[dropcap]ఎ[/dropcap]న్ని విధాలుగా, ఎంత లోతుగా ఆలోచించినా నాకు తట్టడం లేదు, కానీ బాగా తెలిసినట్టే అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళానో, ఎందుకు వెళ్ళానో ఏమీ గుర్తు రావడం లేదు. అయిన వాళ్ళూ, ఆప్తులూ ఎవరూ ఆ ఊళ్ళో ఉన్నట్టుగా తోచదు – మరెందుకు ఆ చిరునామా నన్నంతగా ఆకర్షించిందో తెలియడం లేదు. నెల క్రితం నా సహోద్యోగి కరంచంద్ తన పెళ్లి శుభలేఖ ఇచ్చినప్పటినుండి ఇదే తంతు. ఆ వివాహ వేదిక నాకెందుకో బాగా తెలిసినట్టుగా తోస్తుంది. అది ఎలాగో – ఎందుకో ఎంత తల బద్దలుకొట్టుకున్నా అర్థమై చావడంలేదు. అతన్ని కూడా అడిగాను కానీ పెళ్లి కూతురు తరుపు వాళ్ళు నిర్ణయించిన వేదికని దాని గురించి తనకేమి తెలియదని చెప్పాడు. అయినా నాకు మాత్రం ఆ విలాసం బాగా ఎరిగినట్టు అనిపిస్తుంది. ఇక ఉండబట్టలేక పెళ్ళికి బయలుదేరాను. మామూలుగానైతే వెళ్లే వాడిని కాదు – అందునా ఆఫీసులో అతనో నేనో తప్పనిసరిగా ఉండాల్సిందే అయితే ఆ అడ్రస్సు అంతు తెలుద్దామని వీలు చేసుకొని మరీ బయలుదేరాను.
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్సులో వెళ్లి ఉదయాన్నే వరుడింట రాజమండ్రిలో దిగాను. ముహూర్తం రాత్రి తొమ్మిదింటికి కానీ నాకు ఎప్పుడెప్పుడు నిడదవోలు చేరుకుంటామా అని తొందరగా ఉంది. మధ్యాహ్నం భోజనాల తరువాత చుట్టాలందరికీ ఒక బస్సు ఏర్పాటు చేశారు. అక్కడికెళ్తే పెళ్లి వేదికకి పక్క వీధిలో విడిది ఏర్పాటు చేశారు. నాకు మాత్రం ఎక్కడలేని ఉద్వేగం పుట్టుకొస్తుంది – ఎందుకు నాకు అలా అవుతుందో అర్థం కావడంలేదు. జాగ్రత్త కోసం వెంట తెచ్చుకున్నా బీపీ మాత్రలు వేసుకొని, నిగ్రహించుకోలేక బయలుదేరి పక్క వీధిలోని పెళ్లి వేదికకు బయలుదేరాను.
నిజానికి అది ఒక స్కూలు, సెలవులు కాబట్టి – విశాలమైన ఆట ప్రాంగణాన్ని ఇలా వేడుకల నిర్వహణకు అద్దెకు ఇస్తున్నారట. వీధికి ఇటు వైపున ప్రారంభించి దాదాపుగా ఆ చివర వరకూ స్కూలు భవంతులే, చుట్టూ ఎత్తైన ప్రహరీ నిర్మించి ఉన్నాయి. ఊహ తెలిసాక ఈ ప్రదేశానికి రాలేదు – చుట్టూ పరికించి నాకు నేను ధిలాసా ఇచ్చుకున్నా. మరి పూర్వ జన్మ సంబంధమా? ఈ వ్యాకులత మొదలైన దగ్గరనుంచీ మది పరి పరి విధాలా పరిభ్రమిస్తుంది. వళ్ళంతా చెమటలు పడుతుండగా ఆ భవంతి సముదాయం మధ్య భాగానికి చేరుకున్నా. ఎదురుగా అంతెత్తున బోర్డు ‘నిర్మలా కాన్వెంటు’ (ప్రభుత్వంచే గుర్తింపు పొందినది) LKG నుండీ Xth వరకు: స్టేట్ సిలబస్, నెహ్రూ నగర్, నిడదవోలు. బోర్డుకు పైభాగాన ఒక మూలాన – ప్రారంభం: 1982 – మరో చివర చైర్మన్ : కృష్ణ కమల్. అలవోకగా చదువుతున్నా నాకు ఆ పేరు చూడగానే కళ్ళు విప్పారాయి. ఇంత కాలం నన్ను వేధించిన చిక్కు ప్రశ్న ఒక్క సారిగా తనంతట తానే పరిష్కారమైపోయింది. నా గుండె తేలిక పడింది, కర్చీఫుతో చెమటలు తుడుచుకుంటూ అక్కడున్న సెక్యూరిటీని అడిగాను, “ఈ కృష్ణ కమల్ గారూ… ఎక్కడ ఉంటారు?” అని. నా అసలు ఉద్దేశం ఉన్నాడా పోయాడా అని కనుక్కోవడం.
