[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా గుర్విందర్ సింగ్ దర్శకత్వం వహించిన పంజాబీ సినిమా ‘చౌతీ కూట్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘చౌతీ కూట్’ (పంజాబీ)
[dropcap]పం[/dropcap]జాబీ నయా దర్శకుడు గుర్విందర్ సింగ్ సినిమాలు పాలీవుడ్ (పంజాబీ సినిమా) నుంచి వచ్చే అసంఖ్యాక వ్యాపార సినిమాల మధ్య ఓ వైవిధ్యంతో వుంటున్నాయి. వ్యాపార సినిమాలే తప్ప, సమాంతర సినిమాలు అంతగా నిర్మించని పంజాబ్ నుంచి, అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి పెట్టిన రెండు సమాంతర సినిమాలు అందించాడు. ‘అహనే ఘోరే డా దాన్’ (గుడ్డి గుర్రానికి అన్నదానం – 2011), ‘చౌతీ కూట్’ (నాల్గో దిక్కు -2015) అనే రెండు సినిమాలూ కథానికల ఆధారంగా తీసినవే. మొదటిది పంజాబ్‌లో దళితుల సమస్యమీద, రెండోది పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమ పరిస్థితుల మీద. ఏది తీసినా అతను సినిమాని కథతో కొలవడు, కెమెరాతో కొలుస్తాడు. కథతో కొలిస్తే అది కాలాన్ని, దూరాన్నీ సంక్షిప్తీకరిస్తుంది. కెమెరాతో కొలిస్తే ఆ కెమెరా కాలాన్ని, కాలంతోబాటు దూరాన్నీవిశాలం చేసేస్తుంది. కాల దూరాలు విశాలమైనప్పుడు అనుభవం ఇంట్లో కరోనా వెకేషనంత కమ్మగా వుంటుంది. గుర్విందర్ ఆల్టర్నేట్ సినిమాలు చూడ్డం ఈ అనుభవమే.
గుర్విందర్ పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్థి. అపార అంతర్జాతీయ సినిమా శాస్త్రాల అధ్యయనంతో తన విజన్ తానేర్పర్చుకున్నాడు. కథ నిశ్చలమైనప్పుడు కథనం వుండదంటాడు. కథ చూపించాలే గానీ, కథని మర్చిపోయేట్టు కథనం చేయకూడదంటాడు. నిజమే, కథని నిశ్చలం చేసి అందులోంచి కెమెరాతో కాలాన్ని, దూరాన్నీ సాగదీసినప్పుడు, దానికదే కథనం చేయని నిఖార్సైన కథనమైపోతుంది. కథ కవిత్వంగా వుంటే, ఆ కవిత్వానికి భావం తప్ప కథనముండనట్టే, కాల దూరాలు కూడా అనుభవం కావు. కాల దూరాల్ని కెమెరా ఒక్కటే సాగలాగి లాగి, కథనమన్పించని కథనం చేసేయగలదు.
ఇలా చేస్తూ ఇంకో ప్రయోగానికి పాల్పడ్డదేమిటంటే, కవిత్వం కళకి సంబంధించింది. క్రాఫ్ట్‌తో దానికి సంబంధం లేదు. కళ హృదయ సంబంధమైనదైతే, క్రాఫ్ట్ బౌద్ధిక మైనది. అతను ఈ కవిత్వాన్ని క్రాఫ్ట్ చేసేసి కళని తుంగలో తొక్కాడు! ఆర్ట్ సినిమాని కళాత్మకంగా తీసే ఆనవాయితీని కూడా బ్రేక్ చేసి పారేశాడు.
దీంతో కూడా ఆగలేదు. రెండు వేర్వేరు కథానికల్ని కలిపి సినిమా తీసేసి కథా శిల్ప నియమాలని కూడా త్రుంచి పారేశాడు. విచిత్రమైన పద్ధతిలో ఒక కథానికని ఇంకో కథానికతో కలిపేశాడు. రెండు ప్రసిద్ధ కథానికలూ ఒకే రచయిత రాసినవి కావడం సమస్యలు తెచ్చిపెట్టలేదు. పంజాబీ రచయిత వర్యం సింగ్ సంధూ రాసిన ‘చౌతీ కూట్’, ‘హూఁ మై ఠీక్ టాక్ హాఁ’ అనే రెండు కథానికల్నీ కలిపి ఈ ప్రయోగం చేశాడు. వీటితోబాటు మరికొన్ని కథానికలతో కూడిన సంకలనానికి సంధూకి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. దర్శకుడు గుర్విందర్ తను పంజాబీయే అయినా, పంజాబీ రాయడం చదవడం రానితను, ఆంగ్లానువాదాలు విరివిగా చదివి పంజాబీ సాహిత్యం తెలుసుకున్నాడు. ఇంతకీ ఏమిటా రెండు కథానికలు?
