[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
కపటేశ్వర ఇత్యుక్తం దేవదేవస్య శూలినః।
పుణ్యమాయతనం తస్య సముత్పత్తిం వదస్యమే॥
సంశయో మే మహాన్ బ్రహ్మాన్ కపటేశ్వరః కీర్తినామ్।
కిమర్థం భగవాన్ శంభుః ప్రోచ్యతే కపటేశ్వరః॥
[dropcap]’శూ[/dropcap]లి’ అనే పవిత్ర స్థలంలో దేవదేవుడు కపటేశ్వర అన్న నామంతో ప్రసిద్ధుడు. దాని ఆవిర్భావం గురించి వివరించండి. కపటేశ్వర అన్న పేరు నాలో సంశయం కలిగిస్తోంది. శంభును కపటేశ్వరుడన్న పేరుతో ఎందుకు పిలుస్తారు? ఇది గోనందుడి ప్రశ్న.
గోనందుడి ప్రశ్నకు సమాధానంగా బృహదశ్వుడు గతంలో జరిగిన కథను చెప్పటం ప్రారంభించాడు.
కురుక్షేత్రంలోని దృశద్వతి నదీ తీరంలో పెద్ద సంఖ్యలో ఋషులు తపస్సు ఆరంభించారు. రుడ్రుడి దర్శనాభిలాషతో వారు ఘోరమైన తపస్సు తీవ్రంగా చేయడం ఆరంభించారు. వారి తపస్సుకు మెచ్చి రుద్రుడు వారందరికీ ఒకేసారి కలలో కనబడ్డాడు.
“నా దర్శనార్థం మీరు చిత్తశుద్ధితో జరుపుతున్న తపస్సుకు మెచ్చాను. మీకు నా దర్శనం త్వరగా, సులభంగా అవ్వాలంటే వెంటనే కశ్మీరుకు వెళ్ళండి. అక్కడ ఉన్న నాగుల పెద్ద భవంతికి వెళ్ళండి. అక్కడ నేను మారు రూపంలో మీకు దర్శనమిస్తాను” అన్నాడు.
అందరికీ ఒకేసారి ఒకే స్వప్నం రావటంతో వారు స్వప్నాన్ని గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు, చర్చించుకున్నారు. తమది భ్రాంతి కాదని నిర్ధారించుకున్నారు. శంభు దర్శనం కోసం వెంటనే కశ్మీరం ప్రయాణమయ్యారు.
నాగుల భవనం చేరుకున్నారు. కానీ వారికి అక్కడ శంభు కనబడలేదు. కనీసం శుచి కోసం నీరు కూడా కనబడలేదు. నదులన్నీ కర్ర దుంగలతో నిండి ఉన్నాయి. వాటి కింద ఉన్న నీరు కనబడడం లేదు.
ఋషులంతా నిరాశ చెందారు.
అయితే, ఎటు చూసినా కర్రదుంగలు పడి ఉండడం వారిలో కుతూహలం కలిగించింది. వారు కర్ర దుంగలను తొలగించారు. వాటిని తొలగించి, క్రింద ఉన్న నీటిలో స్నానం చేయటంతోటే వారికి రుద్రత్వం ప్రాప్తించింది.
వారిలో గౌర పరాశర అన్న బ్రాహ్మణ ఋషి ఉన్నాడు. అతడికి కర్రలను తొలగించాలనిపించలేదు. స్నానం చేయాలనిపించలేదు.
‘రుద్రుని దర్శనం కోసం వచ్చిన వాళ్ళం, కర్రలపై కుతూహలం చూపించటం ఏమిట’ని అనుకున్నాడు. అతడు అక్కడే నిలుచుని రుద్రుని కోసం తపస్సు ఆరంభించాదు.
అతడి తీవ్రమైన తపస్సు ఫలితంగా శరీరం క్షీణించసాగింది.
అతని కలలో రుద్రుడు కనిపించాడు.
“ఎందుకని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు? ఎందుకని నిన్ను నువ్వు బాధపెట్టుకుంటున్నావు?” అని అడిగాడు.