“లోపల ఇల్లు ఉందండీ ఆయీ.. తవరెవరో చెప్తే ఫోను చేసి అడుగుతా. అంపించమంటే లోనికి అంపిస్తా” అన్నాడు. నేను నా పేరు చెప్పాను.
ఆ బోర్డు కొసాన ఉన్న పేరుతో మొదలు పెడితేగానీ నా మదిలో నాటుకు పోయిన చిరునామా పూర్తికాలేదు. ‘కృష్ణ కమల్’ MA , B.Ed., నిర్మలా కాన్వెంటు, నెహ్రూనగర్, నిడదవోలు- 534301, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. ఇప్పటికీ కంఠతా వచ్చేస్తుంది – ఎన్ని ఉత్తరాలు మీద రాసానో ఆ అడ్రస్సు. అప్పట్లో మా నాన్న వివిధ పత్రికల్లో చూసి కలం స్నేహం నెరపుతూ ఉండేవాడు. కొంతమంది ముక్త సరిగా జాబు రాసేవారు – కానీ కొందరు ఎంతో ఆప్యాయంగా ఉభయ కుశలోపరితో మొదలెట్టి తమ వ్యక్తిగతం తెలిపి, ఇతరుల కుటుంబ వివరాల మొత్తం అడుగుతూ పేజీలు పేజీలు నింపి ఉత్తరం అందిన వెంటనే తిరుగు టపాలో జవాబు రాసి పంపేవారు. అలాటి వాళ్ళల్లో ఈ కృష్ణ కమల్ ఒకరు. ఈయన నుంచి వారానికి రెండు ఉత్తరాలు తప్పనిసరిగా వచ్చి పడేవి. రాజకీయాలూ, సినిమాలూ, పండగలతోపాటు తన ఇంట్లో విషయాలు చెప్పీ, మా ఉరి విశేషాలు అడిగి – పనిలో పనిగా మా ఇంట్లోవాళ్ల గురించి కూడా చెప్పమనేవాడు నాన్నారిని. ఆయన మా నాయనమ్మ, అమ్మా, అక్కా ఇంకా నా గురించి పరిచయం చేసారు. ఇక ప్రతీ ఉత్తరంలో ఆయన మా యోగక్షేమాలు అడగడం, నాన్నగారు మర్యాదకని మేమూ ఆయన్ని అడిగినట్టు చెప్పమన్నామని రాయడం – దానికి మళ్ళీ ఆయన జవాబులో ప్రస్తావించడం ఇలా సాగుతుండేది అప్పట్లో. అయితే ఉన్నట్టుండి కొన్నాళ్ళకి ఈ కృష్ణ కమల్ నుంచీ ఉత్తరాలు రావడం ఆగిపోయింది. నాన్నగారు చాన్నాళ్లు జాబు రాసేవారు, కానీ అటునుంచేప్పుడూ తిరిగి జవాబు రాలేదు.