హిందూ – సిక్కు- ఓ పెంపుడు కుక్క
హిందువులైన ఇద్దరు స్నేహితులు జుగల్ (కన్వల్జిత్ సింగ్), రాజ్ (హర్నేక్ ఔలఖ్) లు అమృత్‌సర్‌కి వెళ్లేందుకు ఫిరోజ్‌పూర్ స్టేషన్‌కి ఆదరాబాదరా వచ్చేస్తే, వచ్చిన రైలు కాస్తా అదే టెర్మినల్ స్టేషన్ కావడంతో దిక్కు తోచని స్థితిలో పడతారు. ఇంకో ట్రైను తెల్లారే దాకా వుండదు. ఒక గూడ్స్ అమృత్‌సర్ కెళ్లేందుకు సిద్ధంగా వుంటుంది. గార్డుని బతిమాలుకుని వినకపోతే, బలవంతంగా కదులుతున్న గార్డు వ్యానులోకి తోసుకుని ఎక్కేస్తారు. వాళ్ళతోబాటు ఒక సిక్కు పెద్దమనిషి కూడా ఎక్కేస్తాడు. వ్యానులో ఒక సెక్యురిటీ గార్డు, ఇద్దరు సిక్కు యువకులు, ఇంకో ఇద్దరు రైల్వే ఉద్యోగులూ వుంటారు. హిందూ మిత్రులిద్దరూ సిక్కు యువకుల్ని చూసి అనీజీగా ఫీలవుతూంటారు. సిక్కు యువకులు వీళ్ళిద్దర్నీ అనుమానంగా చూస్తూంటారు. అసలే అది ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమకాలం. బింద్రన్ వాలే తీవ్రవాద దళాల హింసాత్మక దాడులు. హిందూ సిక్కుల మధ్య పరస్పర నమ్మకాలు సన్నగిల్లిన వాతావరణం. ఈ నేపధ్యంలో పట్టాలు పటపట లాడించుకుంటూ గూడ్స్ వ్యాను లోపల పరమ ఉద్రిక్త వాతావరణాన్ని మోసుకుంటూ, ఈడ్చి కొట్టినట్టు రాత్రి చీకట్లోకి దూసుకు పోతూంటుంది… అలా కదలకుండా బిగుసుకుని కూర్చున్న జుగల్ కి, ఆరునెలలు వెనుక జరిగింది గుర్తు కొస్తుంది…
ఆ రాత్రి జుగల్ భార్యని, కూతుర్నీ తీసుకుని మామగారి గ్రామానికి కాలినడకన బయల్దేరి దారితప్పి, ఇంకో గ్రామంలోకి వెళ్ళిపోయాడు. సందేహిస్తూనే ఒకింటి తలుపు కొట్టాడు. అది సిక్కులుంటున్న ఇల్లు. ఇంటి యజమాని జోగిందర్ సింగ్ (సువీందర్ విక్కీ) తలుపు తీసి అనుమానంగా చూశాడు. తను రాంపూర్లో పండిత్ రాంనాథ్ అల్లుడ్నని, వూరు దారితప్పాననీ జుగల్ చెప్పుకున్నాడు. రాంనాథ్ పేరువిని జోగిందర్ లోపలికి రానిచ్చాడు. జోగిందర్ తల్లి (గుర్ ప్రీత్ భంగు) జుగల్ భార్యని చూసి, నువ్వు పండిత్ పెద్ద కూతురు ప్యారీ కదూ అంటే, కాదు ప్యారీ చెల్లెలు పారూనని చెప్పుకుంది జుగల్ భార్య (మన్ దీప్ ఘాయ్). ముగ్గుర్నీ ఆప్యాయంగా కూర్చుబెట్టుకుని యోగ క్షేమాలడిగారు.
జోగిందర్‌కి తల్లితో బాటు, భార్య, కొడుకు, కూతురూ వున్నారు. కుటుంబంలో కలిసిపోయిన పెంపుడు కుక్క టామీ వుంది. జోగిందర్ భార్య (హర్లీన్ కౌర్) వాళ్ళకి భోజనం పెట్టాక, వాళ్ళని తీసుకుని చీకట్లో రాంపూర్ కి బయల్దేరాడు జోగిందర్. అక్కడ వాళ్ళని సురక్షితంగా ఇంటికి చేరవేశాడు.
