ఒక పాట పూదోటగా మారినప్పుడు…

0
3

[dropcap]యూ[/dropcap]యెస్ వెళ్ళడం నాకిది రెండవ సారి. భారత ఉపఖండం నుండి యెక్కడో దూరపు గ్రహం వంటి అమెరికా వంటి దేశానికి వెళ్ళడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా! ప్రయాణం పొడువునా యెదురయేవన్నీ వ్యత్యాసాలే—భాష-భాషలోని ఉఛ్చరణ-హావభావాలలో ప్రస్ఠుటించే ముఖఛ్ఛాయలు-అలవోకగా గోచరించే అలంకరణలు-అన్నీ వ్యత్యాసాలే– రెండు మూడు హాల్ట్‌ల తరవాత తిన్నగా నేవేర్క్ విమానాశ్రయంలో దిగి తిన్నగా భారతీయుల అలికిడి కాస్తంత ఒత్తిడిగా కనిపించే న్యూజెర్సీ చేరుకుని హోటెల్ కింగ్స్ కోర్టులో దిగాను. స్నానం చేసి ఉన్నచోట ఉన్నట్టు శివార్చనతో బాటు రెండు వినాయక శ్లోకాలు పఠించడం ముగించి రూముకి వచ్చి రూమ్ బాయ్ అందించిన ఫలహారం ఆరగించడం పూర్తిచేసి గదికి తాళం వేసి నడవనుండి క్రిందకు చూసాను. స్విమ్మింగ్ పూల్‌లో ఆడామగా బహు స్వేచ్ఛగా పొదుపైన కురుచ దుస్తులతో ఒకరినొకర ఒరసుకుంటూ కేరింతలు చేస్తూ ఈత కొడ్తున్నారు. ఇంతటి స్వేచ్ఛ అమెరికాలో తప్ప మరెక్కడ కనిపింస్తుది గనుక. అదే సమయాన పూర్తి యింద్రియ సంయమనంతో కూడిన యిక్కడి పౌరుల సంస్కారయుత ప్రవర్తన నన్ను నిజంగా ఆశ్చర్య చకితుణ్ణి చేస్తుంది.

సముద్ర తీరాన సొగసుగత్తెల్లా కనిపిస్తూన్న బోస్టన్ హార్బర్ ఐల్యాండ్స్ చేరాను. అక్కడ రష్యన్లు నడుపుతూన్న రెస్టారెంట్ ముంగిట రాబర్ట్ రామారాయుడు సతీ సమేతంగా యెదర్కోలు పలికాడు. అతడి భార్య ప్రసన్నలక్ష్మి ఆప్యాయంగా పరామర్శించింది. రాయుడు యెప్పుడు వచ్చి స్థిరపడ్డాడో లేక యిక్కడే పుట్టి పెరిగాడో నాకు తెలియదు. ఒకటి మాత్రం గమనించకూడదనుకుంటూనే గమనించాను. అతడి తెలుగు ఉఛ్ఛరణలో అమెరికన్ స్లాంగ్ కనిపించింది. కాని ప్రసన్నలక్ష్మి తెలుగులో స్వచ్ఛత తొణికిసలాడింది. ఆనందం ఆశ్చర్యం రెండూ కలిగాయి. కలగవా మరి – కొన్ని వేల మైళ్ళ  దూరం నుండి వచ్చిన తెలుగు వాణ్ణి – తెలుగు తేనె పలుకు చెవిన పడితే పారవశ్యం కలగదా! అలా మాట్లాడుకుంటూ అదే రెస్టారెంటులో భోజనాలు పూర్తి చేసి తిన్నగా బిజినెస్ మీట్ హాలు వేపు వెళ్తున్నప్పుడు దారిలో విస్మయం కలిగించే దృష్యం కనిపించింది. పులకింత కలిగించింది. ఒక వ్రాత ఫలకపైన తెలుగులో ఇలా వ్రాసుంది – “ఇక్కడ నగలు తయారు చేసి యివ్వబడును” అంటే – ఇక్కడ భోస్టన్ మారుమూల కూడా తెలుగు వారి అలికిడి ఉందన్నమాట! ఏ దేశ మేగినా యెందు కాలిడినా – రాయప్రోలు వారి పద్యం తలంపుకు వచ్చింది.

