[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా భరతన్ దర్శకత్వం వహించిన మలయాళం సినిమా ‘రతి నిర్వేదం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘రతి నిర్వేదం’ (మలయాళం)
[dropcap]ఒ[/dropcap]కప్పుడు సాహిత్యం సినిమాల ముడి సరుకుగా వుండేది. ఐతే సాహిత్యంలో చేసే ప్రయోగాలు గానీ, కొన్ని రకాల కథా వస్తువులతో చేసే ధైర్యంగానీ సినిమాల విషయానికొచ్చేసరికి వుండేది కాదు. సినిమాలు సేఫ్ గేమ్ ఆడుకుంటాయి. ఒక్కోసారి అదే సేఫ్ గేమ్ ఎవరో ఒక దర్శకుడికి విసుగన్పిస్తుంది. అప్పుడతను గేమ్ మార్చేయాలనుకుంటాడు. గేమ్ ఛేంజర్‌గా మారిపోతాడు. చరిత్రలో నిల్చిపోతాడు, అదే నిషిద్ధ వస్తువైన సాహిత్య ఆధారం పట్టకుని. అప్పుడా దర్శకుడు భరతన్ అయితే, ఆ సాహిత్యం పద్మరాజన్ రాసిన ‘రతి నిర్వేదం’ నవల అవుతుంది. అది వెండి తెరకెక్కి క్లాసిక్‌గా కాలాన్ని జయించేస్తుంది.
1978లో భరతన్ మలయాళ సినిమాల ట్రెండ్ సెట్టర్. ఇక మలయాళ సినిమాలు ‘రతి నిర్వేదం’తో తను వేసిన బాటన నడవక తప్పలేదు. ఆర్ట్ సినిమాలకీ కమర్షియల్ సినిమాలకీ నడుమ గ్రామీణ వాస్తవిక న్యూవేవ్ సినిమా అనే కొత్త స్కూల్ ప్రారంభించడంతో, ఈ స్కూల్ ననుసరించి ఎందరో కొత్త దర్శకులు మలయాళం సినిమా దిశని మార్చేశారు. సామాజిక కట్టు బాట్లని ఉల్లంఘించే కథలతో భరతన్ సినిమాలుంటాయి. ఈ కోవలో వైశాలి, అమరం, కటాతే కిళి కూడు (లోకంలో ఒక పక్షి గూడు), కఠోతు కఠోరం (గుసగుసలు) వంటివి తీశాడు. శివాజీ గణేశన్, కమల్ హాసన్‌లతో ‘దేవర్ మగన్’ అనే మలయాళ – తమిళ కమర్షియల్ కూడా తీశాడు. 1972 – 98 మధ్య కాలంలో 40 సినిమాలకి దర్శకత్వం వహించి, 36 సినిమాలకి కళా దర్శకత్వం వహించాడు. 1975లో ‘ప్రయాణం’తో దర్శకుడు కాక మునుపు, 12 సినిమాలకి కళా దర్శకుడుగా పని చేశాడు.
‘రతి నిర్వేదం’ మరొకందుకు కూడా పేరున్న సినిమా. ఇది మలయాళంలో తీసిన తొలి ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ జానర్ మూవీ. చిన్న వయసు అబ్బాయి – పెద్ద వయసు అమ్మాయిల మధ్య మనుషుల్ని కంగారు పెట్టేసే సంబంధం. ఆ అబ్బాయి ఇంకా సరిగ్గా మీసాలు మొలవని పదహారేళ్ళ కుర్రాడు, అందుకని కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ. ముందు దీని కథేమిటో చూద్దాం…
కథ
పప్పు(కృష్ణ చంద్రన్) పదో తరగతి రాసి, కాలేజీలో చేరేందుకు ఇంకా టైం వుండడంతో గ్రామంలో పడి సరదాలన్నీ తీర్చుకుంటూ వుంటాడు. తల్లి మీనా (నారాయణియమ్మ), తల్లి చెల్లెలయిన పిన్ని సరస్వతీ (కవియూర్ పొన్నమ్మ) వుంటారు. తండ్రి సైన్యంలో వుంటాడు. అటు పొరుగున తల్లి భారతి (కెపిఎసి లలిత)తో కలిసి రతి (జయభారతి) వుంటుంది. రతి పప్పూ కన్నా ఎనిమిదేళ్ళు పెద్ద. రెండేళ్ళప్పుడు ఎత్తుకుని తిరిగింది. ఆమెకిప్పుడు పాతికేళ్ళు దగ్గర పడుతున్నా పెళ్లి యోగం లేదు సర్ప దోషం వల్ల. తల్లి ఈ దిగులుతో వుంటుంది. రతి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో తను సరదాగా వుంటుంది. ఈ సరదాల్లో పప్పు కొత్త కోణాలు చూడ్డం ప్రారంభిస్తాడు.
