరో ఒకరు ఎపుడో అపుడు ఏడిపిస్తూ నవ్వించగలరు..
తనకు ఆయనతో వున్నది ఋణానుబంధమేమో. అందుకే తనకి వుద్యోగం ఇప్పించగానే ఆయన అదృశ్యమైపోయారు అనుకుంది. కరములు జోడించి ఆయనకీ నమస్కరించింది ఉదయ. ‘మీ ఆత్మకి శాంతి కలగాలి సర్’ అనుకుంది మనస్ఫూర్తిగా.
పదిహేను నిముషాల్లో రాష్ట్రంలోని వాళ్ళ ఆఫీస్ సెంటర్లన్నీ పరికించి ఆర్డర్ కాపీ చేతికిచ్చారు. ఇలా చదువవుతూనే అలా ప్రభుత్వ ఉద్యోగం రావడమూ, బారు రామారావుగారితో వివాహం కావడమూ చకచకా జరిగిపోయాయి. కొద్దిగా మానసిక సమస్య ఉన్న వ్యక్తే అయినా దేముడి లాంటి వ్యక్తి రామారావుగారు.
ఆయనతో సంబంధం కుదిర్చేముందు ఇంట్లో మళ్లీ మళ్ళీ అడిగారు ‘అతన్ని చేసుకోడానికి అభ్యంతరం లేదు కదా ఆలోచించు’ అని.
‘ఆయనకి నేను మోరల్ సపోర్ట్ అయితే ఆయన నాకు ఫిజికల్ సపోర్ట్’ అంది ఉదయ.
నారాయణగూడ బ్రిడ్జి దగ్గర కట్టెల దుకాణం పక్కలో కాపురం పెట్టారు ఉదయా రామారావు గార్లు.
పెళ్లయ్యాక ఎమ్మె సోషియాలజీ కట్టి పాసయ్యింది. దివ్యాంగులకోసం 1985లో సంఘమిత్ర అనే సంస్థని గోల్కొండ చౌరస్తాలో ప్రారంభించింది ఉదయ. సంస్థ మొదలు పెట్టిన వెంటనే సేవ కార్యక్రమాలు ప్రారంభించింది.
ఇద్దరు దివ్యాంగులకు పెళ్లిళ్లు కూడా చేసింది స్వంత ఖర్చుతో. ఎందరినో చదివించడం ఉపాధి కల్పించడం చేసింది.
అప్పటివరకు జీవితం సజావుగా సాగింది. 1987లో నారాయణగూడలోంచి వీళ్ళ ఆఫీస్ వెంగళరరావునగర్‌కి మారింది. ఆఫీసుకి దగ్గరలో ఇల్లు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ముషీరాబాద్ చౌరస్తా దాకా రిక్షాలో వెళ్లి అక్కడ బస్సు ఎక్కి వెంగళరావునగర్‌లో దిగి ఆఫీసుకి వెళ్లడం చాలా శ్రమతో కూడినట్టనిపించింది ఉదయకి. కానీ ఏమీ చెయ్యలేక అలాగే అవస్థ పడసాగింది
ఒకరోజు ఆఫీసులో ఉండగా ప్రముఖవ్యక్తి పోవడంతో అప్పటికప్పుడు బంద్ ప్రకటించడం జరిగింది. అప్పటికే వూళ్ళో గొడవలు అందుకున్నాయి. ఆఫీస్ స్టాఫ్ అందరూ బిలబిలలాడుతూ వెళ్లిపోయారు. ఉద్యోగినుల భర్తలు గాభరాగా వొచ్చి భార్యలను వెంట పెట్టుకుని పోయారు. ఉదయకి ఏమి చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి ఎదురయ్యింది. రోజూ బస్సు స్టాప్ దాకా డేక్కుంటూనే వెళ్లినా బస్సు లు లేవు. ఆటోలు లేవు. ఎవరి సాయం అడగాలి. రామారావుగారు ఒక్కరే రాలేరు. వొచ్చినా వాహన సౌలభ్యమూ లేదు.