దీంతో మొదటి కథానిక ‘హూఁ మై ఠీక్ టాక్ హాఁ’ (నేను క్షేమంగానే వున్నాను లెండి) ముగిసింది. ఇక రెండో కథానిక ‘చౌతీ కూట్’…
జోగిందర్ ఇంట్లోకి ఆ రాత్రి నల్గురు తీవ్ర వాదులు వచ్చేస్తారు. టామీ ఒకటే అరుస్తూంటుంది. వీళ్ళు మళ్ళీ ఈ రాత్రి తిండికి, తలదాచుకోవడానికి వచ్చేశారు. ముందు టామీ నోర్మూయించమంటారు. మళ్ళీ ఈ పరిస్థితికి జోగిందర్ భయపడిపోతాడు. టామీని ఎంత వూరుకోబెట్టినా వూరుకోదు. దాన్ని చంపెయ్యమంటారు. ఎన్నిసార్లు దాన్ని వదిలించుకోమని చెప్పాలంటూ జోగిందర్ ఛాతీకి తుపాకీ పెడతారు. ఎన్నిసార్లు దాన్ని వదిలించుకోబోయినా అది ఇంటికే తిరిగొస్తోందంటాడు. ఎలాగో కష్టపడి ఇప్పుడు దాన్ని వూరుకోబెడతాడు. భార్య వాళ్ళకి వండి పెడుతుంది. వాళ్ళు తెల్లారే ముందే వెళ్ళిపోతూ, ఈసారి తాము వస్తే కుక్క కనపడకూడదని తీవ్ర హెచ్చరిక చేస్తారు. తెల్లారే సమాచారమందుకుని సీఆర్పీఎఫ్ దళం వచ్చేస్తుంది. భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఇంటిని చిందరవందర చేసేస్తారు ఆయుధాల కోసం. తమ ఇంటికెవరూ రాలేదన్నా విన్పించుకోరు. ముందు తమ మీద ఎగబడుతున్న టామీని షూట్ చేసేయమంటాడు ఇన్స్‌పెక్టర్ (రవి గౌడ). కానిస్టేబుల్ గురి చూసి షూట్ చేసేస్తాడు…
ఇక జోగిందర్ కుటుంబానికి ఇటు తీవ్రవాదులతో, అటు పోలీసులతో విపత్కర పరిస్థితేర్పడుతుంది. మనశ్శాంతి కరువైపోతుంది. ఇంకోవైపు కుటుంబ మనుగడకి టామీ ఉనికి సమస్యై పోతుంది. టామీని ఎలా చంపుకోవాలన్న ఆందోళనలో పడిపోతాడు జోగిందర్. భయమా, మానవత్వమా? దేనికి లొంగాలి? మానవత్వం కోసం భయాన్ని జయించగల్గాడా?… ఇలా భయం వల్ల కరువైన మనశ్శాంతి కోసం ఏ నిర్ణయం తీసుకున్నాడన్నది ఇక మిగతా కథ.
ఎలా వుంది కథ?
రెండు కథానికల పెద్ద కథ. 1984 నాటి పంజాబ్ చారిత్రక స్థితికి దర్పణం. అక్కడి సమాజం మీద ఖలిస్థాన్ ఉద్యమ ప్రభావ చిత్రణ. మానవత్వానికి మనిషీ – జంతువూ అన్న భేదం సిగ్గు చేటన్న భావంతో కథా ప్రయోజనం. ఈ కథలో ఉద్యమం తాలూకు హింసాత్మక వాతావరణం కేవలం వార్తల రూపంలో నేపధ్యంలో పరోక్షంగా వుంటుంది. ప్రత్యక్షంగా పాత్రలు ఆ ప్రభావాన్ని రెండు రకాలుగా అనుభవిస్తూంటాయి: సామాజికంగా, వ్యక్తిగతంగా. ఆ సామాజిక, వ్యక్తిగత దురనుభవాల్లో సామాజిక విలువల్ని బలి చేయకపోవడం కన్పిస్తుంది. మత వర్గాల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితుల్లో, పోలీసులతో, సిక్కు తీవ్రవాదులతో తామెన్ని బాధలు పడినాసరే – మెజారిటీ వర్గం (సిక్కు), మైనారిటీ వర్గాన్ని (హిందూ) ఆదుకునే సామాజిక విలువల వైపే వుండే విధంగా పాత్రలు ప్రవర్తిస్తాయి. ఇదే మానవీయ ప్రవర్తన మూగ ప్రాణి విషయంలో లోపించడం ఒక విషాదంగా ముగుస్తుంది.
ఆ అర్ధరాత్రి కుటుంబంతో దారితప్పి జోగిందర్ సింగ్ ఇంటికొచ్చిన జుగల్ కుటుంబం పట్ల జోగిందర్ సింగ్ కుటుంబం చూపే బాధ్యత ఒకవైపు. ఎప్పుడు పడితే అప్పుడు తీవ్రవాదులు బస చేయడానికొచ్చేసి పెడుతున్న బాధలతో, మరోవైపు పోలీసులకి తెలిసిపోయే రిస్కు నెదుర్కొంటున్నజోగిందర్ కుటుంబం, జుగల్ కుటుంబం పట్ల ఎలాటి అసహనం కనబర్చకపోగా, వాళ్ళ క్షేమమాన్ని కోరుకోవడంలో ఈ మానవీయ విలువ కన్పిస్తుంది.