మా నాన్నగారు సరదా వ్యాపకంగా ఈ కలం స్నేహాన్ని కొనసాగించేవారు. ఆయన ఇంగ్లీషు టీచరు కాబట్టీ ఆంగ్ల పత్రికలూ చదివేవారు. రోజూ నాలుగు ఉత్తరాల వరకు దేశంలోని వివిథ ప్రాంతాల నుంచీ వచ్చేవి. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు అన్నీ చదివి ఆ సాయంత్రం వాటికి జవాబులు రాసేవారు. ఒక డైరీలో తన స్నేహితుల అడ్రస్సులన్నీ రాసి ఉండేవి, నేనూ మా అక్కా కవరుల మీద చిరునామా రాసి, స్టాంపులు అతికించి పోస్టు డబ్బాలో వేసి ఆయనకు సాయపడేవాళ్ళం. అలా వాళ్ళు మాకూ పరిచయం. తర్వాతర్వాత ఫోనులు, టీవీల ప్రభావం పెరిగిపోవడంతో నాన్నగారి పోస్టు స్నేహాలకి బ్రేకు పడింది. కానీ తన పాత అలవాటు మానుకోలేక ‘జాబులూ జవాబులు’ కార్యక్రమానికి ఉత్తరాలు రాసి – ఏదో ఒకరోజు శాంతిస్వరూప్ గారు తాను కార్యక్రమల నిర్వహణకు చేసిన సూచనలను ‘తప్పక పరిశీలిస్తాము’ అని చెప్తాడని తెగ ఎదురుచూసేవారు. అప్పట్లో వచ్చే ఉత్తరాలని చురుకున్నా వంకీల ఇనుప చువ్వకు గుచ్చి, అది నిండుకున్నది అన్నప్పుడు వాటిని తీసి చింపివేసేవాళ్ళం.
వాచ్‌మాన్ చూపించిన వైపుకు లోపలికి వెళ్ళితే ఆఫీసు రూము కనిపించింది. అక్కడ కూర్చొనివున్నా నడివయసామే నన్ను చూడంగానే, “చెప్పండీ” అంది.
“కృష్ణ కమల్ గారిని కలవాలి” అన్నాను నేను.
“దేని గురించీ? నాన్నగారు ఇప్పుడు పెద్దవారైపోయారు. స్కూలు వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను. మీరు చెప్పండి”
“స్కూలు గురించి కాదండీ. నేను ఆయన్ని కలవడానికి వచ్చాను. మాది బందరు”
“బంధువులా? మిమ్మల్నీ ఎప్పుడూ చూసిన గుర్తు లేదే?”
“కాదండీ, తెలిసినవాళ్ళం అంతే. ఒక్కసారి అయ్యన్ని కలిసి వెళ్ళిపోతాను” ఒక్క క్షణం నన్ను పరికించి చూసినావిడ, ఏమనుకుందో లేచి ముందుకు కదిలి నన్నూ వెంబడించమంది.
విశాలమైన ప్రాంగణంలో ఓ మూల చక్కటి ఇల్లుంది. అందులోని మొదటి అంతస్తులో ఓ గదిలో మంచంమీద బక్క పలచటి శరీరమొకటి సేద దీరుతుంది. మందుల వాసనతో నిండివున్నా గదిలో ఓ పక్కన పుస్తకాలూ, అక్కడే బల్లమీద టేపు రికార్డరు – క్యాసెట్టులూ చక్కగా అమర్చబడ్డాయి. అలికిడికి కళ్ళు తెరిచినాయనకు, “నిన్ను కలవడానికి వచ్చారు, బందరు నుంచీ” అని ముక్తసరిగా చెప్పి పక్కకు జరిగింది ఆవిడ.
పడుకునే కళ్ళజోడు పెట్టుకొని, “ఎవరూ” అన్నారు.
చేతులు జోడించి, “నేను పావెల్ అండీ. మాది బందరు, గుర్తుపట్టారా?” అన్నాను.
“నా దగ్గర చదువుకున్నావా? ఏ సంవత్సరం? ఇప్పుడేం చేస్తున్నావు? చాలా సంతోషం. ఇలా వచ్చి కనపడితే మాకూ ఆనందంగా ఉంటది. ఆరోగ్యం బావుండలేదు నాయనా. స్కూలునీ, చదువు చెప్పిన మాస్టారులనీ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మంచిది బాబూ” పాఠం అప్పచెప్పినట్టు పీల గొంతుతో అనేసి ప్రతి నమస్కారం చేశారు వారు.
