[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
రాజ్ గురించి పృథ్వీరాజ్ కపూర్
సుప్రసిద్ధ సినీ నటులు రాజ్‌కపూర్ బాల్యం, యవ్వనంలోని కొన్ని ఘటనల గురించి ఆయన తండ్రి పృథ్వీరాజ్ వెల్లడించిన వివరాలు ఇవి. మొదటి సారి తండ్రి అవబోతున్నప్పుడు ఆ ఆనందం సినీ నటుడికైనా, క్రికెటర్ కైనా, సాధారణ వ్యక్తికైనా ఒకేలా ఉంటుంది. ఆడపిల్ల అయినా, మగపిల్లాడయినా ముందే కొన్ని పేర్లు అనుకుంటారు. ఇందుకు పృథ్వీరాజ్ కపూర్ మినహాయింపేమీ కాదు.
***
తన భార్య మొదటిసారి ప్రసవానికి సిద్ధమవుతున్నప్పుడు, మగపిల్లాడు పుడతాడని పృథ్వీరాజ్ అన్నారు. పుట్టబోయే పిల్లవాడికి తాను ఎంచుకున్న పేరుని – ‘రణ్‌బీర్ రాజ్’ – అని ఒక కాగితం మీద రాసి భార్య దిండు కింద ఉంచారట. పేరు ఖాయమైపోయింది. చిన్నారి రాజ్‍ని ఇంట్లోని పెద్ద ఆడవాళ్ళు ‘చిస్తో’ అని పిలిచేవారట, అది వాళ్ళు రాజ్‌కి పెడదామనుకున్న సృష్టినాథ్‌కి సంక్షిప్త రూపం. రాజ్ తొలి నాటి రోజులని గుర్తు చేసుకుంటూ నీలికళ్ళ, ఎర్రని బుగ్గల ఆ అందాల బాలుడికి తన ముత్తాత గారి కళ్ళు వచ్చాయని అనుకున్నారు. ఆ పసివాడి బుగ్గలు ఎంత ఎర్రగా ఉండేవంటే, ఆ సహజ ఎరుపుని నమ్మలేని – రమ (పృథ్వీరాజ్ కపూర్ భార్య) బుగ్గలపై ఏమైనా దుమ్ము పడిందేమోనని మాటిమాటికీ తడిగుడ్డతో తుడిచేవారట. “ఇంకో ఆసక్తికరమైన విషయం చెబుతాను” అన్నారు పృథ్వీరాజ్. “కొన్నేళ్ళ తర్వాత మేం ముగ్గురం మాస్కో వెళ్ళాం. ఫిలిం ఫెస్టివల్‌లో రాజ్ న్యాయనిర్ణేత. నేనేమో ‘పరదేశి’ సినిమా షూటింగ్‌లో ఉన్నాను, నా భార్య నాతోనే ఉంది. రాజ్‌ని ఫెస్టివల్ హాల్‌లో రష్యన్ అమ్మాయిలు చుట్టుముట్టారు. నా భార్య ఒత్తిడి చేయడంతో, నేను వెళ్ళి రాజ్‌ని విడిపించి, వాళ్ళ అమ్మ వద్దకు తీసుకువచ్చాను. అప్పుడామె రాజ్ బుగ్గలని తుడిచింది. ఈసారి బుగ్గల నుంచి రంగు వచ్చింది – అది అమ్మాయిల లిప్‌స్టిక్ రంగు!” చెప్పారు పృథ్వీరాజ్.
తాను జన్మించిన పెషావర్ లోనూ, ఇంకా వాళ్ళ కుటుంబం వెళ్ళే సముందరీ వంటి ప్రాంతాలలోనూ ఇంటాబయటా రాజ్ సుప్రసిద్ధుడు. “అప్పట్లో రాజ్ అందరి కళ్ళల్లో కనుపాపల ఉండేవాడు” అన్నారు పృథ్వీరాజ్. “వ్యాపారులకి కూడా రాజ్ అంటే ఇష్టం ఉండేది, రాజ్ చేత డాన్స్ చేయించి, అతనడిగిన చిన్న వస్తువులు తమ కొట్లలోంచి ఉచితంగా ఇచ్చేవారు.”