వాళ్ళకి భోజనం పెట్టి పడుకోబెట్టుకోకుండా, అంత రాత్రి పూట తీసుకుని రాం పూర్ బయల్దేరడ మేమిటన్నలాజిక్ అడ్డుపడుతుంది. తెల్లారేక తీసికెళ్ళ వచ్చుగా? ఎందుకంటే ఈ మొదటి కథానిక వరకూ జోగిందర్ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి మనకి చెప్పడు దర్శకుడు. అందుకని లాజిక్ అడ్డు పడుతుంది. రెండో కథానిక ఇంట్లో తీవ్రవాదులతో ప్రారంభమైనప్పుడు, లాజిక్ క్లియర్ వుతుంది. వాళ్ళని ఇంట్లో వుంచుకుంటే తీవ్రవాదులతో ప్రమాదముండొచ్చు కాబట్టే అలా తీసికెళ్ళి పోయాడన్న మాట.
రెండో కథానికలో కేంద్ర బిందువు పెంపుడు కుక్క టామీ. ఎంతో విశ్వాసంతో వుంటుంది. పిల్లలు ఎంతో ప్రేమిస్తారు. రేయింబవళ్ళూ ఇంటికి కాపలా వుంటుంది. తీవ్రవాదుల సమస్య వల్లే కుక్క కుటుంబానికి బరువై పోతుంది. కుక్క మొరుగుళ్ళు జోగిందర్ ఇంట్లో తీవ్రవాదుల బసకి ప్రమాదం. అలాగని దాన్ని కాల్చి చంపలేరు. ఆ శబ్దం మరింత ప్రమాదం. వదిలించుకో, లేదా చంపు – అని జోగిందర్‌కే డిమాండ్లు. అతను ఎంత దూరం దాన్ని వదిలేసి వచ్చినా ఇంటికే వస్తోంది. ఇక తప్పక గ్రామసర్పంచ్‌ని ఆశ్రయించి కుక్క వల్ల నిద్ర పట్టడం లేదని అబద్ధం చెప్పి, కుక్కకి ఇంజెక్షన్ వేయించమంటాడు. ఇంజెక్షన్లు వేసే ముఖా సింగ్ ఇక తను కుక్కల్ని చంపనంటాడు. చంపకపోతే నువ్వు చస్తావంటాడు సర్పంచ్. చంపుకోమంటాడు ముఖాసింగ్.
ఇలా ఈ ప్రయత్నం కూడా ఫలించక పోవడంతో పెంపుడు కుక్క టామీని పాత గదిలో బంధిస్తాడు. బంధించినా రాత్రంతా మొరుగుతూనే వుంటుంది. ఎంత వూరుకోబెట్టినా వూరుకోదు. ఇప్పుడిక జోగిందర్ లోని సాకులు వెతికే మనిషి… నెమ్మదిగా వెలుపలికొస్తాడు… కుక్క కారణంగా తీవ్రవాదులతో బాటు, పోలీసుల భయం వెన్నాడుతోంటే, ఆ భయానికి లొంగి దాన్ని వదిలించుకునే ప్రయత్నాలన్నీ చేశాడు. చివరికి ఇంజెక్షన్‌తో చంపి వదిలించుకునే ప్రయత్నమూ అయ్యాక, ఇప్పుడు దీన్ని వదలించుకునే కారణం భయం కాదన్నట్టు, వెధవ కుక్కతో నిద్ర చెడుతున్నట్టూ, సర్పంచ్ దగ్గర వెతికిన సాకునే ఆసరాగా చేసుకుని, మనసుకి నచ్చజెప్పుకుని, భార్యకి కూడా చెప్పుకుని, ఒక లావాటి కర్ర చేతిలోకి తీసుకుంటాడు….
ఇప్పుడెలాటి అపరాధ భావమూ లేదు. భయం అనుకుంటేనే అపరాధభావం, మానవత్వం అడ్డొస్తాయి. ఎందుకంటే జుగల్ కుటుంబం విషయంలో భయపడకుండా, మానవత్వం, సామాజిక విలువలు అంటూ ప్రదర్శించుకున్నాడు మరి. అలాటిది కుక్క విషయంలో వీటిని వదులుకోవడానికి అదే భయం కారణం కాకూడదు. కేవలం నిద్ర కరువవడమే కారణమైతే సర్ది చెప్పుకోవడానికి సబబుగా వుంటుంది… చేతిలో కర్ర కూడా ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తుంది …
ఇలా ఈ రెండో కథానికలో మూగ ప్రాణితో అమానవీయ ప్రవర్తన అతడిలోని రెండో రూపాన్నినిట్టనిలువునా నగ్నంగా నిలబెడుతుంది.