“అయ్యో కాదండీ. నేను మచిలీపట్టణం నుంచీ వచ్చాను. నా పేరు పావెల్” అన్నాను కొంచెం ముందుకు వంగి, కాస్త గొంతు హెచ్చిస్తూ.
“ఈ మధ్య కాస్త వినికిడి తగ్గింది. ఒక పని చెయ్యండి, రాసి చూపించండి” అంటూ పక్కనే ఉన్నా పుస్తకాల నుంచీ ఒకటి తీసింది ఆవిడ. అది ఓ ప్రసిద్ధ రచయిత కవితా సంపుటి, తెరిస్తే ముందూ వెనుకా రాసుకోడానికి ఖాళీ కాయితాలు ఉన్నాయి కానీ అంతటి మహత్తర కావ్యాన్ని పిచ్చి రాతలతో కలుషితం చెయ్యడం ఇష్టం లేక పోయింది నాకు. చుట్టూ చుస్తే ఆ రోజు న్యూస్ పేపర్ కనపడింది. మొదటి పేజీ మొత్తం ఓ కార్పొరేటు సంస్థ తన కార్యకలాపాల గురించి ఇచ్చిన ప్రకటన అందంగా ముద్రించబడిఉంది. అక్కడక్కడా ఉన్నా ఖాళీలో నేను ఇందాక చెప్పింది రాసి ఆయన కిచ్చాను. అది చదివిన వాడు నా వంక కాసేపు నిశ్చలంగా చూస్తుండిపోయాడు. కొద్ది సేపటి తరువాత నన్ను దగ్గరకు రమ్మని, నా భుజం తట్టి, “నన్ను గుర్తుపెట్టుకొని వచ్చావా? మీ నాన్న బాగున్నాడా?” అన్నారు. నేను మళ్ళీ పేపరు తీసుకొని ఆయన కాలం చేశారని రాసాను.
“అయ్యో. మంచోడు. అప్పటి మనుషులే వేరు” అని కూతురు వైపు తిరిగి, “నేను చెప్పే వాడిని కదా, ఈ అబ్బాయి వాళ్ళ నాన్నా నేనూ అప్పట్లో ఉత్తరాలు రాసుకొనే వాళ్ళం. గుర్తు పెట్టుకొని వచ్చాడు చూడు. కాస్త కాఫీ ఇవ్వు” అనంగానే ఆమె నా వైపు తిరిగి నవ్వింది.
“నిజానికి నా పేరు ఈయనే పెట్టారండీ. మా నాన్న నాకు నామకరణం అప్పుడు మంచి పేరు సూచించమని తన స్నేహితులందరినీ అడిగితే, రకరకాల పేర్లు రాసి పంపారు వాళ్ళందరూ. మీ నాన్నగారు గోర్కీ రాసిన ‘ది మదర్’ నవలలోని ‘పావెల్’ అనే పేరుని సూచించడం అది ఆయనకి నచ్చి నాకాపేరు పెట్టడం జరిగింది. అందుకే ఇన్నాళ్లకి ఈ ఊరు రావడం పడితే గుర్తు పెట్టుకొని వెదుక్కుంటూ వచ్చానన్నమాట” సంబరంగా చెప్పాను నేను. తను లేచి లోపలికెళ్ళింది.
