జ్ఞాపకాలు – వ్యాపకాలు-3

1
3

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

తొలి అడుగు:

1967 డిసెంబరు 16. నాకప్పటికి 21 సంవత్సరం చివరి పాదం. ఆ రోజు నా ఉద్యోగ ప్రస్థానంలో ప్రముఖం. వాస్తవానికి తొలి ఉద్యోగం 1967 జూలై 10న అరవపాళెం (నాయుడుపేట) హైస్కూల్‌లో జూనియర్ తెలుగు పండిట్‌గా మొదలైన రోజు. జిల్లా పరిషత్ స్కూలులో వంద రూపాయల బేసిక్, 50 రూపాయలు డిఎతో ఆ రోజు ప్రవేశించాను. మధ్యాహ్మం 12 గంటల లోపు హెడ్‌మాస్టర్‌కు రిపోర్ట్ చేశాను. వెంటనే గంట కొట్టారు. IV ఫారం క్లాసు తీసుకోమన్నారు. క్లాసులో కుర్రాడి వద్ద టెక్స్ట్ బుక్ తీసుకుని కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పద్యాలు 45 నిమిషాలు పాఠం చెప్పాను. సాయంత్రం 5 గంటలు కాగానే మా ఊరు కెళ్ళి సామాన్లు తీసుకొస్తానని హెడ్ మాస్టార్‌కు చెప్పి నాయుడుపేట రైల్వే స్టేషన్ కెళ్ళాను. ప్యాసింజర్ రైలు సిద్ధంగా వుంది. టిక్కెట్ తీసుకుని కరవది వెళ్ళాను. అక్కడ మా బాబాయి డాక్టరు. ఆ ఊరిలో నాకు ఉద్యోగం వద్దని చెప్పాను. తిరిగి అటువైపు చూడలేదు. ఆ ఒక్కరోజు జీతం 5 రూపాయలు రెండు నెలల తరువత నాకు మనీయార్డర్ వచ్చింది.

రెండో మజిలీ 23 అక్టోబరు 1967న  మర్రిపాడు (ఆత్మకూరు తాలూకా)  హైస్కూల్‌లో. అక్కడ 50 రోజులు సీనియర్ తెలుగు పండిట్‌గా పాఠాలు చెప్పాను. క్లాసులో ఒక కుర్రాడిని బెత్తంతో డండించడం బాగా గుర్తు. శేషగిరిరావు మా హెడ్‌మాస్టరు. వారి యింటి సమీపంలో ఒక గది తీసుకుని స్వయంపాకం చేసుకుని తిన్నాను. డిసెంబరు 15 మధ్యాహ్నం మా నాన్న లక్ష్మీకాంతరావు హుటహుటీన ఒక లెటర్ తెచ్చారు. సారాశం కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగుశాఖలో ట్యూటర్‌గా వేశారు. 16వ తేదీలోగా జాయిన్ కావాలి.

ఈ ఆర్డరు రావడానికి నేపథ్యం చెప్పాలి. అరవపాళెం ఉద్యోగం వదిలి వేసిన వారం రోజులకు నేను హైదరాబాద్ వెళ్ళి మా ఎం.ఎల్.ఎ. బెజవాడ పాపిరెడ్డిని కలిసాను. ఆయన  నన్ను డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ ఆఫీసుకు తీసుకెళ్ళారు. యం.వి.రాజగోపాల్ (డైరక్టరు)తో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఖాళీలు లేవని ఆయన చెప్పారు. ఆ ఆఫీసులో ముగ్గురు, నలుగురు ఒక ఖాళీ ఫారం పూర్తి చేసి వాళ్ళ బయోడేటాఅ వివరాలు ఒక డబ్బాలో వేస్తున్నారు. నేను కూడా పూర్తి చేసి వేశాను. ఫలితంగా డిసెంబరు నెలలో నాకు ఈ ఆర్డరు వచ్చింది. మాతో బాటు 1967లో ఎం.ఎ. ప్యాసైన చాలామందికి ఆ ఆర్డరులో పోస్టింగులు వచ్చాయి. నాకు కందుకూరు దగ్గరే.

డిసెంబరు 15 సాయంకాలం మర్రిపాడు స్కూలులో రాజీనామా పత్రం ఇచ్చి ఆ రాత్రికి నెల్లూరు మా నాన్న, నేను చేరాం. 16వ తేదీ మా తాతగారి తిథి. కాబట్టి మా నాన్న నాతో కందుకూరు రాలేకపోయారు. మర్రిపాడుకు వచ్చి హెడ్మాస్టరుకి అప్పగింతలు చెప్పి వెళ్ళారు. డిసెంబరు 16న నెల్లూరు – పొదిలి ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఉదయం 8 గంటల కల్లా కందుకూరులో ఒక జిప్ బాగ్‌లో మూడు జతల బట్టలతో దిగాను.