దేవుడా కార్లు అక్కరలేదు కాళ్ళుంటే చాలు అని తనలాంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకునే ఏమో ఎవరో ఆ మాటన్నారు. సాయంత్రమయ్యింది. రాత్రి ప్రవేశించింది.
ఏమి చెయ్యాలి, ఇంటికి ఎలా వెళ్ళాలి అనే సమస్యలు పీడిస్తున్నా అంతకంటే ఆమెని వేధించిన సమస్య ఆఫీస్ వాచ్‌మన్ వ్యవహారం. బాగా తాగి తూలుతూ ఉన్నాడతను. అతనేమీ చేసినా పారిపోలేని నిస్సహాయురాలు ఉదయ.
వాచ్‌మన్ పిచ్చిమాటలు వెకిలి చూపులూ ఉదయని భయపెట్టసాగాయి. గుండె దడదడా కొట్టుకోసాగింసి. ఈలోగా ఎందుకో వాచ్‌మన్ బయటకి వెళ్ళాడు. వెంటనే కష్టపడి ఫోన్ దగ్గరికి చేరి ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రకాశరావుగారికి ఖంగారుగా ఫోన్ చేసింది ఉదయ.
“నువ్వేమి భయపడకమ్మా. వెంటనే ఒక రిక్షావాడిని పంపిస్తాను. ధైర్యంగావుండు. వాడితో కూడా భయంగా మాట్లాడకు” అని చెప్పారు. ఆఫీస్ లోపల తలుపు వేసుకుని కూర్చుంది ఉదయ.
తన గుండె చప్పుడు తనకే గట్టిగా వినిపించసాగింది. చెమటలు పోస్తున్నాయి. ఏడు, ఎనిమిదయ్యింది తొమ్మిదికెళ్లింది. పదిని దాటి పదకొండుకు చేరింది. అప్పుడు రిక్షా వచ్చిదని వాచ్‌మన్ తలుపు కొట్టినా భయపడింది ఉదయ. భయపడుతూనే తలుపు తీసింది
”తలుపెందుకేసుకున్నావమ్మా తియ్యడం నీకు కష్టం కదా. అంత భయమెందుకు, నేను తోడున్నానుగా” అన్నాడు తూలుతూనే వాచ్‌మన్.
వాచ్‌మన్‌తో పాటొచ్చిన రిక్షా ఆతను వాచ్‍మన్‌ల సాయంతో రిక్షా ఎక్కింది ఉదయ. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది
“సర్ వాళ్ల కుటుంబం వారిని నా రిక్షాలోనే ఎప్పుడూ తిప్పుతానమ్మా” అన్నాడు ఆమెకి ధైర్యం కలిగిస్తూ రిక్షా అతను. సరిగ్గా 30 రూపాయలకి ఇంటి దగ్గర దింపాడు.
తాను ధైర్యస్తురాలు. జీవితంలో అనునిత్యం పోరాడుతూ గట్టి పడిన మనిషి.. కానీ రాత్రి కావడం, ఒంటరిగా ఉండడం, వాచ్‌మన్ తాగి ఉండడంతో అన్నింటికంటే ముఖ్యoగా తాను నడవలేకపోవడంతో చిన్నపాటి భయం కలిగింది.
ఇంకా ఆలస్యం చెయ్యకుండా వెంగళరావునగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుంది ఉదయ. భర్త రామారావుకి తాజ్‌మహల్ హోటల్లో సూపర్‌వైజర్ ఉద్యోగమూ తెలిసినవాళ్ల ద్వారా ఇప్పించింది.
