[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]చా[/dropcap]లామంది ఆడవాళ్ళు చెప్తూ వుంటారు, నా జీవితం చూస్తే చాలా ఈర్ష్యగా అనిపిస్తుందని. బహుశా నేను ఏదైనా చెయ్యాలనుకుంటే వెంటనే చేసేస్తా… అదే కారణం అనుకుంట!
ఈ ట్రిప్‌లో నాకు నడుం నెఫ్ఫి వల్ల బిజినెస్ క్లాస్ అయితే హాయిగా వుండేది అనిపించింది. నెక్స్ట్ టైం నుండీ బిజినెస్ క్లాస్‌లో వెళ్ళాలని నిశ్చయించుకున్నాను! అది ఎంత వ్యయంతో కూడినదీ, ఎంత కష్టమూ అని ఆలోచించలేదు. అనుకున్నాను… చేసాను. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెంటనే వెళ్తాను. చెయ్యాలనిపిస్తే, అనుచితం కానిది ఏదైనా చేసేస్తా… ఎవరినైనా అడగాలీ, ఒప్పించాలీ అనుకోను. నా భర్తా, పిల్లలు అందుకు సహకరిస్తారు. “ఇది ఇప్పుడు ఎందుకూ?…” లేదా “నువ్వు ఇప్పుడు వెళ్ళడం అవసరమా?” అని వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. భగవంతుడికి కూడా ఇందులో పెద్ద వాటా వుంది. ఆయన ఆ టైంకి డబ్బు సమకూరుస్తాడు… పెన్ పట్టుకున్నాకా ఎన్నడూ ఖాళీగా లేను… సినిమానో, సీరియలో, ఇప్పుడు వెబ్ సిరీసో… ఎప్పుడూ నా అవసరాలకి సరిపడా డబ్బులొస్తూనే వున్నాయి!
ఫణి డొక్కా ఇంట్లో భోజనాలయ్యాక, నేనూ, ఫణి, మాధవ్ కలిసి మాకిచ్చిన ఎకామిడేషన్, మేరియట్ హోటల్‌కి వెళ్ళాం. గాయత్రీ, పాపా కూడా ప్రోగ్రాంకి వస్తాం అన్నారు మరునాడు.
వెళ్ళగానే మాకు ఓ బ్యాగ్ ఇచ్చారు. అందులో సావనీరు, చేతికి కట్టుకునే ట్యాగ్ అన్నీ వున్నాయి. నాకు బ్లూ ట్యాగ్ ఇచ్చారు. ఇన్‌వైటీస్‌కి రెడ్ ట్యాగ్ ఇవ్వాలి. ఆ విషయం నాకు కిరణ్ ప్రభ గారూ, కాంతీ గారూ వచ్చేదాకా తెలియలేదు! నేను చీర మార్చుకుని వెళ్ళేసరికి స్వాతీ సోమనాధ్ “అబ్బా! డ్రెస్ ఛేంజ్ చేసావా? ఈర్ష్యగా వుంది” అంది. అందుకే ఎప్పుడూ వేరే దేశాలు వెళ్ళినప్పుడు ఓ జతో, రెండు జతలో హ్యాండ్ లగేజ్‍లో పెట్టుకోవాలి. ఈ సూట్‌కేసులు చెక్‌ఇన్ చేస్తే, మనతో వస్తాయి అని గ్యారంటీ లేదు! అవి సాయంత్రం దాకా రాలేదు.
నలభీములని ఒకేసారి చూసినట్టనిపించింది, భోజనాల దగ్గర ఆఫ్రికన్ అమెరికన్స్ వడ్డిస్తూ వుంటే! ఇంక భోజనాలలో ఏ లోపం లేదు. షరా మామూలే. తెలుగు వంటలూ, బూరెలూ, బొబ్బట్లూ, పులిహోరా, ఆవడలూ, గుత్తి వంకాయా, మామిడికాయ పప్పూ, గోంగూర పచ్చడీ, ఆవకాయా, అప్పడాలూ, వడియాలూ, పెరుగూ!
ఇంక తెలిసిన వాళ్ళకి అస్సలు కొదువ లేదు! చిట్టెన్‌రాజు గారు కలిసారు. తోటకూర ప్రసాద్ గారు, ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారూ, హనిమరెడ్డి గారూ, మాధవ్ దుర్భా వాళ్ళ బావగారు వీ.వీ. రామారావు గారూ, అంతా కలిసారు!
