లోకల్ క్లాసిక్స్ – 16: నిశ్శబ్ద సంభాషణం

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా ఆదిత్యా విక్రం సేన్‌గుప్తా దర్శకత్వం వహించిన బెంగాలీ సినిమా ‘ఆశా జౌవార్ మాఝే’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఆశా జౌవార్ మాఝే’ (బెంగాలీ)

[dropcap]ఎ[/dropcap]ప్పుడో ఒక చిన్న కథ పుట్టింది, దాంతో ఒక షార్ట్ మూవీ పుట్టింది, దాంతో ఏకంగా సినిమాయే పుట్టింది… చిన్న కథ ఏనాడో క్లాసిక్. షార్ట్ మూవీ, సినిమా రెండూ ఇప్పటి క్లాసిక్స్. అచ్చులో కథకి పదాలతో భాష వుంటుంది. తెరమీద కథకి మాటలు లేని దృశ్య భాష వుండొచ్చు. ఆ దృశ్య భాష నిశ్శబ్ద సంభాషణం అవుతుంది. నిశ్శబ్దానికీ హద్దుంటుంది. అనంత కాల నిశ్శబ్దం ఎవరూ భరించలేరు, సహించలేరు. కీచులాటలుంటాయి, తెగతెంపు లుంటాయి. కూర నచ్చలేదని విడాకులు, మొహం నచ్చలేదని తలాకులు, డ్రెస్సు నచ్చలేదని డైవోర్సులు వాళ్ళిష్టం. ఇద్దరి మధ్యా నిశ్శబ్దమే కష్టమైపోతే లేకపోతే అప్పుడేం చేస్తారు? ఏం చేస్తారో పై మూడు నిశ్శబ్దాలు చెప్తాయి.

బెంగాలీ ఇండీ (ఇండిపెండెంట్ సినిమా) దర్శకుడు ఆదిత్యా విక్రం సేన్‌గుప్తా, 2014లో ‘ఆశా జౌవార్ మాఝే’ (లేబర్ ఆఫ్ లవ్) అనే సైలెంట్ మూవీతో రంగ ప్రవేశం చేస్తూ, వెనీస్ చలన చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ దృష్టి నాకర్షించాడు. దేశీయంగా జాతీయ ఉత్తమ దర్శకుడు విభాగంలో ఇందిరా గాంధీ అవార్డు పొందాడు. గ్రాఫిక్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్ కూడా అయిన తను, రెండో ప్రయత్నంగా 2018లో ‘జానకి’ అనే సైకలాజికల్ డ్రామాతో అంతర్జాతీయ అవార్డులు పొందాడు. అపస్మారక స్థితిలో వున్న వృద్ధురాలు, జ్ఞాపకాల పొరల్లో ప్రేమని వెతుక్కునే కథ. ‘ఆశా జౌవార్ మాఝే’లో ఆర్ధిక మాంద్యం బాధితులైన యువజంట, ప్రేమని నిలుపుకునే నిశ్శబ్ద పోరాటం. ముందుగా పాత్రల పేర్లు లేని ఈ కథనోసారి చూద్దాం…

కథ కాకూడని కథ

కోల్కతా పాత ఇరుకు వీధుల్లో పై అంతస్తులో వుంటారు ఆమె, అతను. ఆమె హేండ్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలో పని చేస్తుంది. అతను దినపత్రిక ముద్రణాలయంలో పనిచేస్తాడు. ఆమె పగలు పనిచేస్తుంది, అతను రాత్రి పనిచేస్తాడు. ఆమె సాయంత్రం వచ్చేటప్పటికి అతను బయల్దేరతాడు. ఆమె సాయంత్రం వండుకు తిని రాత్రి పడుకుంటుంది. అతను తెల్లారే వచ్చే టప్పటికి ఆమె బయల్దేరుతుంది. అతను ఉదయం వండుకుని తిని పగలు పడుకుంటాడు. ఆమె సాయంత్రం తిరిగి వచ్చేసరికి అతను బయల్దేరతాడు. అతను సైకిలు తొక్కుకుంటూ పోతాడు, ఆమె ట్రాము ఎక్కి వెళ్తుంది.