దివ్యాంగులెందరో ఆమె ద్వారా బాగుపడ్డారు. అద్భుతమైన కధలు రాయగల నేర్పు వున్న ఉదయ వికలాంగుల పిలుపు పత్రికలో సీరియల్ కూడా రాసింది. స్వయంప్రభ అనే మహిళా పత్రికని ప్రారంభించి విజయవంతంగా నడిపింది. ఒకసారి కొందరు రచయిత్రులలో తన పత్రికలో ఒక గొప్పశీర్షిక రాయించింది. పొద్దున్న నుండి సాయంత్రం దాకా రచయిత్రులు పాల్గొన్న ఆ సభకి మద్రాస్ నుండి మాలతి చందూర్ అతిథిగా అలరించారు.
గంగాధరుగారి ఆధ్వర్యంలో 200మంది దివ్యాoగులకు అన్నదానం చేయించింది. అసలే కార్యక్రమయినా అన్నదానం ఆమె లక్ష్యం. పాపం ఆకలేసినా వెంటనే దివ్యాoగులు బయటకి వెళ్ళలేరు కానక వారికి సౌలభ్యం కలిగించాకే కార్యక్రమం గురించి ఆలోచించాలి అనుకుంటూ వొచ్చింది ఉదయ.
మంచి కుటంబం నుండి వొచ్చింది ఉదయ. తాతగారు కాశీనాధుని పూర్ణ మల్లికార్జునుడు గారు కాకినాడ ఎంపీ గా చేశారు. తండ్రి గారి తండ్రి ఆగమశాస్త్ర పండితుడు. విజయవాడ కనకదుర్గగుడి, శ్రీశైలభ్రమరాంబ గుళ్ళల్లో ఆయన అటాచ్ అయ్యి ఉండడం విశేషం.
”మల్లికార్జునుడూ నీ డైనమిజమే మీ మనవరాలికి వొచ్చింది’ అనేవారు ఆయనతో బంధు మిత్రులు.
ఉదయ ఆధ్వర్యంలో 40 మంది దివ్యాoగులకు వివాహాలయ్యాయి. చదువు, ఉద్యోగాలు చూడడమే కాక ఒత్తిడికి లోనయినవారికి కౌన్సిలింగ్ కూడా చేస్తూ వొచ్చింది ఉదయ.
”డైనమిక్ లేడీ” అనే బిరుదును పొందిన ఉదయ చాలా చోట్ల సన్మానాలు పొందింది. రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపును అందుకుంది. త్యాగరాయ గానసభలో శ్రీమతి కుముద్‍౬బెన్ జోషిగారి ముందు ”హనుమంతుడు నడవలేడు” అనే నాటిక రాసి దర్శకత్వం వహించి దివ్యాoగుల చేత చేయించిన ఘనత ఉదయకే దక్కింది.
దివ్యాoగులకిస్తున్న 2000 పింఛను తీసుకున్నా వారిని వేధిస్తున్న కన్నవారికి కౌన్సిలింగ్ చేసింది ఉదయ.. ‘మృదంగనాదం’ అనే సీరియల్, 12 కథలు, పుస్తక రూపంలో రావడానికి సిద్ధంగా వున్నాయి.
ప్రతీ సంవత్సరం దివ్యాoగులకి నిజాయితీగా సేవ చేసే వారిని సత్కరించడం సంఘమిత్ర ఆనవాయితీ. శోభా పేరిందేవిని కూడా పట్టుచీర, ప్రశంసాపత్రం మెమెంటో,శాలువ వగైరాలతో సత్కరించారు. ఆ రోజు కూడా వందలమంది త్యాగరాయ గానసభలో భోజనం చేశారు.
ఉదయ శ్రమిస్తూనే వుంది. పదవీవిరమణ జరిగింది. భర్త పోయారు. ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఆలయం కట్టించింది. అక్కడితో ఆగక ఆ గుడికి దివ్యాoగుల కోసం రాంప్ కట్టించే ఉద్దేశములో వుంది.