రాజ్‌కి సుమారు ఏడేళ్ళ వయసులో జరిగిన ఘటన గురించి చెప్పారు పృథ్వీరాజ్. “ఓ పనివాడితో కలసి షూటింగ్ జరుగుతున్న స్టూడియోకి వచ్చాడు రాజ్. తమ్ముడు బిందు అనారోగ్యంగా ఉన్నాడని చెప్పాడు, అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళమ్మ రాజ్‌ని టాక్సీలో పంపిందంటే… అప్పట్లో అది మాకు ఓ విలాసం లాంటిది… పరిస్థితి తీవ్రత అర్థమైంది” చెప్పారు పృథ్వీరాజ్. అప్పట్లో కపూర్ కుటుంబం ఖర్ శివార్లలో ఉండేది, నాలుగేళ్ళ వయసున్న బిందు (రవీంద్రనాథ్) పక్కింటి తోటలో ఆడుకుంటున్నాడు. స్నానం చేయడానికి వాళ్ళమ్మ పిలిచింది. బిడ్ద ఇంట్లోకి వచ్చాడు, ఉక్కిరిబిక్కిరి అయ్యాడు, తల్లి చేతుల్లోనే కన్నుమూశాడు. పాము కాటేమోనని డాక్టర్ అనుమానపడ్డాడు. కానీ తర్వత, మరో అనుమానం రేగింది, పక్కింటివాళ్ళు ఎలకలని చంపడానికి పెట్టిన తియ్యమందుని బాబు ఏమైనా తిన్నాడా అని! మరో పదిహేను రోజుల్లో ఆ కుటుంబంలో ఇంకో దారుణం సంభవించింది. బిందు కన్నా చిన్నవాడైన దేవేంద్రనాథ్ అనే పిల్లాడు హై ఫీవర్‌తో చనిపోయాడు. ఆ పిల్లల ముఖాలను, తమ్ముడు అనారోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి స్టూడియోకి వచ్చిన రాజ్ ముఖం పృథ్వీరాజ్ మరచిపోలేకపోయారు.
రాజ్ మెట్రిక్‌లో ఫెయిలయ్యాడు. నిజానికి పిల్లవాడు చక్కని విద్యార్థి అనీ, ఇంగ్లీష్‌లో ఫస్ట్ వస్తాడనీ, ఆల్‌రౌండర్ అనీ, నటనలోనూ, స్కూల్లో నాటకాలకు దర్శకత్వం వహించడంలోనూ, వక్తృతం పోటీలో విజయం సాధించడంలోనూ ప్రతిభ చూపాడని పృథ్వీరాజ్ అన్నారు. రాజ్ బలహీనతల్లా అరిథ్‌మెటిక్, లాటిన్ అని అన్నారు. రాజ్ మెట్రిక్ పాసవ్వాల్సిన ఏడాదికి ముందు సంవత్సరం పృథ్వీరాజ్ ముఖాముఖి మాట్లాడేందుకు అతన్ని పిలిచారు. ఎక్స్‌ట్రా కరికులర్ ఏక్టివిటిస్‌లో రాజ్ ప్రతిభని ప్రశంసిస్తూనే, కొన్ని సబ్జెక్టులలో ఇంకా శ్రమించాల్సి ఉందని హెచ్చరించారు.