కళ్ళతోనే నటనలు
టామీ సీజీ కుక్క కాదు, బాగా తర్ఫీదు నిచ్చిన నిజ కుక్క. దీనికి నటించడమెలా వచ్చో వచ్చు. ఫ్రేములో ఎట్నుంచి ఎంట్రీ ఇచ్చి ఎటు వెళ్ళాలో అటే వెళ్తుంది. తెల్లారి సీఆర్ఫీఎఫ్ దళం వచ్చే ముందు, దానికి ఆహారం పెట్టి ఎంత తినమన్నా తినదు. తల ముంత మీదికి లాగినా ముట్టుకోదు. ఇంటి మీదికి రాబోతున్న ప్రమాదాన్ని పసి గట్టి వుంటుంది, అందుకే తిండి ముట్టుకోవడం లేదు. దీనికి ఈ సీనులో ఇలా నటించాలని ఎలా తెలిసిందో తెలిసింది. సీఆర్పీఎఫ్ దళం వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా కలబడాలో కూడా నటన దానికి బాగా తెలిసే వుండాలి. టామీ ఒక వెంటాడే జ్ఞాపకం.
ప్రధాన పాత్ర జోగిందర్ సింగ్‌గా నటించిన సువీందర్ విక్కీ, పాత్రకున్న మానసిక సంక్షోభాన్ని కళ్ళతోనే నటిస్తాడు. ఆ మాటకొస్తే ఇతర నటీనటులందరూ కళ్ళతోనే నటిస్తారు. ప్రారంభంలో రైల్వే స్టేషన్లో కన్వల్జిత్ సింగ్, హర్నేక్ ఔలఖ్‌ల దగ్గర్నుంచీ చివర్లో పిల్లల వరకూ కళ్ళతోనే నటిస్తారు. ఎప్పుడోగానీ సంభాషణ వుండదు. కొన్ని దృశ్యాల్లో బంధువులతో, బయట గ్రామస్థులతో కూర్చున్నప్పుడు కూడా దృశ్యాలు మాటామంతీ లేకుండా సంతాపం ప్రకటిస్తున్నట్టు నిశ్శబ్దంగానే వుంటాయి. ఎవరిదీ హడావిడీ జీవితం కాదని చెప్పడానికి కాబోలు, బెల్లం కొట్టిన రాయిలా ఆ నెమ్మదితనం. పేపర్లో, రేడియోలో ఎంత ఘోర వార్త వచ్చినా సరే కదలక మెదలక తుమ్మ మొద్దుల్లా వుండడం.
సాంకేతికాలు అద్బుతం
చివరిగా మేకింగ్ సంగతులు. సినిమా విశ్లేషణల్లో మేకింగ్ గురించి ఎందుకనుకునే వాళ్ళు క్షమించెయ్యాలి. మేకింగ్ గురించి చెప్పుకోకుండా దీని విశ్లేషణ సంపూర్ణం కాదు. సినిమాలో ఏది ఎందుకు జరిగిందో అప్పుడే అర్థమవుతుంది. సినిమాల్ని కేవలం చూడకూడదనీ, చదవాలనీ కూడా అంటారు కాబట్టి ఓ సారి ఈ పనికూడా పూర్తి చేసేద్దాం.
పైన చెప్పుకున్నట్టుగా దర్శకుడు రెండు కథానికల్ని కలిపి సినిమా చేస్తూ కెమెరాతో కొలవడానికి కారణమేమిటి? ఈ కథానికల్ని ఉన్నదున్నట్టు తీస్తే యాభై నిముషాలే వస్తుందన్పించింది. అందుకని వీటిని రెండు గంటల సినిమాగా పొడిగించడానికి, ఈ కథానికల్లోని ‘కనిపించని కథా విశేషాల్ని’ మైన్యూట్ డిటెయిల్స్‌తో కెమెరాతో కథనం చేస్తూ పొడిగించినట్టు చెప్పుకున్నాడు. ఉన్న కథానికలకి అదనంగా సీన్లు రాసిగానీ, డైలాగులు పెంచి గానీ నిడివి పెంచలేదు. ఇందుకే కథానికల ఒరిజినాలిటీ తెరమీద కథానికలు చదివినంత బావుంటుంది… కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథానికలు.
కథానికలంటే సినిమాగా షార్ట్ మూవీసే (ఫిలిం లేదు కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ అనడంలేదు). తెలుగులో కొన్ని షార్ట్ మూవీస్ కథల్ని సినిమాలుగా తీసి చతికిలబడ్డారు. కొందరు షార్ట్ మూవీస్ మేకర్లు సినిమా కథంతా రాసుకుని, తీరా సినిమా తీస్తే అవి సినిమాకి చాలని పొట్టి కథలే అయ్యాయి. కొన్ని ఇంటర్వెల్‌కే కథ అయిపోయి కూర్చున్నాయి. ఒకతను సినిమా సాంతం తీసి చూసుకుంటే 90 నిమిషాలే వచ్చిందని, దాన్నొదిలేసి పరారీలో వున్నాడు. ఇలా వుంటున్నాయి కథానికలతో సినిమా అనుభవాలు.