తెలంగాణ ప్రభుత్వం తెలుగుమహిళ ఇంచార్జిగా చేసింది. సాయికళ్యాణజ్యోతి పేరిట దివ్యాoగుల కల్యాణ వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన ఉదయ బ్రాహ్మణ జాయింట్ ఆక్షన్ కమిటీకి అధ్యక్షురాలు.
వూరికి దూరంగా వున్నా ఉదయ ఊర్లోని తన తోటివారి కోసం శ్రమిస్తూనే వుంది. దివ్యాoగులమీద ప్రభుత్వం తరుఫున ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసిన ఘనత ఆమెకి దక్కింది.
‘తన ఆత్మవిశ్వాసానికి ప్రథమ కారణం తన కుటుంబమిచ్చిన ప్రోత్సాహం, సహకారమే’ అని చెప్పే ఉదయ ‘లోపంతో పుట్టారని చిన్న చూపు చూడద్దని ప్రోత్సహిస్తే వాళ్ళు విశేషంగా ఎదగగలర’ని చెప్తుంది.
“చిన్నప్పుడు తనకి కాళ్ళు బాగుపడాలని రకరకాల వైద్యాలు చేయించేవారని, ఆరడుగుల లోతున్న గోతిలో ఎండలో కూర్చోపెట్టేవారని, తన మూడో అన్నయ్య తనకి దగ్గరలో తోడుగా కూర్చుని తన కష్టం చూసి కన్నీరు పెట్టుకునేవారని, ఆ రకమైన ప్రేమ లభిస్తే ధైర్యంగా ఉంటుంది” అంది ఉదయ.
‘గవర్నమెంట్ ఉద్యోగిని కదా అందుకని ఇన్ని కార్యక్రమాలు అలవోకగా చేసేస్తుంది’ అని తన గురించి కొందరు అనేవారని తాను తన సంపాదనతో ఎంత కష్టించి ఎన్ని చేసిందో తనకీ భగవంతుడికే తెలుసనీ చెప్పింది ఉదయ.
మంచి పనులు చేసినా కూడా విమర్శించేవారుంటారని అందుకని అవేవీ పట్టించుకోకుండా ముందుకు పోవాలని ఆమె వివరించింది.
‘దివ్యాoగులు, మామూలు వారు పెళ్లిళ్లు చేసుకోవాలన్నది తన కోరిక’ అని చెప్పిన ఉదయ అఖిల భారత బ్రాహ్మణ సేవాసమితి ద్వారా కూడా కార్యక్రమాలు చెయ్యడం విశేషం.
దేముడు మనకి చేతులూ కాళ్ళు ఇచ్ఛేది పక్కవారికి కాస్తంత తోడ్పడడానికే. అయితే కాళ్ళు పని చెయ్యకపోయినా, ప్రస్తుతం చెవులు సరిగ్గా వినపడకపోయినా అవేవి ఉదయ సేవానిరతికి అడ్డు కాలేదు.
‘సంచిక పత్రిక లో ఈ విజయ కథని చదివే దివ్యాoగులకు మీరిచ్చే సలహా ఏమిటి?’ అని అడిగితే ఉదయ ఇలా జవాబు చెప్పింది.
- ఎవ్వరినీ ఎప్పుడూ సాయం కోరకు. నిన్ను నువ్వే నమ్మి నీకై నువ్వు శ్రమించు. నీ నీడని కూడా నమ్ముకోకు. అది కూడా చీకటికి జడిసి నిన్ను వొదిలి పోతుంది.
- నిన్ను నువ్వు నమ్మడమే నీ మొదటి విజయం.
- నువ్వు సమాజంలో బాగా మెరిసిపోవాలంటే సూర్యుడిలా సలసలలాడాలి. సమయపాలన చేస్తూ సాగిపోవాలి అంది
బొటన వేలు యెత్తి ‘అల్ ది బెస్ట్’ అన్నట్టుగా ఉదయ.