పృథ్వీరాజ్ గారి తండ్రిగారు చెప్పడంతో తమ్ముడు విశీ (పృథ్వీరాజ్ మారు తమ్ముడు) (నిజానికి పృథ్వీరాజ్ తన తల్లిని సవతి తల్లి అని గాని, తమ్ముడిని సవతి తమ్ముడు అని గాని ఎక్కడా చెప్పుకోలేదు) గురించి మాట్లాడడానికి అతను చదివే స్కూలికి వెళ్ళాల్సి వచ్చిందట! ఎందుకంటే, మెట్రిక్యులేషన్ పరీక్షకి హాజరయ్యేందుకు విశీకి అనుమతి దొరకలేదట! తమ పలుకుబడిని ఉపయోగించడం పృథ్వీరాజ్‌కి ఇష్టం ఉండేది కాదు. ‘కానీ ఇది మా నాన్నగారి విన్నపం అవడం వల్ల చేయాల్సి వచ్చింది’ అన్నారాయన. అయితే తన సొంత కొడుకు విషయంలో మళ్ళీ ఇదే విధంగా చేసే ఉద్దేశం లేదాయనకి. రాజ్‌ని పిలిచి “నాకొక మాట ఇవ్వు, నీ ఫారం నువ్వే తెచ్చుకుంటానని. నన్ను తెమ్మనకూడదు” అని మాట తీసుకున్నారట. శ్రీమతి పృథ్వీరాజ్ ఒకసారి భర్త వద్దకి వచ్చి రాజ్‌ని మెట్రిక్యులేషన్ పరీక్షకి కూర్చోనిస్తారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. భర్త వెళ్ళి ప్రిన్సిపాల్‌ని కలిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పృథ్వీరాజ్ అంతా విని, “సరే వెళ్తాను, కానీ రాజ్‌ని వచ్చి అడగమను” అన్నారు. రాజ్ అడగలేదు. ఈ ఘటనకి రాజ్ భవిష్యత్తు నడవడికకు సూచికగా పృథ్వీరాజ్ భావించారు.
తాను ఆ రోజుల్లో తిరుగులేని కథానాయకుడైనప్పటికీ, తన పిల్లలకి అన్ని రకాల విలాసాలు కల్పించగలిగే స్థితిలో ఉన్నప్పటికీ – ఆ పని చేయలేదు పృథ్వీరాజ్. ఓ వర్షం కురుస్తున్న రోజున రాజ్‌ని బడికి పంపడానికి తమ కారుని తీసుకువెళ్ళేందుకు అనుమతించమని శ్రీమతి పృథ్వీరాజ్ ఆయన్ను అడిగారు. రాజ్ బైకుల్లా లోని ఆంటోనియో డిసోజా స్కూల్లో చదివేవారు. వాళ్ళుండే మాతుంగ నుంచి, మామూలుగా ఇతర పిల్లలానే, ట్రామ్‌లో వెళ్ళేవారు. పృథ్వీరాజ్ తన భార్యతో – “నీకు తెలుసా, ప్రతీ ఒక్కరికీ కొన్ని విలువైన అనుభవాలు ఉంటాయి. ఇలా వాన కురిసే రోజున, రోడ్లపై నడవడంలోనూ, చినుకులను తప్పించుకోవడంలోనూ, నీటి మడుగులను దాటడంలోనూ, ఒక రకమైన ‘నృత్యం’ చేయడంలోనూ గొప్ప థ్రిల్ ఉంటుంది. ట్రామ్ ఎక్కాలి. బహుశా ట్రామ్‌లో తాత్కాలికంగా పొడిగా ఉన్నవారు ఉంటారు, దిగడానికి సిద్ధంగా ఉంటారు, తడిబట్టలతో ఉన్నవాళ్ళు తమని తాకడాన్ని ఇష్టపడరు. అప్పుడు మీకు కూర్చోడానికీ సీటు దొరుకుతుంది, మీ పక్క నున్నవాళ్ళకి మీరూ, మీ తడి బట్టలు నచ్చవు. ట్రామ్ కూత బెడుతూ ముందుకు సాగుతుంది, మీరేమో రోడ్డు మీద జరిగే జీవిత నాటకం చూస్తూంటారు. బడికి ఆలస్యంగా చేరచ్చు కానీ, టీచరు శిక్ష విధించవచ్చు, కాని అదంతా గొప్ప సరదాగా ఉంటుంది” అని చెప్పి, “కానీ… ఈరోజు పెద్ద వాన పడుతోంది, రాజ్‌కి ఆలస్యం అవుతోంది కారు తీసుకెళ్ళమను” అంటూ ముగించారు. ఇదంతా రాజ్ విన్నారు. “వద్దు నాన్నా, ట్రామ్‌లోనే వెళతాను” అని చెప్పి బయల్దేరారు. తల్లిదండ్రులిద్దరూ బాల్కనీ లోంచి రాజ్ వెళ్ళడం చూస్తుండగా, “కారు గురించి బాధపడకు. మనబ్బాయి – వాళ్ళ నాన్న కారు కన్నా పెద్ద కార్లు, గొప్ప కార్లు తన కోసం కొనుక్కుంటాడు” అన్నారు పృథ్వీరాజ్.
