కాజాల్లాంటి బాజాలు-48: అల్లంఘాటు

4
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]కొ[/dropcap]డుక్కి పెళ్ళి చెయ్యాలని సంబంధాలు చూస్తున్నారు సీత, సీతాపతి. ఇదివరకు రోజులు కావు. కావల్సిన బంధువులు బాబయ్యో, మామయ్యో తెలిసిన వాళ్ళ సంబంధం తేవడం, ఇద్దరిమధ్యా కాస్త తేడాలుంటే మధ్యవర్తిత్వం నెరిపి సంబంధం కుదర్చడం లాంటివి ఇప్పుడు లేవు. ఏమో.. ఇదివరకులా నలుగురు పిల్లలుంటే దేనికోదానికి సర్దుకుని సంబంధాలు కుదుర్చుకునేవారేమో. ఇప్పుదందరికీ ఒక్కరూ లేదా ఇద్దరే పిల్లలు. వాళ్ళే డాక్టర్లూ, ఇంజనీర్లూ కావాలన్నట్లు ఆ ఒక్క పెళ్ళి మీదే తల్లితండ్రుల ఆశలు కూడా. వయసు నచ్చాలి, చదువు నచ్చాలి, మనిషి నచ్చాలి, కుటుంబం నచ్చాలి. పైకి చెప్పకపోయినా యిచ్చిపుచ్చుకోడాలు మరీ నచ్చాలి.

అమెరికాలో వున్న అబ్బాయే కావాలని కొందరు కోరుకుంటుంటే, మా అమ్మాయిని అమెరికా పంపం.. ఇండియాలో వున్న అబ్బాయే కావాలని మరికొందరి తల్లితండ్రుల అభిప్రాయం. ఇవన్నీ ఒక్కసారిగా తెలిసేసరికి సీత, సీతాపతి కాస్త ఖంగారుపడ్డారు. సరే.. కాలంతోపాటే మనమూనూ అనుకుంటూ బంధువులకీ, తెలిసినవాళ్ళకీ అందరికీ మా అబ్బాయికి పెళ్ళి చేస్తాం, ఎవరైనా అమ్మాయుంటే చెప్పమని చెప్పారు. అప్పట్నుంచీ వారికి ఒక్కొక్క సంబంధంతో ఒక్కొక్కరకమైన అనుభవం.

అసలు కొడుక్కి సంబంధాలు చూడ్డానికి ముందు ఎటువంటి సంబంధానికి వెళ్ళొచ్చో సీత అభిప్రాయం తెలుసుకుంటే మంచిదనిపించింది సీతాపతికి. అదే అడిగాడు సీతని. సీతకి తెలుసు, సీతాపతి పధ్ధతైన మనిషి. అన్నీ పధ్ధతి ప్రకారం చేస్తాడు. ఇంట్లో వాళ్ళని కూడా అలాగే చెయ్యమంటాడు. కొన్నింటికి పధ్ధతిగా చేస్తే బాగానే వుంటాయి కానీ మరీ ప్రతిదానికీ గిరిగీసి యిదే పధ్ధతంటే ఎలా కుదుర్తుందీ? అందులోనూ సీత దగ్గర అసలు కుదర్దు. అందరూ మర్యాదస్తులుండరూ, ఇలా మాట్లాడితే చేతకానివాడంటారూ, వాళ్ళ భాషలో మాట్లాడితేనే వాళ్ళకి తెలుస్తుందీ అంటుంది సీత. కాని అలా చెయ్యలేడు సీతాపతి. అతని స్వభావం అతనిది. ఎవరినీ నొప్పించడు. మిత్ర, బంధువర్గంలో అంతటా అతనికి “దేవుడు” అనే మంచిపేరుంది. అందుకని అప్పుడప్పుడు అతను చెప్పినవి శ్రధ్ధగా వింటుంది. సందేహాలుంటే తీర్చుకుంటుంది. బుధ్ధిమంతురాలిలా అన్నింటికీ తలూపుతుంది. మళ్ళీ పక్కకి తిరిగితే ఆవిడ ధోరణి ఆవిడదే.

