జీవన రమణీయం-102

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]”ఆ[/dropcap] కుంక ఇందాక ఎక్కువ నవ్వుతూ, తుళ్ళుతూ కబుర్లు చెప్పినప్పుడే అనుకున్నాను, సూట్‌కేసులు రావేమోననీ” అన్నాను నేను. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మాధవ్ దుర్భాని చూడగానే “మా తమ్ముడేడీ?” అని ఫణి డొక్కా గురించి అడిగితే, “చూశారా! ఎంతైనా మీకు ఫణి మీదే ఎక్కువ అభిమానం” అన్నాడతను. కానీ మాధవ్ ఆ తర్వాత నాకు సోదరుడు, మా అబ్బాయికి మెంటర్‌గా కూడా మారాడు. అతని మూలాన వాళ్ళ అక్క సుజన నాకు ప్రియమైన చెల్లిగా, బావగారు పాలూరి రామారావు గారు కూడా నాకు ఆత్మీయులుగా మారారు!

నేను వీల్ ఛైర్‌లో రావడం చూసి, ఝాన్సీ, ప్రదీప్ మాచిరాజూ “ఛీ! అస్సలు సూట్ కాలేదు రమణీ గారూ మీకీ వీల్ ఛైర్, దిగిపొండి… అన్నారు.

ఇంతలో ఫణి వచ్చి “అక్కా” అని దగ్గరకి తీసుకోగానే, నా పుట్టింటికొచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. ఫణి నటి హేమని చూసి “మీ ఎర్రపూల దుప్పటి తెచ్చారా?” అని ‘అష్టాచెమ్మా’లో డైలాగ్ గుర్తు చేసాడు.

శ్రీనివాసరెడ్డి వచ్చి, ఓ ప్యాకెట్ నా చేతిలో పెట్టి, “మీరూ టీ షర్టే వేసుకోవాలి… సూట్‌కేసులు రాలేదు” అన్న శుభవార్త చెప్పాడు. కానీ నా హేండ్ లగేజ్‍లో నేను రెండు జతలు ఎప్పుడూ పెట్టుకుంటాను. మొదటి అమెరికా యాత్రలోని సూట్‌కేస్ మిస్సింగ్ ప్రహసనం ఏం చిన్నది కాదు కదా! జీవితంలో అనుభవాన్ని మించిన గురువెవరని?

నాతో వచ్చిన భువనకృతి వాళ్ళక్క సుజలకృతీ, బావా రాగానే, ‘తుర్‌ర్’మని పారిపోయింది.

మేం సూట్‌కేసులు ఎక్కడికి రావాలో ఎడ్రెస్‌లు రాసిచ్చి పోయాం. అప్పటికే 28 గంటలయింది, నడుం నిటాక్కూ సీటుకి చేరేసి పెట్టి, మాధవ్ కారులో మేము ఫణి ఇంటికి బయలుదేరాము. మాకు వసతి మేరియట్‌లో ఇచ్చారు. కానీ మా తమ్ముడి ఇల్లూ మరదలినీ, పాప పల్లవినీ చూడాలి కదా!

డొక్కా ఫణి ఇల్లు, అట్లాంటా

ఫణి ఇల్లు అట్లాంటాలో చూడవలసిన ప్రదేశం! ఎంత అందంగా వుందో. ఇల్లు అంటే కిందా పైనా కలిపి ఆరు బెడ్‌రూమ్‌లూ, దేవేంద్ర భవనాల్లాంటి హాల్ళూ, మన మొత్తం ఇల్లంతా కలిపినంతటి బాత్‌రూమ్‍లూ అక్కడ చాలామందికే వుంటాయి! కానీ ఫణి ఇంటి ప్రత్యేకత ఏంటంటే… సంగీతం! అతను పియానో వాయిస్తాడు, హార్మనీ వాయిస్తాడు, వీణ వాయిస్తాడు, వయొలిన్ వాయిస్తాడు, శ్రావ్యంగా పాడతాడు, చక్కగా రాస్తాడు, చంధోబద్ధంగా కవిత్వం రాయగలడు, పద్యపాదాలు పూరించగలడు, అష్టావధానాల్లో అసందర్భ ప్రలాపంతో నవ్వించగలడు, ‘టేక్ ఇట్ ఈజీ’ లాంటి ఫీచర్స్‌లో కడుపుబ్బ నవ్వించగలడు! సర్వకళా వల్లభన్! అన్నట్టు ఓ సారి డాన్స్ బాలేలో పార్టిసిపేట్ చేసాడు, కూచిపూడి నృత్య రూపకం రాసాడు. తర్వాత దర్శకుడిగా మారాడు… ఇంకా తర్వాత… ఎన్నెన్నో చేయాలని నా అభిమతం!