సుద్దాల అశోక్ తేజా, చంద్రబోస్ మొదలైన రచయితలూ, శిల్పా చక్రవర్తీ, ఆమె భర్తా, జబర్దస్త్ హాస్యనటులూ, ఎటు చూసినా తెలిసిన వాళ్ళే!
భోజనం చేసి నేను హోటల్ రూంకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే, “రమణీ గారు! మేం వచ్చేసాం… మీరెక్కడున్నారు?” అని కాంతి గారి మెసేజ్ వచ్చింది. ఈవెనింగ్ బాంక్వెట్‌కి నేను వైట్ శారీ కట్టుకుని, కాంతి గారిచ్చిన రూం నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళి, కాంతి గారినీ, కిరణ్ ప్రభ గారినీ కలిసాను. కాంతి గారిని హగ్ చేసుకుని చాలా ఆనందించాను.
ఈ ట్రిప్‌కి బయల్దేరే ముందే నాకు రఘునాథ్ కొత్తా గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. “మేం చార్లెట్‌లో వుంటాం. మా ఆవిడ పేరు జ్యోతిర్మయీ కొత్తా, తను బ్లాగర్. మీ కథ ఒకటి సావనీర్‌కి కావాలి” అని. నేను వెంటనే ఆనందంగా కథ రాసి పంపించాను. ఆ కథకి మన డబ్బుల్లోనే 1100/- ఆ తర్వాత జ్యోతీ వాళ్ళ నాన్నగారు నెల్లూరు నుండి మనీ ఆర్డర్ పంపించినట్లు గుర్తు! ఆ జ్యోతిర్మయీ, రఘునాథ్ కొత్తా గార్లు కూడా వచ్చారు.
బాంక్వెట్‌లో లక్ష్మీపార్వతి వదినా, మినిస్టర్ డి.కె. అరుణా, ఇంకా చాలామంది కనిపించారు. లక్ష్మీపార్వతి నన్ను హగ్ చేసుకుని, “ఈ బ్లౌజ్ నీ శారీ మీదకి సూట్ కాలేదు” అని నా సెల్ఫ్ డిజైన్డ్ వైట్ బ్లౌజ్ గురించి కామెంట్ చేసింది. నేను నవ్వి “మీరు పొద్దుట పంపిన అరిసెలు బావున్నాయి వదినా” అన్నాను.
“అయ్యో ఫిల్మ్ నగర్‍లో మన ఇంటి దగ్గరే శ్రీజాలో, ఈసారి నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా, చాలా బావుంటాయి స్వీట్స్ అక్కడ” అంది. అన్నట్లుగానే ఆ తర్వాత ఆవిడ శ్రీజాకి తీసుకెళ్ళి అరిసెలు, చెక్కలు కొని పెట్టడంతో, ఇప్పటిదాక నేను రెగ్యులర్‌గా స్వీట్స్ శ్రీజాలోనే కొంటున్నాను!
జ్యోతిర్మయీ కొత్తా, కొద్దిగా బెరకుగా ‘మీరు పేరున్న రైటర్’ అనే భావం వ్యక్తం చేసినా మొదట్లో, ఆ తర్వాత మేం చాలా కలిసిపోయాం. జ్యోతి సన్నగా పొడుగ్గా, చీర కడ్తే, ‘చీరకే ఈవిడ వల్ల అందం వచ్చింది’ అన్నట్లు వుంటుంది. రఘునాథ్ గారైతే చాల జోవియల్ పర్సన్… ఇంతకీ వీళ్ళ ఇంటి పేరే ‘కొత్త’, కానీ మాకు పాత స్నేహితుల్లా చనువైపోయారు, పరిచయం అయిన గంటలో.
ఫణి డొక్క ఇంట్లో అర్ధరాత్రి నన్ను నిద్ర లేపిన నోరి రాధిక గారు కనిపించారు. ఆవిడ కాంతి గారిని పలకరించి, “కౌముదికి నేను కథ రాసి పంపాను, మీరు మళ్ళీ ఎందుకు టైప్ చేసారూ?” అని అడిగారు.