అనుకున్న షెడ్యూల్ ప్రకారం సుమారు రెండు గంటలపాటు మంతనాలు సాగాయి. పిదప వ్యాపార లావాదేవీలు కూడా ఓ కొలిక్కి చేరి వ్యాపార ఒప్పందాలు పూర్తి అయాయి. రాబర్ట్ రామారాయుడి కంపెనీ సిబ్బందే ముందుండి చట్ట పూర్వక పత్రా లు వివరాలతో సహా సిధ్ధం చేసారు. ఆ సిబ్బందిలో సగానికి పైగా అమెరికన్ యూదులే- అక్కడికక్కడ అప్పటికప్పుడు ఒక చిన్న స్థాయి పార్టీ చేసుకుని రాయుడింటికి మర్యాదపూర్వకంగా చూసి రావడానికి వెళ్తున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ చెవులు గింగిర్లెత్తేలా బాంబ్ పేల్చారు. నాతో బాటే ఇద్దరూ అదే ప్లేనులో అంటే – నేను తిరుగు ప్రయాణం చేయబోతూన్న అదే విమానంలో యిండియా వస్తున్నారని. నేను నమ్మలేక బిత్తరపోయి చూస్తూండిపోయాను. “ఇంతటి షార్ట్ నోటీసులో అదెలా సాధ్యం?” అని అడగాలని పలుకు నాలిక చివరి వరకూ వచ్చి ఆగిపోయింది. ఇప్పటి కంప్యూటీకరణ వ్యవస్థలో – అందులో డిజిటలైజేషన్ ప్రపంచంలో సాధ్యం కానిదేముంది? ప్రపంచం ఒక పల్లెపట్టు ప్రాంతంలా రూపాంతరం చెందడం లేదూ! అప్పటికీ ఉగ్గబట్టలేక అడిగాను – “ఇండియాలో పూర్తి చేయాల్సిన వ్యాపార లావాదేవీలైమైనా ఉన్నాయా?” అని. ఇద్దరూ ముక్త కంఠంతో బదులిచ్చారు – “చెప్పుకోదగ్గ వ్యాపార వ్యవహారాలేవీ లేవు గాని—మీతో కలసి ఓ పారి తెలుగు గడ్డ చూడాలనిపించింది. గైడ్ చేస్తారు కదూ!” నేను వెంటనే సగం లేచి ఇద్దరి చేతులూ పుచ్చుకుని-“వైనాట్ !” అని సంతోషంగా బిగ్గరగా అంటూ చేయబోయే ప్రయాణానికి చిన్నపాటి సవరణ చేసాను. “భాగ్యనగరం చేరిన వెంటనే మనం అక్కడ ఉండం. మొదట కోమలినీ – అంటే మా ఆవిణ్ణీ తోడు తీసుకుని తిన్నగా విజయనగరం వెళ్తున్నాం. అక్కడ మా పెద్దమ్మా మేనత్తలిద్దరూ మాకోసం – అంటే మన కోసం యెదురు చూస్తుంటారు. అక్కడకు వెళ్ళి ఆ పైన చూడాల్సిన మిగతా ఊళ్ళ పట్టీ తయారు చేద్దాం. దానికి సింహాచలం కొండ కాస్తంత దగ్గరేగా -నరసింహస్వామి దివ్య దర్శనం చేసుకుందాం. మరొకటి—విజయనగరమంటే మాది ప్రోపర్ విజయనగరం కాదు. నగరం పొలిమేరన ఉన్న ముమ్మడి వలస. అక్కడ యిక్కడున్నట్టు-భాగ్యనగరంలో ఉన్నట్టు స్టార్ హోటల్సు ఉండవు, పోష్ క్లబ్బులూ ఉండవు. మావాళ్ళతో ఒకట్రెండు రోజులు సర్దుకుపోవాలి. ఈజిట్ ఓకే!” అన్నాను. ‘హుర్రే’ అంటూ భార్యాభర్తలిద్దరూ ఉల్లాసంగా అరచినంత పనిచేసారు కదులుతూన్న కారుని మరింత కుదుపులకు లోను చేస్తూ.