“ఈ నదిలో ఉన్న కర్రలను పక్కకి తొలగించి స్నానం చేయి, రుద్రత్వాన్ని శీఘ్రంగా పొందు” అన్నాడు శివుడు.
రుద్రుడికి ప్రణామం చేస్తూ అన్నాడా ఋషి – “రుద్రత్వం పొందిన తరువాత కూడా నీ దర్శనం లభిస్తుందన్నది నిజం. కానీ నువ్వు ముందు మాట ఇచ్చావు, ఇక్కడకు రాగానే మారు రూపంలో దర్శనమిస్తావని. ఆ దర్శనం కాకుండా నాకు సంతృప్తి లేదు” అని.
అతడి సమాధానం విన్న శంభు చిన్నగా నవ్వాడు.
“మారు రూపంలో నీ దర్శనం కాకుండా నేను తినను, తాగను, ఏమీ చెయ్యను. నిన్ను స్మరిస్తూ ఇలాగే క్రుంగి కృశించి పోతాను. నీ దర్శనం కాకుండా నేను ఇక్కడి నుంచి కదలను” అన్నాడు.
అతని మొండితనానికి, పట్టుదలకు శంకరుడు నవ్వాడు.
“నేను మీకు దర్శనం మారు రూపంలో ఇచ్చాను. నువ్వే దర్శించలేకపోయావు. నేను మారు రూపంలో దర్శనమిస్తానన్నాను. ఈ నది లో పడి ఉన్న కర్ర దుంగలు నా రూపమే. అందుకే ఈ కర్రలను తొలగించేందుకు స్పృశించినంత మాత్రమే వారందరికీ రుద్రత్వం లభించింది. అయితే నువ్వు తపస్సు కూడా చేశావు కాబట్టి, నీకు ఒక వరం ఇస్తాను. ఆ తరువాత రుద్రత్వ ప్రాప్తి పొందు” అన్నాడు.
ఋషిఖస్త్యం యథా దృష్టః వాష్ట రూపీ మహేశ్వరః।
తథా త్వం దేహి సర్వస్య జనాస్యేహ నిదర్శనమ్॥
ఇదీ గౌర పరాశర ఋషి కోరిన వరం.
ఎలాగయితే ఋషులకు, కర్ర దుంగలా దర్శనమిచ్చావో, సామాన్యులకు కూడా అదే రూపంలో దర్శనమియ్యి. లోకంలో పాపాత్ములు అధికం అవుతున్నారు. నీ సులభ దర్శనం ద్వారా వారి పాపాలు పరిహారమవుతాయి. పాపాత్ములు తగ్గడంతో లోకం సుఖమయం అవుతుంది.
ఇక్కడ భారతీయ ధర్మంలో, జీవన విధానంలోని గొప్పతనం, ఔన్నత్యం ప్రస్ఫుటమవుతుంది. అందరూ తపస్సు చేశారు. అందరి లక్ష్యం ఒక్కటే. రుద్ర దర్శనం. రుద్రుడు సులభంగా రుద్రత్వం ప్రాప్తించే దారి చూపించాడు.
ఒక్కడు తప్ప అందరూ ఆ మార్గాన్ని అనుసరించారు.
ఆ ఒక్కడు కూడా భగవంతుడు కోరిక కోరుకోమంటే తన కోసం కోరుకోలేదు. ఋషులకూ, మునులకు ఏ రూపంలో దర్శనం ఇచ్చాడో, అదే రూపంలో సామాన్యులకు కూడా దర్శనం ఇవ్వాలని కోరాడు.
ఇది భారతీయ ధర్మం.
గమనిస్తే ఇది భారతదేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తుంది.
సత్య దర్శనం చేసిన ఋషులు అంతటితో సంతృప్తి పడలేదు. వేద రూపంలో తరతరాలు ఆ విజ్ఞానం అందేట్టు చూశారు. వసుధైక కుటుంబం, సర్వేజనా స్సుఖినోభవంతు, శాంతి శాంతి శాంతిః అంటూ అందరి మంచి కోరుకున్నారు. సన్యసించిన శంకరాచార్యులు తన మోక్షం కోరలేదు. దేశప్రజల అభివృద్ధి కోరుకున్నాడు. దేశమంతా ఆధ్యాత్మిక వెలుగులు వెదజల్లాడు.