అధ్యాపక వర్గం:

కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అడుగుపెట్టిన ఆ శనివారం నేను కలిసిన మొదటి వ్యక్తి తుములూరు అప్పయ్యశాస్త్రి. ఆయన ఆఫీసు సూపరింటెండెంట్, కవితా ప్రియుడు. నా సహ ట్యూటరు నడిపినేని సూర్యనారాయణ. వారి ఇంట్లోనే తొలి రోజు ఆశ్రయమిచ్చారు. మా తెలుగు శాఖాధిపతి జంధ్యాల లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆయన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి అన్న కుమారుడు. వారిని నేను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సావం కవి సమ్మేళనంలో తోటి కవిగా నెల్లూరు టౌన్ హాల్‌లో కలిసాను. ఆయన మంచి పండితుడు, కవి. వారి పక్క యింట్లోనే నేను వివాహానంతరం బాడుగ కున్నాను. తెలుగు శాఖలో పని చేసిన మిగిలిన ప్రముఖులను ప్రస్తావించాలి.

ఆర్.యస్. సుదర్శనాచార్య పరమ వైష్ణవులు. తెలుగు సాహిత్యంలో ఆంజనేయ స్తుతిపై పి.హెచ్.డి చేశారు. పి. వెలుగొండయ్య – మరో ఉపన్యాసకులు. ఆయన ఎలిమెంటరీ స్కూలు టీచరు స్థాయి నుండి ప్రమోషన్లు సాధించి అధ్యాపకులయ్యారు. ఉలవపాడు కళాశాల ప్రిన్సిపాల్ చేశారు. ఆయన కుమారుడు హరికుమార్ I.P.S. ఆఫీసరై ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైరయ్యారు (ఏప్రిల్ 2020).

కేతు విశ్వనాథ రెడ్డి మా సహధ్యాపకులు. మంచి కథా రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. సార్వత్రిక విద్యాలయంలో ప్రొఫెసర్‌గా రిటైరై కడపలో స్థిరపడ్డారు. శాఖాధిపతి అయిన లక్ష్మీనారాయణ శాస్త్రి హృద్రోగంతో అకాలమరణం చెందారు. యల్లంరాజు శ్రీనివాసరావు వారి స్థానంలో వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలలో ఆయన మేధావి. అనేక సి.డి.లు విడుదల చేశారు. 2018లో కాలధర్మం చెందారు. సి. రంగారెడ్డి (కడప) మాకు హెడ్‌గా వచ్చారు. ఆయన రాజంపేట ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యారు. జోసెఫ్, ఏ.వి. ఆంజనేయులు సహాధ్యాపకులు.

1967 డిసెంబరు నుండి 1975 ఆగస్టు 15 వరకు ఏడున్నర సంవత్సరాలు కందుకూరు కళాశాలలో పనిచేశాను (ఏలినాటి శని మాత్రం కాదు). ఆ సమయంలో ముగ్గురు ప్రిన్సిపాల్స్ వద్ద పని చేశాను. తొలి ప్రిన్సిపాల్ టి.కె. కృష్ణస్వామి (తిరుమల దేవస్థానం ప్రథమ తీర్థ వైష్ణవులు). 1966లో తొలి ప్రిన్సిపాల్‌గా వచ్చారు. 1970లలో వారి కుమర్తెకు I.P.S. ఆఫీసర్ శ్రీనివాసన్‌తో వివాహం చేశారు. అల్లుడిని, కూతురిని రామాయపట్నం సముద్ర తీరానికి పిక్నిక్ తీసుకెళ్ళి, సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించారు. రెండో ప్రిన్సిపాల్‍గా ఆర్. కృష్ణమూర్తి వచ్చారు. ఆయన జాయింట్ డైరక్టర్‌గా రిటైరయ్యారు. వారి కుమారు విశ్వనాథ్ నా శిష్యుడు. అదే సమయంలో చదువుకున్న ఐ.వై.ఆర్ కృష్ణారావు ఇంటర్మీడియట్ చదివాడు. నూతన ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యాడు. మూడో ప్రిన్సిపాల్‌గా బి. సుబ్రహ్మణ్యం (నెల్లూరు) వచ్చారు. ముగ్గురు ప్రిన్సిపాళ్ళు నన్ను తీర్చిదిద్ది ఎగ్జామినేషన్ అసిస్టెంట్‍గా నియమించి పరీక్షల సహాయకుడిగా తర్ఫీదునిచ్చారు. కళాశాల సాహితీ భాగస్వామ్యం కల్పించారు. విద్యార్థుల చేత కవితలు వ్రాయించి  నేను – ‘విరిసీ విరియని మొగ్గలు’ అనే కవితా సంకలనం ప్రచురించాను.