నా చిరుప్రాయంలోనే నేను అమ్మాబాబులిద్దరినీ (మా వేపు తండ్రిని బాబంటాం) కోల్పోయాను. నన్ను పెంచి పెద్ద చేసి చదివించింది మా పెద్దమా మేనత్తలే. కోమలి మరెవరో కాదు; మా మేనత్త పెద్ద కూతురు. హైద్రాబాదులో దిగి విజయనగరం పొలిమేర చేరేటప్పటికి ఊరంతా జాతరోత్సవం ఆకాశ వీధిలా వెల్లి విరుస్తూంది. కారణం – చాలారోజులుగా కదలకుండా పడి ఉన్న అమ్మవారి ఆలయ రథం మరమ్మతులతో పూసిన రంగులతో కుబేరుడి రథంలా ముస్తాబయి ఉత్సవ మూర్తులతో ఊరేగింపుకు సిధ్దంగా ఉంది. అందరమూ ఓపికతో అక్కడే నిల్చుని, ఆ తరవాత భక్తి పారవశ్యంతో రథాన్ని కాస్తంత దూరం లాగి యింటి ముఖం పట్టాం. అప్పుడు అలా నడుస్తున్నప్పుడు యధాలాపంగా చూసాను; ప్రసన్న లక్ష్మి ముమ్మడి వలస స్త్రీలలాగే నుదుట కాసంత కుంకుమ బొట్టు దిద్దుకుని తలనిండా గంపెడంత పూలు పెట్టుకోవడం. నాకు తెలుసు యూయస్ వేపు భారతీయ స్త్రీలు అలా బరువుగా అలంకరించుకోరు. అందుకని ప్రసన్నలక్ష్మికి ప్రక్కగా వెళ్ళి మెల్లగా అన్నాను- “మా వూరి ఆడాళ్ళు అంతే మేడమ్! పండగ పబ్బలకు ఇలాగే నగలను దిగేసుకుంటారు. తల ఒరిగిపోయేలా పూలు పెట్టుకుంటారు. మీరు అటునుండి వచ్చిన స్త్రీ అని తెలిసినా మిమ్మల్ని వాళ్ళలా అలంకరించేసారు. ఇక మనం యింటికి వెళ్తున్నాంగా – మీరు పూలు తీసి కోమలికి యిచ్చేయండి. భారం తగ్గుతుంది” ఆమె బదులుగా నవ్వింది గాని, పూలను కొప్పునుండి తీయలేదు. అప్పుడు వాళ్ళ వద్దకు రాబర్ట్ రామానాయుడు వచ్చాడు-

“నరసింహులూ-మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడిగేదా!” అన్నాడు. ‘ఉఁ’-అడగమన్నాను.

“మీ యింటి ముందు పెద్ద పెద్ద ముగ్గలున్నాయి. మీ యింట్లో వాళ్ళు ప్రతి రోజు యింటి ముంగిట వేస్తారా?”

నేను నవ్వి బదులిచ్చాను “అంటే -అలా కాదు రాయుడుగారూ! పండగ పబ్బాలప్పుడు పుణ్య కార్యాలప్పుడు ముగ్గులు వేసి గుమ్మాలకు తోరణాలు కట్టడం తప్పనిసరి. అలాగని, ప్రతిరోజూ కళ్ళాపి చల్లి ముగ్గులు వేయాలన్న నిబంధనేమీ లేదు. మా యింట్లో వాళ్ళు దాదాపు ప్రతి దినమూ ముగ్గులు వేస్తారు. వాళ్ళ వల్ల వీలు కాకపోతే – యింటి అమ్మాయిల చేతనో పనిగత్తెల చేతనో వేయిస్తారు. ఐనా -హార్డ్ అండ్ ఫాస్ట్ రూలేమీ లేదు.”

రాయుడు అంతటితో ఊరుకోలేదు. “మరి మీ యింట్లోవాళ్ళు ప్రతిరోజూ వేస్తారన్నారుగా!“

“ఔను. అన్నాను. అలా చేయడానికి మాయింట్లోవాళ్ళకు ఒక నమ్మకం ఉంది. సంప్రదాయం ఉంది. దానిని అందరూ తు.చ. పాటించితీరాలని లేదుగా! “

“అదేమిటో తెలుసుకోవచ్చా! సీక్రెట్ అండ్ స్యాక్రెడ్ ఐతే చెప్పకండి.”

“నో నో! అటువంటిదేమీ లేదు. తెలుగు ముగ్గులు వైకుంఠానికి దీప దారులంటారు.అంతే – నథింగ్ మోర్-నథింగ్ లెస్!”