కథానికలతో సినిమా తీయడానికి గుర్విందర్ సింగ్ వాడిన టెక్నిక్కే, క్రాఫ్ట్ ఈ సీన్లు: ప్రారంభంలో రైల్వే స్టేషన్ సీను ఏకంగా సుమారు పదహారు నిమిషాలుంటుంది. 1968లో సెర్జియో లియోన్ తీసిన క్లాసిక్, ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ది వెస్ట్’ ప్రారంభంలో పన్నెండు నిమిషాలుండే రైల్వే స్టేషన్ సీను గుర్తుకొస్తుంది. కాకపోతే అతి నిదానంగా, తీరుబడిగా రైల్వే స్టేషన్లో సాగే కార్యకలాపాల మధ్య రైలు కోసం వెయిట్ చేసే హెన్రీ ఫోండాతో, సీను చివర రైలు వచ్చి వెళ్ళిపోయాక యాక్షన్ జరుగుతుంది. 2003లో క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్’లో పది నిమిషాలు నిదానంగా సాగే సీన్లు ఉండుండి చివర బ్యాంగ్‌తో ముగుస్తాయి. ‘చౌతీ కూట్’ లో వున్న 16 నిమిషాల సుదీర్ఘ రైల్వే స్టేషన్ సీనూ ఇలా యాక్షన్‌తో ముగియదు. యాక్షన్‌తో ముగిస్తే ఆర్ట్ సినిమా విలువ కోల్పోతుంది. వాళ్ళిద్దరూ గూడ్స్ ఎక్కేసి వెళ్లిపోవడంతో ముగుస్తుంది. ఈ పదహారు నిమిషాలూ జుగల్, రాజ్‌లు బెంచి మీద కూర్చుని ఉలుకూ పలుకూ లేకుండా వెయిట్ చేయడమే ఎక్కువ సేపు వుంటుంది. ప్లాట్‌ఫాం మీద పోలీసుల సంచారమున్నా అలికిడి అంతంత మాత్రమే. చాలావరకూ సీను నిశ్శబ్దం తాండవిస్తూ వుంటుంది. మనమా రైల్వే స్టేషన్లో వున్నట్టే అన్పిస్తుంది, ఆ సన్నివేశంలోని మైన్యూట్ డిటెయిల్స్‌ని పరిశీలించేలా చేస్తూ.
ఇంకో సీను వర్షపు సీను. ఈ సీను చూశాక చాలా రోజులు ఇది వెంటాడుతూ వుండిపోయింది. ఈ సీను తీయడం ఎలా సాధ్యమైంది? కృత్రిమ వర్షం కురిపించకుండా, అంత సహజమైన ఫీల్‌తో, మనమే ఆ వర్షంలో వున్నట్టూ, నిజంగా ఎలా కురిసింది అంత వర్షం సరీగ్గా సీను కోసం? ఈ రెండు ప్రశ్నలతో బాటు మూడోది- పంటపొలాల మీద ఆ కారు మేఘాలు కమ్మడమేమిటి, ఆ సన్న గాలి శబ్దమేమిటి, ఆ గాలి ఎటు వీస్తే అటు గోధుమ మొక్కలు వూగడ మేమిటి, సన్నగా వర్షపు జల్లు సవ్వడి ఏమిటి, వినిపించీ వినిపించకుండా దూరంగా ఎక్కడో పిడుగు పడ్డ శబ్దమేమిటి… చాలా మతిపోగొట్టే అనుభవం! ఇలాటి అనుభవమే అటు కొరియన్ ‘ది క్లాసిక్’లో, టీనేజీ లవర్స్ గ్రామ శివార్లకి వెళ్ళినప్పుడు కురిసే వర్షంతో వెచ్చ వెచ్చగా వుంటుంది…
వెతగ్గా వెతగ్గా ఎక్కడో దర్శకుడిచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం దొరికింది. ఈ సీను కోసం వర్షం కురవలేదు, వర్షం కురవడంతో మార్చేసిన సీను ఇది! స్క్రిప్టులో రాసుకున్న ప్రకారం తెల్లారి సీఆర్పీఎఫ్ దళం వచ్చి సోదాలు జరిపాక, జోగిందర్‌ని అదుపులోకి తీసుకుని వెళ్ళిపోతారు. ఇది చిత్రీకరిస్తున్నప్పుడు వర్షం ప్రారంభమై షూటింగ్‌కి అవాంతరమేర్పడింది. ఆపేద్దామా అని నిర్మాతలు అడిగితే, లేదు సీను మార్చేద్దామని వర్షపు దృశ్యాలు తీయడం మొదలెట్టాడు.
