[dropcap]పో[/dropcap]రాటం మాకేం కొత్త కాదు,
పుట్టుకతోనే మేం మొదలెట్టేసాం.
యుద్ధం మేం ఎరుగనిదేం కాదు,
విజయాలెన్నో సాధించేసాం.
కలిగా నువు కమ్ముకొస్తే..
కల్కిగా మేం అవతరిస్తాం.
సమరం నీది..సైన్యం మాది,
వ్యూహం నీది..విజయం మాది..
క్రిమిగా నువు కలుషితం చేస్తే,
మేధతో మేం కాలరాస్తాం..
సంహారక ప్రక్రియ మేమెరిగినదే…
కాటేయడం నీ కౄరత్వమైతే,
విరుగుడు మార్గం మా కెరుకేలే..
విషాన్ని వైద్యానికి వాడడం మాకలవాటే..
కూల్చడం నీ వికృత రూపమైతే,
పేర్చడం మాకాటవిడుపు..
పేకమేడలనే మేం పడనీయం..
పేరుస్తూ మా పంతం చూపుతాం..
కన్నెర్ర చేసి నువు కమ్మేస్తే,
కదంతొక్కి మేం చీల్చేస్తాం..
కుస్తీలూ, పందాలూ మేం నెగ్గేవేలే..
కల్లోలం నీ నైజమైతే,
కట్టడి మా నైపుణ్యం.
భయపెట్టడం నీ బలమైతే,
బదులివ్వడం మా ధైర్యంలే…
హింసించడం నీ హీనత్వమైతే,
గుణపాఠం నేర్పడం మా నేర్పరితనం.
బలికోరడం నీ పైశాచికమైతే,
ప్రాణదానం మా మానవత్వం.
రక్తబీజుడిలా నువు పుట్టుకొచ్చినా,
బకాసురుడిలా నువు బలిగొన్నా,
భస్మాసురహస్తం నీకేలే..
బ్రతుకు వరం మాకేలే…
బిందువులా నువు అడుగేస్తే,
సంద్రంలా మేం మింగేస్తాం…
చిచ్చువై నువు చొచ్చుకొస్తే,
ఛిద్రం చేసి చిదిమేస్తాం..
దీపాన్నే మేం రెపరెపలాడనీయం..
చేతులడ్డేసి కాపాడుకుంటాం..
దేశానికి నీ మసి అంటనీయం..
ప్రాణాలొడ్డైనా కాపాడుకుంటాం..
అవని ఆకాశాలు కనురెప్పలై,
కన్నబిడ్డలను కాపుకాస్తుంటే..
ప్రకృతి మా ఆరాధ్యమవగా,
వికృతి రూపంమైన నీకు అధోగతేలే…