మెట్రిక్యులేషన్ పరీక్ష సంఘటన తర్వాత, రాజ్ తన తండ్రితో ముఖాముఖి మాట్లాడడానికి… ఈసారి తన చొరవతోనే వెళ్ళారు. “నాన్నా, నేను నా చదువు పూర్తి చేస్తాను. కానీ నేను నేర్చుకునేందతా దుస్తులు స్టైల్‌గా ధరించడమే కావచ్చు; బహుశా డిగ్రీ పూర్తి చేశాక, ఉద్యోగం ఇప్పించమని అడగడానికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను” అన్నారు. కానీ ఇదంతా జరగకముందే తక్షణమే సినీరంగ ప్రవేశం చేయాలనుకున్నారు రాజ్. పృథ్వీరాజ్ నవ్వారు. తాను సినీరంగంలోకి ప్రవేశిస్తానని చెప్పినప్పుడు ఇంట్లో ఎదురైన ప్రతిఘటనని గుర్తు చేసుకున్నారు. తన కొడుకుకి మూడు వందల రూపాయలు ఇచ్చి తమ వాళ్ళున్న లాహోర్, షేక్‌పూరా, సముందరీ, డెహ్రాడూన్ వంటి ప్రాంతాలకు వెళ్ళి రమ్మన్నారు. ‘వెళ్ళొచ్చాక, నీకు అప్పటికీ సినిమాల్లో నటించాలని ఉంటే నేను సాయం చేస్తాను’ అని చెప్పారు. “మా బంధువులంతా రాజ్‌కి స్వాగతం పలికారు, అభిమానంగా చూశారు” చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. “రాజ్ భోజనప్రియుడు. మా వాళ్ళు రాజ్‌కి అన్ని రకాల పదార్థలు పెట్టేశారు, ఫలితంగా రాజ్‌కి డీసెంట్రీ పట్టుకుంది. పాపం, ఆ రోగాన్నీ, సినీరంగంలో ప్రవేశంపై వ్యతిరేకతనీ తట్టుకుని ఇంటికి వచ్చాడు. తన మనసు మారలేదని చెప్పాడు” అన్నారు పృథ్వీరాజ్.
***
ఈ విధంగా రాజ్ కపూర్ సినీ రంగ ప్రవేశానికి నాంది పలికింది.
బొల్లిముంత శివరామకృష్ణ (27 నవంబరు 1920 – 7 జూన్ 2005)
కొందరు వ్యక్తులు బహుముఖీన ప్రతిభావంతులు. వారి ప్రతిభాపాటవాలు ఏ ఒక్క రంగానికో పరిమితం కావు. ఒక రంగంలో మొదటుపెట్టి పలు రంగాలలో విస్తరించి ఆశించిన ప్రయోజనం నెరవేరుస్తూ, ప్రజలని ఆకట్టుకుంటారు.
అట్టివారిలో బొల్లిముంత శివరామకృష్ణ గారు ఒకరు. ఉపాధ్యాయుడిగా, రంగస్థల నటుడిగా, ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా, రచయితగా, సంపాదకుడిగా, సినీ రచయితగా విభిన్న భూమికలు నిర్వహించి, అన్నిటా తమదైన ముద్ర వేశారు.