అతడికి ఇప్పుడు పదహారేళ్ళ వయసు వలన సెక్సు కోరికలు ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. తనతో సన్నిహితంగా వుండే రతితో ఆ కోరికలు తీర్చుకోవాలన్న ఆశతో వుంటాడు. ఆమెకి ఇంకోలా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెడతాడు. అతడిలో వచ్చిన ఈ మార్పుని ఆమె గమనించక అదే పెద్దక్కయ్య ధోరణిలో వుంటుంది. పప్పు ఇంట్లో కూడా అతడిలో వచ్చిన మార్పుని గమనించరు. ఒక రోజు అతడి చేష్టలు రతికి తెలిసిపోతాయి. మందలిస్తుంది గానీ విపరీతంగా ఆందోళన పడుతుంది. ఇక తల్లి ఇంకో సంబంధం తీసుకొస్తుంది. దీంతో పప్పు దురుసుగా ప్రవర్తిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదో వుందని అనుమానించిన రతి తల్లి, రతిని తిడుతుంది. వెళ్లి పప్పూ తల్లికి చెప్పేసి, అదుపులో వుంచుకోమని హెచ్చరిస్తుంది.
ఈ ఎడబాటు పప్పూకి ఎటూ తోచకుండా చేస్తుంది. ఇక రేపే కాలేజికి వెళ్ళిపోయే రోజొస్తుంది. రతిని రహస్యంగా కలుసుకుని ఈ విషయం చెప్తాడు. తన వల్ల ఆమె ఇబ్బందుల్లో పడ్డందుకు బాధ పడతాడు. ఒక ముఖ్య విషయం చెప్పాలనీ, రాత్రి నాగ శిల్పం దగ్గరికొస్తే చెప్తాననీ అంటాడు. ఆమె రాత్రి నాగ శిల్పం దగ్గరికి వెళ్లేసరికి గాలివాన ప్రారంభ మవుతుంది…
గాలివానలో ఆమె తడిసిన అందాలకి వివశుడై అక్రమించుకుంటాడు. ఆమె ఏమీ చెయ్యలేక లొంగి పోతుంది. తీరా జరిగింది తెలుసుకుని, గబగబా వెళ్లిపోతూంటే పాము కాటేస్తుంది. అలాగే బాధ ననుభవిస్తూ ఇంటికెళ్ళి పడుకుంటుంది. బాధని ఓర్చుకోలేక అరుపులు అరుస్తుంది. తల్లి వచ్చి చూసి పరిస్థితి గ్రహిస్తుంది. కానీ పాము ఎక్కడ కాటేసిందో చెప్పదు రతి. హడావిడిగా ఆస్పత్రికి తీసికెళ్తే అక్కడ చనిపోతుంది. ఈ అనూహ్య పరిణామాలకి ఏడ్చేసి, తీరని బాధతో కాలేజీకి బయల్దేరతాడు పప్పూ…
ఎలావుంది కథ
ఇది ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ జానర్లోకి వచ్చే యూత్ కథ. ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ అంటే వయసుకు రావడం. అప్పుడప్పుడే కౌమారం లోంచి యౌవనం లోకి ప్రవేశిస్తున్న, 14 – 18 మధ్య ఈడు అమ్మాయిలూ అబ్బాయిల మనస్తత్వ చిత్రణ. హాలీవుడ్‌లో దీనికీ ప్రధాన స్రవంతిలో ప్రముఖ స్థానం లభించింది. ఏడాదికి 30 వరకూ నిర్మిస్తూంటారు. ప్రేమ చుట్టే కాకుండా, యాక్షన్ నుంచీ సైన్స్ ఫిక్షన్ వరకూ కూడా వుంటాయి. మలయాళంలో ప్రప్రథమంగా ‘రతి నిర్వేదం’ రూపంలో 1978 నిర్మించడం మలయాళ సినిమా చరిత్రనే కాదు, మొత్తం దేశీయ సినిమా చరిత్రనే గొప్ప మలుపు తిప్పిన సంఘటనంటూ పత్రికలు రాశాయి. వయసు తారతమ్యాలతో దర్శకుడు భరతన్ ఆనాడు చేసిన సాహసం, కేరళలో నిరసనల పాల్జేసింది కూడా. అయినా మలయాళ సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్టయింది.