“అలా చెయ్యమన్నానుకదా…”అని ఎప్పుడైనా పొరపాటున సీతాపతి అడిగితే, “అయ్యో, మీరలా అన్నారా? నేనిలా అనుకున్నాను..” అంటూ నీ ముక్కేదంటే చేతిని మూడు వంకర్లు తిప్పినట్టు ఒకే మాటని పదిరకాలుగా తిప్పి ఎదుటివాళ్ళని అయోమయంలో పడేస్తుంది. యివన్నీ తెలుసు సీతాపతికి. కాని అతని పధ్ధతి అతనిదే. చెప్పాలనుకున్నది చెప్పితీర్తాడు. అలాగే ఒకరోజు సీతని పిలిచాడు. వచ్చింది.

“కూర్చో…” బుధ్ధిగా కూర్చుంది సీత.

“యింతకీ మనం ఎటువంటి సంబంధాలకి వెళ్ళాలంటావ్?”

సీత ఉత్సాహంగా మొదలుపెట్టింది.

“పిల్ల తెల్లగా వుండాలి. అలాగని పాలిపోయినట్టుండకూడదు. కళకళ్ళాడుతుండాలి. మరీ పొడుగ్గానూ వుండకూడదు, మరీ పొట్టిగానూ వుండకూడదు. మరీ లావుగానూ వుండకూడదు, అలాగని గాలేస్తే ఎగిరిపోయేట్టూ వుండకూడదు. డాన్సు రాకపోయినా ఫర్వాలేదు కాని సంగీతం కాస్తో కూస్తో నేర్చుకునుంటే బాగుంటుంది. మంచి చదువుండాలి. కాని ఎక్కడా ఉద్యోగం చెయ్యకూడదు. ఒకవేళ చేస్తున్నా పెళ్ళయ్యేక అది మానేసి అబ్బాయితో కాపరానికెళ్ళాలి. ..”

పోజు మార్చింది.

“మన పార్వతమ్మగారు చెప్పేరండీ, వాళ్ళ తమ్ముడికి చేసుకున్న పిల్ల ఉద్యోగం వదిలి రానందిట.. ఆ పిల్లక్కడ.. వాళ్ళ తమ్ముడిక్కడ. ఇంక పెళ్ళెందుకు చెప్పండి?”

సీతాపతి తల పట్టుకున్నాడు. సీత వాక్ప్రవాహం ఆగిపోయింది.

“చూడు తల్లీ, నేను ఒకటొకటే అడుగుతాను. నువ్వు చెప్పు.”

“అలాగే..”

“అమ్మాయి మన శాఖలో అమ్మాయే కావాలా? లేకపోతే ఏ శాఖయినా పనికొస్తుందా? గోత్రం, ఋషులు కలిసినా పరవాలేదా? ఇవి చెప్పు ముందు..”

“అయ్యో.. అయ్యో.. గోత్రాలు, ఋషులు కలిస్తే ఎలాగండీ? మొన్న ఏదో పేపర్లో చదివాను. ఈ గోత్రాల గురించి రీసెర్చ్ చేసినవాళ్ళు రాసారు. ఏమనంటే …యిదివరకు జనాలందరూ గుంపులు గుంపులుగా వలసలు పోయేవారు కదండీ. అందుకని అలా విడిపోతున్నప్పుడు రక్తసంబంధీకులైన వాళ్ళందరూ ఒకే గోత్రం అన్నట్టు పేరు పెట్టుకునేవారుట. అందుకని సగోత్రీకుల్ని చేసుకుంటే రక్తసంబంధీకుల్ని చేసుకున్నట్టే. ఒకే గ్రూపుకి చెందిన రక్తంకల వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి సమస్య లొస్తాయని సైన్స్ చదివిన వాళ్ళందరూ చెప్తారు కదండీ. మీకు తెలీదామాత్రం?”

అతన్నే నిలదీసింది సీత. సీతాపతికి విసుగొచ్చింది.

“నేను అడిగినదానికి రెండే రెండు మాటల్లో జవాబు చెప్తేనే మనం ఈ విషయం మాట్లాడుకుందాం. లేకపోతే నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తాను.”

సీతకి పౌరుషం వచ్చింది.

“ఆ చూస్తార్లెండి.. అసలు మీరెవర్ట పిల్లని చూడ్డానికి? ఈ యింటికి కాబోయే కోడలంటే నాకు వారసురాలు. నాకు ఎలాంటి వారసురాలు కావాలో నేనే చూసుకుంటాను ..”

“ఆ.. చూసుకుంటావ్…నీలాగే ఏ తెలుగు పిచ్చున్నమ్మాయినో తెచ్చేవంటే వాడు కూడా నాలాగే బాధ పడాలి.”