ఆయన గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకా చదలవాడ గ్రామంలో జన్మించారు. అక్కయ్య, మంగమ్మ వారి తల్లిదండ్రులు. ఆయన వారికి ఏకైక సంతానం. ఆయన తండ్రిగారు వ్యవసాయం చేసే రైతు అయినప్పటికీ, స్కూలు టీచరుగా కూడా పని చేసేవారు. అందరికీ విద్య నేర్పాలనే ఉద్దేశంతో ఆయన ఒక పాఠశాలని కూడా స్థాపించారు. ఆయన సంస్కృతంలో గొప్ప పండితులు. ఫలితంగా శివరామకృష్ణ గారు చిన్నతనంలోనే సంస్కృతంలో ప్రావీణ్యం సాధించారు. అక్కయ్యగారు జాతీయవాది, సాతంత్ర్య పోరాట యోధులు కూడా. ప్రాథమిక విద్య వరకు ఇంటి బడిలోనే చదువుకున్నారు శివరామకృష్ణ. తరువాత ఆయన టీచర్ ట్రైనింగ్ కోసం గుంటూరు వెళ్ళారు. శిక్షణ పూర్తయ్యాక తమ స్కూల్లోనే మూడేళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
బాల్యం నుంచి శివరామకృష్ణ గారికి నాటకాలంటే ఇష్టం. ఎన్నో నాటకాలలో ప్రధానంగా స్త్రీ పాత్రలు పోషించారు. ‘రాధాకృష్ణ’ అనే నాటకంలో సత్యభామగా, ‘పాదుకా పట్టాభిషేకం’ అనే నాటకంలో కైకేయిగా, ‘గయోపాఖ్యానం’లో సుభద్రగా నటించారు. హార్మోనియం వాయించడంలోనూ ఆయన నిపుణులు. హార్మోనియం ఆయన సొంతంగా నేర్చుకున్నారు. తాము వేసే నాటకాలకి ఆయనే హార్మోనియం వాయించేవారు. అప్పట్లో శివరామకృష్ణ గారిపై – ‘కవిరాజు’గా పేరొందిన; తెలుగు కవిత్వంలోనూ, సాహిత్యంలోనూ హేతువాదాన్ని, మానవతావాదాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టిన కవిగా గుర్తింపుపొందిన త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం అమితంగా ఉండేది. తదుపరి వారి అబ్బాయి త్రిపురనేని గోపీచంద్‌కీ సన్నిహితమయ్యారు శివరామకృష్ణ గారు.
మాగ్జిం గోర్కీ వ్రాసిన ‘అమ్మ’ నవల ప్రభావం సమాజంపై అధికంగా ఉన్న రోజులవి. గోర్కీ అభిప్రాయాల పట్ల యువత ఎంతో ఆకర్షితులయ్యేవారు. వీటన్నింతో ప్రభావితులైన శివరామకృష్ణ 1943లో 23 ఏళ్ళ వయసులో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. చిన్నవయసులోనే ఆయన రచయితగా మారారు. 1936లో తనకి 16 ఏళ్ళ వయసులో ‘చిత్రాంగి’ అనే పత్రికలో ‘ఏటొడ్డు’ అనే కథ ప్రచురించారు. ఆ తరువాత ఆయన ‘ప్రజాబంధు’ పత్రికలో ఎన్నో కథలు వ్రాశారు. రాజకీయాలలో ప్రవేశించాకా వారి రచనలు వాస్తవిక వాదం వైపు, సమకాలీనాంశాల వైపు మళ్ళాయి. నిజాం పాలనలోని రజాకారులకి వ్యతిరేకంగా పోరాటం జరిపిన తెలంగాణ యోధులపై ‘మృత్యుంజయులు’ అనే నవల వ్రాశారు. సామాజిక సమస్యలపై ‘అంతరాత్మ అంత్యక్రియలు’ వ్రాశారు. వారు రచించిన ‘రాజకీయ గయోపాఖ్యానం’, ‘రాజకీయ కురుక్షేత్రం’ రాజకీయ వ్యంగ నాటకాలుగా అమిత జనాదరణ పొందాయి. 1967 ఎన్నికల సందర్భంగా ఆయన రచించిన ‘ధర్మసంస్థాపనార్థాయ’ సంచలనం సృష్టించింది. 1948 – 1950 మధ్య కాలంలో ఆయన రాసిన ‘తెలంగాణా స్వతంత్రఘోష’ విస్తృత ప్రచారం పొందింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, 1949 – 1952 కాలంలో అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ సమయంలో ఆయన ఆంధ్ర రాష్ట్రమంతా విస్తృతంగా తిరిగారు, ‘నగారా’ అనే పత్రికకి సంపాదకత్వం కూడా వహించారు. 1952 నుండి 1959 వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలిలో పనిచేశారు.