ఆ ఇల్లు సంగీతాలయం! ఆ ఇంటి ఇల్లాలు గాయత్రీ అయ్యల అపర అన్నపూర్ణ. గాయత్రి నిమిషానికి పది సెంటెన్స్‌ల వేగంతో మాట్లాడగలదు. పుట్టి పెరిగింది ఒరిస్సాలోని భువనేశ్వర్‍లో. ఒరియా, బెంగాలీ, హిందీ, తెలుగూ, ఇంగ్లీషూ మాతృభాషలా మాట్లాడేయగలదు కానీ, ఫణికి ఫేస్‌బుక్‌లో ఎవరైనా తెలుగులో కామెంట్ పెడ్తే, “శీనూ, శీనూ! ఏం రాసారూ… చదివి చెప్పు” అనే తెలుగమ్మాయి. వాళ్ళకి అప్పటికి ఒక పాప పల్లవి. ఆ పాపకి కూడా జన్మతః సంగీతం వచ్చేసింది అంటే అతిశయోక్తి కాదు! పదేళ్ళ వయసులో ‘మాటే మంత్రమూ… మనసే బంధమూ’ పాట పియానో మీద వాయించి, వాళ్ళ నాన్నతో గొంతు కలిపి డ్యూయెట్ పాడేస్తుంటే నోరు తెరిచి విన్నాను. అసలు ఎవరి దగ్గరా పియానో వాయించడం నేర్చుకోలేదంటే ఇంకా ఆశ్చర్యపోయాను. నేనూ, మాధవ్, ఫణీ వెళ్ళేసరికీ గాయత్రి అన్నం, సాంబారు, చపాతీలూ, బంగాళాదుంపల కూరా చేసి రెడీగా పెట్టింది. ఈ బంగాళాదుంపలకీ, మా ఫణికి అవినాభావ సంబంధం! “అక్కా, మీ ఇంటికొస్తే బంగారు కణికల్లా బంగాళదుంపలు వేయించి పెడ్తావా?” అన్నది నేను పరిచయం అవగానే ఫణి మొదటి ప్రశ్న! ఓ పక్క మణుగు బంగారం, ఇంకో పక్క బంగాళాదుంపల బస్తా వేస్తే, బంగాళాదుంపల బస్తా వైపే మొగ్గు చూపుతాడు మా ఫణి… అంత ఇష్టం! నేను మొదటిసారి వెళ్ళినప్పుడు పల్లవి ఒకత్తే పాప, కానీ, రెండవసారి వెళ్ళేసరికీ ప్రణవి పుట్టింది. “అదీ పుట్టగానే టమాటా అనమన్నా ‘పొటేటో’ అనే అంటోంది… ఆ పేరు తప్ప వేరే వెజిటబుల్ పేరు చెప్పదు” అని తెగ మురిసిపోయాడు.