ముసలాయన నా వైపు ఆందోళనగా చూసాడు, నేను కాస్త ముందుకొంగి తన కాలరు పట్టి పైకెత్తి, “ద్రోహీ. పాపీ చిరాయువన్నారు అందుకే నీకింకా చావు రాలేదు. మంచాన పడి కుంగి కృశించిపోతావ్. నీది ఒక బ్రతుకేనా?” అని కసితీరా తిట్టి వదిలేసాను. వెనక్కి పడ్డవాడు సంబాళించుకొని, “అప్పుడేం ఏం జరిగిందో మీకెవరికీ తెలీదు బాబూ. మీ నాన్న లాటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో నేనూహించగలను. కానీ జరిగినదాంట్లో నా తప్పు లేదు. ఇన్నాళ్లూ నేనిది ఎవరికీ చెప్పుకోలేక పోయాను. నా దగ్గర అడ్రస్సులన్నీ పోయాయి. ఎవరికీ వివరణ ఇచ్చుకోలేకపోయాను. పార్టీతో సహా అసలెవరూ నన్ను అడగలేదు కూడా, ఇన్నాళ్ళకి ఒక కామ్రేడ్ కొడుకొచ్చి నన్ను కాలరు పట్టి కుదిపేస్తే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నే చెప్పేది నువ్వన్నా వింటావా?” అన్నాడు. ఇప్పుడాయన గొంతు గంభీరంగా ఉంది. నేను పేపరు తీసు విసుగ్గా, “చెప్పూ” అని రాసి చూపించాను. రెండు చేతులు మంచానికి నొక్కి పెట్టి, నడుం పైన లేచి కూర్చొని, పక్కకి జరిగి గోడకి ఆనుకొని, చెప్పనారంభించాడు ఆయన.
* * *
రాడికల్ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన గెరిల్లా దళాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వీర కామ్రేడ్ SK నాకు స్వయానా పెదనాన్న. కాలాజీ రోజుల్లోనే నేనూ ఉద్యమం పట్ల ఆకర్షణతో అడవులకెళ్లి ఆయన్ని కలిసాను. గెరిల్లా యుద్ధ రీతులలో ఆరితేరిన ఆయన, అప్పటికే ప్రజలలోని పార్టీ సానుభూతిపరులతో ఉత్తరాల ద్వారా సమాచార చేరవేత వ్యవస్థను ఒక దానిని ఏర్పాటు చేసి ఉన్నాడు. నన్నూ దానిలో భాగం చేసి, బయట ఉండి కూడా ఉద్యమానికి సాయపడ వచ్చని నచ్చ చెప్పి పంపించేశాడు. మీ నాన్న లాటి వాళ్లతో స్నేహం అని ఉత్తరాలు రాసుకొనే వాళ్ళం. పైకి ఏదో కాలక్షేపం కబుర్లూ, కుశల ప్రశ్నలుగా కనపడినా, అందులో చాలా రహస్యాలు దాగుండేవి. దానికి సంబంధిచిన కోడు ముందుగానే మా కందరికీ నేర్పించారు. నేను ఈ స్కూలు నడుపుతూ – అవసరం అయ్యినప్పుడు ఆశ్రయం కల్పిస్తూ, డబ్బు సాయపడుతూ ఉండేవాడిని.
ఒకసారి పెద్దయ్యకు జబ్బు చేసి మద్రాసులోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. నిజానికి అప్పట్లో కలకత్తా వెళ్లడం రివాజు కానీ పెరిగిన తనిఖీల వల్ల ఇబ్బందని అక్కడికెళ్లారు. వయసు పైబడుతుండటంతో జబ్బులు, అడవిలో అస్తవ్యస్థ జీవనంతో నీరసించిన ఆయనను ICU లోని చల్లదనం, 24 గంటలూ వెన్నంటి ఉండి నర్సులు చేసే సపర్యలూ సేదదీర్చాయి. పాపం ఇంకా అడవుల్లో పరిగెత్తడం తన వల్ల కాదంటూ నాకు కబురెట్టారు. పార్టీ వారికి చెప్పాం, పరిశీలించి నిర్ణయం తెలియచేస్తామన్నారు. కోలుకున్నాక ఆయన మళ్ళీ అడవులకెళ్ళారు. నెలలు గడుస్తున్నాయి, SK ఆరోగ్యం క్షీనిస్తుంది, భద్రతాదళాలు చెట్టు పుట్టని జల్లెడ పడుతుండటంతో పద్దాకా స్థావరం మార్చాల్సి వచ్చేది. విసిగిపోయిన SK ఓ రోజు నా దగ్గరకొచ్చేసాడు. నేను ఆయన్ని తెలిసిన DSP దగ్గరకు తీసుకెళ్ళాను. పోలీసులు అది లొంగుబాటని చెప్పినా పార్టీ మాత్రం ఎవరో మోసం చేసి ఆయన్ని పట్టించారని ప్రకటించి, నా మీద కక్ష కట్టింది.