కాంతిగారు సహజంగానే సౌమ్యురాలూ, సహనశీలి. “ఫాంట్ మాకు సూట్ కాలేదండీ” అనగానే ఆవిడ, “మీరు సరిగ్గా టైప్ చెయ్యలేదు, ఇలా ఎప్పుడూ చెయ్యద్దు” అని నిష్కర్షగా చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. అమెరికాలో నాకు చాలామంది ఎన్.ఆర్.ఐ. రైటర్స్ కనిపించారు. వాళ్ళల్లో ఇండియాలో రాసినా, కాంపిటీషన్ విన్ అయ్యే వంగూరి గారూ, ఫణి డొక్కా, మాధవ్ దుర్భా, సత్యం మందపాటి, నిషిగంధా, మృత్యుంజయుడు లాంటి వాళ్ళు తక్కువ మంది. మిగతావాళ్ళు అమెరికాలో ప్రసిద్ధులు. డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు ఈ ట్రిప్‌లో నాకు పెద్దగా పరిచయం అవలేదు. జస్ట్ ఎమ్.వి.ఎల్ గారూ, తోటకూర ప్రసాద్ గారూ పరిచయం చేసారు అంతే!
బాంక్వెట్‌లో బయట స్నాక్స్ తీసుకుంటుంటే, చాలా మంది అమ్మాయిలు, వాళ్ళు ఇప్పటికీ నా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్… నన్ను గుర్తు పట్టి దగ్గర కొచ్చి “మీ ‘కాలం దాటని కబుర్లు’ ఫాన్స్‌మండీ” అని ఫోటోలు తీసుకున్నారు. సుజాత ఈమని కూడా వచ్చింది. ఝాన్సీని పరిచయం చెయ్యమని ఆమెతో ఫొటో తీసుకుంది. సుజాత ఎవరితోనైనా సరే, ‘మీ బంధువుల్లో ఫలానా వాళ్ళు టి.నగర్‌లో మా ఇంటి దగ్గర వుండేవాళ్ళు అనో, మీ ఫలానా ప్రెండ్ నాకు తెలుస’నో మొదట చెప్తుంది. ఝాన్సీ విసుగ్గా, “నాకెవరూ గుర్తు లేరు… ఏమీ అనుకోకండి… ప్రతీ వాళ్ళూ ఎవరి పేరో చెప్తూ వుంటారు నాతో” అంది.
సుజాత చిన్నబుచ్చుకుంటే, తర్వాత ఆమెని పక్కకి తీసుకెళ్ళి చెప్పాను, “సుజాతా! ఎవరైనా ప్రముఖులని కలుసుకోగానే, ఆ ఒక్క సెకండ్‌లో నీ గురించి వాళ్ళకి గుర్తుండేట్లు, నీ పేరో, నీ ప్రొఫెషనో చెప్పాలి. అంతేకాని మీ వేలు విడిచిన మేనత్త పెద్ద కూతురు మల్లీశ్వరి మా ఇంటి పై వాటా వాళ్ళ తోటి కోడలు అనకూడదు…. నీతో అలా ఎవరైనా అంటే, ఆ పజిల్ నువ్వు ఆస్వాదిస్తావా?” అని అడిగాను.
జ్యోతిర్మయీ నాతో అంటుంది “ప్రతీదీ విడమరిచి, విసుగు లేకుండా ఎలా కౌన్సిలింగ్ చేస్తారండీ మీరూ?” అని. ఇవి అందరికీ తెలిసిన విషయాలే కానీ, ఎక్సైట్‌మెంట్‌లో ఏదేదో మాట్లాడేస్తారు. కొంతమంది నాతో “మా ఆడబిడ్డ కూతురూ, అల్లుడు మీకు బాగా తెలుసు… వాళ్ళ ఆల్బమ్‌లో మీ ఫొటో వుంది… గుర్తు తెచ్చుకోండీ, రామ్మూర్తీ, నాగమణీ…” అని వాదిస్తూ వుంటారు. ఈ అట్లాంటాలోని కన్వెన్షన్ సెంటర్‍లో వరండా మిద నిలబడి చాలామంది జంటల్తో నేను ఫొటోలు దిగాను. “వాళ్ళు మీకు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఆల్బమ్‌లో మీ ఫొటో వుంది” అని వాదిస్తే ఏం చెప్పనూ?… ఇంక సుమా, ఝాన్సీ లాంటి ఫేమస్, స్టేజ్ ఏంకర్స్‌కి ఇలాంటి ఫొటోలూ, పరిచయాలు ఎన్ని వుండి వుంటాయీ?
(సశేషం)