1979లో తెలుగులో దాసరి నారాయణరావు, హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో తెలుపు నలుపులో తీసిన ‘నీడ’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీయే. విజయవాడలో అప్పుడప్పుడే యవ్వనపు గడప తొక్కిన కుర్రాడు, రతి క్రీడ పట్ల కుతూహలంతో వేశ్యల పాలబడి దారితప్పే కథ. ఈ వయస్సంటేనే వివిధ విషయాల పట్ల కుతూహలం. తెలుసుకోవాలన్న కుతూహలం ఎదుగుదలకి సంకేతం. టీనేజీ సహజాతమైన ఈ, కుతూహలాన్నీ, జిజ్ఞాసనీ చంపేస్తూ ప్రేమించడం, ప్రేమలో పడ్డంగా మాత్రమే చూపిస్తూ, అక్కడితో ఎదుగుదల జోలికి పోని అపరిపక్వతతో ముగించేస్తున్నారు. తెలుగులోనే వచ్చిన ‘చిత్రం’, ‘టెన్త్ క్లాస్’ లాంటివి, అప్పుడే ఆ వయసులోనే పెళ్లి కూడా చేసుకుని పిల్లల్ని కనేసే, కమింగ్ ఆఫ్ ఏజ్ సహజాత వ్యతిరేక సినిమాలుగా వుంటాయి.
కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది: అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు. ‘లేడీ బర్డ్’ అనే పేరున్న మూవీలో లేత టీనేజీ అమ్మాయి, తను కోరుకుంటున్నలాంటి భవిష్యత్తుని హైస్కూలు విద్య ఇవ్వడం లేదని, తనలోని కళాభివ్యక్తి కోసం సంఘర్షిస్తుంది. సత్యజిత్ రే తీసిన ‘అపరాజితో’ (1956) కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీయే. ఇందులో ఆ కుర్రాడు తల్లితో వుండాలా, చదువు కోసం పై వూరు వెళ్ళాలా అన్న సందిగ్ధంలో పడతాడు. చివరికి ఎదుగుదల కోసం తల్లినే త్యాగం చేస్తాడు.
రాజ్ కపూర్ తీసిన ‘మేరా నాం జోకర్’ (1970) లో, రాజ్ కపూర్ 14 ఏళ్ల టీనేజీ పాత్రగా రిషీ కపూర్ నటించాడు. ఇతను టీచర్ (సిమీ గరేవాల్) పట్ల ఎట్రాక్ట్ అవుతాడు. ఆమె ద్వారా స్త్రీల ఆంతరంగిక లోకమెలా వుంటుందో దాని గురించి, కోర్కెలెలా వుంటాయో వాటి గురించీ తెలుసుకుంటాడు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఏమిటో అర్థంగాని బాధకి లోనవుతాడు. ఈ అనుభవమే వ్యక్తిగా (రాజ్ కపూర్) ఎదిగాక జీవితాన్ని మార్చేస్తుంది. తను బాధల్ని దాచుకుని, లోకానికి నవ్వుల్ని పంచడానికే ఈ లోకంలోకి వచ్చాడనీ, ఏదైతే ఆమెతో స్వేచ్ఛగా ఎంజాయ్ చేశాననుకున్నాడో, అదంతా కేవలం తాత్కాలికమైనదేననీ తెలుసుకుంటాడు.
అసలు కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూలాలు 18 వ శతాబ్దపు జర్మన్ సాహిత్యంలో వున్నాయి. అప్పట్లో ఈ జానర్ కి ‘బిల్డూక్స్ రోమాన్’ (bildungs roman) అని నామకరణం చేశాడు ఇంపీరియల్ యూనివర్సిటీ లైబ్రేరియన్ కార్ల్ సైమన్ అనే అతను. ‘బిల్డూక్స్’ అంటే జర్మన్ భాషలో విద్య లేదా జ్ఞానం. ‘రోమాన్’ అంటే నవల. ఈ విద్య లేదా జ్ఞానం మానసికంగానూ నైతికంగానూ టీనేజర్ల ఎదుగుదల గురించి. దీన్ని ‘నావెల్ ఆఫ్ ఫార్మేషన్’ అని కూడా అన్నారు.