“అబ్బో.. మహ పడుతున్నార్లెండి బాధ. అయినా అందరూ అలా నోళ్ళు మూసుకుని మూగి మొద్దుల్లా ఎలా కూర్చుంటారో యిళ్ళల్లో..” సీతాపతిని దెప్పింది.

“ఎందుకూ.. యింట్లో ఇంకెవరికీ ఛాన్సివ్వకుండా అందరి బదులూ నువ్వే మాట్లాడుతుంటే…”

“సర్లెండి.. మనకెందుకు వాదన? ఎలాంటి అమ్మాయి కావాలో వాడినే అడుగుదాం..”

అని అప్పటికి వాదించడం ఆపేసింది కాని సీత మనసులో ఈ విషయం గురించి ఆలోచిస్తూనే వుంది.

ఆరోజు సమయం ఉదయం తొమ్మిది. అప్పటికే ఆలస్యం అయిపోయిందని ఖంగారు పడుతూ సీత టిఫిన్ ప్లేట్లు టేబుల్ మీద సర్దింది. హాట్ పేక్ లోంచి వేడి వేడి యిడ్లీలు సీతాపతి ప్లేట్లో పెట్టి, పక్కన అల్లం పచ్చడి, కారప్పొడివేసింది.

రెండు ముక్కలు విరిచి నోట్లో పెట్టుకున్న సీతాపతి అడక్కూడదనుకుంటూనే మెల్లగా అడిగాడు.

“ఇదేం పచ్చడంటావ్?”

భర్త అమాయకత్వానికి సీత జాలిపడింది.

“అయ్యో.. ఆమాత్రం తెలీదుటండీ.. అది అల్లం పచ్చడి..”భార్య సౌమ్యంగా సమాధాన మివ్వడం చూసి కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు సీతాపతి.

“అవునా? మరి అల్లం ఘాటు ఎక్కడా తగలట్లేదేం? అసలు అల్లం పచ్చడంటే ఎలా వుండాలి? అల్లం, బెల్లం, చింతపండు, మిరపకాయ సమపాళ్ళలో పడాలి. అప్పుడే నాలిక్కి దాని రుచి తెలుస్తుంది. ఇది చూడు ఎంత చప్పగా వుందో..?”

సీత సంగతి తెలిసీ పొరపాటుగా అడిగేసాడు.

సీత తప్పు చేసినా తనది తప్పని ఒప్పుకోదు. తలపాగా చుట్టలేనివాడు తల వంకరన్నట్టు నెపమంతా ఎదుటివాళ్ళ మీదకు తోసేస్తుంది.

“సర్లెండి. ఆమాత్రం నాకు తెలీదేంటి? కాని మిరపకాయలు ఎక్కువేస్తే మీకు కడుపులో మండుతుంది కదా.. అందుకని తగ్గించాను. చింతపండు ఎక్కువైతే పులుపు మీకు నోటికి పట్టదు కదా అందుకని కాస్తే వేసేను. తీపి తగిల్తే పళ్ళు లాగేస్తున్నాయంటారని బెల్లం కూడా తగ్గించే వేసేను. మళ్ళీ మీరు బాధపడకుండా వుండాలని ఇంత జాగ్రత్తగా చేసేను..”

సీత సమర్థించుకున్న తీరు చూసి తెల్లబోయిన సీతాపతి నీరసంగా అడిగాడు.

“మరి ఇందులో అల్లమేనా వుండాలి కదా.. అదేది?”

“అదా… అల్లం అందులో అంతర్లీనంగా వుందండీ.. “

“అంతర్లీనమేమిటి తల్లీ.. ఏదో సరస్వతీనదీ అంతర్వాహిని అని విన్నాను కాని ఇలాగ పచ్చట్లో అల్లం అంతర్లీన మవుతుందని యింతదాకా ఎక్కడా వినలేదు. “

“అయ్యో.. అదికూడా తెలీదా..? ఓ ముసలమ్మ పచ్చగడ్డి పచ్చడి చేసి పెట్టిందిట ఓ మహారాజుకి. అది పచ్చగడ్డి పచ్చడి అని శుభ్రంగా పచ్చడి తిన్న అంత గొప్ప మహారాజు కూడా కనుక్కోలేకపోయాడుట. ఆ పచ్చగడ్డి లాగే పచ్చట్లో అన్నీ కలిపి గ్రైండ్ చేసేసినప్పుడు అందులోవన్నీ అంతర్లీనమయిపోతాయి కదండీ. మరింక దానినే అంతర్లీనమంటారన్న మాట. “

సీతాపతి దడుసుకున్నాడు. అంటే ఇందులో అసలు అల్లమే లేదన్నమాట. అల్లం బదులు ఇంకేదో వుందన్నమాట. కొంపదీసి పచ్చగడ్డి కాదుకదా.. తాడో పేడో తేల్చుకు తీరాలనుకున్నాడు.