ఇదీ కథ. రోజూ జరిగే కథ. ఇద్దరిదీ ఒకే కథలా వున్న కథ కాకూడని కథ. చెప్పుకుని లాభం లేదని చెప్పుకోవడం మానేసిన నిశ్శబ్ద వ్యధ. మాటలు లేని మౌనం, ఉదర పోషణార్ధం భౌతిక దూరం. అతను లైఫ్ బాయ్ సబ్బు మీద లక్సు బిళ్ళ అతుక్కుందని, విడదీయబోతే విరిగిపోయిన బాధ లాంటిది ఈ మౌనం. ఈ మౌనంలో అతికి వుండాల్సిందే తప్ప, విడిపోతే విరిగి పోతారు.

అతను 8100 జీతం తెచ్చుకుని, మౌనంగానే బజారులో సరుకులు తెచ్చుకుని, ఓ చేపా తెచ్చుకుని, ఆ పూట జీతం పడిన ఆనందాన్ని మౌనంగా గడపడం, ఒంటరిగా బతకడం. ఆమె పప్పు ధాన్యాలు తెచ్చుకుని, పిండి వంటలు చేసుకుని, కడుపులో ఇంత వేసుకుని, జీతం పడిన రోజుని మౌనంగా నిద్రించి అనుభవించడం…. ఎంత కాలమిలా? తెలీదు. తెలియడానికి వీల్లేదు. వీలైనది ఒక్కటే – కాస్త వూహల్లో ముద్దు ముచ్చట్లు.

ఎలా వుంది కథ

2008-9 ఆర్ధిక మాంద్యం కాలంలో కోల్కతా నగరంలో సగటు జీవులు కఠిన నిబంధనలు విధించుకుని జీవించిన వైనాన్ని దృష్టికి తేదల్చుకున్నాడు దర్శకుడు. ఉద్యోగాలు కరువై, దొరికిన సగటు ఉద్యోగాలు నిలుపుకోవడం కోసం, కాపురాన్నే త్యాగం చేసి వసతి గృహం జీవితానికి రాజీపడ్డ జంట కథ ఇది. దీనికి ఇటాలియన్ రచయిత ఇటాలో కాల్వినో (1923-85) రాసిన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ ఏ మేరీడ్ కపుల్’ అనే రెండు పేజీల ప్రసిద్ధ కథ ఆధారం. దీని ముగింపు ప్రాక్టికల్‌గా వుంటుంది. రాత్రి పడుకున్న ఆమె, తన తలగడకి అతడి పెర్ఫ్యూమ్ పసిగట్టి, ఫర్వాలేదు అతడి ఎరుకలో తానున్నానన్న ఆత్మసంతృప్తితో నిద్రపోతుంది. ఇందులో విషాదముంది.

సేన్ గుప్తా చిత్రానువాదంలో ముగింపు, చివరికి తామిద్దరూ కలిసి గడుపుతున్నట్టు అతనూహించుకోవడంగా, సినిమాటిక్‌గా వుంది. కాల్వినో కథ ఆధారంగా 2013లో ఇరానియన్ యువదర్శకుడు కేవాన్ కరీమీ ‘జాన్ వా షొహర్ కరేగార్’ అన్న 11 నిమిషాల షార్ట్ మూవీ, తెలుపు నలుపులో తీశాడు. దీనికి అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇందులో ముగింపు పట్ల దర్శకుడు కటువుగానే వున్నాడు. ఇద్దరూ బీరు బాట్లింగ్ కంపెనీలో పని చేస్తారు. ఆమె పగలు ప్లాంట్‌లో పని చేసి వస్తుంది, అతను రాత్రి వాచ్‌మన్‌గా వెళ్తాడు. ఈ రొటీన్‌లో ఇంకో రాత్రి డ్యూటీ ఎక్కి అతను బేలగా చూస్తూంటే ముగిస్తాడు దర్శకుడు. ఇందులో ఆమెగా అనాహితా ఇరవానీ, అతనుగా మహ్మద్ అఖారీ నటించారు.