తమ కుటుంబ స్నేహితులు వై. వి. రావు గారి సలహాపై రాజకీయాల నుంచి విరమించుకుని 1959లో ఆయన మద్రాసు వెళ్ళారు. మొదట్లో ఆత్రేయగారి వద్ద సహాయకుడిగా ఉండి సంభాషణలు వ్రాశారు. తరువాత ఆయనే స్వతంత్ర్యంగా డైలాగులు రాయసాగారు. పీటల మీద పెళ్ళి, తిరుపతమ్మ కథ, ఆమె ఎవరు?, విశాల హృదయాలు, మనుషులు మారాలి, కాలం మారింది, శ్రీదేవి, మా మంచి అక్కయ్య వంటి సినిమాలకు సంభాషణలు వ్రాశారు. ‘తిరుపతమ్మ కథ’ సినిమాలోని జనరంజకమైన పాట ‘శ్రీ వేంకటేశా దయాసాగరా’ ఆయనే వ్రాశారు. 1967 ఎన్నికలో బందరు నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు మద్రాసు విడిచారు. 1968లో ఆయన విజయవాడ నుంచి వెలువడే ‘ప్రతిభ’ పత్రికలో సబ్-ఎడిటర్‌గా పని చేశారు. తర్వాతి కాలంలో ‘ప్రతిభ’ స్థానంలో వచ్చిన ‘ప్రగతి’ పత్రికకి సంపాదకులుగా వ్యవహరించారు. ఈ సమయంలోనే ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావు శివరామకృష్ణ గారిని ‘మనుషులు మారాలి’ సినిమా కోసం మళ్ళీ మద్రాసు రప్పించారు. ఆ సినిమాకి ఆయన రాసిన సంభాషణలు ఆవేశ పూరితమైనవిగా, ఆలోచనలు రేకెత్తించేవిగా ఉండి, సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాని జెమినీ పిక్చర్స్ వారు మలయాళంలో తీసిన ‘తులాభారం’ అనే సినిమా ఆధారంగా నిర్మించారు. ఈ కథకి సంభాషణలు, పాటలే నిజమైన కథానాయకులు. అప్పటికి శారద, శోభన్‍బాబు ప్రముఖ తారలు కాదు, తర్వాత అయ్యారు. శివరామకృష్ణ గారు మలయాళ మూలం చూసి, కథకి తెలుగు నేటివిటీ అద్దడంతో, సినిమాని అందరూ మెచ్చుకున్నారు.
అయితే ఆయన తన రచనా వ్యాసంగం కొనసాగించి ‘ఏ ఎండకా గొడుగు’, ‘పత్రికా న్యాయం’, ‘క్విట్ కాశ్మీర్’, ‘ధర్మసంస్థాపనార్థాయ’, ‘దొంగ దొరికింది’, ‘కలసి అందరు బతకాలి’, ‘నేటి భారతం’, ‘భలే మంచి చౌక బేరము’ వంటి రచనలు చేశారు.