1796 లో సుప్రసిద్ధ జర్మన్ రచయిత జే డబ్ల్యూవ్ గోథె రాసిన ‘విల్ హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్’ అన్న నవల ఈ జానర్ ఎలిమెంట్స్‌ని స్థిరీకరించింది. ఈ నవల్లో నవయువకుడు (మిస్టర్ విల్‌హమ్) కి నాటక రచయిత నవ్వాలని కోరిక బలంగా వుంటుంది. తండ్రేమో వ్యాపారం చూసుకోమంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయి నాటకాల వెంటపడి జీవితంలో ఏం నేర్చుకుని, ఎలా ఎదిగిన వ్యక్తిగా తిరిగి వచ్చాడో అద్భుత రచన చేశాడు గోథె.
ఈ నవలని అనుసరించి అప్పట్లో జర్మన్ భాషలో మరెన్నో ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ నవలలు వెలువడ్డాయి. ఆ తర్వాత 19, 20, 21 వ శతాబ్దాల్లో ఆంగ్ల భాషలో చార్లెస్ డికెన్స్ రాసిన ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’, ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’; మార్క్ ట్వైన్ రాసిన ‘అడ్వెంచర్స్ ఆఫ్ హకల్బరీ ఫిన్’, జేమ్స్ జాయిస్ రాసిన ‘ఏ పోట్రెయిట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ ఏ యంగ్ మాన్’, జేడీ శాలింగర్ రాసిన ‘ది క్యాచర్ ఇన్ ది రై’, డరోతీ అలిసన్ రాసిన ‘బాస్టర్డ్ ఔటాఫ్ కరోలినా’, జేకే రౌలింగ్ ‘హేరీ పోటర్’ సీరీస్ నవలలూ ఉదాహరణకి కొన్ని. చేతన్ భగత్ ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ కూడా ఒకటి. మొదటి కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా, ‘బాంబీ’ అనే యానిమేషన్ గా 1942లో హాలీవుడ్ లో నిర్మించారు.
అప్పట్లో ‘రతి నిర్వేదం’ పేరుతో పద్మరాజన్ రాసిన నవల ఆధారంగా భరతన్ తీసిన ఈ కథలో సామాజిక ప్రయోజనం వుండడం, లేకపోవడం రెండూ వున్నాయి. ఈ వయసులో కోర్కెల్ని అదుపులో వుంచుకోక పోతే, ఆ కోర్కెలే కాటేసి జీవితాంతం నరకం చూపిస్తాయనీ అబ్బాయిలకి ఒక హెచ్చరిక; ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా, ఆడదాని జీవితాన్ని అక్కడికక్కడ వెంటనే ఫినిష్ చేసేసి చేతులు దులుపుకునే – మేల్ మోరల్ పోలిసింగూ ఇందులో కన్పిస్తాయి. భరతన్, పద్మరాజన్‌ల చలవ.
దీన్ని 2011లో మలయాళంలోనే రీమేక్ చేశారు. ఇప్పుడు ఇలాటి ముగింపు చూపిస్తే ఒప్పుకోరనేమో, కథాకాలన్ని ఒరిజినల్ నాటి 1978 లోనే స్థాపించాడు దీని దర్శకుడు టి.కె. రాజీవ్ కుమార్. ఇందులో శ్రీజిత్ విజయ్, శ్వేతా మీనన్‌లు నటించారు. దీనికి పెద్దగా పేరు రాలేదు. తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. బి గ్రేడ్ సెక్సు సినిమా అని ఎవరూ పట్టించుకోలేదు. నేటి యువప్రేక్షకులకి, కాలీన స్పృహ కోల్పోయే గతకాలపు తీరుతెన్నులతో ప్రేమ కథలు చూపిస్తే చూడలేరని – ఇటీవల తెలుగులో కూడా రెండు మూడు నిరూపించాయి.
ఎలా నటించారు
నును లేత, నూనూగు మీసాల కుర్రాడిగా కృష్ణ చంద్రన్ సరీగ్గా ఆ వయసుకి సరిపోయాడు. కౌమారంలోంచి యౌవనంలోకి తాజాగా అడుగు పెట్టిన లేత టీనేజర్‌లా. టెన్త్ చదివి ఇక కాలేజీ ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్నాడని నమ్మించే ఎత్తూ బరువూ మొహంతో ముద్దుగా. రీమేక్ లో శ్రీజిత్ విజయ్ ఒక ఎత్తైన పహిల్వాన్‌లా వుంటాడు. ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ అన్న సంగతే మర్చిపోయుంటాడు దర్శకుడు రాజీవ్ కుమార్. శ్రీజిత్ పాత్రని ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్‌కి వెళ్ళబోతున్న పాత్రలా మార్చాడు. 1978లో ఇంజనీరింగ్ మోజెక్కడుంది. ఇవాళ్టి మోజు చూపిస్తున్నాడని కూడా మర్చిపోయుంటాడు. కృష్ణ చంద్రన్ మొహంలోని ఇన్నోసెన్స్ సీన్స్ కి కొత్తందాలు కూర్చి పెడతాయి. నటన కూడా సహజంగా నటించేస్తాడు. రీమేక్‌లో శ్రీజిత్ పాత్రకి లేనిదీ, కృష్ణ చంద్రన్ పాత్రకి వున్నదీ ఏమిటంటే – అంతర్ముఖం.