ఇప్పుడిలా వుంటుంది సీను: వచ్చిన సీఆర్పీఎఫ్ దళంతో బయట కుటుంబం, కుక్కా కలబడ్డాక, వాళ్ళని తోసేసి సిబ్బంది ఇంట్లో సోదాలు చేపడతారు. కుక్కని షూట్ చేయమని ఇన్స్‌పెక్టర్ ఆదేశిస్తాడు. పోలీసు షూట్ చేస్తాడు. ఇంట్లో చిందరవందర చేస్తూ గాలిస్తూంటే వర్షం మొదలవుతుంది. బయట కెమెరా పాన్ అవుతుంది. పంటపొలాల మీద ఆకాశంలో బాగా కిందికి దిగి కమ్ముకున్న కారు మబ్బులు. గాలికి చెట్లు వూగడం, ఉరుములు, వర్షం. టైం లాప్స్‌తో వర్షం తగ్గు ముఖం. డాబామీద గదిలోంచి బాల్కనీలో ఫోకస్ చేసి తగ్గిన వర్షపు చినుకుల నిశ్చల షాట్, బాల్కనీలోంచి కింద వాకిట్లోకి ఫోకస్ చేసి మరో నిశ్చల షాట్, గొడ్ల సావిట్లో మేస్తున్న పశువుల మీద ఫోకస్ చేసి ఇంకో నిశ్చల షాట్, బయట బురదలో అడ్డదిడ్డంగా టైర్ల గుర్తుల మీద ఫోకస్ చేస్తూ మరింకో నిశ్చల షాట్, చివరికి గేటు మీద ఫోకస్ చేసి నిశ్చల షాట్ పెడితే, ఆ గేటు లోంచి గబగబా వచ్చేస్తూ కుక్క…
ఈ నిశ్చల షాట్స్‌తో సీక్వేన్సే దర్శకుడి క్రాఫ్ట్. ఉన్న కథలోంచి కాలాన్నీ, దూరాన్నీ లాగి, కెమెరాతో కథనం చెయ్యడం. ఈ సీక్వెన్స్‌లో బయట బురదలో టైర్ల గుర్తులు దళం వెళ్లి పోయిందనడానికి నిదర్శనం. మొదట దళం రాకతో ఉద్రిక్తంగా ప్రారంభమైన ఈ సన్నివేశం, చివరికి బయటి నుంచి కుక్క గబగబా ఇంట్లోకి రావడంతో సుఖాంతమైనట్టు రిలీఫ్. కుక్కని చూసి హమ్మయ్యా బతికే వుందని మనమనుకోవడం. ఇలాటి క్రాఫ్ట్ తోనే మిగిలిన దృశ్యాలు నిండి వుంటాయి.
చివరిగా ఇంకోటి చూద్దాం: ఒక స్టీలు కడ్డీ విచ్చుకుంటూ పైకి లేస్తుంది. ఏమిటా అని చూస్తూంటే, అంకెల మీద ముల్లు అటూ ఇటూ కదులుతూంటుంది. ఆ తిప్పుతున్న వేళ్ళు కన్పిస్తాయి. అది ట్రాన్సిస్టర్. ఆ పైకి లేచింది యాంటెన్నా. ఆ ముల్లు కదలడం ట్యూనింగ్. అతను జోగిందర్. వూరి బయట గ్రామస్థులతో కూర్చుని వుంటాడు. ట్యూన్ చేసి స్టేషన్ కలిపితే, బీబీసీ లండన్నుంచి హిందీలో వార్తలు… నిన్న స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మూడు వందలమంది మిలిటెంట్లు మరణించారు… సౌదీ అరేబియా వైమానిక దళాలు రెండు ఇరాన్ విమానాల్ని కూల్చి వేశాయి…. శ్రీలంక వేర్పాటువాద గెరిల్లాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు… ఇలా కొన్ని ముఖ్యాంశాలు చెప్పి, ప్రధాన వార్త ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి పూర్తి సమాచారం ప్రసారం చేస్తారు.
అదే బెల్లం కొట్టిన రాయిలా కూర్చుని వింటూంటారు. కెమెరా వార్తల్లోని బైట్స్‌ని బట్టి కథనం లాగుతూంటుంది… ఇరిగేషన్ కెనాల్‌ని ఫోకస్ చేసి నిశ్చల షాట్, రెండు పాయలుగా ప్రవహిస్తున్న తూముల మీద ఫోకస్ చేసి మరో నిశ్చల్ షాట్, వార్తలు వింటున్న శ్రోతల మీద లాంగ్ షాట్, అవుట్ ఫోకస్‌లో దూరంగా వస్తూ ఓ ట్రాక్టర్… ఒకటి కాదు రెండు ట్రాక్టర్లు… వార్తలు ముగియడం, జోగిందర్ అటు చూడడడం… ట్రాక్టర్స్ ట్రాలీల్లో మేళతాళాలతో పాటలు పాడుకుంటూ వస్తున్న స్త్రీ పురుషుల బృందాలు… అమరవీరుడు బాబా దీప్ సింగ్ (1682 -1757) ని స్మరిస్తూ బృందగానం…
ఒర లోంచి బాబా వీర ఖడ్గము సరసర పైకొచ్చెను
వజ్ర ఖచిత కంకణ ధారియై
కదిలెను కదన రంగాన అమరత్వానికి
శత్రువుల రుధిర దాహార్తియై
రుధిరము కాక జలము అడిగిన వాడు దెబ్బతినునురా
వాహె నామ్… వాహే గురు...