నన్ను చూడగానే, “రమణీ గారూ! శ్రీను చెప్పాడు మీ గురించి” అన్న గాయత్రి, రెండు నిమిషాల్లో, “అబ్బా… అక్కా అంటానక్కా, ఈ ఏవండీలు మనకొద్దులే!” అనేసింది. గాయత్రి అందం ఏ సినీ తారకీ తీసిపోదు… వాళ్ళకన్నా చాలా బావుంటుంది! వాళ్ళయితే మేకప్‌లు తీస్తే తేడా కొడ్తారు. కానీ గాయత్రి “అక్కా… ఏదైనా టీవీ సీరియల్‌లో నాకు ఎక్స్‌ట్రా వేషం ఇప్పించవా? లేదా నాగుపాము బొట్టు పెట్టుకునే ఆడ విలన్‌గానైనా…” అని వెంటబడింది. “నీకు ఎక్స్‌ట్రా ఖర్మేం గాయత్రీ, ఇంత అందంగా వున్నావు?” అంటే, “అబ్బా! అదే నా లైఫ్‌లో కోరిక, ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్‌నే అవుతా” అనేది. సరదాగా ఇలా మాట్లాడే గాయత్రి చాలా టాప్ పొజిషన్‌లో ఉద్యోగం చేస్తోంది. ఎంత మంది అతిథులొచ్చినా ఒంటి చేత్తో వంట చేసి పెట్టి, డొక్కా సీతమ్మగారి వారసులం అని నిరూపించేస్తుంది.

మాధవ్ దుర్భా భార్య డా. అపర్ణ, కూతురు
మాధవ్ పిల్లలు

మాధవ్ భార్య అపర్ణా పితాంబరం కూడా తక్కువేం కాదు. ఇద్దరు పిల్లలు సాధనా, అభీ. అభీని నేను ‘రసగుల్లా’ అని పిలుస్తాను. అంత ముద్దుగా వుంటాడు. ఆ అమ్మాయి పీడియాట్రీషియన్. ఇంట్లో అస్వస్థతతో వున్న అత్తగారినీ, మావగారినీ, ఇద్దరు చిన్న పిల్లల్నీ చూసుకుంటూ, క్లినిక్ కూడా నడుపుతుంది. అక్కడ మోస్ట్ ఎఫీషియంట్ పీడియాట్రీషియన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి అమ్మాయి మరునాడు మా కోసం గారెలూ, దోసకాయ పఛ్చడీ పెద్ద ట్రే నిండా చేసి తెస్తే, ఆ అమెరికా అమ్మాయిల పనితనానికి అబ్బురపడ్డాను. నేను గాయత్రి ఇంట్లో మేడ మీద బెడ్‌రూమ్‌లో మంచం చూడగానే, ఒళ్ళు మరిచి అలా నిద్రపోయానో లేదో, అర్ధరాత్రి మూడు గంటల వేళ నా తలుపులు ఎవరో ‘దబదబా’ బాదారు. అసలు కళ్ళు తెరిస్తే నేను ఎక్కడున్నానో నాకే తెలీలేదు. హంసతూలికా తల్పంలా గదంతా వున్న పెద్ద పట్టి మంచం లాంటి ఎత్తైన మంచం! మెత్తని పరుపులూ, దిండ్లూ మధ్య పెద్ద గదిలో… అది ఎవరిల్లో గుర్తుకురాలేదు! కానీ తలుపుమీద దబదబా శబ్దం! టైం చూస్తే మూడు అవుతోంది కాబట్టి గాయత్రి కాదు! లేచెళ్ళి తలుపు తీస్తే ఒకావిడ, “బాత్‌రూమ్ డోర్ మీరు లోపలి నుండి గెడ పెట్టారు, బయట నుండి నాకు వెళ్ళడానికి వీలుగా లేదు” అంది. బాబ్డ్ హెయిర్‌తో పెద్ద బొట్టుతో వుందావిడ. నేనెళ్ళి తలుపు తెరిస్తే థాంక్స్ చెప్పిందో లేదో గుర్తు లేదు కానీ మళ్ళీ వచ్చి పడుకున్నాను. ఆవిడ కూడా రచయిత్రిట, పేరు రాధిక. తర్వాత తెలిసింది మా వారు చిన్నప్పటి ఫ్రెండ్ శేషాద్రికి వదినగారు (భార్యకి అక్క) అని!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here