అటు పోలీసులూ, ఇటు పార్టీ నా మీద నిఘా పెట్టాయి. నా స్కూల్లో టీచర్లు, నాకొచ్చే ఉత్తరాలూ, నా ప్రతీ కదలికనూ పరిశీలించడం మొదలెట్టారు. కలం స్నేహం పేరున మేము ఉద్యమానికి అందిస్తున్నా సహాయ సహకారాల గురించి తెలుసుకొని పోలీసులు నన్ను అరెస్టు చేశారు. అప్పుడే నా వద్ద దొరకిన ఉత్తరాల ఆధారంగా నాకు మిత్రులైన వారందరినీ కూడా విచారించారు. కోర్టులో నా పై కేసు నిలవలేదు – నేను విడుదలయ్యాను. కొన్నాళ్లకి అసలు నాకు ఉత్తరాలే రావడం ఆగిపోయింది, బహూశా పోలీసులు తీసుకోవడం మొదలెట్టివుంటారు.
ఇదీ జరిగింది. కామ్రేడ్ SK తనంతట తానే లొంగిపోయాడు, కానీ అందరూ నేను చేసిన ద్రోహంవల్ల ఆయన దొరికిపోయాడనుకున్నారు. బ్రతికున్నపుడు ఆయనా ఎప్పుడూ ఈ విషయంలో వివరణ ఇవ్వలేదు. నా మీద నిఘా వల్ల నాకు ఉత్తరాలు రాసిన వాళ్ళందరూ కూడా పోలీసుల దృష్టిలోకి వచ్చారు. కామ్‌గా సంసారం చేసుకొంటూ, ఏదో ఉద్యోగం చేసుకొంటూ, ఉద్యమానికి సాయపడిన మీ నాన్న లాటి వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిపోయారు. అలా నేను ఉద్యమ ద్రోహినయ్యాను.
ఏదో చెప్పాలని నోరు తెరుచుకుంటుంది, కానీ ఎదుటి మనిషికి వినపడదు అని మనసు ఆపుతుంది.
ఉద్యమం పట్ల తన తండ్రి యొక్క నిబద్ధత గురించి తనకా వయసులో తెలీదుగానీ – రోజూలాగే స్కూలు నుంచీ వచ్చి ఇంటి ముందు ఖాళీ స్థలంలో మడత కుర్చీ వేసుకొని కూర్చొని ఉత్తరాలు చూస్తున్నా తండ్రిని, పోలీసులు ఒక్కసారిగా చుట్టముట్టడం – ఆయన తన చేతిలోని కాగితాలు చింపెయ్యడం, అమ్మ వెంటనే చురుకున్నా ఉత్తరాల చువ్వని తీసుకెళ్లి మండుతున్నా పొయ్యిలో పడెయ్యడం – అది గమనించిన కానిస్టేబులు లాఠీతో దానిని బయటకు లాగడం, వేగంగా వెనక్కి వచ్చిన చువ్వ పక్కనే ఉన్న నా కాలిమీద పడటం, ఆ వేడికి నా కుడి కాలు కాలడం, అమ్మ పసుపు గుడ్డ కట్టడం, ఇల్లంతా గాలించిన పోలీసులు ఆపై జీపులో నాన్నని ఎక్కించుకుపోవడం, అమ్మ రోజూ పోలీసు స్టేషన్‌కు అన్నం తీసుకువెళ్లడం, వారం తరవాత నాన్న కుంటుకుంటూ తిరిగిరావడం, ఆపై నన్ను నెల్లాళ్ళు సైకిలుపై ఆసుపత్రికి తిప్పడం మాత్రం గుర్తుంది. కాలిన గాయం మానింది కానీ ఆ మచ్చ అలా ఉండిపోయింది – దానిని చూసినప్పుడల్లా నాన్న అనేవాడు ‘ఆ ద్రోహి వల్లే ఇదంతా’ అని.