వీళ్ళని చూసి ట్రాక్టర్లు ఆపుతారు. ‘మంచి నీళ్ళు తాగుతారా’ అడుగుతాడు జోగిందర్. ఒకడికి అక్కడున్న బోరు పంపు కొట్టి నీళ్ళు తాగిస్తాడు. తిరిగి ట్రాక్టర్లు బయల్దేరతాయి. ఇప్పుడు పాటలెవరు పాడుతున్నారో రిజిస్టరవుతారు. మేళతాళాలెవరు వాయిస్తున్నారో వాళ్ళుకూడా రిజిస్టరవుతారు (ఈ అంచెలంచెలుగా ఇప్పుడు టైమింగ్‌తో రివీలవుతున్న డిటెయిల్స్‌తో క్రాఫ్ట్‌ని గమనించాలి). కదులుతున్న ట్రాక్టర్ల మీద ఒకే కంటిన్యుటీ టాప్ యాంగిల్ జిమ్మీ జిబ్ షాట్ వేస్తూ పోతే, ట్రాక్టర్లో జోగిందర్‌తో బాటు గ్రామస్థులూ ఇప్పుడు కన్పించడం… ట్రాక్టర్ల పక్కనుంచి తెల్ల గుర్రాల మీద తుపాకులు పేలుస్తూ ‘వీరులు’ కదలడం… మరిన్ని ట్రాక్టర్లు… మరిన్ని వాహనాలూ… వెళ్లి వెళ్లి ఒక కూడలిలో సభ జరుగుతున్న చోట ఆగడం. పోలీసు దళాలు వచ్చేయడం. లాఠీ ఛార్జి, కాల్పులూ … అంతా చెల్లా చెదురై పోవడం…
నీళ్ళు తాగడమే కొంపముంచింది! బోరు కొట్టి జోగిందర్ మంచినీళ్ళు తాగించడమే దగా చేసింది… ‘రుధిరము కాక జలము అడిగిన వాడు దెబ్బతినునురా’ అని పాడుకున్న పాటే మర్చిపోయారు.
ట్రాన్సిస్టర్లో వార్తలు వస్తూంటే, ఇటు కెనాల్లో తూముల్లోంచి దుముకుతున్న నీళ్ళెందుకు చూపిస్తున్నాడబ్బా అన్పిస్తుంది. ఏమిటి దీనర్ధం? ఇప్పుడాలోచిస్తే అది కెమెరా కథనంలో ఫోర్ షాడోయింగ్ షాట్. ఇటు కాల్వ నీళ్ళు, అటు ఎదురుగా ట్రాక్టర్ల మీద బృందాల రాక. నీళ్ళు కొంప ముంచబోతున్నాయని చెప్పడం! పైగా పాడుకున్న పాటే మరచి, బోరు నీళ్ళు కూడా తాగడం. కూడలిలో అడ్డంగా దెబ్బతిని పారిపోవడం… వాహెనామ్… వాహే గురు!
ముగిద్దాం
టెక్నికల్‌గా కెమెరా (సత్యరాయ్ నాగ్ పల్), సౌండ్ (సుస్మిత్ నాథ్), సంగీతం (మార్క్ మార్డర్) అద్భుతమైనవి. చాలావరకూ నిశ్శబ్దమే వుంటుంది. ఆ నిశ్శబ్దానికో అర్ధముంటుంది. అయితే రెండు కథానికల్ని కలిపిన తీరే విచిత్రంగా వుంటుంది. మొదటి కథానిక జుగల్ ఫ్లాష్‌బ్యాక్‌తో ముగిశాక, మళ్ళీ అతనే తనకి సంబంధంలేని జోగిందర్ ఫ్లాష్‌బ్యాక్‌ని కూడా తల్చుకోవడం అసహజంగా వుంటుంది. జుగల్ ఫ్లాష్‌బ్యాక్ జుగల్ దృక్కోణమే, జోగిందర్ ఫ్లాష్‌బ్యాక్ కూడా జుగల్ దృక్కోణంలో ఎలా వస్తుంది. ఇదలా వుంచితే, ముగింపు: గూడ్స్ ఎక్కి బయల్దేరిన జుగల్, రాజ్ లు అసలు అమృత్‌సర్ కెందుకు వెళ్తున్నారు? ఫ్లాష్ బ్యాక్స్ పూర్తయ్యాక ఇది తెలుస్తుంది.
నయా ఇండిపెండెంట్ దర్శకుడు గుర్విందర్ సింగ్ దీనిని ఇండో ఫ్రెంచ్ సంయుక్త నిర్మాణంలో పూర్తి చేశాడు. కేన్స్‌లో, సింగపూర్లో, ముంబాయిలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఘన పురస్కారాలు పొందదాడు. కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అదనం.