“అసలు అల్లంపచ్చడంటే అల్లంఘాటు నసాళానికెక్కాలి.. అలాంటిది ఇందులో ఆ ఘాటే ఎక్కడా కనపడట్లేదూ..”

భర్త మాటలకి ఇటుతిరిగి “ఇప్పుడూ…” అంటూ సీత ఇంకా ఏదో వివరణ ఇవ్వబోతుండగా ఫోన్ మోగింది.

“హలో..” ఫోన్ ఎత్తింది సీత.

“హలో, సీతాపతిగారి ఇల్లాండి?

“అవునండీ..”

“ఆయనున్నారాండీ..?”

“ఉన్నారండీ. మీ పేరండీ.?”

“నా పేరు రావనాధవండీ. సీతాపతిగారబ్బాయి పెళ్ళికొడుకున్నాడని తెలిసీ.. మీ అబ్బాయాండీ…?”

“అవునండీ. మా అబ్బాయే. పెద్ద ఇంజనీరండీ. తెల్లగా వుంటాడు. పొడుగ్గా వుంటాడు. గుండ్రటి కళ్ళు. పొడుగు ముక్కు…. ముక్కు మా వారి మేనమావది వచ్చింది లెండి. అలాంటి ముక్కున్నవాళ్ళు చాలా అదృష్టవంతులవుతారుటండీ.. మా తాతగారు చెప్పేవారు.”

ప్రవాహంలా సాగిపోతున్న సీత మాటల్ని ఆపుతూ సీతాపతి ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు.

“హలో.. నేను పెళ్ళికొడుకు తండ్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి.”

సీత మాటలకి బిత్తరపోయిన ఆ రావనాధం తేరుకుని, “నా పేరు రావనాధమండీ. మీ అబ్బాయి పెళ్ళికొడుకున్నాడని తెలిసీ…”

విషయం మాట్లాడబోతున్న సీతాపతిని ఫోన్ ఒక చేత్తో ముయ్యమని సైగ చేసింది సీత. అలాగే మూసి ఏమిటన్నట్లు భార్య వైపు చూసాడు. “ఆ అమ్మాయికి తెలుగు చదవడం వచ్చో రాదో అడగండి..” రహస్యంగా చెప్పినట్టు గుసగుసలాడింది.

ఏదో పెద్ద విషయం చెపుతుందనుకున్న సీతాపతి నిస్సహాయంగా ఆమెని చూసి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. భర్త అలా తన మాట పట్టించుకోకపోవడంతో వీర నారి ఝాన్సీలక్ష్మీ లాగ ఫోన్ కున్న స్పీకర్ ఆన్ చేసిందామె. అవతలాయన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

“ఆయ్.. అవునండి. కోట్లున్నాయండి. అందుకని దానికి తగ్గ సంబంధం కోసం చూస్తున్నారండి. పిల్ల బాగుంటుంది. చదువుకుంది. తండ్రి కోటీశ్వరుడు. కాలు కింద పెట్టనివ్వకుండా పెంచుకున్నారండి పిల్లని. ఇంతకీ తమరికి ఏమాత్రం వుందండీ?”

మాట తప్పిస్తూ “అమ్మాయి వయసెంతండీ?” అడిగాడు సీతాపతి.

“చిన్నపిల్లేనండీ. ఊడుప్ భూవు లున్నాయండి. కొబ్బరితోటుందండి. ఎకరం స్థలంలో మూడంతస్తుల మేడ కట్టేడండి. ఒక్కతే పిల్లండి. వంద తులాల బంగారవుందండి. రెండు కిలోల వెండుందండి. అన్నీ ఆ పిల్లకేనండి. ఇంకా ఎక్కడెక్కడో షేర్లో ఏయో అంటారు చూడండి అయ్యి కూడా ఉన్నాయండి.. అవన్నీ…”

“మీ ఇంటి పేరేంటండీ?” మర్యాదైన స్వరంతో అడిగాడు సీతాపతి.

“ఆయ్, పెళ్ళికూతురు మా అమ్మాయి కాదండి..”

