‘రైతు బతుకు సిత్రాలు’ పేరిట రైతుల స్థితిగతులపై 8 మినీ కవితలు అందిస్తున్నారు నాగ శైలజ.
1. ఎందుకోసం?
ఎందుకోసం?
పెస్టిసైడ్ షాపుల్లో
పురుగు మందులు
రైతులు సాగుచేసే
పంటల కోసమా?
పంటలు సాగు చేసే
రైతుల కోసమా?
2. ప్లీజ్…
కురవని చినుకుకోసం
కునుకు సైతం మరచి
ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన
నా సీమ రైతు కళ్లు
కురిసే మేఘాలయ్యాయి.
కన్నీటిలో పండే పంటలు వుంటే
కాస్తంత చెప్పరూ……ప్లీజ్.
3. సందేహం
నాయకులు
ఓట్లకోసం
సీట్లకోసం
రైతును
రాజుగా చేస్తామంటున్నారు
రాచరికం తెరమరుగైనట్లు
రైతు కూడా
కనుమరుగవుతాడేమో?
4. వెన్నెముక
రైతు
దేశానికి ‘వెన్నెముక’
చినుకు అనే
కాల్షియం మోతాదు తగ్గి
పెళుసు బారింది
సర్కారు సాయమనే
వైద్యం అందక
అరిగిపోయింది
అప్పుల భారం మొయ్యలేక
ఒరిగిపోయింది
అవమానాలు తట్టుకోలేక
పుటుక్కున
విరిగిపోయింది
5. విడ్డూరమే…
సీమ నేలపై
పొలంలో బోరు వేస్తే
చిత్రంగా….
రైతు కంట్లో
ఊట వుబికివస్తోంది
ఇదేం విడ్డూరమో?
6. సీజనల్ మంత్ర
నాయకుడి నాలుక
పదే పదే అదే పనిగా
నాగలి జపం చేస్తోంది
ఎందుకా అనుకున్నా ?
ఎన్నికల సీజన్ వస్తోందట మరి
7. సీమ రైతు
సీమ రైతు
పొలం విత్తాడు
పైరు ఏపుగా పెరిగి
కాపు విరగకాసింది
అప్పులు ఫలసాయంగా
అవమానాలు దిగుబడిగా…
8. కన్నీళ్ళు
కన్నీటిధార!
రైతు
ఎంత లోతు త్రవ్వినా
బోరుబావుల్లో
నీరు పడనప్పుడు…
వాటిల్లో
చిన్నారులు
జారిపడినప్పుడూ….