తన వ్యక్తిగత ముక్తి వదిలి, సకల జనుల ముక్తి కోసం తాను తాను నరకం అనుభవించేందుకు సిద్ధపడి రామానుజార్యుదు తారకమంత్రం సకల జనులకు బోధించాడు. వ్యక్తిగత మోక్షం కన్నా సమిష్టి లబ్ధికే ప్రాధాన్యం ఇచ్చాడు.
జ్ఞానదేవుడు, తుకారం, కబీరు, చైతన్య మహాప్రభు, అక్క మహాదేవి, లల్లేశ్వరి, ఒకరేమిటి, భారతీయ ధర్మంలో ఆరాధనీయులంతా వ్యక్తిగత ముక్తిని సామాజిక అభ్యున్నతి కొసం వదిలిపెట్టినవారు. వ్యక్తి కన్నా సమిష్టికి ప్రాధాన్యం ఇచ్చినవారే.
తరువాత తరంలో వివేకానందలోనూ ఇది ప్రస్ఫుటమవుతుంది. రామకృష్ణ పరమహంస ప్రేరణతో వ్యక్తిగత మోక్ష ప్రయత్నాలు వదిలి కర్మయోగాన్ని స్వీకరించాడు వివేకానందుడు. అలాగే శ్రీ అరవింద మహర్షి స్వయంగా తాను ఆశ్రమం వదిలి బయటకు రాకపోయినా అనుక్షణం దేశ ప్రజల అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం తపించాడు.
ఇది భారతీయ ధర్మ లక్షణం.
ఎవరైతే వ్యక్తిగత స్వార్థానికి ప్రాధాన్యం ఇస్తారో వారు రాక్షసులు.
బ్రహ్మదేవుడిని విపరీతమైన వరాలు కోరి, అప్రాకృతికంగా ప్రవర్తించిన వారంతా రాక్షసులయ్యారు. అహంకారంతో విర్రవీగి నశించారు. వ్యక్తిగతాన్ని విస్మరించి సమిష్టి అత్యున్నతి కోరినవారు పూజ్యనీయులయ్యారు. ఈనాటికీ భారత ప్రజల మన్ననలందుకుంటున్నారు.
గౌర పరాశరుడు కూడా భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాడు.
ఈ నిర్మోహత్వము, నిస్వార్థము భారతీయ సమాజ జీవ లక్షణం. అలాంటి భారతీయ సమాజం ఈనాడు స్వార్థానికి, వ్యక్తిగత లబ్ధి కోసం సమిష్టిని దెబ్బ తీసేందుకు వెనుకాడని వారితో నిండిన సమాజంలా మారటానికి కారణాలు అన్వేషించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు వస్తే అసలు నిజాలు వెతికితే వాటితో మొదటికే మోసం వస్తుందన్న భయంతో దేశంలోని సమస్యలన్నింటికీ పూర్వీకులను, పురాణాలను బాధ్యులుగా ప్రచారం చేశారు.
ప్రచారపు హోరును తొలగించి చూస్తే, మన ఋషులు సర్వసమాజ అభ్యున్నతిని కోరుకున్నారు. వ్యక్తిగత స్వార్థాన్ని రాక్షసత్వంగా భావించారు. తమ కోసం వారు ఏమీ కోరుకోలేదు.
భగవద్దర్శనం కోసం అహోరాత్రాలు తపస్సు చేసి, తీరా భగవంతుడు దర్శనం ఇచ్చిన తరువాత, నాలాగే సామాన్య ప్రజలకూ దర్శనం ఇచ్చి తరింపజేయమని వేడుకున్నారు. ఇదీ భారతీయ ధర్మం. ఇది భారత దేశ జీవ లక్షణం.
పక్కవాడి కడుపు నిండిందా అని చూస్తాడు. పక్కవాడికి అన్నీ అమరాయా అని చూస్తాడు. తాను అర్ధాకలితో కటిక నేలపై పడుకుంటాడు.
(ఇంకా ఉంది)