ఇవన్నీ వింటున్న సీతకి కోపం ఎగదన్నుకు వచ్చింది. సీతాపతి చేతిలోంచి ఫోన్ బలవంతంగా లాక్కుంది.

“ఆయ్.. ఇంతకీ తమరికేమవుతుందండీ పిల్ల?” అదే యాసతో అడిగింది.

“ఆయ్.. మా ఆవిడుందాండీ. అదేలెండి.. మా బామ్మర్దున్నాడాండీ. ఆడి భార్య మేనత్త కొడుక్కి తోడల్లుడు కూతురండి. చానా పెద్ద సంబంధవండి. కోట్లున్నాయండి. మరి దానికి తగ్గది చూసుకోవాలి కదండీ. మీ అబ్బాయేదో పెద్ద చదువు చదివాడంటేనూ, వివరాలు కనుక్కోమన్నారండి.. అందుకని ఫోన్ చేసేనండి..”

“మీకు ఏం వివరాలు కావాలండీ?” మర్యాదను తెచ్చిపెట్టుకుంటూ అడిగింది సీత.

“అదేనండి… మీ కెంతుందో వివరాలు కనుక్కోమన్నారండి. అందుకని ఫోన్ చేసేనండి. మీకు ఏమాత్రం వుందో చెపితే వాళ్ళకి చెపుతానండి.. ఇలాగంటున్నాననుకోకండీ.. మరీ కోట్లున్నాయి కదండీ.. అందుకు తగ్గది చూసుకోవాలి కదండీ మరీ..”

“కోట్లుంటే కోఠీలోని కోఠీలన్నీకొనుక్కుని వాటి మీదెక్కి దూకండి..” అనబోయి ఎదురుకుండా వున్న సీతాపతిని చూసి బలవంతంగా ఆ మాటలని మింగేసింది సీత. గొంతులోకి ఎక్కడలేని మర్యాదా తెచ్చుకుంది.

“మాకాండి.. ఆయ్… వాళ్ళకి కోతులుంటే మాకు కొండముచ్చులున్నాయండి..”

అవతలి పక్కనున్న రావనాధం బిత్తరపోయాడు. ఆవిడని ఆపాలని గబుక్కున అందుకున్నాడు.

“కోతులు కాదండీ. కోట్లు.. కోట్లు..” “ట”ని మరీ వత్తి పలికాడు.

“అహా.. అలాగాండీ.. వాళ్ళకి కోట్లుంటే మాకు భేట్లున్నాయండి..”

అవతలాయన బిత్తరపోయాడు. “అంటే యేంటండీ..?” అనడిగాడు.

సీత వూరుకోలేదు.

“అదేనండీ. మాదాపుర్ లో విల్లాలు కొందావనుకుంటున్నావండీ. బేరం కుదిర్తే ఓ పది కొని పడేస్తావండి.

బటర్ ఫ్లై రిసార్ట్స్ బేరం చేస్తున్నావండీ. అది కుదిర్తే ఓ పది కోట్లవుతుందండి.

మల్టీప్లెక్స్ అమ్ముతారేమో అడుగుతున్నావండీ..వాళ్ళమ్ముతే ఎన్ని కోట్లవుతుందో చూడాలండి..

మరింక మా మాట పక్కన పెడితే మా కుక్కలూ, పిల్లులూ కూడా వెండి పళ్ళేల్లోనే భోంచేస్తాయండి. అవి ఒకరోజు తిన్నవి మళ్ళీ మేం వాడమండి. గోడమీంచి విసిరేస్తాం. అలా విసిరేసిన చెత్త మా గోడ పక్కన పర్వతంలా పేరుకుపోయిందండి. మున్సిపాల్టీవాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ వచ్చి తీసికెల్టం లేదండి. మీకు మున్సిపాల్టీలో ఎవరైనా తెలుసాండీ.. తెలిస్తే కాస్త మాగోడ పక్క చెత్త తీయించి పుణ్యం కట్టుకోండి..” అంటూ టకటకా సమాధానం చెప్పేసి, మొహమ్మీద కొట్టినట్టు రిసీవర్ గట్టిగా క్రెడిల్ చేసి సీతాపతి వైపు తిరిగి

“మీరేంటన్నారూ.. అల్లం ఘాటు లేదనా.. “అంది.

సీతాపతి తడబడిపోతూ, “అబ్బే లేదనలేదు. అల్లంఘాటు ఫోన్ ఆ చివరిదాకా వెళ్ళిందీ అన్నాను” అంటూ వూపిరి పీల్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here