ప్రేమలో కమిట్‌మెంట్ అంటూంటారు. అంటే ఏమిటి? కలిసివుండే ఒక వాగ్దానమా? మరెందుకు విడిపోతారు ఏదో తేడా వచ్చిందని? ఈ కమిట్‌మెంట్ అర్ధం లేని మాట. స్వతంత్రంగా ప్రేమనేది లేదు. ప్రేమ రిలేటివ్ పదం. అవసరాల కోసమే ప్రేమిస్తారు, అవసరాల కోసమే కలుస్తారు. ఆ అవసరాలు ఇద్దరికీ సమిష్టి బాధ్యత అవుతాయి. ఆ బాధ్యతకి ఇద్దరూ కట్టుబడి వుండడమే కమిట్‌మెంట్. శారీరక అవసరాల కోసం కలిస్తే శారీరకంగా కలిసివుండే బాధ్యత, ఆర్ధిక అవసరాల కోసం కలిస్తే ఆర్ధిక అవసరాల కోసం కృషి చేస్తూ కలిసి వుండే బాధ్యత. ఎన్ని ఆటంకా లెదురైనా, ఆ బాధ్యతల నుంచి తప్పుకోకపోవడమే కమిట్‌మెంట్. అదే ప్రేమ, అందులోంచే ప్రేమ.

ఈ కథలో అతనూ ఆమె సరిపడడం లేదని విడిపోవచ్చు. ఎందు కోసం కలిశారో అది కాదనుకుని విడిపోతే విరిగిపోతారు. ప్రేమ ఈ మూగ బంధంలోనే వుంది. విడిపోతే ఇంకెక్కడో లభించేది ఇంకో ప్రేమ కాదు, రాజీ. జీవితాలు ఇలా కూడా వుంటాయి అర్ధవంతంగా. జీవితాలు రాత్రెప్పుడో పక్క మీద చేరి, ఎవరి మానాన వారు లాప్‌టాప్ మీద మళ్ళీ ఆఫీసు వర్క్‌లో మునిగిపోయే నిరర్ధక బంధాలుగానూ వుంటాయి.

నటనలు కాని నటనలు

ఇందులో అతను రిత్విక్ చక్రవర్తికీ, ఆమె వాసవదత్తా ఛర్జీకీ నటించడంతో పనిలేదు. నటించడానికి భావోద్వేగాల ప్రదర్శన వుండని పాత్రలు. నిర్లిప్తంగా వుండిపోతే చాలు. చిట్ట చివర కాస్త దరహాసం సరిపోతుంది. సంభాషణలతో పనేలేదు. ఇలా జీవించడం ప్రారంభించిన కొత్తల్లో మాట్లాడుకునే వుంటారు. వర్రీ అయ్యే వుంటారు. కానీ ఈ జీవితంలో మార్పే వుండదని ఖాయమైనప్పుడు ఇంకేం మాట్లాడుకుంటారు, ఇంకేం వర్రీ అవుతారు. నిర్లిప్తంగా జీవితం గడిపెయ్యడమే ప్రేమల్ని ప్రేమారా పీలుస్తూ.

సంభాషణలు లేక శబ్దాలుంటాయి. సన్నని సంగీతముంటుంది. ప్రారంభంలో టైటిల్స్‌లో, చివర ఐదు నిమిషాల ఊహాజనిత పోయెటిక్ ముగింపులో సన్నాయి విన్పిస్తుంది – తొలిరాత్రిని గుర్తుచేసే సింబాలిజంగా.

అలోకానందా దాస్ గుప్తా సంగీతమిచ్చాడు. మహేంద్ర శెట్టితో బాటు, దర్శకుడు ఛాయాగ్రహణం సమకూర్చారు. బ్యానర్ ఫర్ ఫిలిమ్స్, దర్శకుడి సొంత నిర్మాణ సంస్థ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here