కందుకూరు రచయితల సంఘం:

1972లో కందుకూరు తాలూకా రచయితల సంఘం పేర సాహితీ సంఘం స్థాపించాం. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. లబ్ధప్రతిష్ఠులైన సంస్కృత పండితులు విక్రాల శేషాచార్యులు, వారి సతీమణి శ్రీదేవమ్మ మంచి రచయిత్రలు. వారు సింగరాయకొండ సమీఫంలోకి పాకల వారు. శ్రీనాథుడిది పాకల అని నానుడి. మొగిలిచర్ల వద్ద పవని నిర్మల ప్రభావతి గొప్ప కథా రచయిత్రి. కనిగిరిలో కొమాండురి రామానుజాచార్యులు, అవధానులైన కోడి సోదర కవులు, అగస్త్యరాజు సర్వేశ్వరరావు ప్రసిద్ధులు. వాసా లక్ష్మీనారాయణ రైతు కవి. ప్రముఖ కవుల జయంతుల పేర గుడ్లూరులో ఎర్రన జయంతి, కందుకూరులో రుద్రకవి జయంతి, సింగరాయకొండలో పిల్లలమర్రి పినవీరభద్ర జయంతి ఘనంగా జరిపాము.

మాలకొండలో కవిసమ్మేళనం జరిపాము. సబ్ జడ్జ్ బి.వి.నరసింహం అధ్యక్షులు. మాల్యాద్రి స్థల పురాణాన్ని కొమాండురి రామానుజాచార్యులు, నేను పరిష్కరించి ప్రచురించాము. రచయితలందరం కుసుమ మంజరి పేర ఒక సంకలనం వెలువరించాం. గుడి నారాయణ బాబు, అలంకారం కోటంరాజు – అనే ప్రాథమిక పాఠశాల అధ్యాపకులు నా వద్దకు తరచు వచ్చి పద్య కవితలు వ్రాయడం నేర్చుకొన్నారు. కావలిలో సౌహార్ద్ర పర్యటన చేసి ఉభయ సంఘాల కవి సమ్మేళనం నిర్వహించాం.

రచయిత సహకార సంఘం:

1974లో కందుకూరులో రచయిత సహకార సంఘం స్థాపించాం. దాని నేపథ్యం చెప్పాలి. 1974 ప్రథమ పాదంలో పవని శ్రీధరరావు హైదరాబాదు నుండి నాకొక టెలిగ్రాం ఫంపారు. మూడో రోజున రాష్ట్ర సహకార శాఖా మంత్రి బత్తిన సుబ్బారావు వస్తారనీ, ఆ సందర్భంగా రచయితల సంఘం పక్షాన ఒక సభ ఏర్పాటు చేయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఒక సభ పెట్టాం. ఆ సభలో నేను వ్రాసిన ప్రకృతి వర్ణనల గ్రంథాన్ని మంత్రి ఆవిష్కరించారు. మంత్రిగారికి రచయితల సహకార సంఘం స్థాపిస్తామని ఒక మహాజరు సమర్పించాం. ఆయన హైదరాబాదు వెళ్ళగానే లక్ష రూపాయలు మంజూరు చేశారు. పవని శ్రీధరరావు అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షులుగా, బి.వి.పి.హెచ్.బి. ప్రసాదరావు కార్యదర్శిగా సహకార సంఘం వెంటనే స్థాపించాం. బ్యాంకు లోను తెచ్చి ఒక ప్రింటింగ్ ప్రెస్‍ని కొన్నాం. ‘శారద నవ్వింది’ అనే కథా-కవితా సంకలనం వేశాం.

కందుకూరులో మా సహాధ్యాపకులు కరణం సుబ్బారావు, పాఠశాల అధ్యాపకురాలు ఆవుల ప్రమీలా దేవి, డా. రంగయ్య తదితరులు మా రచయితల సంఘంలో సీనియర్ సభ్యులు. కావలిలో వై.వి. రత్నం ఇలాంటి సంఘం పెట్టి ఉత్సాహంగా పని చేశారు. మేమూ ఆ త్రోవలోనే నడిచాము. ఒంగోలు జిల్లా రచయితల సంఘం నాగభైరవ కోటేశ్వరరావు నాయకత్వంలో అభ్యుదయ రచయితల సంఘ సభలు ఘనంగా జరిపారు. ఎర్రన సాహితీ పీఠం నెలకొల్పి నాట్యావధాని డా. ధారా రామనాథశాస్త్రి సాహితీ సభలు నిర్వహించారు. మల్లవరపు జాన్, కొలకలూరి స్వరుపారాణి, ఈమని దయానంద, యం.వి.యస్. శర్మ ఒంగోలులో ప్రముఖ రచయితలు. డాక్టర్ జె. వీరాస్వామి (D & M HO) సాహితీ పోషకులు.