ఆ తరవాత సంభాషణ సాగలేదు యిల్లు చేరేంత వరకూ –

***

రాత్రి భోజనాలు అయిన తరవాత ఉదయం చదవకుండా విడిచి పెట్టిన దినపత్రికను తీసుకుని చదువుతూ కూర్చున్న ప్పుడు నాకు చప్పున స్పురణకు వచ్చింది, యిల్లంతా నిర్జనంగా నిర్మానుష్యంగా ఉన్నట్టు. పరకాయించి చూసాను. రాయుడు దంపతుల జాడ లేదు. చటుక్కున లేచి పెరడు వేపు దూసుకు వెళ్ళాను. అక్కడున్నారు భార్యాభర్తలిద్దరూ – తేరి చూస్తే రాబర్ట్  రామారాయుడు యెందుకో దైన్యంగా దీనంగా ఉన్నట్టు కనిపించాడు. రెండు కళ్ళూ చెమ్మగిల్లి ఉన్నాయి. ప్రసన్నలక్ష్మి ని అడిగాను, యేమైంది-యేమైందని. దానికామె నవ్వటానికి  ప్రయత్నిస్తూ అంది – “మావారికి చనిపోయిన వాళ్ళమ్మా పెద్దమ్మా గుర్తుకి వచ్చారు. చాలా మంది అనుకుంటున్నట్టు  రాయుడుగారు యూయెస్‌లో పుట్టి పెరగలేదు. భీమవరంలో పుట్టి పెరిగి స్డడీస్ కోసం అమెరికా వచ్చి ఆ తరవాత అక్కడే స్థిరపడ్డారు. ఆ మాటకొస్తే నేను అక్కడ పుట్టి పెరిగాను.”

“అది సరేనండి – ఇప్పుడెందుకు వేళకాని వేళ కంటతడిపెట్టుకుంటున్నారు మీ వారు?”

“చెప్పాను కదండీ – వాళ్ళమ్మా పెద్దమ్మా గుర్తుకి వచ్చారని !”

“మళ్ళీ అదే జవాబా! ఇప్పుడెందుకు వాళ్ళిప్పుడు గుర్తుకి వచ్చారని?”

“అదా అడుగుతున్నారు! ఈయనకీ ఈయన తమ్ముడుగారికీ వాళ్లమ్మగాని పెద్దమ్మగాని జోలపాట పాడి వినిపిస్తే గాని నిద్రపోయేవారు కారట. ఎదురింట్లోనే పొరుగింట్లోనో – ఎవరో పిల్లల తల్లి వాళ్ల బిడ్డను జోకొట్టడానికి – ‘జో అచ్యుతానందా-జో జో ముకుందా-రారా పరమానందా రామగోవిందా!’ అని పాడటం వినిపించింది. అప్పట్నించీ గుండె చెరువైనట్టు కంట తడిపెట్టుకుంటున్నారు రాయుడు గారు.”

“అలాగా” అంటూ రాయుడుగారి భుజం తట్టి అక్కణ్ణించి కదలబోయాను. అప్పుడతను చట్టున లేచి నా చేయి పట్టుకుని ఆపారు.

“నేను దాని కోసం మాత్రమే యెమోషనల్ కాలేదు నరసింహులూ! మరొకటి కూడా నా మనసు పొరల్ని తొలిచేస్తుంది. నా ప్రపంచంలో నేను తలమునకలవుతూ నేనింతటి మధురమైన జోలపాటను మరచిపోయానంటే -చిన్ననాట నాకు విద్యా బుద్ధులు నేర్పిన తెలుగుని మరచిపోయినట్లే కదా – తెలుగుని మరచిపోతున్నానంటే – నన్ను కనీ పెంచీ పెద్ద చేసిన మా అమ్మను కూడా మరచిపోతున్నట్లే కదా! నేను అమెరికా చేరిన వెంటనే  మా అబ్బాయిలిద్దర్నీ న్యూజెర్సీలో ఉన్న ఆదివారపు తెలుగు బడిలో చేర్పిస్తాను. ఇది మా అమ్మపైన మా పెద్దమ్మ పైనా ఒట్టు” అన్నాడు.

నేను ఉన్నపాటున రాయుణ్ణి కౌగలించుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here