పప్పు కోర్కెలాపుకోలేక బయట రతితో ప్రవర్తించే తీరు బహిర్ముఖంగా అతడి పాత్ర చిత్రణకి సరే, బాగానే వుంది. మరి ఆ వయసు కుర్రాడిగా ఏకాంతంలో వున్నప్పుడు ఏం చేస్తూంటాడనే అంతర్ముఖ కోణం కూడా ఆవిష్కరిస్తే, పాత్ర ఏకోన్ముఖంగా డొల్లగా మారే ప్రమాదాన్ని తప్పించుకుంటుంది. రీమేక్‌లో ఈ అంతర్ముఖ కోణం లేకే అంత పహిల్వాన్ పాత్ర డొల్లగా మారింది. ఒరిజినల్లో పప్పుతో కేవలం ఒక్క సీనుతో చెప్పేశారు. అద్దంలో పదే పదే తన అందాలు చూసుకోవడం, లోలోపల ఆనందించడం వగైరా. గోడకి క్యాలెండర్ తిరగేసి వుంటుంది. దాన్ని తిప్పితే డ్రీం గర్ల్ హేమమాలిని బొమ్మ బయట పడుతుంది. దాని ముందు రోమాంటిక్ పోజులు పెడుతూంటాడు…
కృష్ణ చంద్రన్ దీనితర్వాత 2019 వరకూ మరో 23 సినిమాలు నటించాడు. 164 సినిమా పాటలు పాడేడు. రతి పాత్రలో జయభారతిది కూడా సున్నిత నటనే. కాకపోతే ఇలాటి కథకి అవసరం కాబట్టి అంగాంగ ప్రదర్శన తప్పలేదు. అతడ్ని రెచ్చగొట్టాలని కాదు. కుట్టు మిషన్ మీద బట్టలు కుడుతూంటే, పెడల్ మీద పిక్కలు బయల్పడే సీను, గదిలో బట్టలు మార్చుకుంటూంటే అతను తలుపు చాటునుంచి రహస్యంగా చూసే సీనులాంటివి. చిన్నప్పట్నుంచీ చూస్తున్న పిల్లాడిగా వాడితో ఆమె బాండింగ్, ట్రీట్ చేసే విధానం సరదాగా వుంటాయి. రీమేక్‌లో శ్వేతా మీనన్ కిది కుదరలేదు. అతనే ఓ పహిల్వాన్‌లా వున్నాడు.
1966 – 2006 మధ్య జయభారతి 310 మలయాళం, 26 తమిళం, 2 హిందీ, ఒక తెలుగు సినిమాల్లో నటించింది. హీరో తల్లి, పిన్ని, హీరోయిన్ తల్లి పాత్రల్లో ముగ్గురు నటీమణులూ భరతన్ పిక్చరైజేషన్‌లో ఫ్రెష్ గా కన్పిస్తారు. మెలోడ్రామాలు భరతన్‌కి నచ్చవు.
దేవరాజన్ సంగీతంలో జేసుదాస్ పాడిన రెండు పాటలున్నాయి. ఈ రెండు పాటలవల్ల సినిమాకి ఫీల్, సోల్ సమున్నతంగా ఒనగూడాయి. రామచంద్ర బాబు ఛాయా గ్రహణంలో కేరళ కొండలూ లోయల మధ్య పాలక్కడ్ జిల్లాలో గ్రామ విజువల్స్ కథకి తగ్గ దృశ్య నేపథ్యానిచ్చాయి. ఈ రంగుల ఛాయాగ్రహణానికి కేరళ రాష్ట్ర అవార్డు లభించింది. ఒక బాల నటుడిగా నటించిన మాస్టర్ మనోహర్‌కి ఉత్తమ బాల నటుడి అవార్డు లభించింది. ఉత్తమ చలన చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు నందుకుంది ‘రతి నిర్వేదం’. దీని నిర్మాత హరి పోతన్, బ్యానర్ సుప్రియా ఫిలిమ్స్.