అవధాన జైత్రయాత్ర:

1969 జనవరి 31. సరిగ్గా నాకు 22 ఏళ్ళు నిండాయి. ఇంకా వివాహం కాలేదు. మా కళాశాల ఆఫీసు సూపరింటెండెంట్ ఇంట్లో ఓ సాయంకాలం ఇష్టాగోష్టికి అధ్యాపకులం కలిసాం. ‘మీరు అష్టావధానం చేయండి సరదాగా’ అన్నారాయన. నిషిద్ధాక్షరి తప్ప మిగిలిన అంశాలతో అవధానం మొదలుపెట్టాను. శ్రీకారం చుట్టగానే వారి ఇంటి పక్కనే ఉన్న సోమేశ్వరాలయ గుడి గంట మ్రోగింది. శుభ శ్రీకారమైంది. తర్వాత నవంబరులో మా కళాశాలలో పూర్తి స్థాయి అష్టావధానం చేశాను. జంధ్యాల లక్ష్మీనారాయణ శాస్త్రి, అన్నాప్రగడ లక్ష్మీనారాయణ, బి.వి.పి.హెచ్.బి. ప్రసాదరావు, డా. జి. సీతారామశాస్త్రి పృచ్ఛకులు. అవధానం రక్తి కట్టింది. 1970 అక్టోబరులో మా కళాశాలలో మరో అవధానం చేసి మెప్పించాను. ఆ ఉత్సాహంతో 1970 ఫిబ్రవరిలో కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల అవధానంలో కోడి సోదరకవులతో ఒకరైన శతావధాని సుబ్రహ్మణ్యశాస్త్రి, కొమాండురి రామానుజాచార్యులు, అగస్త్యరాజు సర్వేశ్వరరావు తదితరులు పృచ్ఛకులు. వారం రోజుల్లో పొదిలిలో మరో అవధానం.

1970 మార్చి 15. చారిత్రాత్మక దినం. నేను చదివిన కళాశాలలో మా అధ్యాపకులు పృచ్ఛకులుగా అవధానం చేసి తిక్కవరకు రామిరెడ్డిచే సన్మానం పొందాను. 1971 నవంబరులో వెంకటగిరి ఆర్.వి.యం. పాఠశాలలో, 1974 నవంబరు దగదర్తి పాఠశాలలో, అక్టోబరులో దామరమడుగు పాఠశాలలోనూ అవధానాలు నిర్వహించాను. కళాశాల స్థాయిలో విజయవాడ శాతవాహన కళాశాల అవధానం చిరస్మరణీయం. దిగ్దంతులైన పృచ్ఛకులుగా దేవరకొండ చిన్నికృష్ణయ్య, వింజమూరి శివరామకుమార్ కూచొన్నారు.

1973 జూన్‍లో నెల్లూరు వేద సంస్కృత కళాశాల అవధానంలో ప్రసిద్ధ పండితులు పృచ్ఛకులు. బెజవాడ గోపాలరెడ్డి గారు నన్ను సన్మానించారు. 1974 జనవరిలో నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అవధానంలో శివారెడ్డి, సురభి నరసింహం, గోసుకొండ వెంకట సుబ్బయ్య ప్రభృతులు నను పట్టుబట్టారు.

1974 ఫిబ్రవరిలో జవహర్ భారతి కళాశాల అవధానంలో యస్.వి.భుజంగరాయశర్మ, కేసరి సుందరరామశర్మ, జె.వి.సుబ్బారాయుడు, పడాల రామమూరి పృచ్ఛకులుగా అభినందించారు. 1974 ఉగాది నాడు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) అవధాన సభ గర్వకారణం. 1974 సెప్టెంబరులో వేటపాళెం కళాశాల అవధానం చమత్కార భరితం. ప్రొద్దుటూరు సంస్కృత కళాశాల అవధానంలో (1975 డిసెంబరులో) నరాల రామారెడ్డి, అవధానం చంద్రశేఖర శర్మలు పృచ్ఛకులు. సి.వి. సుబ్బన్న శతావధాని ప్రశంసించారు. 1976 నవంబరులో కడప ప్రభుత్వ కళాశాలలో అవధానానికి పుట్టపర్తి నారాయణాచార్యులు అధ్యక్షులు. అవధానాలు మాని గ్రంథరచన చేస్తే శాశ్వతమని పుట్టపర్తి సలహా ఇచ్చారు. 1976 జనవరి 26న బెంగుళూరు ఆంధ్ర సారస్వత సభ దిగ్విజయం. అంతటితో అవధాన జైత్రయాత్రకు స్వస్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here